శ్రీ సూర్యనారాయణా! వేదపారాయణా! లోకరక్షామణీ! దైవ చూడామణీ! ||
ఆత్మరక్షా నమః పాపశిక్షా నమో విశ్వకర్తా నమో విశ్వభర్తా నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా మహాభూతప్రేతంబులున్ నీవయై బ్రోవుమెల్లప్పుడున్ భాస్కరాఽహస్కరా ||
పద్మినీవల్లభా వల్లకీగానలోలా త్రిమూర్తిస్వరూపా విరూపాక్షనేత్రా మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్య ఓయయ్య దుర్దాంత నిర్ధూత తాపత్రయాభీల దావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార గంభీర సంభావితానేక కామాద్యనీకంబులన్ దాకి యేకాకినై చిక్కి యేదిక్కునున్ గానగా లేక యున్నాడ నీ వాడనో తండ్రీ ||
జేగీయమానా కటాక్షంబునన్ నన్ గృపాదృష్టి వీక్షించి రక్షించు వేగన్ మునీంద్రాదివంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు సారధ్యమన్ గొంటి నాకుంటి యశ్వంబు లేడింటి చక్రంబులున్ దాల్చి త్రోలంగ మార్తాండ రూపుండవై చెండవా రాక్షసాధీశులన్ కాంచి కర్మానుసారాగ్ర దోషంబులన్ ద్రుంచి కీర్తి ప్రతాపంబులన్ మించి నీ దాసులన్ గాంచి యిష్టార్థముల్ కూర్తువో ||
దృష్టివేల్పా మహాపాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబ భారంబుగానీక శూరోత్తమా ఒప్పులన్ తప్పులన్ నేరముల్ మాని పాలింపవే సహస్రాంశుండవైనట్టి నీ కీర్తి కీర్తింపనే నేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్త్వమున్ జూపి నా ఆత్మ భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ బ్రశంసింప నా వంతు ఆశేషభాషాధిపుల్ గానగా లేరు నీ దివ్యరూప ప్రభావంబు కానంగ నేనంత ఎల్లప్పుడున్ స్వల్పజీవుండనౌదున్ మహాకష్టుడన్ నిష్టయున్ లేదు నీ పాదపద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ చేయవే కామితార్థప్రదా ||
శ్రీమహాదైవరాయా పరావస్తులైనట్టి మూడక్షరాలన్ స్వరూపంబు నీ దండకంబిమ్మహిన్ వ్రాయ కీర్తించి విన్నన్ మహాజన్మ జన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్థముల్ కొంగు బంగారు తంగేడు జున్నై ఫలించున్ మహాదేవ దేవా నమస్తే నమస్తే నమస్తే నమః ||