*శ్రీదేవీభాగవతము - 49*

P Madhav Kumar


*చతుర్థ స్కంధము - 09*

                     

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏

*శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః  శ్రీమాత్రేనమః* 


*లలితా సహస్రనామ శ్లోకం - 49*


*నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశినీ!*

*నిర్నాశా మృత్యుమథనీ నిష్క్రియా నిష్పరిగ్రహా!!*

🙏🌹🌹🌹🌹🌻🔯🌻🌹🌹🌹🌹🙏


*నిన్నటి భాగములో.........* 

 

48వ  భాగములో....

*విష్ణుమూర్తికి భృగుశాపం*  చదువుకున్నాము.


*అమ్మ దయతో......*  ఈ రోజు

*"శుక్రాచార్య తపోభంగానికి ఇంద్రుని ఎత్తుగడ"*

*మాయా శుక్రాచార్యుడు*

చదువుకుందాం.

🔯<>><<>><♾️🔘♾️<>><<>><✡


🌈 *శుక్రాచార్య తపోభంగానికి ఇంద్రుడి ఎత్తుగడ* 🌈


దేవతలూ విస్మయం చెందారు. ఇంద్రుడికైతే మరింత భయం పట్టుకుంది. కావ్యుడి తపస్సు ముగింపుకి వచ్చింది. మంత్రం సిద్ధిస్తుంది.


దానితో ఏమి చేస్తాడో. తండ్రిని మించిన శక్తిశాలి అవుతాడు. ఎలాగబ్బా అని తలపట్టుకు కూర్చున్నాడు. విరుగుడు ఏమిటో, ఏమి చేస్తాడో తెలుసుకునే దారి ఏమిటో ఎంతకీ తోచలేదు. పాత ఉపాయమే కొత్త మనిషితో ప్రయోగిద్దాం అనుకున్నాడు. సొంతకూతురు జయంతిని (జయంతుడి సోదరి) పిలిచాడు. ముఖానికి నవ్వు పులుముకున్నాడు.


*జయంతీ!* నిన్ను నేను శుక్రాచార్యుడికి కన్యాదానం చేశాను. అతడిప్పుడు తీవ్ర తపస్సులో ఉన్నాడు. నువ్వు వెళ్ళి పరిచర్యలు చెయ్యి. అతణ్ణి భర్తగా స్వీకరించు. ఆరాధించు. మనస్సు దోచుకో. నీకు వివశుణ్ని చేసుకో. ఇది నేను స్వప్రయోజనం కోసం చేస్తున్నపని. అందుచేత కాదనకుండా అంగీకరించి నా భయం తొలగించు.


తండ్రి ఆంతర్యాన్ని గ్రహించిన జయంతి సరే అని అంగీకరించింది. సరాసరి శుక్రాచార్యుడి సన్నిధికి వచ్చింది. పొగలో తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నాడు. పొగజూరిపోయాడు. చెమటలు కక్కుతున్నాడు. అరటి ఆకులతో వింజామరలు వీచింది. శుభ్రమైన శీతలోదకాలను తెచ్చి త్రాగడానికి అందించింది. ఎండసోకకుండా పైటచెరగు అడ్డం పట్టింది.


మధుర ఫలాలను ఎంచి ఎంచి కోసి తెచ్చి భక్తితో ప్రేమతో అందించింది. నిత్యకర్మానుష్ఠానానికి కుశలూ కుసుమాలూ సమకూర్చింది. చిగురాకులతో మెత్తని శయనం ఏర్పరిచింది. ఆదరంతో సేవలు చేసిందే తప్ప ఏ వికారాలనూ ఏనాడూ ప్రదర్శించలేదు. శపిస్తాడని భయపడింది. 


అతడి మనస్సు రంజిల్లేటు స్తుతులు చేసింది. అనుక్షణం ప్రియంగా మాట్లాడింది. ఉదయమే అతడు లేచేసరికి ఆచమనోదకం సిద్ధంగా ఉంచడం మొదలుకొని సకలోపచారాలూ అతడి మనస్సుకు అనుకూలంగా చేస్తోంది. నిర్వికారచిత్తంతో బ్రహ్మచర్యదీక్షతో చేస్తోంది.


సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంద్రుడిలో ఆతురత పెరిగింది. జితాత్ముడైన శుక్రుడి ప్రవృత్తినీ మనస్సునూ తెలుసుకోవడం కోసం మరికొందరు సేవకులను నియోగించాడు.


కావ్యుడి వెయ్యేళ్ళ తపస్సు నిర్విఘ్నంగా పూర్తి అయ్యింది. మహేశ్వరుడు సంతోషించాడు. ప్రత్యక్షమయ్యాడు. దివ్యవరాలు ఇచ్చాడు. *అవధ్యత్వం సర్వజ్ఞత్వం (మనస్సులలో ఉన్నది తెలుసుకోగలగడంతో సహా)* అనుగ్రహించాడు. అంతర్ధానం చెందాడు.


శుక్రుడు సంతృప్తి చెందాడు. ప్రక్కనే నిలబడి ఉన్న జయంతిని చూశాడు. నువ్వు ఎవరి అమ్మాయివి? పేరేమిటి? ఎందుకని ఇక్కడికి వచ్చావు? పని ఏమిటి? అందమైన కన్నులున్న చిన్నదానా! నీ కోరిక ఏమిటో చెప్పు. ఎంత దుష్కరమైనా తీరుస్తాను. నీ సేవలకు సంతృప్తి చెందాను. వరం కోరుకో అన్నాడు.


జయంతి ముఖం ఆనందంతో కళకళలాడింది. రవ్వంత సిగ్గుపడుతూ బదులు పలికింది. 


*భగవన్!* నేను ఏ పనిమీద వచ్చానో నువ్వు తపశ్శక్తితో గ్రహించలేకనే అడుగుతున్నావా?


*జయంతీ!* ఎరుగుదును. అయినా నువ్వు చెబితే వినాలని ఉంది. నీ మనస్సులో ఉన్నదేమిటో నిస్సంకోచంగా చెప్పు. నీకు భద్రమగుగాక!


*మహామునీ!* నేను ఇంద్రుడి కూతురిని. మా తండ్రి నన్ను నీకు సమర్పించాడు. నా పేరు జయంతి అంటారు. జయంతుడి చెల్లెలిని. నాకు నీ పై మనసయ్యింది. ధర్మబద్ధంగా నన్ను స్వీకరించి ప్రేమతో ఆనందించు, ఆనందింపజెయ్యి.


*భామినీ!* అలాగే. అంగీకరిస్తున్నాను. అయితే గడువు కేవలం పదేళ్ళు మాత్రమే. అదృశ్యరూపాలతో ఇక్కడే క్రీడిద్దాం.


ఈ నియమానికి జయంతి అంగీకరించింది. ఇంటికి తీసుకువెళ్ళి శుక్రుడు వివాహం చేసుకున్నాడు. తన మంత్రశక్తితో ఇద్దరూ అదృశ్యులై స్వేచ్ఛగా క్రీడిస్తున్నారు.


శుక్రాచార్యుడు కృతార్థుడై మంత్రశక్తితో ఇంటికి తిరిగి వచ్చాడనే వార్త తెలిసి దైత్యులంతా పరుగుపరుగున వచ్చారు. ఆశ్రమం అంతటా గాలించారు. గురుడు కనిపించలేదు. అదృశ్యరూపంలో ఉన్నాడని వారికి తెలీదు. ఆశగా మళ్ళీ మళ్ళీ వెదికారు. కనిపించలేదు. విమనస్కులై భగ్న మనోరథులై కాళ్ళీడ్చుకుంటూ స్వగృహాలకు తిరిగి వెళ్ళారు.


 🌈 *మాయా శుక్రాచార్యుడు* 🌈


దేవేంద్రుడు బృహస్పతితో మంతనాలు జరిపాడు. కావ్యుడు జయంతితో శృంగార భోగాలు అనుభవిస్తూ కాలం గడుపుతున్నాడు. పదేళ్ళ సమయం ఉంది. ఈలోగా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఆలోచించి మంచి ఉపాయం చెప్పమని అడిగాడు. మాయా విద్యతో దానవులను ప్రలోభపెట్టి దేవకార్యం నిర్వర్తించమన్నాడు. బృహస్పతి సరే అన్నాడు. శుక్రాచార్యుడుగా రూపం ధరించి రాక్షసులను సమీపించాడు. గురువుగారు వచ్చారని దైత్యులు సంబరపడ్డారు.


పాదాభివందనాలు చేశారు. వారితో -


*దైత్యులారా!* స్వాగతం. మీ క్షేమం కోరి వెయ్యేళ్ళు కఠిన నియమాలతో తీవ్ర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాను. దివ్యవరాలు పొందాను.


ఈ మాటలు వినగానే దైత్యులు ఆనందంతో చిందులు తొక్కారు. కరతాళధ్వనులతో కోలాహలం చేశారు. బాధలన్నీ అప్పుడే తీరిపోయినట్టు పొంగిపోయారు. పదే పదే సాష్టాంగ పడ్డారు.


*(అధ్యాయం - 12 శ్లోకాలు - 59)* 


జనమేజయుడికి మనస్సు కుతకుతలాడింది. ఈ మోసాలు ఏమిటి? దేవతలు కూడా ఇంతేనా అనుకున్నాడు. వ్యాసుణ్ణి ఆడిగాడు.


*వ్యాసమహర్షీ !* శుక్రాచార్యుడి రూపంలో ఉన్న బృహస్పతి అటు పైని ఏమి చేశాడు? తెలుసుకోవాలని కుతూహలంగానే ఉంది. కానీ సాక్షాత్తు దేవతల గురువు, అంగిరసుడి తనయుడు, సకలధర్మశాప్రవేత్త- బృహస్పతి ఇలా నయవంచనకు దిగడమేమిటి ? దేవేంద్రుడు సరే, దేవగురువు ఇలా చెయ్యవచ్చువా? పదిమందికి చెప్పాల్సినవాడు తానే పాడిదప్పితే ఎలాగ? సర్వధర్మాలకూ మూలకారణం సత్యమనికదా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పరమాత్మ సాక్షాత్కారానికి కూడా సత్యమే సాధకమని చెబుతున్నారు మునీశ్వరులు. అన్నీ తెలిసిన బృహస్పతి అసత్యానికి పాల్పడితే ఇక ఈ సృష్టిలో సత్యం పలికే సంసారి ఉంటాడా?


స్వార్థం కోం కుక్షింభరులై తపస్వులు కూడా అసత్యాలు పలకడమేనా? శిష్టులే లేకపోతే ఇక వేదప్రామాణ్యం ఏమైపోవాలి? ఇవేవీ అనిపించలేదా బృహస్పతికి? దేవతలు సాత్వికులనీ, మానవులు రాజసులనీ, తిర్యక్కులు (పశుపక్ష్యాదులు) తామసాలనీ మునులు విభజించారుకదా ! అటువంటిది దేవగురువు ఎంత సాత్త్వికంగా ఉండాలి. స్వయంగా మిథ్యా వాది అయితే ఇక రాజసతామసులలో సత్యవాది ఎవడుంటాడు? ఎక్కడుంటాడు? మహర్షి! అసలు ధర్మస్థితి ఏమిటి? నాకు ఇదొక పెద్ద సందేహం పట్టుకుంది. 


జగత్రయమూ మిథ్యా భిభూతమే అయితే ప్రాణికోటికి గతి ఏమిటి? విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడూ - ఇంకా సురనాయకులూ అందరూ ఎదుటివారిని మోసగించడంలో నేర్పరులే. కామక్రోధాలకూ లోభమోహాలకూ లొంగిపోయినవారే. తపోధనులైన మునులు వసిష్ఠ వామదేవ విశ్వామిత్ర బృహస్పతులే పాపాలకు పాల్పడ్డారంటే ఏమి చెప్పాలి? ధర్మానికి గతి ఏమిటి? ఇంద్రుడూ అగ్నీ చంద్రుడూ కడకు బ్రహ్మదేవుడూ పరకాంతావ్యామోహితులయ్యారు. అసలు, ఆర్యత్వం అనేది ఈ భువనత్రయంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఉంది అంటావా? ఎవరిమాటను ఉపదేశంగా స్వీకరించాలి? ఎవరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ? దేవతలూ మునులూ అందరికందరే అయితే ఇక చేసేది ఏమిటి?


జనమేజయుడి ఆవేదనను వ్యాసమహర్షి అర్థం చేసుకున్నాడు. అతడి ప్రశ్నలకు అర్థం లేకపోలేదు. ఆధారాలు ఉన్నాయి. అందుకే ఓపికగా సమాధానం చెప్పాడు.


*(రేపు....  "అరిషడ్వర్గాలకు అతీతులు లేరు"  )*


♾••••┉┅━••••❀🕉️❀••••┉┅━••••♾


*యద్యచ్చరితం శ్రీదేవ్యాః తత్సర్వం లోకహేతవే!*

*నిర్వ్యాజయా కరుణయా పుత్రే మాతుర్యథా తథా!!*


*భావము:* 💐


ఏ విధంగానైతే తల్లి తన కుమారులపట్ల అపారకరుణాదృష్టిని, ఏవిధమైన స్వార్ధము లేకుండా వారి క్షేమం కోసం ప్రసరింపజేస్తుందో... ఆ విధంగా జగన్మాత శ్రీదేవి యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అదంతయూ లోకహితము కొరకై వ్యాసాదులచే రచింపబడినది. మన తల్లి చూపులతో కరుణ అనుగ్రహిస్తే... జగన్మాత అక్షరవాఙ్మయమనే కరుణతో మనలను అనుగ్రహిస్తున్నది.  

🙏🌹🌹🌹🌹🌻🌻🌹🌹🌹🌹🙏



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat