*చతుర్థ స్కంధము - 07*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః శ్రీమాత్రేనమః*
*లలితా సహస్రనామ శ్లోకం - 47*
*నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాశినీ!*
*నిర్మమా మమతాహంత్రీ నిష్పాపా పాపనాశినీ!!*
🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏
*నిన్నటి భాగములో.........*
*ప్రహ్లాద - నరనారాయణ యుధ్ధం* చదువుకున్నాము.
*అమ్మ దయతో......* ఈ రోజు
*శుక్రాచార్యుడి తపస్సు*
చదువుకుందాం.
🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡
🙏 *శుక్రాచార్యుడి తపస్సు* 🌈
*జనమేజయా!* హిరణ్యకశిపుడు దేవలతో వైరం పెట్టుకుని, వేల సంవత్సరాలు యుద్ధం చేసి కట్టకడపటికి ఓడిపోయాడు. అతని కొడుకు ప్రహ్లాదుడు అదే వైరాన్ని కొనసాగించి యుద్ధాలు చేశాడు. ఇంద్రుడిచేతిలో పరాజితుడై విరోచనసుతుడైన బలికి సింహాసనం అప్పగించి తాను తపస్సులకు వెళ్ళిపోయాడు. బలిచక్రవర్తి కూడా తాతతండ్రుల మార్గంలోనే ప్రయాణించి దేవతలతో తలపడ్డాడు. విష్ణుమూర్తి సహాయకుడుగా ఇంద్రుడు జయకేతనం ఎగుర వేశాడు.
హతశేషులైన దైత్యులు బ్రతుకుజీవుడా అని పారిపోయి భృగుపుత్రుడైన శుక్రాచార్యుణ్ణి శరణువేడారు. నువ్వు సహాయం చెయ్యకపోతే పాతాళానికి పారిపోవడం తప్ప మాకు గత్యంతరం లేదని ప్రాధేయపడ్డారు.
శుక్రుడు అభయం ఇచ్చాడు. నా తపశ్శక్తితో నా మంత్రశక్తితో (బుద్ధిబలం) నా వైద్యవిద్యతో మీకు సహాయం చేస్తాను, భయపడకండి అన్నాడు. ఓషధీ వైద్యం చేశాడు. అందరి గాయాలూ నయం అయ్యాయి. దైత్యులు స్థిమితపడ్డారు.
చారులవల్ల ఈ వార్త దేవతలకు తెలిసింది. నాయకులు అందరూ కలిసి చర్చించారు. భృగువంశసంభవుడైన శుక్రాచార్యుడు మంత్రాంగం పన్నకముందే మనం హఠాత్తుగా దాడిచేసి దైత్యులను సంహరిద్దామని నిర్ణయించుకున్నారు.
ఇంద్రుడి నాయకత్వంలో బయలుదేరి వెళ్ళి మెరుపుదాడి చేశారు. రాక్షసులను ఊచకోత కోశారు. కకావికలై పరుగులు తీసినవారుతియ్యగా మిగిలినవారు శుక్రుడి కాళ్ళమీద పడ్డారు. రక్షించు మహాప్రభో - అన్నారు.
భయపడకండి, నేను ఉన్నానుగా అంటూ అతడు వారిని ఓదార్చాడు. శుక్రాచార్యుణ్ణి చూసిన దేవతలు ఇక అక్కడికి ఊచకోత ఆపి స్వర్గలోకానికి తిరుగుముఖం పట్టారు.
*(అధ్యాయం - 10, శ్లోకాలు - 50)*
దేవతలు వెళ్ళిపోయాక, అటూ ఇటూ బెదిరి పారిపోయిన రాక్షసులనందరినీ ఆహ్వానించి భృగుపుత్రుడు శుక్రాచార్యుడు ఓదార్చాడు. ధైర్యవచనాలు పలికాడు.
పూర్వం ఒకప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన సంగతి ఇప్పుడు మీకు తెలియజేస్తామ, వినండి అంటూ మొదలు పెట్టాడు. విష్ణుమూర్తి రాక్షపసంహారానికి కంకణం కట్టుకున్నాడు. వరాహరూపం ధరించి హిరణ్యాక్షుడినీ, నరసింహావతారం ధరించి హిరణ్యకశిపుడినీ సంహరించాడు. ఇంకా ఇలాగే క్రమక్రమంగా సర్వరాక్షససంహారం చేస్తారు. ఇది ఆలనాడు బ్రహ్మదేవుడు నాకు చెప్పిన సంగతి. అయినా భయపడకండి. విష్ణుమూర్తిని జయించడానికి అనువైన ఉపాయం ఏదీ ప్రస్తుతం నాకు స్ఫురించడం లేదు. అందుకని శంకరుడి దగ్గరికి సలహాకోసం వెళ్ళి వస్తాను. నేను వచ్చేదాకా మీరంతా ఇక్కడే ఉండండి. త్వరలోనే వస్తాను.
శుక్రుడు కూడా వెళ్ళిపోతే మరీ ఒంటరివాళ్ళం అయిపోతాం ఎలాగా అని రాక్షసులు కంగారు పడ్డారు.
*ఆచార్యా!* నువ్వు వచ్చేలోగా మా ఈ కొద్దిమందినీ దేవతలు మట్టు పెట్టేస్తారేమో! మహావీరులంతా ఇప్పటికే అయిపోయారు. విత్తనాల్లాగా మేము ఈ కొద్దిమందిమీ బతికి ఉన్నాం. ఎలాగ? అని దైత్యులు దీనంగా పలికారు.
*దైత్యులారా!* తప్పదు. నేను వెళ్ళి శంకరుడినుంచి మంత్ర విద్యను తెచ్చి మీకు ఉపదేశించేవరకూ. మీరంతా ఎక్కడో ఒకచోట, ఎలాగో ఒకలాగ తలదాచుకోండి. శమదమాదులు అలవరచుకుని తపస్సులు చెయ్యండి. మీజోలికి ఎవరూ రారు. సామదానాలు ఉపయోగించండి. సమయోచితంగా ప్రవర్తించండి. దేశకాలాలూ బలపౌరుషాలూ చూసుకోవాలిగదా! అవసరమైతే శత్రువులకు ఊడిగం చెయ్యాలి. శక్తి సమకూరాక సంహరించాలి. ఇది శుభప్రదమైన రాజనీతి.
అందుకని ప్రస్తుతానికి వినయగుణం నటిస్తూ సామోపాయంతో కాలం గడపండి. నేను వచ్చేవరకూ గుమ్మం కదలి వెళ్ళకండి. శివుణ్ణి మెప్పించి మహామంత్రాలు తెస్తాను. అప్పుడు చూపిద్దాం మన తడాఖా అని చెప్పి దైత్యుల్ని ఒడబరిచి కావ్యుడు (శుక్రుడు) బయలుదేరాడు.
దానవులంతా కలిసి ప్రహ్లాదుణ్ణి - ఉభయులకూ విశ్వసనీయుడుకదా అని - దేవతల దగ్గరికి రాయబారం పంపారు. ఆయుధాలు విడిచి పెట్టేశాం. వల్కలాలు ధరించాం. కందమూలాలు తింటూ ముక్కుమూసుకుని తపస్సు చేసుకుంటున్నాం. కాబట్టి ఇక మా జోలికి రాకండి అని దైత్యుల సందేశాన్ని ప్రహ్లాదుడు వినిపించాడు. దేవతలు విశ్వసించారు. తామూ విసిగిపోయారేమో, యుద్ధ సన్నాహాలు విడిచి పెట్టి హాయిగా నిశ్చింతగా క్రీడాపరాయణులు అయ్యారు. దైత్యులు దంభతాపసులై కశ్యప ప్రజాపతి ఆశ్రమంలో తలదాచుకుంటూ శుక్రాచార్యుడి రాకకోసం ప్రతీక్షిస్తున్నారు.
భృగుసంభవుడు శుక్రాచార్యుడు కైలాసానికి వెళ్ళి మహాదేవుడికి నమస్కరించాడు. బృహస్పతి దగ్గర లేని దివ్యమంత్రాలు నాకు కావాలి. దేవతలను ఓడించాలి. రాక్షసులను గెలిపించాలి. అలాంటి మహత్తరమైన మంత్రాలను ఉపదేశించు అని అభ్యర్థించాడు.
మహాదేవుడు సర్వజ్ఞుడు. శంకరుడు. ఆలోచించాడు. దేవతలకు ద్రోహం తల పెట్టి ఈ శుక్రాచార్యుడు ఇలా వచ్చాడు. ఇతడు రాక్షసులకు గురువు. వారి విజయం కోరుకుంటున్నాడు. సహజం. మరినా నా కర్తవ్యం ఏమిటి? నేనూ నా దేవతలను రక్షించుకోవాలి. (రక్షణీయా మయా దేవా ఇతి సంచింత్య శంకరః! అని ఆలోచించి శుక్రుడితో ఇలా అన్నాడు.
*కావ్యా! (శుక్రాచార్యా!)* నీ కోరిక నెరవేరాలంటే ఒక దుష్కరమైన వ్రతం ఉంది. దుష్కరంలోనూ అతి దుష్కరం. అయినా చెబుతాను, చెయ్యగలిగితే చూడు. కిందనుంచి పొగ పెట్టుకుని, తలకిందులుగా వేలాడుతూ ఆ పొగనే పీలుస్తూ పూర్తిగా వెయ్యేళ్ళపాటు తపస్సు చెయ్యాలి. చేస్తే నువ్వు కోరుకున్న మంత్రాలు అన్నీ లభిస్తాయి. ప్రయత్నించు. నీకు శుభమగుగాక!
శుక్రాచార్యుడు సరే అన్నాడు. మరోసారి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. ఎక్కడో అడవిలో అనువైనచోటు చూసుకుని తపస్సు ప్రారంభించాడు. తల్లకిందుల తపస్సు. ధూమపాన తపస్సు.
*(రేపు.... "విష్ణుమూర్తికి భృగుశాపం" )*
♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾
*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*
*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*
*భావము:* 💐
ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది. 🙏
🙏 శ్రీ మాత్రే నమః 🙏
🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏