*శ్రీదేవీభాగవతము - 46*

P Madhav Kumar


*చతుర్థ స్కంధము - 06*

                       

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 46*


*నిష్కారణా నిష్కలంకా నిరుపాధిర్నిరీశ్వరా!*

*నీరాగా రాగమధనీ నిర్మదా మదనాశినీ!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........* 

 

*"ప్రహ్లాద - చ్యవన సంవాదం"* చదువుకున్నాము.


*అమ్మ దయతో......*  ఈ రోజు  

*ప్రహ్లాద - నరనారాయణ యుధ్ధం*

చదువుకుందాం.

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


🙏 *ప్రహ్లాద - నరనారాయణ యుద్ధం* 💐


చ్యవనుడు చెప్పినది విని నైమిశారణ్యం చేరుకున్న ప్రహ్లాదుడు, సరస్వతీ  నదీతీరంలో తండ్రికి తీర్థవిధులను నిర్వర్తించడానికి అనువైన చోటుకోసం అన్వేషించాడు. సమీపంలో ఒక పెద్ద మర్రిచెట్టు కనిపించింది. అక్కడికి చేరుకున్నాడు. కార్యక్రమం ముగించాడు. విశ్రాంతి తీసుకుంటూ పరిశీలనగా చూసేసరికి అక్కడ కొన్ని బాణాలు కనిపించాయి. అవి విభిన్నజాతులవి. అన్నింటికీ గ్రద్ద ఈకలు ఉన్నాయి. (బాణాలవేగం పెరగడంకోసమని పక్షి ఈకలు కడతారు). పదునుతో తెల్లగా తళతళలాడుతున్నాయి. ప్రహ్లాదుడు ఆశ్చర్యపోయాడు. ఇవి ఎవరి బాణాలు చెప్మా అనుకున్నాడు. ఇది పరమపావనమైన తీర్థం. పరమశాంతమైన ఆశ్రమం. ఇక్కడ ఈ క్రొవ్వాడి నారాచాలు ఏమిటి?


సాలోచనగా నలువైపులూ పరికిస్తున్న ప్రహ్లాదుడికి ఇద్దరు సవయస్కులైన మునీశ్వరులు ధ్యానమగ్నులై కనిపించారు. కృష్ణాజినధరులు. జటాభార సమున్నతులు. నరనారాయణులు. వారిముందు రెండు ధనుస్సులు ఉన్నాయి. *నరుడిముందు అజగవమూ,* *నారాయణుడిముందు శాఙ్గమూ.* వాటితో పాటే అక్షయతూణీరాలు (ఎప్పుడూ బాణాలు తరిగిపోని అమ్ములపొదులు). వాటిని అలా ఉంచి ఇద్దరూ నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్నారు. ప్రహ్లాదుడు చూశాడు. ఇది ధర్మవిరుద్ధంగా కనిపించింది. క్రుద్ధుడయ్యాడు.


*మునీశ్వరులారా!* ఏమిటి ఈ దొంగజపం? ఈ ధనుర్బాణాలు ఏమిటి ? ఈ ధ్యానాలు ఏమిటి? ఎవరిని మోసం చేద్దామని? మహావీరులు కాదలుచుకుంటే ధనుర్బాణాలు చేపట్టండి. మహాతపస్వులు కాదలిస్తే తావళాలు తిప్పండి. అంతేకానీ రెండూ నడిపిస్తామంటే కుదరదు. అది ధర్మ విరుద్ధం. సృష్టిలో కనీవినీ ఎరగని వింత. కృతయుగంలోనైనా కూడని పని. ఈ కలియుగంలో అసలు కుదరదు. మీరు బ్రాహ్మణులు. 'తపస్సులు చేసుకోవాలే తప్ప ధనుస్సులు చేపట్టకూడదు. జటలను ధరించాలే తప్ప అంబులపొదులను ధరించకూడదు. అయినా మీ ఇష్టం. ఏదో ఒకటి త్వరగా తేల్చుకోండి. రెండూ అంటే మాత్రం ఊరుకోను.  ధర్మహాని జరగడానికి వీలులేదు. ధర్మంపట్ల ఆగ్రహంతో (పట్టుదలతో) ప్రహ్లాదుడు ఇలా షరతు పెట్టాడు.


నరనారాయణులకు నచ్చలేదు. నరుడు కల్పించుకున్నాడు.


*దైత్యేంద్రా!* ఇందులో నీకు వచ్చిన బాధ ఏమిటి? సామర్థ్యం ఉన్నవాడు ఏది చేసినా (ఎన్నిచేసినా) చెల్లుతుంది. మూఢుడా! మేము తపస్సుకీ ధనుస్సుకీ సమర్థులం. ఏదైనా చేపట్టగలం. చేపట్టాం. నువ్వు ఏమి చెయ్యగలవు మమ్మల్ని ? నీ దారిన నువ్వు పో. మర్యాద దక్కించుకో. అంతేకానీ అనవసరంగా మాజోలికి రాకు. బ్రహ్మతేజస్సు నీకేం తెలుసు? ప్రాణాలతో బతికి బట్టకట్టాలి అనుకునేవాడెవడూ బ్రహ్మతేజస్వులతో పెట్టుకోడు. వెళ్ళు, వెళ్ళు. నీ పని నువ్వు చూసుకో.


నరుడి వీరాలాపాలు ప్రహ్లాదుడి కోపానికి మరింత ఆజ్యం పోశాయి. భగ్గుమన్నాడు. 


*మందబుద్ధులారా!* గర్వమోహితులై ప్రగల్భాలు పలుకుతున్నారు. నేను దైత్యేంద్రుణ్ణి. ధర్మసేతు ప్రవర్తకుణ్ణి. నేనిక్కడ ఉండగా ఈ ఆశ్రమంలో ఈ దివ్యతీర్థంలో ఇంతటి అధర్మం జరగడానికి వీలులేదు. జరగనివ్వను. సమర్ధులం సమర్థులం అంటున్నావు, ఏమిటి మీ సామర్థ్యం? ఏదీ చూపించండి మీ యుద్ధశక్తిని, ఒకసారి చూస్తాను.


*ప్రహ్లాదా!* అంతగా చూడాలని ఉంటే నువ్వే దిగు యుద్ధానికి. రాక్షసాధమా! ఇప్పుడే నీ బుర్ర పగలకొడతాను. క్షణం చాలు.


ప్రహ్లాదుడు కోపావేశంతో ధనుష్టంకారం చేశాడు. దశదిశలూ దద్దరిల్లాయి. నరుడు ధనుస్సు ఎక్కు పెట్టి శరవర్షం కురిపించారు. బంగారపు మలాం చేసిన తన బాణాలతో వాటిని అన్నింటినీ మధ్యలోనే ఖండించాడు దైత్యేంద్రుడు. ఇది అవమానంగా బావించిన నరుడు మరిన్ని బాణాలు వేశాడు.  వాటిగతీ అంతే అయ్యింది. ప్రహ్లాదుడు గురిచూసి నరుడి గుండెల పైకి బాణం వేశాడు. తట్టుకుని నిలబడ్డ నరుడు ప్రహ్లాదుడి బాహువులకు గురి పెట్టాడు. ద్వంద్వయుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ఇంద్రాది దేవతలూ మహర్షులూ ఆకాశంలో నిలబడి వింత చూస్తున్నారు.


వర్షపాతంలా ప్రహ్లాదుడు బాణాలను కురిపిస్తుంటే తట్టుకోలేకపోతున్న నరుడికి బాసటగా నారాయణుడు విల్లు ఎక్కు పెట్టాడు. కుండపోత కురిపించాడు.


ధనుర్విద్యాకౌశలంలో ఎవరికీ ఎవరూ తీసిపోవడం లేదు. దేవతలు సంతోషించి ముగ్గురి మీదా పుష్పవృష్టి కురిపించారు.  కాసేపటికి ఆకాశమంతటా బాణాలు ఆవరించాయి. సూర్యచంద్రులు కనుమరుగయ్యారు. పగలూ రాత్రీ తేడా తెలియడం లేదు. మెరుపుల్లాంటి బాణాల కాంతులు తప్ప అంతా కారుచీకటి.


ఆకాశం నుంచి తిలకిస్తున్న నారదపర్వతమహర్షులు ఒక వైపు దిగులుపడుతూనే ఒకవైపు వీరత్వానికి మురిసిపోతున్నారు. ఇటువంటి యుద్ధాన్ని కనీవినీ ఎరుగమని చరిత్రపుటలు తిరగవేస్తున్నారు. తారకాసురయుద్ధం వృత్రాసురయుద్ధం మధుకైటభయుద్ధం - ఇవి చరిత్రలో ఇప్పటికి మహాయుద్ధాలు. వాటిని మించిపోయింది ఈ సంగ్రామం. ఎందుకంటే ప్రహ్లాదుడు నారాయణుడికి సాటివచ్చే ప్రబలశూరుడు. సమయుద్ధం సాగుతోంది - అని చర్చించుకుంటున్నారు.


నారాయణుడు నేర్పుగా బాణం వేసి ప్రహ్లాదుడి ధనుస్సును ఛేదించాడు. అతడు మరొక విల్లును స్వీకరించాడు. దానినీ ఖండించి తన లాఘవం చూపించాడు నారాయణుడు. ఇలా చాలా ధనుస్సులు భగ్నమయ్యాయి. ప్రహ్లాదుడికి వొళ్ళు మండింది. *పరిఘ* అనే ఆయుధాన్ని విసిరాడు. అది సరాసరి వెళ్ళి గుండెలను తాకబోతోంది. తొమ్మిది బలమైన బాణాలను ఒకేసారి వేసి దాన్ని తుత్తునియలు చేసి పరిహసించాడు నారాయణుడు. రెప్పపాటు సమయమన్నా ఇవ్వకుండా మరో పది బాణాలను సంధించి ప్రహ్లాదుడి శరీరానికి తూట్లు పొడిచాడు. ఈసారి ప్రహ్లాదుడు దృఢమైన ఇనప గదను విసిరాడు. అది ఊహకందనంత వేగంగా వచ్చి నారాయణుడి తొడలను ఢీకొంది. అయినా అతడు చలించలేదు. ప్రహ్లాదుడికి ఇది అవమాన మనిపించింది. వెంటనే *శక్తి ఆయుధం* ప్రయోగించాడు. నారాయణుడు దాన్ని లీలగా ఒకే ఒక్క బాణంతో ఏడుముక్కలు చేసి, ఏడింటినీ ఏడు బాణాలతో పధ్నాలుగు ముక్కలు చేశాడు.


*జనమేజయా!* ఇలా నరనారాయణులతో సమఉజ్జీగా నిలబడి ప్రహ్లాదుడు నూరేళ్ళు (దివ్య వర్షశతం) యుద్ధం చేశాడు. ఎవరికీ ఎవరూ తీసిపోలేదు. అలుపూ సొలుపూ లేదు. భీషణ సంగ్రామం సాగుతోంది. ఇరుపక్షాలవారికీ ఆశ్చర్యంగానే ఉంది.


శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. చతుర్భుజుడు. రమాకాంతుడు. చక్రధారి. హిరణ్యకశిపునందనుడు పరమానందం పొందాడు. పాదాభివందనం చేశాడు. మనసులో మాట అడిగాడు. వేలయుద్దాలు చేశాను. ఇంతకాలంపాటు జయలక్ష్మి వరించకపోవడం ఎన్నడూ లేదు. ఈ ఇద్దరినీ నేనెందుకు జయించలేకపోతున్నాను? సందేహం తీర్చమని అడిగాడు.


*నాయనా, ప్రహ్లాదా!* వీరిద్దరూ నా అంశతో జన్మించిన మహర్షులు. జితేంద్రియులు. నరనారాయణులు. అందుచేత అపజయం అనుకోక, నీ రాజ్యానికి నువ్వు వెళ్ళు. ఇక ఎప్పుడూ వీరితోగానీ వీరివంటి తాపసులతోగానీ విరోధం పెట్టుకోకు. కలహించకు- అని విష్ణుమూర్తి చెప్పడమేమిటి, ప్రహ్లాదుడు రణరంగం విడిచి పెట్టి తనవారందరితోనూ కలిసి పాతాళానికి వెళ్ళిపోయాడు. నరనారాయణులు మళ్ళీ తమ తపస్సులు తాము కొనసాగించారు.


*(అధ్యాయం - 9, శ్లోకాలు - 56)*


*శౌనకాది మహర్షులారా!* వ్యాసుడు చెప్పగా ఈ కథవిన్న జనమేజయుడికి మౌలికంగా ఒక ధర్మ సందేహం వచ్చింది. సవినయంగా అడిగాడు.


*వ్యాసమహర్షి!* నరనారాయణులు శాంతస్వభావులు. వైష్ణవాంశ సంభూతులు. తపోధనులు. చక్రతీర్థంలో నివసిస్తున్నవారు. సత్త్వగుణ సంపన్నులు. కందమూల ఫలాలే ఆహారంగా జీవిక సాగిస్తున్న వారు. ధర్మపుత్రులు. సత్యసంధులు. ఇన్ని ఉత్తమగుణాలూ ఉండి వీరు యుద్ధానికి ఎలా దిగారు? క్రోధ వివశులు ఎలా కాగలిగారు? పోనీ తాత్కాలికంగా ఆవేశపడ్డారేమో అనుకుందామంటే నూరేళ్ళు, అదీ దివ్య వర్షశతం అంటే వెయ్యేళ్ళకు పైగా యుద్ధం చేశారు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అటు ప్రహ్లాదుడూ అంతే. విష్ణుభక్తుడు. మహాజ్ఞాని. జన్మతః దైత్యుడైనా స్వభావతః దేవత. తీర్థయాత్రకని వచ్చి యుద్ధయాత్రకు దిగారు. శాంతి సుఖాలను పణంగా పెట్టాడు. 


*మహర్షీ!* నాకేమీ అర్థం కావడంలేదు. ఈ వైరుధ్యం ఎక్కడ ఉందో తెలియడం లేదు. *కామినీ కనకం కార్యం కారణం విగ్రహస్య వై* అన్నారు. వీరికీ ఈ యుద్ధబుద్ధి ఎలా కలిగింది? నరనారాయణులు తపస్సు చేసేది ఎందుకోసం? మోహం కోసమా, సుఖభోగాలకోసమా, స్వర్గం కోసమా? శాంతచిత్తులై అంతటి తపస్సుచేసి వీళ్ళు పొందిన ఫలం ఏమిటి? తపోనియమాలతోనూ పునఃపునః సంగ్రామాలతోనూ శరీరాలను కృశింపజేసుకోవడమా? రాజ్యకాంక్ష అందామా, అది లేదు. ధనకాంక్ష లేదు. దారేషణ లేదు. గృహేషణ లేదు. అన్నీ పుష్కలంగా ఉన్న ప్రహ్లాదుడు మరింక దేనికోసం వారితో తలపడినట్టు? బుద్ధిమంతుడెవడైనా నిరీహుడై సుఖపడాలనుకుంటాడు. వీళ్ళేమిటి - నిరీహులై ఉండీ కష్టాలూ దు:ఖాలూ కొనితెచ్చుకున్నారు? పర్వజ్ఞులు చెయ్యవలసిన పనేనా ఇది? మూర్ఖులు తప్ప యుద్ధాన్ని ఎవరైనా కోరుకుంటారా?


నాకు తెలిసినంతవరకూ యయాతి ఒకడు ఇలాగే అహంకరించి కష్టాలు కొనితెచ్చుకున్నాడు. యజ్ఞయాగాలూ దానధర్మాలు అమితంగా చేసి సంపాదించుకున్న స్వర్గాన్ని చేజేతులా జారవిడుచుకున్నాడు. శబ్దోచ్చారణ మాత్రంచేత స్వర్గం నుంచి పతనమైపోయాడు. ఎదుగుదలతోపాటు ఒదుగుదల ఉండాలికదా! మరి వీరికి ఇంతలేసి అహంకారాలు ఎలా వచ్చాయి? తత్త్వం తెలిసినవాడవు నువ్వు. దయచేసి వివరించు.


*జనమేజయా!* ఇంతకు ముందే చెప్పాను. అది నీ మనస్సుకి పట్టినట్టులేదు. పోనీలే. మళ్ళీ చెబుతున్నాను. శ్రద్ధగా ఆలకించు. *ఈ సృష్టికి మూల హేతువే అహంకారం. అది త్రిగుణాత్మకంగా ఉంటుంది. కారణం లేనిదే కార్యం లేదు. కారణగుణాలు కార్యానికి సంక్రమిస్తాయి. అందుచేత ఈ సృష్టిలో భాగమైన దేహధారికి - ఎంతటివాడికైనా అహంకారం తప్పదు. మహర్షులంటావేమిటి, త్రిమూర్తులకే ఇది తప్పదు.*


అయితే, సాత్త్వికాహంకారంవల్ల తపస్సూ దానమూ ధర్మమూ యజ్ఞమూ యాగమూ - ఇటువంటివి సంభవిస్తాయి. రాజసాహంకారం వల్ల కూడా ఇవే ప్రభవిస్తాయి. ఫలితాలలో తేడా ఉంటుంది.


దానికేమి, అది అలా ఉండనీ. తామసాహంకారంవల్ల కలహాలూ కయ్యాలూ ఆవిర్భవిస్తాయి. ఇంతకీ నువ్వు తెలుసుకోవలసింది ఏమిటంటే...


 - *ఏదోఒక అహంకారం లేకుండా ఏపనీ జరగదు. అది శుభమైనా అశుభమైనా అహంకారజన్యమే.*


అహంకారాన్ని మించిన బంధకారణం మరొకటి లేదు ఈ సృష్టిలో. అది కారణంగా ఏర్పడిన విశ్వంలో అదిలేనిచోటు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? దేవమానవ తిర్యగ్జాతులన్నింటి పుట్టుకా అహంకారంతోనే. మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం - ఇదొక కర్మబంధం. రథచక్రంలా తిరుగుతూ ఉంటుంది. విష్ణుమూర్తి ఎన్ని జన్మలు ఎత్తాడో ఏఏ జన్మలు ఎత్తేడో ఎవడైనా లెక్క పెట్టి చెప్పగలడా? వాటిలో జాతిరీత్యా ఏవి ఉత్తమాలో ఏవి నీచాలో గ్రహించగలమా? చేపజన్మ ఎత్తేడు. తాబేలు అయ్యాడు. పందిగా జన్మించాడు. నరసింహుడుగా అవస్థపడ్డాడు. వామనుడై చెయ్యి సాచాడు. యుగయుగాలుగా జగన్నాధుడి దురవస్థ ఇది. కర్మబంధంలో ఇరుక్కొని, భృగుమహర్షి శాపంవల్ల ఈ ఏడవ మన్వంతరంలో విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలు అసంఖ్యాకం.


*పరాశరాత్మజా!*  భృగుమహర్షి శపించడమేమిటి? విష్ణుమూర్తి ఏమి అపరాధం చేశాడు? భృగువుకి కోపం ఎందుకు వచ్చింది? ఏమని శపించాడు? ఇది చాలా విడ్డూరంగా ఉంది. తెలియజెప్పవా?


*(రేపు....  "శుక్రాచార్యుడి తపస్సు)*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏


🙏 శ్రీ మాత్రే నమః 🙏


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat