*తృతీయ స్కంధము - 19*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః*
*లలితా సహస్రనామ శ్లోకం - 40*
*తటిల్లతాసమరుచిః షట్చక్రోపరి సంస్థితా!*
*మహాశక్తిః కుండలినీ బిసతంతు తనీయసీ!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*నిన్నటి భాగములో.........*
*రామకథ* చదువుకున్నాము.
*అమ్మ దయతో......*
ఈ రోజు తృతీయ స్కంధములోని
*సౌమిత్రి ఓదార్పు,*
*నారదాగమనం-దేవీవ్రతోపదేశం*
*దాశరథికి దేవీదర్శనం*
చదువుకుని *తృతీయస్కంధం* ముగించుకుందాం......
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡
🌈 *సౌమిత్రి ఓదార్పు* 🙏
*అగ్రజా !* ఏమిటి ఈ బేలతనం. నీవంటి మహావీరులు ఇలా నీరుగారిపోతే ఎలా ! ధైర్యం తెచ్చుకో. ఆ రాక్షసాధముడు రావణుణ్ణి సంహరించి సీతాదేవిని నేను తీసుకువస్తాను. అధైర్యపడకు. నీవంటి ధీరులు ఆపదల్లోనూ సంపదల్లోనూ ఒకే రీతిగా నిశ్చలంగా ఉండాలేకానీ సామాన్యుల్లాగా చలించిపోతే ఎలా ! సంయోగ వియోగాలు దైవాధీనాలు. జరుగుతూ ఉంటాయి. దుఃఖపడి ప్రయోజనం ఏమిటి ! ప్రస్తుతం మనకి రోజులు బాగోలేదు. అందుకని రాజ్యహాని, వనవాసం, సీతాపహరణాలతో కష్టాల పాలయ్యాము. మంచిరోజులు వస్తాయి. అప్పుడు అన్నీ మనకు అనుకూలంగా పరిణమిస్తాయి.
కష్టయోగం ఎలా తప్పించుకోలేకపోతున్నామో, అలాగే సుఖయోగమూ తప్పించుకోలేం. ఆ రోజులు వస్తాయి. సీతాదేవి లభించి తీరుతుంది. దుఃఖపడకు. కొంచెం ఓపికపట్టు. సుగ్రీవుడి వానర సైన్యం దశదిశలకూ వెడుతోంది. సీతమ్మ జాడ తెలుసుకువచ్చి మనకు చెబుతారు. అప్పుడు నేనే స్వయంగా వెళ్ళి ఆ రాక్షసుణ్ణి చంపి సీతాదేవిని తీసుకువస్తాను. లేదా భరతుణ్ణో, జనకమహారాజునో ససైన్యంగా రమ్మని రావణుడి మీదకు దండెత్తి సంహరించి జానకీదేవిని తెస్తాం. మన వంశంలో రఘుమహారాజు కేవలం ఒకే ఒక్క రథంతో బయలుదేరి దశదిశలూ జయించాడు. అలాంటి వంశంలో జన్మించి నువ్వు ఏమిటి ఇలా డీలా పడిపోతున్నావు. నేను ఒక్కడినే సకల సురాసురులనూ జయించగలను. అటువంటిది ససహాయుడిగా ఉండి ఒక్క దుష్ట రావణుణ్ణి సంహరించలేనా ?
*రఘురామా !* సుఖం తరవాత దుఃఖం, దుఃఖం తరవాత సుఖం చక్రనేమి క్రమంలో వస్తుంటాయి. అంతేకానీ ఏ ఒక్కటో కలకాలం ఉండిపోదు. అయితే, కష్టాలో సుఖాలో వచ్చినప్పుడు మనోధైర్యాన్ని పోగొట్టుకుంటే ఇక ఆ మనిషి శోకసాగరంలో మునిగిపోతాడే తప్ప ఎప్పుడూ సుఖపడలేడు. ఈ మాట మర్చిపోకు.
*సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖమ్ !*
*చక్రనేమిరివైకం తన్న భవేద్రఘునందన !!*
*మనో౬తికాతరం యస్య సుఖదు:ఖసముద్భవే !*
*స శోకసాగరే మగ్నో న సుఖీ స్యాత్కదాచన !!*
ఇంద్రుడంతటివాడికే సింహాసనం పోయింది. నహుషుడు అధిష్ఠించాడు. ఇంద్రుడు భయపడి పారిపోయి కొన్ని సంవత్సరాలపాటు అజ్ఞాతవాసం చేశాడు. నహుషుడేమో సుఖాలకు కన్నుగానక మహర్షులను అవమానించీ శచీదేవిని కాంక్షించీ సర్వభ్రష్టుడయ్యాడు. శాపాలకు గురి అయ్యాడు. అందుచేత కష్టాలకు దుఃఖపడకూడదు. గట్టెక్కే ఉద్యమం చెయ్యాలి.
*అన్నయ్యా!* నువ్వు అన్నీ తెలిసినవాడవు. జగదేకవీరుడివి. నీకు నేను చెప్పాలా ? ఇలా దుఃఖించడం ఎంతమాత్రమూ సమంజసంగా లేదు. లే. ధైర్యం తెచ్చుకో. దుఃఖాన్నీ కాతరభావాన్నీ (పిరికితనం) మనస్సునుంచి దులి పేసుకో.
లక్ష్మణ ప్రబోధంతో రాముడు శోకం నుంచి తేరుకున్నాడు. ధైర్యం కూడగట్టుకున్నాడు. మామూలుమనిషి అయ్యాడు.
*(అధ్యాయం - 29, శ్లోకాలు - 55)*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
🌈 *నారదాగమనం - దేవీవ్రతోపదేశం* 🙏
సరిగ్గా అదే సమయానికి నారదుడు తన మహతీవీణ పై బృహద్రథసామను పలికించుకుంటూ ఆకాశం నుంచి దిగివచ్చాడు. రాముడు లేచి నిలబడి స్వాగతసత్కారాలు జరిపాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించాడు. శిలావేదిక పై కూర్చోబెట్టాడు. చేతులు కట్టుకుని చెంత నిలబడ్డాడు. ఇద్దరినీ కూర్చోమన్నాడు నారదుడు. కుశలప్రశ్నలు వేశాడు.
*రఘువరా !* సురలోకంలో విన్నాను. పరమసాధ్వి సీతాదేవిని రావణాసురుడు అపహరించుకుని వెళ్ళాడుటగదా ! మూర్ఖుడు. తనకు మరణమని తెలుసుకోలేక అపహరించాడు.
*రామా !* అసలు నువ్వు జన్మించిందే రావణ సంహారం కోసం. ఇందుకే సీతాపహరణం జరిగింది.
పూర్వజన్మలో వైదేహి ఒక ముని కన్యక. గొప్ప తపస్విని. రావణుడు కామాంధుడై అప్పుడు ఆమెను వాంఛించాడు. నాకు భార్యవు కమ్మని నిరోధించాడు. జుట్టుపట్టుకున్నాడు. తపస్వినికి కోపం వచ్చింది. రావణ స్పర్శతో కలుషితమైన శరీరాన్ని అగ్నికి ఆహుతి చెయ్యాలని నిశ్చయించుకుని రావణుణ్ణి శపించింది. దుర్మార్గుడా ! నీ నాశనం కోసం నేను మళ్ళీ పుడతాను. అయోనిజగా జన్మిస్తాను - అంటూ అగ్నిలో దూకేసింది. అదిగో ఆ తపస్విని సీతగా జన్మించింది. రమాంశసంభూత. వొళ్ళు మరిచి సర్పాన్ని దండగా వేసుకున్నట్టు రావణుడు వంశనాశనం కోసం సీతాదేవిని అపహరించాడు.
మరో రహస్యం విను. నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి. చావు పుట్టుకలు లేనివాడివి. అయితేనేమి, దేవతల ప్రార్థనను మన్నించి రావణవధ కోసం రఘురాముడిగా అవతరించావు. మానవ జన్మ ఎత్తేవు కాబట్టి మానవుడిగా విలపిస్తున్నావు. అంతే. ధైర్యం వహించు. అక్కడ లంకలో సీతాదేవి రేయింబవళ్ళు నిన్నే ధ్యానిస్తూ నీ రాకకోసం ఆశగా ఎదురుచూస్తోంది.
ధర్మపరురాలై సాధ్వీనియమాలను పాటిస్తూ నీకోసం విలపిస్తోంది.
ఇది అంతా దేవతలకోసం జరుగుతోంది కనక దేవేంద్రుడు స్వయంగా కామధేనువు పాలను బంగారు గిన్నెలో సీతాదేవికి పంపించాడు. ఆ అమృతాన్ని జానకీమాత స్వీకరించింది. ఇక ఆకలి దప్పికల బాధ లేదు. నేను వెళ్ళి చూసిమరీ వచ్చాను. అది అలా ఉంచు.
రావణాసురుడు సామాన్యుడు కాడు. మహాబలశాలి. వరగర్వితుడు. అతణ్ణి సంహరించేందుకు నేనొక ఉపాయం చెబుతాను. ఆలకించు.
ఇదిగో ఆశ్వయుజమాసం వచ్చింది. శరదృతు ప్రారంభం. ఇప్పుడే ఆరంభించి *దేవీ నవరాత్ర వ్రతం* శ్రద్ధగా చెయ్యి. ఉపవాస దీక్షతో నిర్వహించు. జపాలూ హోమాలు జరిపించు. జగవ్మాతకు జంతుబలి ఇయ్యి. ఇది కామ్యార్చన. కోరికలు సిద్ధిస్తాయి. దశాంశం హవనం చెయ్యి. ఈ వ్రతాన్ని పూర్వకాలంలో త్రిమూర్తులూ దేవేంద్రుడూ చేసి అమోఘవరాలను పొందారు. భృగు, వసిష్ఠ, బృహస్పతి, విశ్వామిత్రాదులు అందరూ ఈ వ్రతం చేసినవారే. సిద్ధులు పొందినవారే, కష్టాలలో ఉన్నవారు తప్పనిసరిగా చెయ్యవలసిన వ్రతం ఇది. అందుచేత రావణవధకోసం నువ్వు ఈ వ్రతాన్ని చేసి తీరాలి. వృత్రాసురుణ్ణి సంహరించడానికి వెడుతూ ఇంద్రుడు చేశాడు. త్రిపురాసురుణ్ణి పంహరించే వేళ శివుడు చేశాడు. మధుకైటభ సంహారం కోసం విష్ణువు చేశాడు. అందుచేత విధ్యుక్తంగా నువ్వూ చెయ్యి. తేలికగా విజయం పొందుతావు.
*నారదా !* ఎవరు ఈ దేవి ? ఆవిడ ప్రభావం ఏమిటి ? ఆవిడ జన్మప్రకారం ఏమిటి ? ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి ? పేరేమిటి ? - ఇవన్నీ సమగ్రంగా వివరించు దేవర్షి !
*రామా !* ఈ దేవి ఆదిపరాశక్తి. సనాతని. సర్వకామద. పూజించినవారి దుఃఖాలను చిటికెలో తొలగిస్తుంది. చరాచరజగత్తు అంతటికీ ఆదికారణం. త్రిమూర్తులకూ అధిదేవత. ఆమె అనుగ్రహం, అమె శక్తి లేకుండా బ్రహ్మాది దేవతలు స్పందించనైనా న్పందించలేరు.
విష్ణుమూర్తిలో పాలనాశక్తి ఆమె. మా త్రండిలో సృజనశక్తి ఆమె. రుద్రుడిలో సంహారశక్తి ఆమె. ఈ సృష్టిలో ఏ చిన్న వస్తువైనా సరే అది ఆవిడ శక్తియే, ఆవిడ ఉత్పత్తియే.
ఈ త్రిమూర్తులూ ఈ సూర్యచంద్రులూ ఈ భూగోళం ఇవి ఏవీ లేనప్పుడు కూడా ఈ మహాదేవి పూర్ణప్రకృతిగా పరాత్పరుడితో కలిసి విహరిస్తూ ఉంది. నిర్గుణ స్వరూప. తాను సగుణ స్వరూపగా మారి ముల్లోకాలనూ సృష్టిస్తోంది. బ్రహ్మాదులను సృష్టించి వారికి తన శక్తులను ప్రసాదించి లోకసృష్టిని నిర్వహింపజేస్తోంది. ఆ పరాశక్తిని తెలుసుకుంటే జన్మసంసారబంధాలనుంచి ముక్తి లభిస్తుంది. ఆవిడ పరా - విద్య. వేదాద్య. వేదకారిణి. బ్రహ్మాది దేవతలు ఆవిడ గుణాలనూ పనులను తెలుసుకొని అసంఖ్యాకంగా దివ్యనామాలను కల్పించారు. అ-కారం మొదలు క్ష-కారంవరకూ ఉన్న అచ్చులనూ హల్లులనూ గుణింతాలనూ కలుపుకుంటూ వెడితే ఎన్ని పదాలు తయారు అవుతాయో అన్ని నామధేయాలు ఉన్నాయి ఆవిడకి.
*రఘువరా !* క్లుప్తంగా పూజా విధానం చెబుతున్నాను. తెలుసుకో.
సమతలంలో పీఠం వేసి జగదంబికను ప్రతిష్ఠించాలి. తొమ్మిది నాళ్ళూ ఉపవాసం ఉండాలి. నేనే పురోహితుడుగా దగ్గర ఉండి జరిపిస్తాను. దేవకార్యం కోసం ఈ పాటి సాయం చెయ్యాలని ఉత్సాహంగా ఉంది.
꧁┉┅━❀🔯❀━┅┉꧂
🙏 *దాశరథికి దేవీ దర్శనం* 🙏
*జనమేజయా !* నారదుడే పూనుకొన్నాక ఇక లోటేముంది !
రాముడు ఉత్సాహంగా నవరాత్రవ్రతం చేశాడు. పీఠం పెట్టి జగన్మాతను ప్రతిష్ఠించాడు. హోమమూ మంత్రజపమూ బలిదానమూ జరిగాయి. ఉపవాస దీక్షతో భక్తి శ్రద్ధలతో నిత్యార్చనలు జరుపుతున్నాడు.
అష్టమి నాటి రాత్రి స్వప్నంలో జగదంబిక దర్శనం అనుగ్రహించింది. సింహారూఢయై గిరిశృంగం పై నిలబడి మేఘ గంభీర కంఠంతో జగదీశ్వరి పలికింది.
*మహావీరా ! రఘురామా !* నీ భక్తిశ్రద్ధలకు మెచ్చాను. కావలసిన వరం కోరుకో. ఇస్తాను. నువ్వు నారాయణాంశ సంభూతుడివి. రావణవధకోసం దేవతల కోరిక మీద మానవుడుగా జన్మించావు.
పూర్వకాలంలో మత్స్యాది అవతారాలు ధరించి దుష్టశిక్షణ చేశావు. శిష్ట రక్షణ చేశావు. వేదాలను రక్షించింది నువ్వే. కచ్ఛప రూపం ధరించి మంధర పర్వతాన్ని ఎత్తేవు. వరాహరూపం ధరించి మేదినిని కోరపై నిలబెట్టావు. నరసింహావతారం ధరించి హిరణ్యకశిపుణ్ణి చీల్చి చెండాడావు. ప్రహ్లాదుణ్ణి కాపాడావు. వామనావతారంతో బలిచక్రవర్తిని కికురించి త్రివిక్రముడిగా విజృంభించావు. పరశురాముడిగా క్షత్రియులను జయించి భూమినంతటినీ కశ్యపుడికి ధారపోశావు. ఇప్పుడు దశరథరాముడిగా జన్మించావు. రావణ పీడితులైన దేవతలు నిన్ను ప్రార్ధిస్తే ఈ అవతారం ధరించావు. దేవాంశ సంభూతులైన కపీశ్వరులు నీకు ఈ మహాకార్యంలో సహాయపడతారు. వారికి నా శక్త్యంశ ఉంటుంది. ఆదిశేషుడు లక్ష్మణుడుగా అవతరించాడు. అతడు ఇంద్రజిత్తుని సంహరించడంకోసమే జన్మించాడు.
*రామా !* నీకు జయం కలుగుతుంది. పాపిష్ఠి రావణుణ్ణి సంహరించి సుఖంగా రాజ్యపాలన సాగించు. పదకొండువేల సంవత్సరాలపాటు నీ పాలన నడుస్తుంది. అప్పుడు తిరిగి వైకుంఠానికి వెడుదువుగాని.
*జనమేజయా !* ఈ మాటలు చెప్పి సింహవాహన అదృశ్యమయ్యింది.
రాముడు సంతుష్టాంత రంగుడై వ్రతాన్ని దీక్షతో పూర్తిచేశాడు. దానాలూ అన్న సంతర్పణలూ యథాశక్తిగా నిర్వహించాడు. విజయదశమినాడు వానర సేనతో లంకాపట్టణం పైకి దండయాత్ర సాగించాడు. సేతుబంధనం చేసి లంకలో ప్రవేశించి రావణుణ్ణి సంహరించాడు.
*(అధ్యాయం-30, శ్లోకాలు- 63)*
🙏 *లోకంలో ఎన్నో పురాణాలు ఉన్నాయి. అవి ఏవీ దేవీ భాగవతానికి సాటిరావు. ఇది శ్రోతలకు విశేష ఫలదం. భుక్తి ముక్తి ప్రదం.* 🙏
🌈 *తృతీయ స్కంధం - శ్లోకాలు 1746 - తెలుగుసేత: శ్రీ బేతవోలు రామబ్రహ్మం* 🌈
*(రేపటినుండి చతుర్థ స్కంధము ప్రారంభం)*
*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*
*...శ్రీదేవీ భాగవతము... సశేషం...*
♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾
*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*
*భావము:* 💐
ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది.
🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏🙏
🙏 శ్రీ మాత్రే నమః 🙏