*చతుర్థ స్కంధము - 05*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః*
*లలితా సహస్రనామ శ్లోకం - 45*
*నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా!*
*నిత్యశుధ్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*నిన్నటి భాగములో.........*
*అహంకారం సృష్టిబీజం* చదువుకున్నాము.
*అమ్మ దయతో......* ఈ రోజు
*"ప్రహ్లాద - చ్యవన సంవాదం"*
చదువుకుందాం.
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡
🌈 *ప్రహ్లాద చ్యవన సంవాదం* 💐
*జనమేజయా!* హిరణ్యకశిపుడి తదనంతరం పాతాళరాజ్యానికి ప్రహ్లాదుడు పట్టాభిషిక్తుడయ్యాడు. నరసింహస్వామి స్వయంగా జరిపించాడు. జనరంజకంగా పరిపాలన సాగిస్తున్నాడు. భూలోకంలోనూ పాతాళలోకంలోనూ ధర్మం నాలుగుపాదాల నడుస్తోంది. యజ్ఞయాగాది క్రతువులు నిరంతరంగా నిరాటంకంగా సాగుతున్నాయి. ప్రజలంతా భోగభాగ్యాలతో సుఖసంతోషాలతో విరాజిల్లుతున్నారు.
ఇలా ఉండగా ఒకనాడు -
భృగుపుత్రుడైన చ్యవన మహర్షి నర్మదానదిలో స్నానానికి దిగాడు. స్నానంచేసి గట్టుకి వస్తూండగా ఒక భయంకర విషసర్పం అతడి కాళ్ళను నోట గరచుకొని పాతాళానికి లాక్కుపోయింది. భయభీతుడైన మునిసత్తముడు విష్ణుమూర్తిని మనసా స్మరించాడు. సర్పం నిర్విషమైపోయింది. నీటిలో మునిగి పాతాళానికి పోతున్నా, చ్యవనుడికి చీమకుట్టినట్టయినా లేదు. అక్కడికి వెళ్ళాక సర్పం మునీశ్వరుణ్ణి విడిచి పెట్టింది. చెక్కుచెదరలేదే అని ఆశ్చర్యపోయింది. ఇతడెవరో మహాతపస్విలాగా ఉన్నాడు, శపిస్తాడేమో అని భయపడి, తన భార్యలతో పిల్లలతో కలిసి సకలోపచారాలూ చేశాడు ఆ సర్పవీరుడు. చ్యవనుడు ప్రసన్నుడయ్యాడు. శపించలేదు సరికదా, కొత్త లోకం కొత్త వాతావరణం ఆనందిస్తూ పాతాళంలో సంచరించాడు.
ప్రహ్లాదుడు, చ్యవనుని చూశాడు. ధర్మవత్సలుడు గదా, చ్యవనుడిని ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలతో అర్చించాడు. గౌరవంగా సముచిత సింహాసనం మీద కూర్చోబెట్టాడు.
*చ్యవనమహర్షి !* ఇలా అడుగుతున్నానని మీరు ఏమీ అనుకోవద్దు. మా పాతాళానికి రావడంలో కారణమేమిటి? దేవేంద్రుడు పంపితే వచ్చారా? నిజం చెప్పండి. ఇంద్రుడికి మా దైత్యులంటే తగని ద్వేషంకదా ! మా రాజ్యం ఎలా ఉందో చూసి వెడదామని వచ్చారా?
*ప్రహ్లాదా!* ఇంద్రుడితో నాకు పనిఏమిటి? అతడికి దూతగా రావలసిన అవసరం ఏమిటి? నేను భృగుపుత్రుణ్ణి. స్వనేత్రుణ్ణి. ధర్మ తత్పరుణ్ణి. అనవసరంగా నన్ను శంకించకు. నర్మదా పుణ్యతీర్థంలో స్నానం చేస్తుంటే ఒక విషసర్పం పట్టుకొని ఇటు లాక్కువచ్చింది. విష్ణుమూర్తిని స్మరించాను. విషసర్పవిముక్తుణ్ణి అయ్యాను. అంతలోకీ నీ దర్శనమయ్యింది. నువ్వు విష్ణుభక్తుడివి. నేనూ విష్ణుభక్తుడిని.
ప్రహ్లాదుడు సంతోషించాడు. భూలోకంలో ఉన్న తీర్థాలను గురించి తెలియజెప్పమని అభ్యర్థించాడు. చ్యవనుడు అన్నాడుగదా -
*హిరణ్యకసిపునందనా!* *మనోవాక్కాయాలను సిద్ధిగా ఉంచుకున్నవారికి అడుగడుగునా తీర్థాలే. మలిన మనస్కులకు గంగానది సైతం పాపపంకిలమే. మనస్సు పాపరహితంగా పరిశుద్ధంగా ఉంటేనే ఏ తీర్థాలైనా పావవాలయ్యేది.*
గంగానదికి ఇరువైపులా పొడుగునా ఎన్నెన్నో గ్రామాలు ఉన్నాయి. నగరాలు ఉన్నాయి. అడవుల్లో గిరజనావాసాలు ఉన్నాయి. ఇన్ని జాతులవారూ రోజూ ఆ గంగలోనే ముప్పొద్దులా మునుగుతున్నారు. బ్రహ్మసమానమైన ఆ పవిత్రజలాన్నే గ్రోలుతున్నారు. అయితేనేమి ఒక్కడంటే ఒక్కడు ముక్తిపొందాడా? *విషయలంపటులు వెళ్ళి ఎంతటి పవిత్ర తీర్థంలో మునిగినా ఫలితం శూన్యం.* *అన్నింటికీ మనస్పే ముఖ్యం. దాన్ని శుద్ధి చేసుకుంటే అన్ని శుద్ధి పొందుతాయి.*
అలాకాకుండా తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఆత్మవంచన - పరవంచనలు చేస్తే ఆ చుట్టుకునే పాపానికి అంతు ఉండదు. *ఇంట్లోవారుణం (పెదపాపరకాయ) పక్వమైనా ఇష్టం కానట్టే దుష్టస్వభావుడు దివ్యతీర్థంలో కోటిసార్లు మునిగినా పవిత్రుడు కాలేడు.*
అందుచేత అన్నింటికంటే ముందు మనశ్శుద్ధి ఉండాలి. అది ఉంటేనే ద్రవ్యశుద్ధి సిద్ధిస్తుంది. అటు పైని ఆచారశుద్ధి. ఇవన్నీ ఉన్నవాడికే తీర్థం తీర్థమవుతుంది. లేకపోతే అదొక రేవు మాత్రమే. అక్కడ ఏవేవి ఎంతెంత చేసినా “శుద్ధ దండుగ". నిజానికి వీటన్నింటికన్నా *భూతదయ* చాలా గొప్పది. అయినా నువ్వు తీర్థాలను గురించి అడిగావు కనక వాటినే చెబుతాను - విను.
భూలోకంలో లెక్కలేనన్ని తీర్థాలున్నాయి. వాటికేంగానీ *ఉత్తమోత్తమమైన తీర్థరాజం ఒక్కటే ఒక్కటి - నైమిశంలో చక్రతీర్థం.* దాన్నే పుష్కర తీర్థమని కూడా అంటారు. మిగతా తీర్థాలు ఎంతకంతే!
*జనమేజయా!* చ్యవనుడు ఇలా చెప్పేసరికి ప్రహ్లాదుడు సంబరపడ్డాడు. తన రాజ్యంలోని దైత్యప్రముఖులనందరినీ సమాయత్తం చేసి వెంటనే నైమిశానికి బయలుదేరాడు. పుండరీకాక్షుణ్ణి పీతాంబరుణ్ణి దర్శిద్దాం. తరిద్దాం రండి, రండి అంటూ ప్రయాణమయ్యాడు. నైమిశం చేరుకున్నాడు. చక్రతీర్థంలో చిత్తశుద్ధిగా స్నానం చేశాడు. విమలోదకాలతో విరాజిల్లుతున్న పుణ్యనదీమతల్లి సరస్వతిని సందర్శించాడు. ముమ్మారు మునిగాడు. మనస్సు ప్రసన్నమయ్యింది. యథావిధిగా అనేక దానాలు నిర్వహించాడు.
*( అధ్యాయం- 8, శ్లోకాలు- 47)*
*(రేపు.... ప్రహ్లాద - నరనారాయణ యుధ్ధం )*
♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾
*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*
*భావము:* 💐
ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏
🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏
🙏 శ్రీ మాత్రే నమః 🙏