🍃🌷శ్రావణ శుక్ల షష్ఠీ మహాత్మ్యం:
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻సనత్కుమార ఉవాచ:
ఓ స్వామీ! ఆశ్చర్యమును కలుగచేసెడి నాగపంచమి వ్రతమును వింటిని ఇక ముందు షష్ఠీ తిధి యందు ఏ వ్రతమును చేయవలయునో యే విధిగా చేయవలయునో దానిని చెప్పుమని సనత్కుమారుడు ఈశ్వరుని అడిగెను.
🌻ఈశ్వర ఉవాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు…
ఓ బ్రాహ్మణోత్తమా! శ్రావణ శుద్ధ షష్ఠి యందు నూపౌదనము అనే వ్రతమును చేయవలయును. ఆ వ్రతమును చేసిన యెడల అపమృత్యువు తొలగుటయే గాక మహా మృత్యువైనను తొలగిపోవును.
శివాలయమునందుగాని తన గృహమునందుగాని శివుని యధావిధిగా పూజించి, పప్పు అన్నమును నివేదన చేయవలెను.
ఉప్పుకలిపిన మామిడికాయ కూరను దానికి సాధనముగా ఉపయోగింపవలయును. ఏ పదార్థములు దేవునకు నివేదనము చేయుచున్నారో ఆ పదార్థములనే బ్రాహ్మణులకు వాయనము ఇవ్వవలయును.
ఈ విధముగా వ్రతమును చేసిన వానియెక్క పుణ్యము విశేషముగానుండును. ఇందుగుఱించి పూర్వము జరిగిన కథయొకటి కలదు దానిని జెప్పెదను సావధానముగా వినుము.
పూర్వకాలంబున రోహితుడను రాజు కలడు , ఆయనకు చాలా కాలము వఱకు సంతానం లేక పోవుటచే పుత్రులను పొందవలయుననే కోరికచే మిక్కిలి ఘోరమైన తపస్సు చేసెను.
ఇట్లు తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓ రాజా! నీవు చేసిన పూర్వ కర్మలో కుమారుడు కలుగునట్టి యోగ్యత లేదు. కాబట్టి, తపస్సును చాలింపుమని యెంత చెప్పినను వినక సంతానమును పొందవలయుననే కోరికచే తపస్సును చాలించలేదు. యిట్లు తీవ్రమగు తపస్సు చేయుటచే, కష్టము తోచి , బ్రహ్మదేవుడు తిరిగి ప్రత్యక్షమై ఓ రాజా! నీకు పుత్రునిచ్చితిని కాని అతడు త్వరలోనే మృతినొందును. అని బ్రహ్మదేవుడు చెప్పెను.
అనంతరము ఆ రాజుయు , రాజు గారి భార్యయు ఈ విధముగా ఆలోచించిరి. సంతానము లేకుంటచే పుత్రులు లేరనియు గొడ్డురాలు అనియు లోకులు చెప్పుకొందురు, పుట్టి గతించినప్పటికి అట్టి అపవాదు కలుగదు గాన , స్వల్పాయుర్దాయం కలవాడైనను పుత్రుని ఇమ్మని వారు కోరగా, ఆ ప్రకారమే బ్రహ్మదేవుడు పుత్రునొసగెను. ఆ పుత్రుడు కలిగినందువలన సంతోషమును, అల్పాయుర్దాయం కలవాడగుటచే విచారమును కలవాడై ఆ రాజు పుట్టిన పిల్లవానికి జాతకర్మాది సంస్కారముల నన్నియు యధావిధిగా చేసెను.
దక్షిణ అను పేరుగల రాజు గారి భార్యయు రోహితుడు అను రాజును ఆ పుట్టిన పిల్ల వానికి శివదత్తుడు అను పేరు పెట్టిరి.
అనంతరము ఆ రాజు పిల్లవానికి వయస్సురాగానే ఉపనయనము మాత్రం చేసెను. ఆల్పాయుర్దాయము కలుగుటచే మృతినొందుననే కారణముచే ఇతనికి వివాహము చేయలేదు.
అనంతరము ఆ పిల్లవాడు పదహారవ సంవత్సరము నందు మరణము నొందెను. ఎవని వంశములో బ్రహ్మచారిగా ఉండి, మరణమునోందునో వాని వంశము అంతరించుటయే గాక అట్టివాడును దుర్గతినొందును , అని ఆ రాజు ఎరిగినవాడై , తన కుమారుడు బ్రహ్మచారిగా ఉండి మృతినొందినాడని మిక్కిలి దుఃఖము నొందెను.
🌻సనత్కుమార ఉవాచ:
దేవదేవుడవును , జగత్ప్రభువును అగు ఓ సాంబమూర్తీ ! ఇట్టి దోషం పోవుటకు పరిహారమేదైన ఉన్నదా ! లేదా ! ఉన్నయెడల అటువంటి దోషము ఏ విధముగా నివృత్తించునో చెప్పవలయును.
🌻ఈశ్వరువాచ:
ఇట్లు సనత్కుమార మునీశ్వరుడు అడుగగా సాంబమూర్తి చెప్పుచున్నాడు.
ఓ మునీశ్వరా ! దీనికి ప్రతిక్రియను చెప్పెదను వినుము.
స్నాతకమైనవాడును , బ్రహ్మచారియు మృతినొందిన యెడల అర్క వివాహ విధిగా వివాహము చేసి పరస్పరము కూర్చవలెను. దేశకాలములను స్మరించి మృతినొందిన బ్రహ్మచారి యొక్క గోత్రనామములను జెప్పి స్వభావసిద్ధమగు గోదానాది వ్రతవిధులనన్నియు యధాప్రకారముగా జరుపవలెను. బంగారముతో అభ్యుదయ కర్మను చేసి , అగ్నిహోత్రమును ప్రతిష్ఠించి ఆఘారాదిహోమమును గావించి , పిమ్మట భూరాదిచతుర్వ్యాహుతుల హోమమును చేయవలయును.
బ్రహ్మ చర్యాశ్రమము యొక్క సిద్ధి కొరకు వ్రతాధిపతియగు అగ్నిహోత్రునకు విశ్వేదేవతలకు చెందునట్లుగా ఆజ్యముతో హోమమును చేయవలయును. అనంతరము స్విష్టకృత్చేసి పిమ్మట మిగిలిన హోమములనన్నియు పూర్తిచేయవలెను. అనంతరము దేశకాలములను స్మరించి అర్క వివాహము చేసెదనని సంకల్పము చేయవలెను. బంగారముతో అభ్యుదయకర్మను చేసి పిమ్మట జిల్లేడు కొమ్మను శవమును నూనెతోటి పసుపుతోటి పూసి పచ్చని దారముతో జుట్టవలెను. రెండు పచ్చని వస్త్రములను కూడా చుట్టవలయును. అనంతరము అగ్నిహోత్రమును ప్రతిష్ఠించి వివాహవిధ్యుక్తముగా ఆఘారాదిహోమములను చేసి, అగ్నిహోత్రుడు, బృహస్పతి, కాముడు మొదలగు దేవతలకు భూరాది చతుర్వ్యాహుతుల చేతను, ఆజ్యముతో హోమముజేసి స్విష్టకృత్తును చేసి హొమాదికర్మలన్నియు సమాప్తిని పొందించవలెను.
జిల్లేడు కొమ్మను , శవమును పిమ్మట దహింపవలెను. ఈ విధానముగా మృతినొందిన వానికిని అప్పుడు మృతినొందబోవువానికిని చేయవలయును. మృతినొందిన పిమ్మటనే దహింపవలయును. యిట్లు ఆఱు సంవత్సరములు దీనికి సంబంధములగు క్రియలనన్నియు యధావిధిగా జరుపవలయును.
అనంతరము నూతనములగు కౌపీనములు , హస్తాభరణములు , కర్ణాభరణములు , కృష్ణాజినములు, పాదుకలు, గొడుగులు , మాలికలు , గోపీచందనము, మణి సమూహములు, మఱియు ఇతర ఆభరణములును , ముప్పది మంది బ్రహ్మచారులకు ఇవ్వవలయును. ఈ ప్రకారముగా జేసిన యెడల ఏ విధమగు విఘ్నము కలుగదు.
ఓ మునీశ్వరా! ఈ విధానమునంతయు ఆ రాజు బ్రాహ్మణులు చెప్పగా విని , ఈ విధముగా మనస్సున విచారపడెను.
అర్క వివాహము రెండవ పక్షము గాని ముఖ్యమైనది కాదు , అయినను , జేయవలయుననుకుంటినేని మృతినొందిన వానికి కన్యను ఎవ్వడును ఇవ్వడు గదా! అయినప్పటికి నేను రాజును కాఁబట్టి యెవడైనను ధనమునందు అపేక్ష కలిగినయెడల కన్యను ఇచ్చిన వానికి కోరినంత ధనమును గాని , రత్నములను గాని ఇచ్చెదనని రాజు దేశమునందంతటను ప్రకటన చేసెను.
ఇట్లుండగా ఆ పట్టణములో ఒక బ్రాహ్మణునకు ఒక కుమార్తె కలిగిన పిమ్మట భార్య చనిపోయినది ఆ బ్రాహ్మణుడును రెండవ వివాహము చేసికొని , కొంతకాలమునకు దేశాంతరమునకు లేచిపోయెను. ఇంటివద్ద రెండవ భార్యయు సవతి కూతురు ఉండిరి. ఆ రెండవ భార్య దుష్టస్వభావము కలది అగుటచే , రాజు గారి ప్రకటనను విని , సవతి కూతురునందు ద్వేషము చేతను , ధనమునందు ఆశ చేతను పదిసంవత్సరములు వయస్సు గలదియు , బాలికయు , దిక్కులేనిదియు , తన స్వాధీనంలోనే ఉన్నదియు, తన సవతి కూతురును లక్ష రూప్యములను పుచ్చుకొని మృతినొందిన వానికి వివాహం జేయుటకు గాను రాజు గారికిచ్చెను.
అప్పుడు ఆ రాజు , ఆ బ్రాహ్మణ కన్యకను తీసికొనివెళ్లి , నదీ తీరము వద్దనుండు శ్మశాన ప్రదేశమునకు శవముతో గూడ తీసికొని వెళ్లి , అచ్చట ఆ కన్యకకును, శవమునకును వివాహము చేసిరి.
ఇట్లు విధి ప్రకారముగా వివాహము చేసి , ఆ చిన్నదానిని భుజింపచేసి పిమ్మట ఆ శవమును దహించుటకు ప్రయత్నము చేయుచుండగా... ఓ జనులారా ! మీరు చేయబోవునది ఇదియేమిటి ? అని ఆ చిన్నది అచ్చటనుండు మనుష్యులను ఆడిగినది.
అనంతరము అక్కడ ఉండు వారందరు ఆ చిన్నదాని అవస్థకు దుఃఖాక్రాంతులై , ఓ చిన్నదానా! నీ పెనిమిటిని దహింపబోవుచున్నారు అని చెప్పగా , ఆ చిన్నది భయపడి పిల్లయగుటచే ఏడ్చుచు యిట్లు పలుకుచున్నది.
నా పెనిమిటిని ఎందునిమిత్తము దహింపవలెను. అలా నేను దహింపనివ్వను , మీరందరు కలసి వెళ్లవలయును , యిచ్చటనే ఒక్కదానిని ఉందును. నా పెనిమిటి యెప్పుడు లేచునో అప్పుడు, నా పెనిమిటితో కూడా లేచి వెళ్లెదను అని యీ ప్రకారము నిర్బంధముగా మాట్లాడుచుండెడి ఆ చిన్నదాని పట్టుదలను చూచిన కొందరు వృద్ధులు ఆమె యొక్క ప్రారబ్ధమును గురించి యిట్లు చెప్పుకొనిరి.
ఎంత ఆశ్చర్యమగా ఉన్నది, ఈ చిన్నదాని యొక్క కర్మమునందు ఏ విధముగా జరుగబోవునో యెవరికిని తెలియదు గదా! దీనులను పాలించువాడును దయగలవాడును అగు భగవంతుడేమి చేయునో గదా! ఈ చిన్నదానికి ఆధారులెవరును లేరు, సవతి తల్లి ద్వేషము కలదియగుచు, ఈ రాజునకు అమ్మెను, అందువలన ఎప్పుడైనను, ఈ చిన్నదానికి భగవంతుడే రక్షకుడగును , మనము ఈ శవమును దహించుటకు సాధ్యంకాకయున్నది, కాబట్టి, మనందరికి ఇష్టమైన యెడల, యింటికి వెళ్లడమే ఉత్తమము, అని ఈ ప్రకారము వారందరు ఆలోచించి, ఆ శవమును, కన్యకను శ్మశానములో విడిచి యింటికిజనిరి.
ఆ చిన్నదియు ఒంటరిగా ఉండుటవలనను, చిన్నతనమగుట వలనను, ఈ జరిగినదంతయు సాకల్యముగా తెలియనిదై భయభ్రాంతురాలై ఏమియు తోచక, పార్వతీ పరమేశ్వరులను భక్తిపూర్వకముగా మనస్సున ధ్యానింపుచుండెను.
దీనురాలగు ఆ చిన్నది స్మరణ చేయుట వలన సమస్తమును తెలిసినవారలగు ఆ పార్వతీపరమేశ్వరులు దయతో గూడిన మనస్సుగలవారై శీఘ్రముగా అచ్చటకు వచ్చిరి.
ఇట్లు , వృషభవాహనమును ఎక్కి, మిక్కిలి కాంతితో ప్రకాశించెడి ఆ పార్వతీపరమేశ్వరులను చూచి, వీరు దేవతలని నిజము తెలియకపోయినను వారికి సాష్టాంగదండప్రణామము చేసెను. పూర్వమెవరును లేకుండుటచే భయపడుచుండెడి ఆ చిన్నది, ఇప్పుడ ఎవరో సహవాసముగా ఉండుట తటస్థించినదని ధైర్యం కలదియగుచు, నా పెనిమిటి మెళుకువ గలవాడై లేచుటలేదు, యేమికారణమని ఆ చిన్నది పార్వతీపరమేశ్వరులను అడిగెను.
ఆ చిన్నది ఏమియు తెలియని బాలదశయందు ఉండుటచే , దయగలవారలై పార్వతీపరమేశ్వరులు అనుగ్రహించి, ఓ చిన్నదానా! పూర్వము నీ తల్లి నూపౌదనమను వ్రతమును ఆచరించినది, నీవు సంకల్పము చేసి నువ్వులు, ఉదకము చేతిలోనుంచుకొని , ఆ తల్లి చేసిన నూపౌదన వ్రతఫలమును నీకు ధారపోయుచున్నాను. కాఁబట్టి, స్మృతిగలవాడవై లేచుగాక యని ఉదకమును వదిలిపెట్టుము, అని వారు చెప్పగా ఆ చిన్నదియు ఆవిధముగానే చేసెను. వెంటనే పెనిమిటియగు శివదత్తుడు లేచి కూర్చుండెను.
అనంతరము పార్వతీపరమేశ్వరులు ఆ వ్రతవిధానమంతయు ఆ చిన్నదానికి చెప్పి , అదృశ్యులైరి. పిమ్మట శివదత్తుడు ఆ చిన్నదానిని చూచి, నీవెవరవు ! నేనిచటకు రావడమునకు కారణమేమి? అని అడిగెను.
ఆ చిన్నదియు జరిగిన వృత్తాంతమునంతయు జెప్పెను.
అనంతరము తెల్లవారగానే ఉదయమున నదిలో స్నానము చేయుటకు వచ్చిన మనుష్యులందరు అచ్చట బ్రతికియున్న రాజపుత్రుని చూచి , యిండ్లకు వెళ్లి , ఓ రాజా ! నీ కుమారుడు బ్రతికినవాడై కోడలితో కూడ నదీతీరమందు సంచరించుచున్నారు , అని ప్రజలు చెప్పగా విని , కొంతవఱకు సందేహము గలవాడై యుండగా మరికొందరు తనకు విశ్వాసము కలవారు చెప్పగా నమ్మకము కలవాడుగుచు , అమితమగు సంతోషమును పొందెను.
అనంతరము ఆ రాజు భేరీ మొదలగు వాద్యములను మోయింపుచు , నదీ తీరమునకు మిక్కిలి సంతోషముతో వెళ్లెను. ప్రజలందరును సంతోష చిత్తులగుచు , ఓ రాజా ! మృతినొందిన నీ కుమారుడు బ్రతుకుటవలన నీవు మిక్కిలి అదృష్టవంతుడవు అని రాజును పొగడిరి. అప్పుడు రాజు చెప్పుచున్నాడు,™️ నేను అదృష్టవంతుడనని మీరు చెప్పుట సరియైనది కాదు. నేను దౌర్భాగ్యుడను, హీనుడను , ఈ నా కోడలు మిక్కిలి పుణ్యురాలు , ఈమె యొక్క పుణ్యమహిమ చేతనే , నా కుమారుడు బ్రతికెను , అని రాజు కోడలిను ప్రశంశ చేసి , బ్రాహ్మణులకు షోడశమహాదానములను చేసి పూజించెను.
మృతినొందుటచే శవమునకు చేయు ఉత్క్రాంతక్రియలను జేసి శ్మశానమునకు తీసికొని పోగా తిరిగి బ్రతుకుట వలన నింటికి వచ్చువానికి చేయదగిన శాంతి హోమాదిక్రియలు అన్నియు బ్రాహ్మణులు చెప్పగావిని , ఆ రాజు యధావిధిగా క్రియలనన్నియువచేసెను.
ఓ మునీశ్వరా ! ఇట్టి ఫలము కలది కాఁబట్టి, ఈ నూపౌదనము అను వ్రతమును నీకు జెప్పితిని, ఈ రకమున ఐదు సంవత్సరములు చేసిన పిమ్మట, ఉద్యాపనము చేయవలయును.
ఉద్యాపన విధానమేనగా... సువర్ణముతో పార్వతీపరమేశ్వరుల ప్రతిమను చేయించి, దానిని నిత్యము పూజింపుచు, అన్నముతోను , మామిడాకులతోను ప్రాతఃకాలంబున హోమము చేయుచు , ప్రత విధానములో జెప్పఁబడిన రీతిగా దేవతకు నైవేద్యమును బ్రాహ్మణునకు దానమునిచ్చుచు, యధావిధిగా వ్రతమును ఆచరించిన యెడల చిరకాలము జీవించునట్టి పుత్రుని బడసి అంత్యకాలమునకు కైలాసంచేరును, అని సనత్కుమారునితో సాంబమూర్తి చెప్పెను.
ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే "నూపౌదన షష్ఠీ" వ్రత కథనం నామ పంచమోధ్యాయస్సమాప్తః..
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏
⚜️⚜️🌷🌷⚜️⚜️🌷🌷⚜️⚜️
