🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*ఆర్యన్ కావు అయ్యప్ప స్వామి ఆలయం - 3*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*పళింజన్ ప్రభువా ! ఏమిటీ అకృత్యం ? ఏ దేవత ఆశించింది ఈ బలిని. మహాఘోరం చేయబోతున్నారు. మహారాజా ! జీవితాన్ని శాశ్వతం చేసుకోవాలన్న అత్యాశతో మరో నిస్సహాయురాలి జీవితాన్ని అంతం చేయడం అధర్మమని నీకనిపించలేదా ! ప్రజారంజకునిగా పేరు గాంచిన మీరు నేడు ప్రజాకంటకుడిగా మారతారా ! ఈమె నీ ప్రజలలో ఒక్కటికాదా ! అసలింతవరకు ఏ జీవి కూడా జరామరణ వర్జితుడు కాలేడు. కానీ మంచితనం తోను మమతానురాగాలతోను యశోసంపదను పొంది చిరంజీవులైన వారు యెందరో వున్నారు. వారిలో మీరు ఒకరిగా కలకాలం నిలవండి. కీర్తి శాశ్వతం కానీ మనిషి శాశ్వతంకాదుకదా ! బలిని ఆపండి. ఆ కాళికామాత మిమ్ము బలి ఇవ్వమని కోరిందా ! ఎంతటి అన్యాయం చేయబోయారు మహారాజా ! ఆ తల్లిని చూడండి. ఆమె ముఖం ఎంత మలినంగా వుందో మీ అకృత్యాన్ని చూచి. రాజా ! అమ్మను ఆరాధించండి. అనుగ్రహం పొందండి. అంతేగాని ఏ తల్లీ తనబిడ్డలను బలి ఇవ్వమని కోరదు మహారాజా!"* అంటున్న ఆ మహాపురుషుని మాటలు మంత్రాక్షరాల్లా మహారాజు చెవుల సోకాయి. ఆ మాటల మహిమ ఏమోకాని ఎత్తిన కత్తి అలానే నిలచిపోయింది. పళింజన్ మహారాజు చేతిలోని కత్తిని ప్రక్కన పడవేసి ఆ మహాపురుషుని ముందు మోకరిల్లాడు.
మహాపురుషా ! మీరెవరోకానీ ! నా కనులు తెరిపించారు. స్త్రీ హత్యపాతకం నుండి నన్ను రక్షించారు. మీకేమిచ్చి ఈ ఋణం తీర్చుకోగలను స్వామీ ! *ఆశలు అంతరించిన ఆ శివబాల కనులు తెరచింది. ఎదురుగా నిలచివున్న ఆ కాంతి పుంజాన్ని కనులారా చూచింది. హరిహర స్వరూపంగా కన్పిస్తున్న ఆ మహాపురుషునకు పాదాభివందనం చేసింది.*
*అమ్మా ! నీకు శుభం కలుగు గాక ! శీఘ్రమేవ కళ్యాణప్రాప్తిరస్తు ఈ శాస్తా దీవెన వృధా కాదమ్మా !"* అంటూ దీవించాడు ఆ మహా పురుషుడు. పళింజన్ మహారాజు ఆ దీవెన విని ఒక్కసారిగా వులిక్కి పడ్డాడు. ఈ అవతారపురుషుడు మహాశాస్తానా ! ఏమిటి తన అదృష్టం. మహాశాస్తా వారి మహాదర్శనం తనకు లభించిందా ! ఎన్ని జన్మలు పుణ్యమో కదా ఈ స్వామి దర్శనం. *అవును ఈ అవతార పురుషుడిని తన అల్లుడిగా చేసుకొంటేనో , ఈ ఆలోచన కలిగిందే తడవుగా ఆతని మనసు పులకిరించింది. స్వామీ ! ధర్మశాస్తా ! మీ దర్శనభాగ్యంతో నా జన్మధన్యమయింది. మహాపాతకం నుండి నన్ను తప్పించారు. మా ముద్దుల పట్టి పుష్కళను పరిణయమాడి మా వంశాన్ని పావనం చేయండి. కన్యాదాన మహాఫలం నాకు కలిగించండి. ఏమంటారు స్వామీ !"* అంటూ చేతులు జోడించాడు. స్వామి వారి చిరునవ్వే జవాబుగా గోచరించింది. *"నిజం పలికావు పళింజన్ మహారాజా ! మనిషికి ఆశ వుండవచ్చు కానీ అత్యాశ పనికిరాదు. జాతస్య హి ధృవో మృత్యుః అన్న భగవానుని వాక్యం మరచి జరామరణ వర్జితుడవు కావాలని అత్యాశకులోనయ్యావు. జీవించినంతకాలం చిరకీర్తిని పొందాలని ఆశించడం జీవిత పరమార్థం చిరంజీవిగా వుండాలనుకోవడం దురాశ కాదా ! రాజా ! నీవు చిరంజీవివి కావాలంటే ఆ మహాపురుషుడిని అల్లుడిగా చేసుకో ! నీ జీవితం చరితార్థమవుతుంది. సూర్య చంద్రులున్నంత కాలం నీకీర్తి చిరస్థాయిగా నిలచిపోతుంది"* - అనెను కాళిమాత.
కాళికామాత పలుకులు పళింజన్ రాజు హృదయాన్ని మరింత పరవశింపజేశాయి. అది తమ కులదైవం ఇస్తున్న శాసనంగా భావించాడు. రాజు తలచుకొంటే కళ్యాణవేడుకలకు కొదవనా ! కళ్యాణవేడుకలు ప్రారంభమయ్యాయి. రాజ్యమంతా చాటింపులు
వేయించారు. మంగళతోరణాలు , మంగళ వాయిద్యాలు , మంగళ హారతులు , ఎక్కడ చూచినా కళ్యాణకాంతులే. విషయం తెలిసిన పుష్కళాదేవి హృదయంలో పూర్ణచంద్రోదయమయింది. పుణ్యపురుషుడు మహాశాస్తా తనకు జీవనరేఖగా నిలువ బోతున్నాడన్న తలంపు ఆమె హృదయాన్ని ఆనంద మందిరంగా మార్చింది. ముత్తైదువలు వధూవరులకు మంగళస్నానాలు చేయించారు. పడతులు పెండ్లి కూతురిని అలంకరించారు. స్వామివారు సర్వాలంకార భూషితుడయ్యాడు. కళ్యాణ మంటపం కమనీయంగా అలంకరింపబడింది. మహాశాస్తా మనోహరంగా మంటపంలోనికి ప్రవేశించాడు. వేదమంత్రాల నడుమ వధూవరులచే కళ్యాణ హోమం జరిపించబడింది. పాదపూజలు , కన్యాదానాలు కమనీయంగా జరిపించబడ్డాయి. అందాలు రాశిగా పోసిన అపురూప లావణ్యవతి పుష్కళాదేవి నునుసిగ్గుల మొగ్గలా స్వామి ప్రక్కన కూర్చుంది. ఓరకంట స్వామిని చూసింది. తన జన్మ ధన్యమని భావించింది. ఇది జన్మజన్మల బంధంగా ఆమెతలంచి మహాశాస్తాకు మనసులోనే ప్రేమాంజలి ఘటించింది. ఎన్ని పూజలు ఎన్ని నోములు పుణ్యఫలమో ఈ పుణ్యపురుషుని పత్ని కావడం తన అదృష్టంగా భావించింది. సర్వదేవతలు స్వామి కళ్యాణాన్ని కనులారా చూడడానికి ఆకాశంలో నిలిచారు. యక్షగందర్వకిన్నెర కింపురుషాదులు అక్షతలు చల్ల సమాయత్తమయ్యారు.
*మాంగల్యం తంతునానేన లోక జీవన హేతునా। కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం ॥*
*ఓ దేవీ ! లోక కళ్యాణమును కోరి ఈ పచ్చని మంగళ సూత్రములు నీ కంఠమునందు అలంకరింపజేసి నిన్ను నాదానిగా స్వీకరిస్తున్నాను. మంగళవాద్యాలు మ్రోగుతున్నాయి. ఆకాశం నుండి అమరులు సుమవర్షం కురిపించారు. నేపాళ ప్రజలు ఆనందాక్షతలు చల్లగా శ్రీ మహాశాస్తావారు పుష్కళాదేవి కంఠాన కళ్యాణ సూత్రాన్ని ముడివేశారు. చిరునగవులు చిందులాడ స్వామి ఆమె శిరసున తలంబ్రాలు పోయ వంచిన తలయెత్తని వామాక్షి స్వామి శిరసున సుతారంగా తలంబ్రాలు వదిలింది. పుష్కళాదేవితో పాణిగ్రహణం పూర్తి చేసిన పరమాత్మ శాసనాయుక్త హస్తంతో సర్వలోకాలను పాలిస్తున్నాడు. సురులు , సర్వలోకాలు ఆ కళ్యాణ వరద శాస్తాకు ముకుళిత హస్తాలతో వందన మందారాలు అర్పించారు. స్వామి ప్రక్కన నిలబడి మహాలక్ష్మిలా కనిపిస్తున్న ఆ పుష్కళాదేవికి స్తుతులు సమర్పించారు.
*నేపాళ నృప సంభూతా! శాస్త్రు వామాంగ మాశ్రితా । తనోతు భక్తలోకస్య | పుష్కళా పుష్కళాం శ్రియం ॥*
*రేపు పందళం వలియక్కోవిల్ శాస్తా ఆలయం గురించి తెలుసుకుందాము*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*