*అయ్యప్ప కొలిచిన వినాయకుడు*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
పాశిక్కుళం వినాయకుని ఆలయం తమిళనాట సుప్రసిద్ధమైన దగును. నాగపట్టణం జిల్లా తరంగంపాడి పట్టణమునకు సమీపాన ఎడుత్తుక్కాట్టి శాత్తనూర్ అను గ్రామాన ఈ విఘ్నేశ్వరుని ఆలయం నెలకొనియున్నది. ఇచ్చట వెలసియున్న వినాయకుని తమ్ముడగు శాస్తా కొలిచి , ఆరాధించి అనేక వరములను పొందినట్లు అచ్చటి స్థల పురాణములో చెప్పబడియున్నది. కలిలో మానవులకు ధర్మాన్ని శాసించి , నేర్పించి , ఆచరింపచేయుటకు జగన్మోహన సుందరశాస్తా హరిహరసుతుడై ఆవిర్భవించినారు. తనకిచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తించుటకు కావలసిన శక్తి సామర్థ్యాలను పొందుటకును యత్న కార్య ఆటంక నివృత్తి కోరి శ్రీ శాస్తావారు పాశిక్కుళం వినాయకుని దలచి తపమొనర్చినారట. అనుజుని ధర్మబద్ధమైన కోరిక నిండిన తపమునకు సంతసించిన విఘ్నరాజు సోదర వాత్సల్యము మీర వన్ని వృక్షస్వరూపిగా శాస్తా ముంగిట *"తమ్ముడా ! నీ తపస్సుకు మెచ్చితిని. వరమేమి కావలయునో కోరుకొమ్ము"* అనెను. అందులకు శాస్తా *“అన్నా విఘ్ననివారకా ! నేను పెద్దల ఆజ్ఞానుసారం నిర్వర్తించు పనులలోని ఆటంకములను తొలగించి సర్వత్ర విజయం సమకూరునట్లు అనుగ్రహించవలెను. అలాగే భూలోకమున దారి తప్పిన వారు , అక్కరకే రానివారనేకులుగా దలచి సన్మార్గ మన్వేషింతురు. అట్టివారల జీవితాలను చక్కదిద్ది వారి పరివర్తనలో మార్పు కలిగించి , వారందరిని లోకులు స్వామిగా భావించి మర్యాదలందుకొనేలా చేయగలను. దీక్షానంతరం నిత్యజీవితంలో వారికి కలిగే ఆటంకాలను తొలగించకపోతే వారు మరల యథా విధిగా దురభ్యాసాల పాలపడిపోయే ప్రమాదం వాటిల్లును. కావున నా భక్తులు నన్ను కొలిచినపుడు వారి చంచలములను , సంకటము లను తొలగించే శక్తిని ప్రసాదించవలెను." అని వేడుకొని అందులకొరకై మానవులు చేయవలసిన తపమును శబరిమలై యోగపట్టము దాల్చి తాను చేస్తాననియు మాటిచ్చినారట. ఆ మేరకే నేటికిని శబరినాథుడైన శ్రీ ధర్మశాస్తావారు యోగాసన పద్ధతిలో అమరి చిన్ముద దాల్చి తపమొనర్చుచున్నారనియు అందురు.)* ధర్మబద్ధమైన శ్రీధర్మశాస్తావారి కోర్కెను మన్నించిన వినాయకుడు *"తమ్ముడా ! మణికంఠ ! నీ ఆవిర్భావ సమయమునందే హరిహరులు నీకు విఘ్ననివారక శక్తిని ప్రసాదించియున్నారన్న సంగతి నీకు తెలుసు. ఆ సంగతి నాకు తెలుసు. ఐనా మర్యాద నిమిత్తం నీవు నా గురించి తపముచేసి నా వద్ద అందులకు అనుమతి కోరడం నీ సౌశీల్యానికి , వినయానికి చక్కటి తార్కాణం. పైగా అందులకొరకు భక్తులు " ఆచరించవలసిన తపమునకు నీవు ఆచరించుటయనునది నీ త్యాగ శీలానికి నిదర్శనము. అటులనే కానీ ! నీ భక్తులకు విఘ్నములన్నియు 'స్వామియే శరణం అయ్యప్ప' అను ఒక్క పిలుపుతో పటాపంచలై పోవునుగాక. ఆటంకములన్నియు తొలగిన భక్తులు ప్రశాంత చిత్తులై మండల దీక్షను తు.చ. తప్పక ఆచరించి శబరిగిరిపై నిన్ను దర్శించి తరింతురుగాక. వారి రాకకు సాక్షి గణపతిగా నేను పంబాతీరాన అమరి అనుగ్రహించెదను."* అని వరములిచ్చినారట. ఈ స్థలమునకు గల వన్ని వృక్షమును ముమ్మార్లు ప్రదక్షిణ చేసి దీపం వెలిగించి , అచ్చట వెలసిన వినాయకుని దర్శించి గరికతో అర్చించి ఆరాధించువారి అభీష్టములన్నియు నెరవేరును. మనోమాలిన్యము తొలగును. మనస్సున మరల పాశి పట్టకుండ కాపాడుట వలననే వీరిని పాశి కళ వినాయకుడనిపిలిచెదరు. వీరి సందర్శనము వలన మనస్సున మంచి తలంపులు ప్రసరించును. తలచిన పనులు జరుగును. అంతటి మహిమ గలవాడు పాశిక్కుళం వినాయకుడు" అని ఆ గ్రామ నివాసి యొకరు తెలిపిరి. మనము గూడ వినాయక చవితినాడు శ్రీధర్మశాస్తావారిని అనుగ్రహించిన పాశిక్కుళం వినాయకుని దలచి మ్రొక్కి విఘ్నములన్నియు తొలగి తరింతుముగాక.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*