కార్తీక శుద్ధ చతుర్దశి - వైకుంఠ చతుర్దశి’

P Madhav Kumar


కార్తీక శుద్ధ చతుర్దశిని *‘వైకుంఠ చతుర్దశి’* గా పిలుస్తుంటారు. 

సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ రోజున శివుడిని పూజిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.


     ఈ కారణంగా ఈ రోజు అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. 

    కర్తవ్యపాలన విషయంలోనే శివకేశవులు వేరుగా కనిపిస్తూ వుంటారు. 

    నిజానికి వారిద్దరూ ఒకటేనని వేదకాలంలోనే చెప్పబడింది.


    ఈ విషయంలో ఒకానొక కాలంలో వాదోపవాదాలు జరిగినప్పటికీ , ఆ తరువాత కాలంలో శివకేశవులకు భేదం లేదనే విషయాన్ని చాలామంది గ్రహించారు. 

     ఇక ఈ కార్తీకమాసాన్ని మించిన పవిత్రమైన మాసం మరొకటి లేదని సాక్షాత్తు శివకేశవులే సెలవిచ్చారు. 

    ఈ మాసమంతా కూడా ప్రతిరోజూ ఓ ప్రత్యేకతను , విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది.


హరిహరులకు ఇది ఎంతో ప్రీతికరమైన మాసం కనుక ఈ సమయంలో వారి అనుగ్రహాన్ని సంపాదించడం ఎంతో తేలిక. 

    ఈ కారణంగానే ఈ మాసంలో శ్రీమహావిష్ణువును తులసి దళాలతోను … శివుడిని బిల్వదళాలతోను పూజిస్తుంటారు. ఇక లక్ష్మీపార్వతులు కూడా నోములు … వ్రతాలను ఆచరించే ముత్తయిదువులను అనుగ్రహిస్తూ తీరికలేకుండా వుంటారు. 

    అంటే ఇటు లక్ష్మీనారాయణుల ఆశీస్సులు … అటు శివపార్వతుల అనుగ్రహాన్ని అందించే అద్వితీయమైన మాసంగా ఇది చెప్పబడుతోంది.


   ఈ నేపథ్యంలో భక్తుల ముందుకు ఒక వరంగా వచ్చే విశిష్టమైన రోజే

*‘వైకుంఠ చతుర్దశి’.* సమస్త మానవాళిచే పూజలు అందుకుంటూ వుండే విష్ణుమూర్తి , ఈ రోజున శివుడిని పూజిస్తాడంటే ఇది ఎంతటి పవిత్రమైనరోజో అర్థం చేసుకోవచ్చు. 


    ఈ రోజున శ్రీమహావిష్ణువు వైకుంఠం నుంచి నేరుగా కాశీ నగరానికి వెళ్లి అక్కడి విశ్వనాథుడిని అర్చిస్తాడని అంటారు. 

ఇక ఈ రోజున లింగ వ్రతాన్ని ఆచరించి జాగరణ చేసిన వారికి మోక్షం లభిస్తుంది.


శివకేశవులను ఆరాధిస్తూ అనుగ్రహాన్ని పొందే ఈ రోజున ఇత్తడి కుందుల్లో గానీ , రాగి కుందుల్లో గాని దీపాలను వెలిగించి వాటిని దానాలు చేయాలి. 

ఈ విధంగా చేయడం వలన సమస్త దోషాలు సకల పాపాలు తొలగిపోతాయి … ఆశించే శుభాలు ఆనందంగా చేకూరతాయి...

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat