శ్రీ మహాశాస్తా చరితము - 29 ప్రభావతి పరిణయము

P Madhav Kumar

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ప్రభావతి పరిణయము*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి  (ABADPS)*


ఇలా 46 దినములు గడిచిపోయినవి. ఆనాడు కిరాతరాజు ప్రభావతితో చాలా ఆవేశముగా
హెచ్చరించెను. *"రెండు దినములు నీకు గడుపు ఈయుచున్నాను. గడవు తీరినంతనే నీకు సమ్మతించిననూ సమ్మతించకపోయిననూ బలవంతముగా నిన్ను వివాహమాడియేనైనా తీరుదును”* అంటూ వెడలిపోయెను. ప్రభావతి కొంచెమైనా చలించక , సదా శాస్తా యొక్క ధ్యానములోనే
మునిగియుండెను. రెండు దినములు గడువు తీరిపోయినది.

సభ ప్రారంభమైనది. కిరాత రాజు సింహాసనమును అధిష్ఠించి బంధింపబడిన వారినందరినీ
హాజరుపరుచవలసినదిగా ఆజ్ఞాపించెను. అతడి ఆజ్ఞానుసారము బంధితులందరూ రాజుముందర
హాజరుపరుచబడిరి. హంసధ్వజ మహారాజు అతడి భార్య , మిగిలినవారు సైతము తాము చేసిన
తప్పిదమునకు పశ్చాత్తాపము పొందుచూ , తమ మొర ఆలకించి మమ్ములను మన్నింపుమని
మనస్ఫూర్తిగా కోరుచుండుటను స్వామి గ్రహించినవాడయ్యెను.

తాను కాశీరాజునకు విధించిన శిక్ష చాలునని భావించిన కరుణాసముద్రుడైన భగవానుడు లీలా వినోదమును ఆపివైచి , తాను ధరించిన కిరాతవేషమును వదలివేసి , తన అసలు స్వరూపముతో
సాక్షాత్కరించెను. కఠినముగా మొరటువానివలె గోచరించిన కిరాత స్వరూపము పోయి , సర్వాలంకార భూషితుడై సౌమ్యమైన మందహాస వదనముతో స్వామి ప్రకాశించుచుండెను. మిగతా వేటగాండ్రు ,
స్వామియొక్క శాస్త్రుగణములుగా సాక్షాత్కరించిరి.

తమ తప్పిదములను మన్నింపుమని , మహారాజు , అతడి భార్య కంటికి మంటికి ఏకధాటిగా
ఏడ్చుచూ స్వామి పాదములబడి మన్నింపుపని ప్రార్థించిరి. తన కారణముగానే కదా ఇంత పొరపాటు జరిగినదని చింతించూ హిరణ్యవర్మ తలదించుకుని భిన్నవదనుడై యుండెను. ఇక ప్రభావతి పరిస్థితి ఎట్లుండెననగా , ఇంతకాలమూ తన్ను వివాహమాడుమని వేధించిన వ్యక్తి. తాను
పరిణయమాడుటకై వేచియున్న వరుడే స్వామియని గ్రహించి , కించిత్తు సిగ్గుతో తలదించుకుని
యుండెను.

తప్పు చేసినవారిని సన్మార్గములో పెట్టుటయే ధ్యేయముగా గల శాస్తా మహారాజును ఉద్దేశించి
ఇట్లు పలికెను. *“నా ప్రియ భక్తుడైన యజ్ఞమిత్రునికి నీవలన , నీ కుమారుని వలన జరిగి అనర్ధము నీకు అవగతమగుటకొరకై నీకు ఈ దుస్థితి వాటిల్లునట్లు చేసితివి. నీ కుమారుడు ఇక ఎన్నటికీ పొరపాట్లు చేయడు. న్యాయమార్గమున నడచును. యుద్ధమున మరణించిన నీ పరివార సైన్యము పునరుజ్జీవితులగుదురు.*

*నా కొరకై వేచియుండు ప్రభావతిని త్వరలోనే వివాహమాడుదును. నా భక్తుడగు సత్యపూర్ణుడు త్వరలో ఇచటికి ఏతెంచును. నీవు పెండ్లి శుభలేఖను అతడి ద్వారా పంపుము. నిర్ణీత ముహూర్త సమయమున ప్రభావతిని నేను సంప్రదాయ సిద్ధముగా వివాహమాడుదును”* అని పలికెను.

ప్రభావతిని చూసి *“రాకుమారీ ! మాయందు నీకు గల భక్తిని పరీక్షింపగోరియే నేను ఈ నాటకమునాడితిని. త్వరలోనే నిన్ను పాణిగ్రహణము చేసుకొందును”* అంటూ వరమిచ్చి
అంతర్థానమయ్యెను.

స్వామియొక్క సత్యవాక్కు ఫలించినది. మహారాజు , అతడి కుమారుడు ప్రజారంజకముగా
పరిపాలించవలెనను సంకల్పము చేసికొని మరణించిన సైనికులు పునరుజ్జీవితులైరి.

స్వామియొక్క ఆశీర్వాద ఆదేశానుసారము సత్యపూర్ణుడు కాశి పట్టణమునకు వచ్చెను. మహారాజు అతడిని సాదరముగా ఆహ్వానించి , అతిథి మర్యాదలు గావించి వివాహ ముహూర్తమును నిశ్చయించి , శుభలేఖను అతడికిచ్చి పంపెను.

అనుకున్న ముహూర్తము రానే వచ్చినది. కాశీ పట్టణమున ఒక్క క్షణము తపమాచరించిననూ ,
అది కోటి యుగములు తపము నాచరించిన పుణ్యము కలుగును కదా ! అటువంటి మహిమాన్విత స్థలమున జరుగు స్వామి యొక్క కల్యాణ మహోత్సవమును తిలకించుటకై దేవతలు , ఋషులు , అసురులు , యక్షులు వంటి వారందరూ గుమిగూడిరి.

గంగానది వంటి పుణ్యనదులు సైతం కదలివచ్చి స్వామికి అభిషేక ఆరాధనలు గావించినవి. ముల్లోకములూ విస్మయము చెందు విధముగా వివాహ మహోత్సవ ఏర్పాట్లు చేయబడినది. ఇరువైపులా ముక్కోటి దేవతలు వెంటరాగా , స్వయంప్రకాశకుడై తేజోవంతముగా ప్రకాశించుచూ ,
శాస్తావరుని వేషధారియై అశ్వమును అధిరోహించి వచ్చుచుండెను.

సరస్వతి అంశతో జన్మించిన ప్రభావతిని , సరస్వతీ దేవి తన కుమార్తెగానే భావించి పెండ్లి కూతురిని చేసి ఆనందించినది.

సదా స్వామియొక్క దివ్యమంగళ స్వరూపమును ఆరాధించు ఋషులు , దేవతలు స్వామిని పెండ్లి
కుమారునిగా అలంకరింపజేసి పెండ్లి పీటలపై కూర్చుండచేసిరి.

పదునాలుగు భువనములందు వసియించు దేవతలు గుమిగూడియుండగా లక్ష్మీనారాయణులు ,
పార్వతీ పరమేశ్వరులు చెరియొకవైపు తరలిరాగా , అందరి యొక్క హర్షధ్వనులు ప్రతిఫలించుచుండు
మయమున హంసధ్వస మహారాజు *"నాయొక్క కులమును ఉద్ధరించుటకై అవతరించిన నా ప్రియ పుత్రికయగు ప్రభావతి ఇకనుండి నీ అర్థాంగి. నీ భార్యగా ఏలుకొనుము”* అంటూ కన్యాదానము చేయగా , మంగళవాద్యములు మ్రోగుచుండగా హరిహరసుతుడైన శాస్తా ప్రభావతి మెడలో మూడు ముడులు వేసి అర్థాంగిని చేసికొనెను. ప్రభావతి అమితమైన ఆనందముతో పరవశించి స్వామికి కైమోడ్చినది. వివాహానంతరము స్వామి ప్రభావతితో శాస్త్రులోకమును చేరి ఆనందముగా పరిపాలించు చుండెను. వారికి *🌹సత్యకుడు🌹* అను కుమారుడు జన్మించెను. అతడు వీరుడు , ధర్మమును నిలబెట్టు ధీరునిగా అవతరించెను.



*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*

*లోకాః సమస్తా సుఖినోభవంతు*



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat