_*అయ్యప్ప సర్వస్వం - 71*_యుగాతీతుడు అయ్యప్ప - 5*

P Madhav Kumar



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*యుగాతీతుడు అయ్యప్ప - 5*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


వేద పురాణము నందలి (స్కాంధము - శంకర సంహిత) సత్యపూర్ణుడను మహర్షి యొక్క నేత్రముల నుండి పూర్ణా , పుష్కళా యను ఇరువురు కన్యలు ఆవిర్భవించినారనియు వారు కళ్యాణమను నోము నోచి శ్రీశాస్తా వారిని వివాహమాడినారనియు చెప్పబడి యున్నది. మరికొన్ని స్థల మహత్యములలో కంచిని ఏలుచుండిన శివబాలుడనుబడు వీరసేనుడు ధర్మపాలనము చేయుచుండగా అచ్చటికి మల్లకాసురుడు మరియు కొందరు రాక్షసులు శివబాలుని హింసించగా శాస్తావారు సాయపడి రాక్షసులను హతమార్చి శివబాలుని రక్షించినారనియు ఆ శివబాలుని పుత్రియగు పూర్ణాదేవిని శాస్తా వారు వివాహమాడినారనియు

చెప్పబడియున్నది. 


శిల్పరత్నము అను గ్రంథములో శ్రీశాస్తావారు సరస్వతి దేవి అంశముతో ఆవిర్భవించిన 'ప్రభా' అను కన్యను గూడ వివాహమాడినట్లు , వారికి సత్యకన్ అను ప్రియపుత్రుడు కూడా యున్నట్లు తెలుపబడియున్నది. దీనికి నిదర్శనము వలె నేటికిను  శబరిమలలో శ్రీస్వామివారి పవళింపు సేవాగానముగా పాడబడే హరిహరాసనం పాటలో ప్రణయ సత్యకా స్వామి ప్రాణనాయకం అను పదములు సూచనీయమగును. దీని మూలాన హరిహరసుతునిలో బ్రహ్మ అంశము గూడా నిండియున్నట్టు  గోచరించుచున్నది.


తమిళనాడులో పలు గ్రామములందు శాస్తా ఆరాధన ప్రబలమై యున్నది. తమిళనాడంతయూ వీరికి సుమారు 700లకు పైగా దేవాలయము లున్నట్టుగాను , వీరు గ్రామరక్షక దేవుడై కొలువుండి దుష్టగ్రహ బాధానివారణమూర్తిగా తమిళులచే ఆరాధింపబడు చున్నారు. తదుపరి దేశకాల ఆచారఅనుష్ఠాన ప్రకారం పలు ప్రఖ్యాతి గాంచిన దేవతామూర్తుల ఆరాధనలు అలవాటులోనికి వచ్చినను ఈ శాస్తా ఆరాధన మాత్రము క్రమము తప్పక జరుపబడుచునేయున్నది. ఈ దైవము గూడా ఊరికి తగ్గట్టు శాస్తా , అయ్యనార్ , చాత్తన్ , కరుప్పస్వామి , శంగిలి కరుప్పణ్ , మన్నారస్వామి , మధురై వీరన్ , వేటైక్కి ఒరుమగన్ , భూతనాథన్ , అయ్యప్పన్ అను పలునామము లతో పిలువబడి తనను ఆరాధించే వారికి రక్షణ కల్పిస్తున్నారనుటకు అచ్చటివారికి కలిగే అనుభూతులే తార్కాణము.


తదుపరి శ్రీ మణికంఠ స్వామివారి అవతారమునకు పిమ్మట శ్రీ శాస్తావారి మహిమలు లోకములో ప్రబలమైనది. నేడు పామర పండితులే కాక పాశ్యాత్య విజ్ఞులు సైతం ఇందులోని ఆరోగ్యసూత్రము యొక్క స్థూల , సూక్ష్మ , పరమార్ధము లెరింగి అయ్యప్ప భక్తులగుచున్నారనిన మిన్నగాదు. ఇందులకు నిదర్శనగా సమీపకాలములో తమిళనాడు , ఆంధ్రరాష్టములలో పలుచోట్ల క్రమబద్దముగా కట్టించి ప్రతిష్టింపబడిన శ్రీ ధర్మశాస్తావారి ఆలయములు , విగ్రహములే సాక్షి. ఈ మహిమలన్నియు శ్రీ మణికంఠ శాస్తావారు నేటికాల ప్రజలలో తన ఎనలేని ప్రతిభను చాటి చూపినందు వలననే గదా వారిలో ఇంతటి చైతన్యము ఏర్పడియున్నదని అన్పించుచున్నది.


క్రీ.శ. 1776-1835లో జీవించిన సంగీత త్రిమూర్తులగు త్యాగ బ్రహ్మం , ముత్తు స్వామి దీక్షితులు , శ్యామాశాస్త్రి గార్లలో (మువ్వురు సమకాలికులు యొకరగు శ్రీ ముత్తు స్వామి దీక్షితులవారు తమ సాహిత్యములో శ్రీ శాస్తావారిని హరిహర పుత్రులనియు , వీరు శౌరిగిరి (శబరిగిరి) వాసులనియు , ఫాల్గుణ మాసం పౌర్ణమితిథిలో ఆవిర్భవించిన వారనియు , దక్షుని శిక్షించిన వీరభద్రులు గూడ వీరేననియు , వర్ణించియున్నారు. పాశ్చాత్యులు గూడా శ్రీశాస్తావారిని ఆరాధించినట్లు ఆధారములు గలవు. గ్రీకు దేశస్థుల పురాణరీత్యా దివ్య పురుషుడగు ఏసుక్రీస్తు జన్మించుటకు పలువందల సంవత్సరముల ముందు పాండ్యుడనబడు రాజు గ్రీకుదేశమున రాజ్యాంగము స్థాపించినాడనియు అతని వంశములో వచ్చిన ఏరిశాత్తన్ అనబడు రాజు గ్రీకు రాజ్యశాసనమును ఏర్పరచి నారనియు చెప్పబడియున్నది.


ఈజిప్టు దేశపు పురాణానుసారము (దశద్వీపము) 'మేనస్ ' (మను) అను రాజు తొలుత ఒక రాజ్యాంగాన్ని స్థాపించినాడనియు తదుపరి ఉతీయన్ - శేరన్ (DJV-SEV), ఉదియన్ శరన్ తిథి (DJU-SEV-TERI), విరిశడయన్ (REV-JEVF), ఎశబిరన్ (SMEFRU), ఉదయన్ కారి ఈశన్ (DJEORARI-ISON),


నన్ శరన్ (NYUSUR), మున్నగు రాజులు క్రీ.పూ. 4000 సం.లకు పూర్వము నుండి రాజ్యపాలనము చేసినారని తెలియవస్తున్నది. కారి యనుబడునది శ్రీ శాస్తావారి నామమగును. శరవంశీయుల కులదైవము శ్రీశాస్తాయగును పైగా U-SER - KARE ఆశిరియకారి I - PUT (ఆర్య పుత్రన్ - ఐయ్యప్పన్), MEREN RE (మారన్ కారి), NETJERI-KARE (నీది శేరకారి), NITEEKETTY (నిత్య కీర్తి) మున్నగు పలు నామములు చేరదేశపు నామములు గానే కన్పించుచున్నది. కావున ఈజిప్టు దేశమున అనాది నుండియే కారి అనబడు శాస్తావారి ఆరాధన యుండి యున్నట్లు తెలియవస్తున్నది.


ఈజిప్టు దేశమున క్రీ.పూ. 1085 లోహిక పరన్ (ఇక్షాకు) వంశమున వచ్చిన హరిహరన్ (దీబెస్ కోవిల) గురువర్యులు ఈజిప్టు దేశమును పాలించినాడని ఈజిప్టు దేశపు చరిత్ర వెల్లడి చేయుచున్నది.


టర్కీ దేశమున చాతన్ అధియమాన్ అను రాజు యుండినట్లుగాను , అతడు 6000 సంవత్సరముల మునుపు నివసించి వెడలిన కొండలలోని గుహలు నేటికిను అదియమాన్ పేరిటనే పిలువబడుచున్నది. బర్మా దేశమునకు తూర్పుదిశలో నున్న కంబోడియా అను దేశమున కౌండిల్యుడు అనబడు బ్రాహ్మణుడు యొక నాగకన్యకను వివాహమాడి ఒక సామ్రాజ్యమును సృష్టించెను. మీకాంగ్ లేక మా కాంగై యనబడు నదీ తీరమున నాగూర్ లేక అంగోరు వాట్ అను రాజధానిని ఏర్పరచి పాలించినాడనియు , తదుపరి ఆ రాజ్యము పలు హైందవ రాజులు పాలించినారనియు ఆ దేశపు చరిత్ర వివరించు చున్నది. జయవర్ముడు మున్నగు రాజులు వారిలో సూచించతగిన వారగును. అంగోరు వాట్ ఆలయములలో ప్రస్తుతము శబరిమలపై అయ్యప్ప స్వామి వారు అమరియున్న భంగిమలోని పలు విగ్రహములు నేటికిని అచ్చట ఆరాధనలో యున్నవి.


కాలిఫోర్నియాలో (అమెరికా) యొక పర్వతము శాస్తా మౌంట్ అను పేరిట పిలువబడుచున్నది. తమిళనాడులోని పాండ్య , చేర , చోళ , రాజులు సముద్రము దాటి పలు దేశములను చేపట్టి పాలించినారనియు అట్టివారు పాలించిన ఆయా దేశములలో శాస్తా ఆరాధనను గూడా ప్రచారములో పెట్టినారనియు పై చెప్పబడిన వివరణముల నుండి తెలియ వస్తున్నది. ఈ ప్రఖ్యాతులన్నియు శ్రీ మణికంఠ శాస్తావారి భూలోక అవతారమున కల తార్కాణములై వెలువడుచున్నది. అట్టి మణికంఠ శాస్తావారి చరిత్ర భారత దేశము లోను , కేరళలోను క్రింది విధముగ చెప్పుకొనబడుచున్నది.


పలువేల సంవత్సరములకు ముందు 'మణికూటాద్రి' వాసియగు శాస్తా వారిని 'చెంగో' అను పాండ్యరాజు ఆరాధించెను. అతనికి తదుపరి దక్షిణమధురాపురిలో తలై సంఘం అనబడు ఆధ్యాత్మిక సంఘమొకటి సాక్షాత్ శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిచే మొదలిడబడినది. తదుపరి దానిని పలువురు పాండ్యరాజులు విస్తీకరించిరి.


తదుపరి కాలవైపరీత్యమున దక్షిణ మధురాపురి సముద్రములో మునిగిపోయినది. పిదప కపాడ పురమున ఇడై సంఘం ఏర్పడినది. అందులకు పిమ్మటే ప్రస్తుతమున్న మధురలో కడై సంఘం , ఏర్పడి పలువురు పాండ్యరాజులు దానిని విస్తరించి ప్రచారములో పెట్టిరి. పిదప అఖండ చోళ సామ్రాజ్యము ఏర్పడగా పాండ్యులు చేర దేశమునకు , శ్రీలంకకు వెడలి జీవనము సాగించిరి.


*(సశేషం)*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat