భేతాళ కథలు - 26

P Madhav Kumar
1 minute read

పూర్వము ఒక వృక్షముపై అనేక పక్షలు తమ తేనితో జీవించుచున్నాయి. విక్రమార్కుడు భూసంచారము చేయుచు ఆ వృక్షచ్ఛాయను విశ్రమించుచున్న రాత్రి, పక్షులన్నియు గుమిగూడి కొలువు దీరియున్నాయి. "పక్షులారా! మనకిక్కడ శత్రుబాధ ఎక్కువగా యుంది. మన ప్రాణాలకు రక్షణ కనిపించుటలేదు. యింతకంటే మంచి సురక్షిత స్థానమును చూచిరమ్మన్నాను చూచివచ్చితిరా?' యని పక్షులతేడు అడిగాడు. "ప్రభూ! ఎక్కడ చూచినను ఏదియో యొక్క ఇక్కట్టు కనిపించుచునే యున్నది. కాని యుజ్జయిని నగరంబునట్లుగాదు. దాని పాలకుడు విక్రమాదిత్యుడు. అక్కడి జంతువులలో జాతి వైరములు, కులమత ద్వేషాలు, జారచోర బాధలు. అపమృత్యుభయము మొదలైవేవీలేవు. ఆ రాజు దైవ సమానుడు. పరోపకారపారీణుడు. దయాస్వభావుడు, మీదు మిక్కిలి జీవుల యెడ కరుణా స్వభావుడు. ఆతని రాజ్యములోనే ప్రాణానికెప్పుడునూ కీడు కలుగదు. మనమా ప్రాంతమున వసింపవచ్చును”నని పక్షులన్నియు ముక్త కంఠముతో చెప్పాయి. 'సరే'నని అంగీకారానికొచ్చాయి.

జంతుభాష నెఱింగిన విక్రమార్కుడిదంతయూ విన్నాడు. ఆదమరచి నిద్రిస్తుండగా తెల్లవారు ఝూమున ఎక్కడనుండియో ఒక ఆవును దరుముకొని ఒక పులి వచ్చుటయునుగాంచెను. గోవు కూడా విక్రమార్కుని శరణుజొచ్చినది. ఆతడునూ పులిని తన భయంకర ఖడ్గముచే చంపివేసెను. ఇదంతయు వృక్షము నుండి గమనించుచున్న పక్షులు జూచి ఈతడెవరని విచారించి యడిగి దెలిసికొని "ప్రభూ! పులిని జంపి పాడియావును గాపాడితివి. మమ్ములను గూడా రక్షించి మాన్యుడవు కమ్ము మమ్ములనొక రాక్షసుడు ప్రతిదినము భక్షించి పోవుచున్నాడు. మా వంశమంతరించి పోవుచున్నది. మమ్ము రక్షించి మా బాధలీడేర్చు”మని ప్రాధేయపడ్డాయి. విక్రమార్కుడు వాటికభయము నొసంగి యారాక్షసుడున్న ప్రదేశమునకరిగి ఆతనితో యుద్ధము జేసి యా రాక్షసుని సంహరించి, వధించిన వార్తను పక్షులకెఱింగించి "నిర్భయముగా నివసించండ”ని జెప్పి తన స్వస్థలమునకు పోయాడు. విక్రమార్కుని ఔదార్యమునకు కరుణా స్వభావతకు, జంతుప్రేమకు ఈ కథయే నిదర్శనము.

3
0

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat