Lingashtakam in telugu – లింగాష్టకం

P Madhav Kumar


 బ్రహ్మమురారిసురార్చిత లింగం

నిర్మలభాసితశోభిత లింగమ్ |
జన్మజదుఃఖవినాశక లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౧ ||

అర్థం – ఏ లింగమును బ్రహ్మ, విష్ణు మొదలగు సురులు అర్చించుదురో, ఏ లింగము నిర్మలత్వమను శోభతో కూడి యున్నదో, ఏ లింగము జన్మమునకు ముడిపడియున్న దుఃఖములను నశింపజేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

దేవమునిప్రవరార్చిత లింగం
కామదహం కరుణాకర లింగమ్ |
రావణదర్పవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౨ ||

అర్థం – ఏ లింగమును దేవతలయొక్క ఋషులయొక్క తరతరాలు అర్చించుచున్నాయో, ఏ లింగము కోరికలను కాల్చివేసి కరుణను కలిగియున్నదో, ఏ లింగము రావణాసురుని గర్వము నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

సర్వసుగంధసులేపిత లింగం
బుద్ధివివర్ధనకారణ లింగమ్ |
సిద్ధసురాసురవందిత లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౩ ||

అర్థం – ఏ లింగము అన్నిరకముల సుగంధములచే అద్దబడియున్నదో, ఏ లింగము బుద్ధి వికాసమునకు కారణమై యున్నదో, ఏ లింగము సిద్ధులు, దేవతలు, అసురుల చే వందనము చేయబడుచున్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

కనకమహామణిభూషిత లింగం
ఫణిపతివేష్టితశోభిత లింగమ్ |
దక్షసుయజ్ఞవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౪ ||

అర్థం – ఏ లింగము బంగారము మరియు గొప్ప మణులచే అలంకరింపబడియున్నదో, ఏ లింగము సర్పరాజముచే చుట్టుకొనబడి అలంకరింపబడి యున్నదో, ఏ లింగము దక్ష యజ్ఞమును నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

కుంకుమచందనలేపిత లింగం
పంకజహారసుశోభిత లింగమ్ |
సంచితపాపవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౫ ||

అర్థం – ఏ లింగము కుంకుమ మరియు గంధముతో అద్దబడి యున్నదో, ఏ లింగము తామరపువ్వుల హారముతో అలంకరింపబడియున్నదో, ఏ లింగము సంపాదించబడిన పాపరాశిని నాశనము చేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

దేవగణార్చితసేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకరకోటిప్రభాకర లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౬ ||

అర్థం – ఏ లింగమును దేవగణములచే భావముతో, భక్తితో పూజింపబడుచూ సేవింపబడుచూ ఉన్నదో, ఏ లింగము కోటి సూర్య సమానమైన శోభతో ఉన్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవకారణ లింగమ్ |
అష్టదరిద్రవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౭ ||

అర్థం – ఏ లింగము ఎనిమిది (బిల్వ) దళములను చుట్టూ కలిగియున్నదో, ఏ లింగము సమస్త సృష్టికి కారణమై యున్నదో, ఏ లింగము ఎనిమిది రకాల దరిద్రములను నశింపజేయగలదో , అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

సురగురుసురవరపూజిత లింగం
సురవనపుష్పసదార్చిత లింగమ్ |
పరాత్పరం పరమాత్మక లింగం [** పరమపదం **]
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౮ ||

అర్థం – ఏ లింగము సురులయొక్క గురువు (బృహస్పతి) మరియు ఉత్తమమైన సురులచే పూజింపబడుచున్నదో, ఏ లింగము దేవతల పూదోటయందున్న పువ్వులచే అర్చనచేయబడుచున్నదో, ఏ లింగము ఉత్తమమైనదానికన్నా ఉన్నతమైన పరమాత్మ స్థాయిలో యున్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

అర్థం – లింగాష్టకమను ఈ పుణ్యప్రదమైన ఎనిమిది శ్లోకములను శివుని దగ్గర చదువువారు శివలోకమును పొంది శివానందమును అనుభవించెదరు.

(ఈ అర్థము మండా కృష్ణశ్రీకాంత శర్మకు స్ఫురించి వ్రాయబడినది)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat