Vinayaka chavithi 2024: వినాయక చవితి సందర్భంగా మీరు ఫేమస్ గణపతి ఆలయాలను సందర్శించాలని అనుకుంటున్నారా? అయితే వివిధ ప్రదేశాలలో ఉన్న ఈ ప్రత్యేక ఆలయాలను దర్శించుకోండి. మీ కోరికలు నెరవేరి పుణ్యం లభిస్తుంది.
Vinayaka chavithi : భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. జ్యోతిషశాస్త్రంలో వినాయకుడిని జ్ఞానం, ఆనందం, శ్రేయస్సును ప్రసాదించే దైవంగా కొలుస్తారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలలో ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రజలు వినాయకుడి విగ్రహాలను ఇంటికి తీసుకువస్తారు. మూడు, ఐదు, తొమ్మిది, పదకొండు రోజుల పాటు వినాయకుడికి పూజలు చేసి అనంతరం నిమజ్జనం చేస్తారు.
వీధుల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేసి వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టిస్తారు. నవరాత్రుల పాటు పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. 10వ రోజున ఘనమైన వీడ్కోలు పలుకుతూ నిమజ్జనం చేస్తారు. ఈ వినాయక చవితికి మీరు వినాయకుడి ఆశీస్సులు పొందాలని అనుకుంటున్నాట్లైతే ప్రసిద్ధ వినాయక ఆలయాలను సందర్శించడం మంచిది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ వినాయక ఆలయాలను సందర్శించడానికి వెళ్లవచ్చు.
శ్రీమంత్ దగ్దుషెత్ హల్వాయి గణపతి ఆలయం
శ్రీ మంత్ దగ్దుషెత్ గణపతి ట్రస్ట్ మహారాష్ట్రలోని అతిపెద్ద ట్రస్ట్ లలో ఒకటి. పూణేలో ఈ శ్రీమంత్ దగ్దుషెత్ హల్వాయి గణపతి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం లక్ష మందికి పైగా యాత్రికులు వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తుంటారు. ఆలయ వెబ్ సైట్ ప్రకారం ఈ ప్రదేశానికి ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ప్లేగు మహమ్మారి వచ్చిన సమయంలో తమ కుమారుడని కోల్పోయినప్పుడు శ్రీ దగ్దుషెత్ హల్వాయి, అతని భార్య లక్ష్మి భాయి గణేష్ ఆలయాన్ని స్థాపించారని చెబుతారు. ఆలయంలో 7.5 అడుగుల ఎత్తు 4 అడుగుల వెడల్పుగా గణపతి విగ్రహం ఉంది.
ఆది వినాయక ఆలయం
ఆది వినాయకుడి రూపం ఉన్న ఆలయం ఇది. తన తండ్రి అయిన శివుని చేత తల నరికి వేయడానికి ముందు ఉన్న మానవ తలతో ఉన్న వినాయకుడి విగ్రహం ఇక్కడ ఉంటుంది. ఈ రూపంలో వినాయకుడు గొడ్డలి, తాడు, మోదకం, కమలం కలిగి ఉంటాడు.
సిద్ధి వినాయక ఆలయం
దేశంలోనే ప్రసిద్ధి చెందిన గణేష్ దేవాలయాల్లో శ్రీ సిద్ధి వినాయక గణపతి ఆలయం ఒకటి. వినాయక చవితి పండుగ సందర్భంగా సిద్ధి వినాయక ఆలయాన్ని పూలు, దీపాలతో అందంగా అలంకరిస్తారు. ముంబై నగరంలోని ఈ ప్రసిద్ధ దేవాలయంలోని వినాయకుడిని నవసాచ గణపతి అని పిలుస్తారు. అంటే కోరిన కోరికలు తీర్చే వాడని అర్థం. ఈ దేవాలయం చూసేందుకు కూడా ఎంతో రమణీయంగా ఉంటుంది. అందుకే చాలామంది యాత్రికులు పర్యాటకులను ఆకర్షిస్తుంది.
కాణిపాకం
చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వినాయకుడి ఆలయం చాలా మహిమ కలిగినది. ఈ దేవాలయాన్ని చోళ రాజు కులోత్తుంగ చోళుడు నిర్మించాడు. వెయ్యికి పైగా సంవత్సరాలకు చెందిన పురాతనమైన ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని వినాయక విగ్రహానికి ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలోని విగ్రహం రోజు రోజుకి పరిమాణం పెరుగుతుందని చెబుతారు. ఇక్కడ వినాయకుడు బావిలో ఉంటాడు అయితే ఈ బావిలోని నీరు ఎప్పుడూ ఎండిపోదు. అందుకే కాణిపాకం వినాయక ఆలయం చాలా ప్రత్యేకమైనది.
శ్రీ దొడ్డ గణపతి ఆలయం
బెంగళూరులోని బుల్ టెంపుల్ రోడ్డులోని శ్రీ దొడ్డ గణపతి ఆలయం ఉంది. 16 అడుగుల వెడల్పుతో 18 అడుగుల ఎత్తైన వినాయకుడి విగ్రహం ఈ ఆలయంలో ఉంది. వినాయక చవితి సందర్భంగా ఈ ఆలయాన్ని అందంగా అలంకరిస్తారు.