*మదన - వర్ణిణీల పరిణయ ఉత్సవము*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️*అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి (ABADPS)*
ఏ స్వామి యొక్క ఆగమనమునకై దేవతలు , బుషులు సైతము తపము చేయుదురో , అటువంటి
దివ్యమంగళ స్వరూపియైన శాస్తా , తన భక్తురాండ్రైన మదన , వర్ణిణిల తపః ఫలితముగా , అచట
ఉండువారికి కనులవిందుగా సాక్షాత్కరించెను.
*“సింధురాజా ! నన్నే వివాహమాడవలెన్న ధృడ నిశ్చయముతో నున్న నీ కుమార్తెలను చేబట్టుటకై , దేవలోకమును వదలి , రాకుమారునిగా రూపుదాల్చి నాటకమాడితిని. నీ కుమార్తెలతో నా వివాహము జరుగుటకు ముందుగా నీవు నాకొక సహాయము చేయవలయును. నా ప్రియ భక్తుడైన చోళరాజు
మరల తన రాజ్యము చేపట్టుటకు నీ సహాయము కావలెను. నీ సైన్యముతో దండెత్తిపోయి , ఘూర్జర రాజుని ఓడించి , ఈతడు కోల్పోయిన రాజ్యమును మరల ఇతడికి కట్టబెట్టవలసిన బాధ్యత నీదే సుమా”* అని ఆజ్ఞాపించెను.
కృతజ్ఞతాపూర్వకముగా , ఆనంద పరవశులై చూచు చోళదేశపు రాజుని , అతడి భార్యను చూసి
*“శుభకీర్తి సహాయము వలన మీరు కోల్పోయిన రాజ్యమును మరల పొంది , నా ఆశీస్సుల వలన సకల సౌఖ్యములను అనుభవించి , కడకు నా పద సన్నిధిని చేరుదురు గాక”* అని ఆశీర్వదించెను.
భగవంతుని ఆజ్ఞానుసారము చోళదేశపు రాజుని సింహాసనాధీష్టుని గావించిన పిమ్మట , తన కుమార్తెల పరిణయమునకు ఒక శుభ ముహూర్తమును నిర్ణయించెను.
శ్రీ శాస్తా యెక్క వివాహ వృత్తాంతమును విన్న జనులందరూ హర్ష ధ్వానములు చేసిరి. స్వామి యెక్క ఆదేశానుసారము విశ్వకర్మ ఒక అందమైన కళ్యాణ మండపమును నిర్మించెను. అందమైన
సరస్సులు , నదులు , తటాకములు ఇలా సకల వసతులూ కలుగు విధముగా నిర్మించబడినవి. కోరిన
కోరికలు తీర్చు కల్పవృక్షమే కొని రాబడినది.
అనుకున్న శుభముహూర్తము రానే వచ్చినది. శాంతమైన దృక్కులతో స్వామి చిరునగవులు చిందుచూ , ఆశ్వారూఢుడై , లక్షల కొలది పరివార గణములు సేవించుచుండగా , దేవతలు వెంటరాగా ,
త్రిమూర్తులతో కళ్యాణ మండపమును చేరుకొనెను. సూర్యచంద్రులు ప్రభలు చిందుచుండగా , వాయు , వరుణులు చామరము వీచుచుండగా , ఒకవంక వేదఘోషలు ధ్వనించుచుండగా , మరొక వంక దేవ గానములు ఆలపించుచుండగా , దేవ కన్యలు నాట్యము చేయగా , భగవద్దర్శనమునకై
ఎదురుచూచు ఋషిపుంగవులు పూర్ణకుంభముతో స్వాగతము పలికిరి.
బ్రహ్మదేవుడు వైదిక కార్యములు చేయనుపక్రమించెను. మదన - వర్ణిని ఇరువురూ పెండ్లి
కుమార్తెలుగా శోభాయమానముగా అలంకరింపబడిరి. పరంజ్యోతి స్వరూపుడైన స్వామి కూడా కళ్యాణశోభతో పెండ్లి కుమారుడై ప్రకాశించుచుండెను.
ముమ్మూర్తులు , ముగ్గురమ్మలూ ఆశీర్వదించుచుండగా , దేవలోక వాసులూ , భూలోక ప్రజలందరూ
స్వామిని పలువిధముల స్తుతించుచుండగా ,
జయ జయ ధ్వానములు చేయుచుండగా తన భక్తురాండ్రైన మదన , వర్ణిణీలను *భువనేశ్వర మూర్తి అయిన శాస్తా పాణిగ్రహణము చేసుకొనెను.*
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*
*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*
*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*
*లోకాః సమస్తా సుఖినోభవంతు*