నవరాత్రులు: శరన్నవరాత్రులు - శ్రీ మహాలక్ష్మీ దేవి Navratri Sri Mahaa Lakshmidevi

P Madhav Kumar



శ్రీ మహాలక్ష్మీ దేవి

లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం

శ్రీ మహాలక్ష్మీదేవి

రంగు:  నిండు గులాబి
పుష్పం:  తెల్లని కలువ
ప్రసాదం:  క్షీరాన్నం, పూర్ణాలు

దసరా నవరాత్రులలో ఆరవ రోజు అమ్మను  శ్రీ మహాలక్ష్మీ దేవిగా అలంకరిస్తారు.

కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి.

డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి.

"యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా" అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. కనుక శరన్నవరాత్రులలో మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి.

మంత్రము:

"ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా" అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.
ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను.
లక్ష్మీ స్తొత్రములు పఠించవలెను. 








🙏శ్రీ దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఆరవ రోజు అమ్మ వారి దివ్య అలంకరణ
శ్రీ మహాలక్ష్మీ దేవి:

అలంకరించే చీర రంగు: ఎరుపు లేదా ఆకు పచ్చ.
నైవేద్యం : పూర్ణం బూరెలు,  క్షిరాన్నం (బెల్లం తో చేసినది)

🌻శ్రీ మహాలక్ష్మీ అవతారం:

లక్ష్మీ దేవి గురించి వివిధ కథలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మీదేవి తోడుగానే ఉందని, ఆమె 'నిత్యానపాయిని' లక్ష్మీనారాయణులు వేరు వేరు కాదని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెప్పారు. సృష్ట్యాదిలో దేవి (మహాశక్తి) సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవీ భాగవతం లో చెప్పారు. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి, భృగువు, ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెండ్లి చేశాడు. కనుక లక్ష్మీదేవిని 'భార్గవి' అని కూడా అంటారు.

తరువాత ఒకసారి దూర్వాసుని శాపకారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదలి పాలసముద్రంలో నివసించింది. అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగా చేసే చిలకడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామదేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాలసముద్రంలో నుండి పుట్టింది కనుక ఆమె 'సముద్రరాజ కుమార్తి' అయ్యింది. ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మీకి సోదరుడయ్యాడు. ధనాధి దేవత అయిన ఈ దేవిని శ్రీమహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు.విష్ణువు శక్తికి, మాయకు కారణం లక్ష్మీదేవి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మీకి మరో అంశ అని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మీగా చెప్పబడింది.ఆమెను అష్ట భుజ మహాలక్ష్మీగా వర్ణించారు. విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్పారు. రామావతారం లో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అలవేలు మంగగా, విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడై ఉంటుంది.

🌻లక్ష్మీదేవికి వివిధ పేర్లు:

చాలా మంది దేవతలులాగే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అష్టోత్తర శతనామ స్తోత్రం , సహస్ర నామ స్తోత్రం వంటివి ఉన్నాయి. ఎక్కుగా లక్ష్మీదేవిని పలికే పేర్లలో కొన్ని లక్ష్మీ, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి, నిత్యానపాయిని, క్షీర సముద్ర రాజ తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర.

🌻లక్ష్మీదేవి రూపధారణ:

ఎక్కువగా లక్ష్మీదేవిని చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భూషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ.

యజుర్వేదం పురుష సూక్తంలో శ్రీ, లక్ష్మీ అనే ఇద్దరు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం, వాజసనేయ సంహితలలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణయుగంలో మత్స్య, విష్ణు, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడింది. లక్ష్మీదేవి ప్రతిమను చిత్రించే విధానాన్ని మత్స్యపురాణంలో ఇలా చెప్పారు. "దేవి ప్రతిమ యౌవనాకృతి కలిగి ఉండాలి. దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమ్మలు కలిగి సర్వాభరణములు ధరించి, ముఖం గుండ్రంగా ఉండి దివ్యాంబరమాలా కంకణధారియై ఉండాలి. ఎడమచేతిలో పద్మం, కుడిచేతిలో బిల్వఫలాలుఉండి, పద్మాసీనయైన దేవి చుట్టుప్రక్కల నల్ల తుమ్మెదలు తిరుగుతున్నట్లుగాను, ఇరువైపుల తొండములయందలి పాత్రలతో అభిషేకించు గజరాజులను, ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రించాలి. అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత శంఖ, చక్ర , గదా, పద్మ, ధారిణి. విష్ణుధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణుసహితయైనప్పుడు ద్విభుజయై పద్మమునుదాల్చి సర్వాభరణభూషితయై ఉండును.

స్వతంత్రమూర్తిగా మలచినపుడు చతుర్భుజయై, ఉన్నత సింహాసనాసీనయై, పద్మము, అమృతపాత్ర, బిల్వఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకింపబడుచున్నట్లు చూపవలెను. శిరస్సుమీద సువికసిత పద్మములుండవలయును. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వఫలములు ప్రపంచమును, పద్మము సంపదను తెలుపును. రెండు గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పారు. వరాహమిహిరుని బృహత్సంహితలో దేవతా ప్రతిమల ఆకృతులు వివరంగా చెప్పబడినవి కాని లక్ష్మీదేవి ఆకృతి గురించి చెప్పలేదు. కారణం తెలియడంలేదు.

🌻అష్ట లక్ష్ములు:

లక్ష్మీ దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మీ. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం.

🌻మంగళ ప్రదాయిని:

ఆదిపరాశక్తి మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మీ అమిత పరాక్రమంతో మహిషుడనే రాక్షసుడిని సునాయాసంగా సంహరించి మహిషాసురమర్దినిగా పూజలందుకుంది. శరన్నవరాత్రుల సందర్భంగా అష్టలక్ష్ముల సమిష్టి రూపమైన దుర్గమ్మను మహాలక్ష్మీగా భక్తులు పూజిస్తారు.

♦️అపరాజితా స్తోత్రం:

యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు విష్ణుమాయ రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు చైతన్యం రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు బుద్ధిరూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు నిద్ర రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు ఆకలి రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు జీవాత్మ రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు శక్తి రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు దాహం రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు ఓర్పు/ సహనం రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు మూలప్రకృతి తత్త్వంగా (సర్వజీవుల పుట్టుకకు కారణం) ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు సిగ్గు రూపంగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు శాంతి రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు శ్రద్ధ (భగవంతుని యందు విశ్వాసము, ధర్మం మరియు శాస్త్రము చెప్పేదే సత్యము అనే భావనను శ్రద్ధ అంటారు) రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు ప్రేమ మరియు సౌందర్యంగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు సద్గుణములు/ అదృష్టము/ ఐశ్వర్యం రూపంలో ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు క్రియాశీలత్వంగా/ చురుకుదనము/ స్వధర్మము రూపంగా వ్యక్తమవుతున్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు జ్ఞాపకశక్తిగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు దయా గుణంగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు సంతృప్తి భావనగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు మాతృస్వరూపంగా ఉన్నదో, ఆ తల్లకి నమస్కారములు.

యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఏ దేవి అయితే సర్వజీవుల యందు (మతి)మరపు/ మోహము/ భ్రమ రూపంలో వ్యక్తమవుతున్నదో, ఆ తల్లకి నమస్కారములు.

ఇంద్రియాణామధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషు యా!
భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దైవ్యై నమో నమః!!

🌻అఖిల లోకాల యందున్న జీవుల ఇంద్రియాలకు అదిష్ఠాన దేవతయై, సర్వజీవులయందు సర్వత్రా వ్యాపించి ఉన్న భగవతికి నమస్కారములు.

చిత్తిరూపేణ యా కృత్స్నమేతద్వ్యాప్య స్థితాం జగత్!
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః!!

🌻ఈ జగత్తంతా వ్యాపించి, చిత్శక్తి (చైతన్యం) రూపంలో అన్నింటియందూ ఉన్నదో, ఆ తల్లికి ముమ్మారు నమస్కారములు

ఆ శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహం భక్తులందరిపై ఉండుగాక!

శ్రీ మాత్రే నమః....🙏🙏



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat