విఘ్నేశ్వర దండకము –
శ్రీపార్వతీపుత్ర లోకత్రయస్తోత్ర సత్పుణ్యచారిత్ర భద్రేభవక్త్రా మహాకాయ కాత్యాయనీనాథసంజాత స్వామీ శివా సిద్ధివిఘ్నేశ నీ పాదపద్మంబులన్ నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందుఖండంబు నీ నాల్గుహస్తంబులున్ నీ కరాళంబు నీ పెద్దవక్త్రంబు దంతంబు నీ పాదహస్తంబు లంబోదరంబున్ సదా మూషకాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్నతొండంబు నీ గుజ్జురూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీగంధమున్ కుంకుమంబక్షతల్ జాజులన్ చంపకంబుల్ తగన్ మల్లెలున్ మొల్లలున్ మంచి చేమంతులున్ తెల్లగన్నేరులున్ మంకెనల్ పొన్నలన్ పువ్వులున్ మంచి దూర్వంబులన్ దెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్ మరిన్మంచివౌ నిక్షుఖండంబులున్ రేగుపండ్లప్పడంబుల్ వడల్ నేయిబూరెల్ మరిన్ గోధుమప్పంబులున్ పునుగులున్ బూరెలున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయున్ జున్ను బాలాజ్యమున్ నానుబియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్ బంగరు బళ్ళెమందుంచి నైవేద్యమున్ బంచ నీరాజనంబున్ నమస్కారముల్ జేసి విఘ్నేశ్వరా నిన్ను పూజింపకే యన్యదైవంబులన్ ప్రార్థనల్ సేయుటల్ కాంచనంబొల్లకే యిన్ముదా
గోరుచందంబు గాదే మహాదేవ యో భక్తమందార యో సుందరాకార యో భాగ్యగంభీర యో దేవచూడామణీ లోకరక్షామణీ బంధుచింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత, నీ దాసదాసానుదాసుండ శ్రీదొంతరాజాన్వయుండ రామాభిధానుండ నన్నిపుడు చేపట్టి సుశ్రేయునిన్ జేసి శ్రీమంతుగా జూచి హృత్పద్మ సింహాసనారూఢతన్నిల్పి కాపాడుటే గాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగుబంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ పుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ గల్గగా చేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా యివే వందనంబుల్ గణేశా నమస్తే నమస్తే నమస్తే నమః ||
విఘ్నేశ్వరుని మంగళహారతులు –
శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు- వాసిగల దేవతావంద్యునకును |
ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి – భూసురోత్తమ లోకపూజ్యునకును ||
| జయ మంగళం నిత్య శుభ మంగళం |
నేరేడు మారేడు నెలవంక మామిడి – దూర్వార చెంగల్వ ఉత్తరేణు |
వేరువేరుగ దెచ్చి వేడ్కతో పూజింతు – పర్వమున దేవగణపతికి నిపుడు || జయ ||
సుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు – పొసగ సజ్జనులచే పూజకొల్తు |
శశిజూడరాదన్న జేకొంటి నొక వ్రతము – పర్వమున దేవగణపతికి నిపుడు || జయ ||
పానకము వడపప్పు పనస మామిడిపండ్లు – దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు |
తేనెతో మాగిన తియ్య మామిడిపండ్లు – మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు || జయ ||
ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య – ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు |
కమ్మని నెయ్యియు కడుముద్దపప్పును – బొజ్జవిరుగగ దినుచు పొరలుకొనుచు || జయ ||
వెండిపళ్ళెరములో వెయివేల ముత్యాలు – కొండలుగ నీలములు కలియబోసి |
మెండుగను హారములు మెడనిండ వేసికొని – దండిగా నీకిత్తు ధవళారతి || జయ ||
పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు – గంధాల నినుగొల్తు కస్తూరినీ |
ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తంబున – పర్వమున దేవగణపతికి నిపుడు || జయ ||
ఏకదంతంబును ఎల్లగజవదనంబు – బాగయిన తొండంబు వలపు కడుపు |
జోకయున మూషికము సొరిదినెక్కాడుచును – భవ్యుడగు దేవగణపతికి నిపుడు || జయ ||
మంగళము మంగళము మార్తాండతేజునకు – మంగళము సర్వజనవందితునకు |
మంగళము ముల్లోక మహితసంచారునకు – మంగళము దేవగణపతికి నిపుడు || జయ ||
సిద్ధివిఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు – ఒనరంగ నిరువదియొక్క పత్రి |
దానిమ్మ మరువము దర్భ విష్ణుక్రాంత – యుమ్మెత్త దూర్వార యుత్తరేణి |
కలువలు మారేడు గన్నేరు జిల్లేడు – దేవకాంచన రేగు దేవదారు |
జాజి బలురక్కసి జమ్మిదాచెనపువ్వు – గరిక మాచిపత్రి మంచిమొలక || జయ ||
అగరు గంధాక్షతల్ ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును |
భాద్రపద శుద్ధచవితిని పగటివేళ కుడుములు నానుబాలు ఉండ్రాళ్ళు పప్పు
పాయసము జున్ను దేనెను పంక్తిమీర కోరిపూజింతు నిన్నెపుడు కోర్కెలలర || జయ ||
బంగారుచెంబుతో గంగోదకముదెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి |
మల్లెపువ్వులు దెచ్చి మురహరుని పూజింతు రంగైన నా ప్రాణాలింగమునకు || జయ ||
పట్టుచీరలు మంచి పాడిపంటలుగల్గి గట్టిగా కనకములు కరులు హరులు
ఇష్టసంపదలిచ్చి యేలినస్వామికి పట్టభద్రుని దేవ గణపతికి నిపుడు || జయ ||
ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి
నిక్కముగ మనమును నీయందె నే నిల్పి ఎక్కువగు పూజలాలింపజేతు || జయ ||
మల్లెలా మొల్లలా మంచిసంపెంగలా చల్లనైనా గంధసారములను
ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నే జేతు కోరి విఘ్నేశ || జయ ||
దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును
దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడగు దేవగణపతికి నిపుడు || జయ ||
చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను
పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనెపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ||జయ ||
మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు
నేరేడు నెలవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోను || జయ ||
ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలుమీ కరుణతోను
మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందుము కోర్కెదీర || జయ ||
| జయ మంగళం నిత్య శుభ మంగళం |