*చతుర్థ స్కంధము - 01*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః*
*లలితా సహస్రనామ శ్లోకం - 41*
*భవానీ భావనాగమ్యా భవారణ్యకుఠారికా!*
*భద్రప్రియాభద్రమూర్తిః భక్తసౌభాగ్యదాయినీ!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*నిన్నటి వరకూ.........*
మనం 40 భాగములలో *ప్రథమ, ద్వితీయ, తృతీయ స్కంధములు* చదువుకున్నాము.
*అమ్మ దయతో......*
ఈ రోజు నుండి *చతుర్థస్కంధము* ప్రారంభించబడుతోంది.
ఈరోజు -
*జనమేజయుని సందేహాలు*
*వ్యాసుడు చేసిన కర్మ ప్రబోధం*
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡
*శౌనకాది మహామునులారా !* సర్వజ్ఞుడైన వ్యాసుడు సన్నిధిలో దొరికేసరికి జనమేజయుడు తన సందేహాలను అన్నింటినీ తీర్చుకోవాలనుకున్నాడు. ఒక్కసారిగా చాలా ప్రశ్నలు గుప్పించాడు.
*వ్యాసమహర్షీ !* నువ్వు సర్వజ్ఞుడివి. వంశ చరిత్రలు అన్నీ తెలిసినవాడివి. మా వంశాన్ని నిలబెట్టినవాడివి. కనుక అడుగుతున్నాను. దయచేసి నా సందేహాలు తీర్చు.
శూరసేనసుతుడైన వసుదేవుడికి శ్రీహరి పుత్రుడుగా జన్మించాడని కథ విన్నాను. దేవకీవసుదేవులను కంసుడు కారాగారంలో బంధించాడనీ, వారికి పుట్టిన ఆరుగురు బిడ్డలను సంహరించాడనీ, అష్టమగర్భంగా శ్రీహరి కారాగారంలోనే జన్మించాడనీ, అటు పైని గోకులానికి చేరాడనీ, అంతటి కుమారుడు ఉన్నా దేవకీవసుదేవులకు కారాగారవాసం తప్పలేదనీ - విన్నాను. ఇలా ఎందుకు జరిగింది ? ఈ దంపతుల పూర్వజన్మ సుకృతమా, దుష్కృతమా ఇది ?
వీరికి ఒక ఆడపిల్ల పుట్టినదనీ, ఆ పసిబిడ్డను కంసుడు నేలకు విసిరికొడితే ఆకాశంలోకి ఎగిరి *అష్టభుజ* గా మారిందని విన్నాను. నిజమేనా ? ఈ పసిబాల ఎవరు?
శ్రీ కృష్ణుడి గృహస్థ జీవితం ఎలా సాగింది ? అతడికి చాలామంది భార్యలు ఉండేవారని తెలిసింది. అతడి దేహ త్యాగానికి సంబంధించి కొన్ని కింవదంతులు వ్యాప్తిలో ఉన్నట్టున్నాయి. వాటికేమిగానీ అసలు ఏమి జరిగిందో తెలిసినవాడవు నువ్వు. ఆ సత్యం నాకు ఎరుకపరచు.
బదరికాశ్రమంలో తపస్సు చేసుకునే నరనారాయణులే ఇంద్రోపేంద్రులనీ, వారే కృష్ణార్జునులనీ నారదాది మహర్షులు చెబుతూంటారు. ఇది ఎలా సాధ్యమయ్యింది ? ' శాంతంగా తపస్సు చేసుకునే మహర్షులు క్షత్రియులుగా ఎందుకు జన్మించారు ? దీనికేదయినా శాపకారణం ఉందా ?
ఒక బ్రాహ్మణుడి శాపంవల్ల యాదవవంశం నశించిందనీ, గాంధారీశాపంవల్ల కృష్ణుడి వంశం అంతరించిందనీ అంటారు. నిజమేనా ?
జగద్రక్షకుడైన శ్రీ కృష్ణుడికి పుత్రుడుగా జన్మించిన ప్రద్యుమ్నుణ్ణి ఒక శంబరుడు పురిటిగది నుంచి అపహరించాడటగదా ! ఇది ఎలా సాధ్యమయ్యింది ? వాసుదేవుడు దివ్యదృష్టితోనైనా గమనించ లేకపోయాడా ? అడ్డుకోలేకపోయాడా ?
అలాగే మరొక సందేహం మనస్సుని పట్టి పీడిస్తోంది. ఆందోళన కలిగిస్తోంది. భూభారాన్ని తొలగించడం కోసం విష్ణువే కదా కృష్ణుడుగా జన్మించాడు. అంతటివాడు తానే ఎవరికో భయపడి మధురా రాజ్యాన్ని వదిలేసి ద్వారవతికి పారిపోవలసిన అవసరం ఎందుకు వచ్చింది ?
చివరి రోజులలో శ్రీ కృష్ణుడి భార్యలకు ఏ రక్షణమూ లేకపోయింది. దొంగలు దోచుకున్నారు. ఇదేమి దారుణం ? స్వామీ ! ఏమిటి దీనికి కారణం ?
పాండవులు దేవాంశసంభవులు కదా ! కృష్ణ భక్తులు కదా ! మహావీరులై అత్యద్భుతంగా రాజసూయయాగం చేశారుగదా ! అయినా అడవులపాలయ్యారు. ఎన్నో కష్టాలు పడ్డారు. వారు చేసిన పాపం ఏమిటి ? యజ్ఞఫలం ఏమైనట్టు ?
అగ్నిగుండం నుంచి లక్ష్మీదేవిలా జన్మించిన ద్రౌపదీసాధ్వికి జీవితమంతా దుఃఖమయంగానే సాగింది. ఒకటిగడిస్తే ఒకటిగా కడగండ్లు. నిండు సభలో దుశ్శాసనుడు జుట్టుపట్టుకుని ఈడ్చాడు. రజస్వలగా ఏకవస్త్రగా ఉన్నదానికి ఈ అవమానం జరిగింది. విరాటుడి కొలువులో సైరంద్రిగా తలదాచుకుంది. కీచక జయద్రథులు చేసిన అవమానాలు భరించింది. వీటన్నిటికీ కారణం ఏమిటి? ఏ జన్మలో చేసుకున్న పాపం?
సదాచార సంపన్నులైన పాండవులు భీష్మద్రోణులను మోసంతో సంహరించారు. జగత్తు నశ్వరమని తెలియనివారా ! తెలుసు. అయినా రాజ్య లోభం వారిని దారి తప్పించింది. దీనికి వాసుదేవుడి వత్తాసు మరీ విడ్డూరం. చివరికి వంశనాశనమయ్యింది. ఎవరు ఏమి బాముకున్నారు కనక ! రాజ్యలోభంతో యుద్ధాలు చేసి యోధులను చంపి ఆ నెత్తురుకూడు తింటూ అదే వైభోగం అనుకునేకన్నా, భిక్షాటనమో శిల్పాటనమో ఉత్తమోత్తమం.
*వ్యాసర్షీ !* విచ్ఛిన్నం కాబోతున్న మా వంశాన్ని ఒకప్పుడు నువ్వు స్వయంగా కాపాడావు. దేవరన్యాయంగా గోళకులను పుట్టించావు. అచిరకాలంలోనే అది నీ కళ్ళ ఎదుటనే క్షీణించి ఈ దశకు వచ్చింది. ఒంటి ఊపిరితో మిగిలింది. నా తండ్రి పరీక్షిత్తు ఒక తపస్విని అవమానించడం అనేది చాలా అనూహ్యమైన సంఘటన. ఏ క్షత్రియుడూ చెయ్యని ఈ ఘోరాన్ని మా తండ్రి ఎందుకు చేశాడు ? ఎలా చేశారు ? నాకేమీ అర్థం కావడం లేదు. మహానుభావా ! ఇవీ ఇలాంటి సందేహాలు నన్ను తొలిచేస్తున్నాయి. వివరంగా చెప్పి నా మనస్సును కుదుటపరచు.
*(అధ్యాయం-1 శ్లోకాలు-48)*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
💐 *వ్యాసుడు చేసిన కర్మ ప్రబోధం* 🌈
*జనమేజయా !* ఏమి చెప్పమంటావు ? అన్నింటికీ ఏకైక కారణం *కర్మ.* దాని గతి విలాసాలు తెలుసుకోవడం దేవతలకే సాధ్యం కాదు. ఇంక మానవుల సంగతి చెప్పాలా !
ఈ త్రిగుణాత్మకమైన జగత్తులో దేని పుట్టుకైనా కర్మానుసారమే జరుగుతుంది అనడంలో సందేహం లేదు. జీవులు అనాది నిధనులు. కర్మబీజ సముద్భవులు. రకరకాల జన్మలు ఎత్తుతున్నారు. వుడుతున్నారు, గిడుతున్నారు. ఇదంతా కర్మానుసారమే జరుగుతోంది. కర్మ రహితంగా దేహసంయోగం ఉండదు. *శుభ - అశుభ - శుభాశుభమిశ్రమ రూపంగా కర్మలు మూడు విధాలు. వీటినే పుణ్యకర్మలు పాపకర్మలు పాపపుణ్య సమ్మిశ్రితకర్మలు అని కూడా అంటారు.*
*జనమేజయా !*
ప్రతిజీవికీ *సంచితకర్మ (పూర్వ జన్మలలో సంపాదించుకున్నది),* *ప్రారబ్ధకర్మ (వర్తమానంలో సంపాదించుకున్నది),* *ఆగామికర్మ (రాబోయే కాలానికి చెందినది)* - అని మూడు కర్మలు తప్పక ఉంటాయి. సుఖదుఃఖాలకు ఇవ్వే కారణం. ముసలితనం, శోకం, హర్షం, మృత్యువు కామక్రోధాది అరిషడ్వర్గమూ - ఇవన్నీ దేహగతగుణాలుగా కనపడతాయి గానీ వీటన్నింటికీ మూలం కర్మమే. ప్రాణికోటిలో చరాచర జగత్తులో ఏదైనా సరే పుట్టడం మొదలుకొని గిట్టడం వరకూ ప్రతి సంఘటనా ప్రతి ఆలోచనా ప్రతి కదలికా కర్మఫలమే. బ్రహ్మాది దేవతలూ సూర్యచంద్రులూ అంతా కర్మాను బద్ధులై సంచరించేవారే. కర్మ అనాది నిధనం (ఆదీ అంతమూ లేనిది). నిత్యం.
ఈ దృష్టితో జగత్తు నిత్యమా అనిత్యమా అనే చర్చ ప్రాచీనకాలం నుంచీ జరుగుతోంది. ఇప్పటికీ మునీశ్వరులు ఆ తర్కంలోనే మునిగి ఉన్నారు. మాయావరణంలో చిక్కుకుంటే జగత్తు నిత్యంగానే భాసిస్తుంది. కారణం ఉండగా కార్యాభావం (కార్యం జరగకపోవడం) ఎలా ఉంటుంది ? అన్నింటికీ అన్ని వేళలా మాయ అనేది నిత్యతాకారణం.
ఈ జగత్తు అంతా కర్మనియంత్రితమై తిరుగుతోంది. విష్ణుమూర్తి అంతటివాడు గర్భవాసాలు చేస్తున్నాడు. వైకుంఠ భోగాలను విడిచి పెట్టి మత్స్యాది క్షుద్రజంతువులుగా గర్భవాసదుఃఖం అనుభవించాడంటే కర్మ కాకపోతే ఏమిటి కారణం ? మలమూత్రాలతో నిండిన గర్భకోశంలో తొమ్మిది పది నెలల పాటు నివసించే నరకాన్ని ఎవడైనా కోరుకుంటాడా ? ఇదేమైనా వనవిహారమా! జలకాలాటా? హంసతూలికా తల్పమా కోరుకోవడానికి ? కాళ్ళూ చేతులూ ముణగదీసుకుని అథోముఖంగా పడుకునే అవస్థను తెలివి ఉన్నవాడెవడూ కోరుకోడు. అయినా విష్ణుమూర్తి మానవగర్భవాసాన్నే కాదు పశుపక్ష్యాదుల గర్భవాసాన్ని కూడా (అవతారాలలో) అనుభవిస్తున్నాడంటే అదొక కర్మ !
*మహారాజా !* గర్భవాసాన్ని మించిన సరకం మరొకటి ఏదీ లేదు. ముల్లోకాలలోనూ లేదు. అందుకే, దానికి భయపడి తపస్వులు తీవ్రాతితీవ్రతపస్సులు చేస్తూంటారు. మనస్వులు రాజ్యాలనూ భోగభాగ్యాలనూ విడిచి పెట్టి వనవాసానికి పరుగులు తీస్తుంటారు.
మలమూత్రాలూ, క్రిమికీటకాలూ, జఠరాగ్ని, వపాదుర్గంధం - వీటితోనిండిన గర్భకోశంలో నివసించడంకన్నా సంకెళ్ళతో చెరలో నివసించడం సుఖం. క్షణకాలం ఉండాలంటేనే వొళ్ళు గరపొడుస్తుంది. పది నెలలు ఉండటం ఎంత దుఃఖమో ఆలోచించు. పోనీ ఎలాగో గడిచాయి అనుకుంటే దానినుంచి బయటపడటం మరీ దుఃఖం. అతిదారుణమైన యోని యంత్రం నుంచి నలిగిపోతూ బయటకు రావాలి. శైశవమూ బాల్యమూ ఇంకెంత దుఃఖకరాలో అందరికీ తెలిసిందే. మాటలు రాని మూగదనం. ఏమి తెలియని అజ్ఞానం. ఆకలిదప్పికలకు ఏడవడం తప్ప ఏమి చెయ్యలేని పరతంత్రత, తన మలమూత్రాలను తానే ఒళ్ళంతా పులుముకునే పిచ్చితనం. బిడ్డ ఎందుకు ఏడుస్తున్నాడో తెలీక తల్లి వేదనపడటం. శిశువు ఆరోగ్యం కోసం తాను మందులు వేసుకుంటూ పథ్యాలు చెయ్యడం - అబ్బో ! బాల్యంలో దుఃఖాలు ఇన్నీ అన్నీ కాదు. ఏ సుఖం ఉంది కనక గర్భవాసాన్ని కోరుకోవాలి ? విజ్ఞుడెవడూ కోరుకోడు.
అయినా సుఖాలూ దుఃఖాలూ మన చేతుల్లో ఉన్నాయి కనకనా కోరుకున్నప్పుడల్లా రావడానికీ పోవడానికిని. అంతా కర్మవిపాకంతో జరుగుతూంటుంది. *“అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్"* అని పెద్దలమాట. దేవతలతో సహా సకల ప్రాణికోటికీ ఇది తప్పదు.
*జనమేజయా !* తపస్పూ దానధర్మాలూ యజ్ఞయాగాలూ ఆచరించడం ద్వారా మానవుడు ఇంద్రపదవిని పొందుతాడు. ఆ పుణ్యం క్షీణించిపోతే ఇంద్రుడైనా స్వర్గం నుంచి పడిపోకతప్పదు.
విష్ణుమూర్తి రామావతారం ధరించినప్పుడు దేవతలు వానరులుగా అవతరించి సహకరించారు. కృష్ణావతారంలో యాదవులుగా జన్మించి అనుచరులయ్యారు. ఇలా ప్రతియుగంలోనూ విష్ణుమూర్తి అవతారాలు ధరిస్తూంటాడు, ధర్మసంరక్షణ చేస్తూంటాడు. ఇదొక ధర్మచక్రం. రాక్షసులను తానే స్వయంగా సంహరించడం విష్ణుమూర్తికి కర్తవ్యం. అందుకోసం ధరించినదే కృష్ణావతారం. ఆ కథ అడిగావు కదా, చెబుతున్నాను, ఆలకించు.
*(అధ్యాయం -2 శ్లోకాలు - 60)*
*(రేపు.... దేవకీ వసుదేవుల జన్మవృత్తాంతం)*
*🙏అమ్మ దయ ఉంటే... అన్నీ ఉన్నట్లే...🙏*
*...శ్రీదేవీ భాగవతము... సశేషం...*
♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾
*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*
*భావము:* 💐
ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏
🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏
🙏శ్రీ మాత్రే నమహా 🙏