07. శ్రావణమాస మహాత్మ్యము - 7వ అధ్యాయం - Sravana Masam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

07. శ్రావణమాస మహాత్మ్యము - 7వ అధ్యాయం - Sravana Masam

P Madhav Kumar

 

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll


🌻ఈశ్వరఉవాచ: 

సాంబమూర్తి చెప్పుచున్నాడు....

ఓ మునీశ్వరా! ఇకముందు "శ్రావణ శుద్ధ సప్తమి” దినంబున చేయతగిన "శీతలాసప్తమి" యను వ్రతమును గుఱించి చెప్పెదను సావధానముగా వినుము.

గోడయందు దిగుడుబావి ఆకారమును, దానిలో దివ్యరూపులును అశరీరులు అను పేరుగల జలాధిదేవతలు అనెడు గుర్తును లిఖించవలయును, మఱియు ఇద్దరు బాలురు, ముగ్గురు పురుషులతో గూడియున్నట్లు ఒక స్త్రీ ప్రతిమను లిఖించవలయును. ఒక గుఱ్ఱమును ఒక యెద్దును మనుష్యులచే వహింపబడు ఒక సవారీని లిఖియించి, పిమ్మట జలాధి దేవతలను షోడశోపచారములచే పూజించి, దోసపండు వ్యంజనముగా చేసి, పెరుగుతో కలిపిన అన్నమును నివేదన చేయవలయును.

ఏ పదార్థములను నివేదన చేయుచున్నారో, ఆ పదార్థములనే బ్రాహ్మణునకు వాయనమివ్వవలయును. ఈ ప్రకారము ఏడు సంవత్సరములు ప్రతమును చేయుచు, ప్రతి సంవత్సరమునందు ఏడుగురు సువాసినీ స్త్రీలకు భోజనము పెట్టవలయును. ఆనంతరము ఉద్యాపనము చేయవలయును. 

బాలురతో గూడి యున్నట్లుగా నిర్మింపబడిన జలాధిదేవత ప్రతిమలను ఒక బంగారపు పాత్రయందుంచి ఉదయమున, సాయంకాలంబున భక్తితో పూజింపవలయును. నవగ్రహములకు ముందుగాను, తర్వాత ప్రధాన దేవతలకును అన్నము మొదలగువానితో ప్రాతఃకాలంబున హోమము చేయవలయును. ఈప్రకారముగా వ్రతమాచరించి, ఫలితమును పొందిన వారిని చెప్పెదను వినుము. 

పూర్వ కాలంబున సౌరాష్ట్ర దేశమునందు శోభనము అను ఒక పట్టణము కలదు. ఆ పట్టణమందు సమస్త ధర్మములయందు ఆసక్తిగల ఒక ధనవంతుఁడు కలఁడు♪. ఆయన - జలము ఎచ్చటను లేనట్టి యుజనసంచారము లేని అడవి యందు సమస్త జీవరాసులకు ఉపయోగమగునట్లుగా ఎప్పుడును జలముతో నిండియుండవలయునను భావముతో దిగుడు బావులు మొదలగువానిని త్రవ్వించెను. విశేషముగా ధనమును ఖర్చు పెట్టి, గట్టి రాళ్లతో నడచుటకు సుఖముగా నుండునట్లు కాలి త్రోవలను, పశువులు నీరు త్రాగుటకు తొట్లను, మార్గస్ధులకు  ఆయాసమును పోగొట్టునట్టియు, బహుకాలము ఉండదగిన తొట్టెలను అచ్చటచ్చట మార్గ సమీపములో ఏర్పఱచెను.

ఈ ప్రకారము ధర్మకార్యములను చేసినప్పటికి,  ఎచ్చటను ఒక్క బిందువైనను జలము సంభవింపలేదు♪. అప్పుడు వ్యాకులము కలవాడై.., నా ఆయాసము వ్యర్థమైనది, నా సొమ్మంతయు వ్యర్ధముగా ఖర్చు అయినది గదా♪! అని ధనదుడు అను పేరుగల ఆ ధనవంతుడు విచారపడి, ఆ రాత్రి అచ్చటనే నిద్రించగా జలదేవతలు ఆయన స్వప్నములో కనబడి, ఓ ధనవంతుడా! నీవు త్రవ్వించిన బావులలో నీరు పుట్టుటకు ఉపాయమును జెప్పెదను వినుము. నీవు మా యందు భక్తికలవాడవై నీ మనమడుని మాకు బలిగా ఇచ్చితివేని, నీవు త్రవ్వించిన బావి ఎప్పుడును జలంతో నిండియుండునని చెప్పి యదృశ్యులైరి. ఆ ధనికుడును ఇటువంటి స్వప్నమును జూచి ఇంటికి వచ్చి, అంతయు కుమారునితో చెప్పెను.

ఆయ యొక్క కుమారుడును ద్రవిణుడు అను పేరుగలవాడును, ధర్మమునందు ఆసక్తి గలవాడుగా నుండెను. ఇట్లు తండ్రి చెప్పిన వృత్తాంతమును విన్నవాడై కుమారుడు చెప్పుచున్నాడు•.... 

ఓ తండ్రీ! నేను నీకు కుమారుడను అగుటచేత నీ మాటను తప్పక వినవలయును, మఱియు నీవు చేయునటువంటిది ధర్మకార్యము, నీవు విచారింప పనిలేదు, ధర్మము శాశ్వతముగా ఉండును. పుత్రులు మొదలగువారు నశించెడివారు కాఁబట్టి, నశించునట్టి స్వల్పవస్తువునిచ్చి శాశ్వతముగా ఉండునటువంటి ధర్మమును సంపాదించుట మిక్కిలి దుర్లభమైనది గదా! గాన, నాకు చంద్రుడు సూర్యుడు అను పేరుగల యిద్దరు కుమాళ్లు కలరు వారిలో పెద్ద వాడగు చంద్రుని నీవు సందేహింపక బలిగా ఇవ్వవలయును, ఇట్లు మనము చేసెడి ఆలోచనను సమస్త విధముల స్త్రీలకు తెలయనివ్వకూడదు♪. తల్లికి తెలియకుండునట్లుగా ఉపాయమును జెప్పెదను వినుము♪. నా భార్య ఇప్పుడు గర్భవతియై ప్రసవించుటకు సిద్ధముగానున్నది. కాబట్టి ప్రసవించుటకు తండ్రి గారి ఇంటికి వెళ్లును. అప్పుడు చిన్న కుమారుడగు సూర్యుడు తల్లితో కూడా వెళ్లును. అప్పుడు మనము యోచించిన కార్యమునకు ఎటువంటి విఘ్నము కలుగదు, అని కుమారుడు తండ్రితో జెప్పెను.

ఇట్లు, కుమారుడు చెప్పిన మాటలను తండ్రి విని, మిక్కిలి సంతోషించి,  ఓ పుత్రకా! నీవు చాలా ధన్యుడవు, నేనును మిక్కిలి ధన్యుడను, నీవంటి యోగ్యమైన సంతానము కలుగుటచేతనే నేను పుత్రులు కలవాడనైతిని అని తండ్రి కుమారుని మెచ్చుకొనెను.

ఇంతలో, ఆయన భార్యయగు సుశీలను ప్రసవమునకు తీసికొని వెళ్లుటకు తండ్రిగారి ఇంటివద్ద నుండి వర్తమానము రాగా, ఆప్పుడు ఆమెతో ఇట్లు చెప్పిరి. పెద్దకుమారుడు మావద్దనే యుండును, చిన్న కుమారుని మాత్రము తీసుకొని వెళ్లవలయునని పెనిమిటియు, మామగారును చెప్పగా పతివ్రతయగు ఆ చిన్నది వీరి ఆలోచనను తెలియనిది కాఁబట్టి, ఆ ప్రకారమే పెద్దకుమారుని విడిచి చిన్న కుమారుని తీసుకొని వెళ్లెను.

అనంతరము తండ్రియు కుమారుడును శీతాంశుడను పిల్లవానికి నూనెతో తలంటి, స్నానము చేయించి, మంచి వస్త్రముల చేతను, ఆభరణముల చేతను అలంకరించి, ఆ నూతివద్దకు తీసుకొనివెళ్లి జలాధిదేవతలు సంతోషింతురు గాక యని, ఆ నూతిలో పాతి పెట్టిరి.

అప్పుడు వెంటనే ఆ నూతిలో... అమృతముతో సమానమగు జలము పుట్టి నిండియుండెను♪. పిమ్మట ఆ తండ్రి కుమారులిద్దరు ఇంటికి వెళ్లి, పిల్లవానిని బలి ఇచ్చుటచే విచారమును, నూతిలో జలము పుట్టుటచే సంతోషమును కలవారైరి.

అనంతరము, ఆ పిల్లవాని తల్లియగు సుశీల తండ్రి గారి గృహమునందు ప్రసవించినది. మూడవ కుమారుడు కలిగెను. పిమ్మట తన యింటికి మూడవ మాసము నందు ప్రయాణమై వచ్చుచుండగా దారిలో తన మామగారు త్రవ్వించిన బావిలో జలముపుట్టి సంపూర్ణముగా నిండియుండుట చూచి మిక్కిలి ఆశ్చర్యమును పొంది, ఆ బావిలో స్నానము చేసెను.

ఈ నూతి విషయమై నా మామగారి యొక్క ఆయాసము, ధనవ్యయము సఫలమైనదని ఆ చిన్నది సంతోషించినది. ఆ దినము శ్రావణశుద్ధ సప్తమి అగుటచే ఆ దినంబున శ్రేయస్కరమగు శీతలా ప్రతమును చేయదలచి, వంట చేసికొని అన్నమును పెరుగును తీసికొని వచ్చి జలదేవతలను పూజించి, పెరుగు కలిపిన అన్నమును దోసపండును నివేదనము జేసి, ఆ పదార్థమునే బ్రాహ్మణునకు వాయనము ఇచ్చెను. ఆ పదార్ధములనే తాను, తల్లితో కూడ ఉండువారును భుజియించి ఇంటికి ప్రయాణమై వచ్చుచుండగా,  అచ్చటికి ఆ చిన్నదాని యొక్క గ్రామము ఒక ఆమడ దూరముండెను.

అనంతరము ఆ చిన్నది, ఇద్దరు కుమాళ్లతో కూడుకొని సవారీ నెక్కి వెళ్లుచుండగా జలదేవతలు ఈ ప్రకారము తమలో తాము యిట్లు సంభాషించిరి. ఈ చిన్నదియు మనయందు భక్తి కలదియగుచు, మన సంబంధమగు శీతలా సప్తమీ వ్రతమును ఆచరించినది. ఈ పెనిమిటిచేతను మామచేతను స్థాపించబడిన పెద్ద పిల్ల వానిని మనము తీసికొని నూతనముగా మఱియొక పిల్ల వానిని మనము యిచ్చినప్పటికి ఈ వ్రత ప్రభావమున మనము సంతోషించుటయు ఎంత మాత్రము కనపడదు. కాఁబట్టి, మొదటగా తండ్రి,తాతలచే స్థాపింపబడిన పిల్లవానినే ఇవ్వవలయునని నిశ్చయించి, దయా స్వభావము గల ఆ జలదేవతలు ఆ బావినుండి పిల్లవానిని బయటికి తీసి వెళ్లుచుండెడి తల్లి యగు సుశీలను ఆపిల్ల వానికి అప్పగించిరి.

అనంతరము ఆ పిల్లవాడు ముందు వెళ్లుచుండెడి తల్లి వెంట వెనుక పరుగెత్తుకొని వెళ్లుచు ఓ తల్లీ! అని పిలువగా ఆ ధ్వని తన పెద్దకుమారుని ధ్వనిగా తలచి వెనుకకు తిరిగి చూచెను♪. యిట్లు వెనుక వచ్చుచుండెడి తన కుమారుని ఆ చిన్నది జూచి, మనస్సున భయపడినదై తన తొడయందు గూర్చుండబెట్టుకొని, శిరస్సున ముద్దాడి, ఏదో కొంచెము, తనకుమారునితో ఇట్లు పలుకుచున్నది.

ఆ పిల్లవాడు భయపడిన వాడుగా ఉండుటను తలచి,  ఓ కుమారా! నీవు సర్వాభరణములచే అలంకరింపబడి యుంటివి దొంగలెత్తుకొని వెళ్లియుండిరా యేమి? లేక పిశాచములు నిన్ను తీసుకొనిళ్లినవా యేమి? వాళ్ల వలన ఏ విధముగా విడిపించుకొని వచ్చితివి, మన బంధువులందరు విచారచిత్తులై యుండిరి... ఏమి కారణం? అని పిల్లవానిని అడుగుచు వ్యాకులము కలదియై పట్టణ సమీపమునకు రాగా,  సుశీల వచ్చుచున్నదని ఆ గ్రామములో కొందరు వెళ్లి ఆమె పెనిమిటితోను మామతోను చెప్పిరి.

ఈ జనులు చెప్పిన వార్తను విన్నవారై, తండ్రియు కుమారుడును సుశీల వచ్చిన పిమ్మట తన పెద్ద కుమారుని సంగతిని అడిగినయెడల ఆమెతో ఏమి చెప్పుదుమా.. అని చింతాక్రాంతులయిరి.

ఇంతలో,  ఆ సుశీల ముగ్గురు కుమారులతో కూడా వచ్చెను♪. అప్పుడు పెనిమిటియు మామగారును తల్లితో కూడా వచ్చిన పెద్ద పిల్లవానిని జూచి ఆశ్చర్యమును, మిక్కిలి సంతోషమును పొంది, ఆమెతో ఇట్లు పలికిరి, ఓ చిన్నదానా! నీవు ఏమి పుణ్యమాచరించితివి! శ్రేయస్కరమగు ఏ వ్రతమాచరించితివి.

ఓ చిన్నదానా! నీవు పతివ్రతవు, ధన్యురాలవు, పుణ్యురాలవు, మన పెద్దపిల్లవాడు అకస్మాత్తుగా రెండు మాసముల నుండి ఏమి కారణముచేతనో మాకు కనుపించుటలేదు. ఆటువంటివాడు, ఏ కారణముచేతనో,  నీతో కూడావచ్చుటచే, తిరిగి చూడకలిగితిమి.  మన దిగుడుబావి నీళ్లతో నిండియుండెను♪.  నీవు ఇక్కడనుండి పుట్టినింటికి వెళ్లునప్పుడు ఒక్క రెండవకుమారుడినే తీసుకొని వెళ్లితివి, యిప్పుడు ముగ్గురు కుమాళ్లతో గూడ వచ్చితివి. ఓ యోగ్యురాలా! నీ వలన మా వంశమంతయు తరించినది, అని ఈ ప్రకారము కోడలిని మామగారు స్తుతియించెను. పెనిమిటియు దయాస్వభావము కలవాడై,  భార్యను ప్రేమించెను. ఇట్లు వారు సంతోషించినవారై తన యొక్క సుకృతమును గురించిఅడుగగా తాను చేసిన శీతలా వ్రతమాహాత్మ్యము అంతయు చెప్పెను.

ఇట్లు, సుశీల చెప్పిన మాటలను విని, వారందఱు సంతోషమును పొంది, ఇహలోకమున సమస్త సుఖములను అనుభవించి, జన్మాంతమున మోక్షముపొందిరి, కాబట్టి, ఓ మునీశ్వరా! ఇటువంటి ప్రభావము కలదిగనుక శీతలా సప్తమీ వ్రతమును చెప్పితిని.

పెరుగుతో కలిపిన అన్నము చల్లనైనది,  దోసపండును చల్లని గుణమును ఇచ్చును. బావి జలమును చల్లనైనవి జలాధిదేవతలును చల్లనైనవారు.

కాబట్టి, తాపత్రయములనెడు అగ్నిహోత్రముచే దహింపబడెడు మనుష్యునకు ఈ శీతలా వ్రతము వలన - జలముచే అగ్ని చల్లారిపోవునట్లు తాపత్రయములు నశించిపోవును,  గాన, ఈ శీతలాసప్తమీవ్రతము సార్ధకమైన పేరుగలది అని సాంబమూర్తి సనత్కుమార మునీశ్వరునితో చెప్పెను.

ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే - "శీతలస సప్తమీ" వ్రత కథనం నామ షష్ఠోధ్యాయస్స సమాప్తం.  

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏

⚜️⚜️🌷🌷⚜️⚜️🌷🌷⚜️⚜️

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow