సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ
ఉపనిషత్తులు పరబ్రహ్మాన్ని సత్యం, జ్ఞానం, అనంతం అని వర్ణించాయి. ఆలోచనకు, వాక్కుకు అతీతమైన బ్రహ్మతత్వాన్ని మానవ మేధతో తెలుసుకోవడం చాలా కష్టం. వేద ద్రష్టలు ఒకవైపు తమ అశక్తతను వ్యక్తపరుస్తూనే బ్రహ్మతత్వ వర్ణనకు ప్రయత్నించారు. వేదాలు సైతం అవర్ణనీయమైన ఆ అనంత సాన్నిధ్యాన్ని విపులీకరిస్తూనే, తత్త్వ వర్ణన కడుదుర్లభమని ఘోషించాయి.
జ్ఞానులు ఎప్పుడూ అజ్ఞాతంగానే ఉంటారు. తత్త్వం బోధపడిందనో, తత్త్వాన్ని వర్ణిస్తామనో గొప్పలు చెప్పుకోరు. తాము అనుభూతి చెందుతున్న అద్భుతాన్ని మానవ జాతికి అందించాలన్న తపనే కాని, లేనిపోని సంక్లిష్ట భావజాలాన్ని రుద్దాలని వేద ద్రష్టలు ఎప్పుడూ అనుకోలేదు.
ఈ విశ్వంలోని ప్రతి అణువులోనూ భగవంతుడు ఆవరించి ఉన్నాడు.
“నక్షత్రాల వెనక మెరిసే మహా తేజస్సు”, “హృదయాల్లో స్పందించే దివ్య దీప్తి” – ఆ తత్వం దూరంగా ఉంది! దగ్గరగానూ ఉంది!
లేనిపోని కల్పనలు చేయక, తర్కాన్ని ఉపయోగించమన్నారు ద్రష్టలు. బుద్ధి, హేతువుకు అందకపోయినా వాటిని వాడాలి. విశ్వంలోని సమస్తాన్ని కళ్లతోనే చూడాలి, బుద్దితో ఆలోచించాలి!
విశ్వంలోని వివిధ అంశాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటికి మూలం ఎవరు? ఏ కారణం లేకుండా సృష్టి ఎలా వస్తుంది? ఈ విధంగా పరిశోధన జరిపితే మూలకారణం ఒకటి ఉందని తెలుస్తుంది!
మీకు గజేంద్రమోక్షం కథ తెలిసే ఉంటుంది. విచారగ్రస్తుడై, విధి శాపగ్రస్తుడైన గజేంద్రుడు విలపిస్తూ, బయటపడటానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. మూల కారణం తెలుసుకోవాలని అనుకున్నాడు. అది తెలుసుకోగల శక్తి ఏనుగుకు లేదు. వచ్చిన బాధకు, విశ్వానికి మూల కారణం తెలుసుకోవలసిన అగత్యం ఏమిటి?
అందులోని గజేంద్రుడిని జీవాత్మతో పోల్చితే తత్త్వం విశదపడుతుంది. విధివంచిత అయి, భూమిపై సర్వదుఃఖాలు అనుభవిస్తున్న జీవాత్మ బయటపడటానికి మూలకారణం తెలుసుకుని తీరాలి.
విశ్వానికి మూలకారణం బ్రహ్మతత్వమే.
ఆధ్యాత్మిక గ్రంథాల్లోని తత్వసారం తెలుసుకోవడానికి మనం సంకుచిత మనస్తత్వాన్ని, పరిమితత్వాన్ని వీడాలి. అవి ఉన్నంతకాలం ఆధ్యాత్మిక అనుభవాలు రావు. ఋషుల్నే విమర్శిస్తే, వారు చెప్పే ప్రబోధాలు ఎలా అర్థం అవుతాయి? మనిషి తన మనస్సును విస్తరించుకుంటే, ఋషులు చెప్పే మాటలు కొద్దిగానైనా అర్థమై, కొంచెమైనా ఆచరించగలుగుతాడు.అందుకే విశాల దృక్పధం ఎప్పుడూ అవసరం.
మంత్రాక్షరాలు గొప్పవే. కాని అక్షర పరబ్రహ్మ తత్వాన్ని చూపించలేవు. అందుకే అశక్తతను వ్యక్తంచేస్తూనే వేదద్రష్టలు తమ ప్రయత్నం తాము చేశారు.
మనం కూడా జ్ఞానులమై, నిత్య సత్యశోధన చేస్తేనే తత్త్వం అనుభవంలోకి వస్తుంది. వేదసహితమైన పవిత్ర గ్రంథాల్లోని జ్ఞానాన్ని దీపస్తంభాలుగా చేసుకుంటే చీకటిలో సైతం లక్ష్యాన్ని చేరుకోగలం. సంసార సాగరాన్ని దాటగలం. పరబ్రహ్మంలో ఐక్యమై మోక్షాన్ని సాధించగలం.