భేతాళ కథలు - 22 - స్వభావం

P Madhav Kumar
1 minute read

స్వభావం

ఒక శూద్రునకు నలుగురు పుత్రులు. అతను చనిపోయేముందు. కొడుకులని పిలిచి-“తూర్పు ఇంటి అడ్డగోడకింద నాలుగువేల వరహాలు దాచాను. నా అనంతరం సమంగా పంచుకోండి." అని చెప్పి కన్నుమూశాడు. వారిలో ఒకడు మిగిలిన వారికి తెలియకుండా ఆ సొమ్ము అపహరించాడు. కొంతకాలానికి సోదరులు ఆ ధనాన్ని పంచుకోవాలని అక్కడ వెదికితే లేదు. దాంతో - నువ్వుతీశావంటే నువ్వుతీశావని కేకలు వేసుకుని రాజసభకు వచ్చి తగవు తీర్చమనిరి. "కొంతకాలమాగిరండి” అని రాజువారిని పంపివేశాడు. కొన్నాళ్లయ్యాక మళ్లీ ఆ నలుగురు అన్నదమ్ములూ రాజసభకు వచ్చారు.

“ఒకరాజు కొక కుమార్తె ఉండేది. ఆమెకు గురువుచే సమస్తవిద్యలూ నేర్పించాడు. ఆమె గురువుగారికి దక్షిణనీయబోయి బంగారుపళ్లెమునందు వస్త్రములు, నగలు మొదలయినివి పెట్టి తీసుకువెళ్లగా - 'నాకివి అక్కరలేదు.' అన్నాడు గురువు. రాకుమార్తె “మరేంకావాలి” అని అడగగా - నీ వివాహం రేపనగా అప్పుడు కోరుతాను. అన్నాడు. ఆమె “అలాగే” అని వెళ్లిపోయింది. రాకుమారికి వివాహదినం వచ్చింది. ముందురోజు గురువుకి సమాచారం పంపగా "శోభనం రాత్రి నీ భర్తతో కలిసే ముందు సకలాభరణభూషితవైరా' అని వర్తమానం పంపాడు. గుణవతి అయిన ఆ రాకుమారి వాగ్దానాన్ని నిలుపుకుందుకు శోభనంనాటి రాత్రి అలంకారభూషితయై గురువు వద్దకు వెళ్తూండగా దారిలో దొంగలడ్డగించారు.

చోరులారా! నేనొక చోటుకి పోవుచున్నాను. త్వరగానే తిరిగి వచ్చెదను. నగలన్నీ అప్పుడు మీకిచ్చేస్తాను. నన్నుమాట నిలబెట్టుకోనివ్వండి “అని కోరగా వారంగీకరించి ఆమెను అప్పుడు పోనిచ్చారు. ఆమె గురువును దర్శించుకోగా నీ భర్తతో కూడి కలకాలం సుఖంగా ఉండు " అని ఆశీర్వదించి సెలవిచ్చేశారు. ఆమెతిరిగి వస్తూ దొంగలను తననగలను తీసికొనమనగా- "ఆడి తప్పని నీవంటి గుణవతి వద్ద చౌర్యము చేయుటకు మా మనసంగీకరించడం లేదు- నీ భర్తతో సుఖంగా ఉండు" అని వారు ఆమెను సాగనంపారు. ఆమె- జరిగినదంతయూ భర్తకు చెప్పింది. అతనెంతో ఆనందించి కొంతకాలం తరువాత ఆమెను తన రాజ్యానికి తీసుకు వెళ్లిపోయాడు.

అంతవరకూ చెప్పిరాజు ఆ నలుగురి సోదరులనీ - “వీరిలో అధికులయిన గుణవంతులెవరు? రాజకుమారా? దొంగలా? రాజకుమారి భర్తా? గురువా?' ' అని ప్రశ్నించాడు. "శోభనపు పెళ్లికూతురిని పరపురుషుడి వద్దకు పంపిన -భర్త" అన్నాడు పెద్దవాడు. “ఆడితప్పని రాజపుత్రికి -”చెప్పాడు రెండోవాడు. "అంత సౌందర్యవతి అయిన కన్యవచ్చినా - మరో చింత చేయక - ఆశీర్వదించి పంపిన గురువు" అన్నాడు మూడోవాడు. “చేజిక్కిన నగలను దోచుకొనక ఆమెను వదలివేసిన దొంగలు - అన్నాడు నాలుగోవాడు.

వారిసమాధానాలను బట్టి దొంగెవరో గ్రహించినా -కొన్నాళ్ళాగాక చిన్నవాడిని పిలిచి-"నువ్వే దొంగవి సాక్ష్యాధారాలు కూడా లభించాయి.” అని రాజు గద్దించగా వాడు అంగీకరించి - అన్నదమ్ములవాటాలిచ్చేశాడు. “విక్రమార్కా! ఆ నలుగురిలోనూ నిజంగా గుణాధికులెవరు? ప్రశ్నించాడు భేతాళుడు. ఇలాంటి విషయాన్నే పరిష్కరించిన రాజు “రాజకుమార్తె, వాగ్దానాన్ని నిలుపుకుందుకామె చేసినంత సాహసం తక్కువదికాదు. ఆమె దాంపత్యానికే ముప్పు తేగలిగిన ఆపాయన్నెదుర్కుందామె ఆడినమాట కోసం " అని చెప్పడంతో భేతాళుడు మాయమయ్యాడు.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat