11. శ్రావణమాస మహాత్మ్యము - 11వ అధ్యాయం - Sravana Masam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

11. శ్రావణమాస మహాత్మ్యము - 11వ అధ్యాయం - Sravana Masam

P Madhav Kumar


♦️ఏకాదశాధ్యాయము:

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll


🌻సనత్కుమార ఉవాచ:

ఓ జగద్రక్షకా! ఏడు వారములను గుఱించిన వ్రతములను నీవు చెప్పగా వింటిని. అమృతతుల్యములగు వాక్యములెంత వినినను నాకు తృప్తి తీరలేదు. నీమాటల వలన శ్రావణమాసముతో సమానమగు మాసము మఱియొకటి లేదని నాకు తోచుచున్నది. అందువలన శ్రావణమాసములో తిథులయందు కల్గిన మహిమను కూడ వినవలయునని యున్నది. కాఁబట్టి వాటి మహిమను కూడా చెప్పుమని సాంబమూర్తిని సనత్కుమారుడు అడిగెను.


🌻ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి చెప్పుచున్నాడు.... 

ఓ మునీశ్వరా! మాసములలో కార్తీకము శ్రేష్ఠమైనది, దానికంటే మాఘమాసము ఉత్తమమైనది. దానికంటెను వైశాఖము అధికమైనది. మాఘమాసము విష్ణు ప్రీతికరమైనది. నేను ప్రపంచ స్వరూపుడను కాఁబట్టి, యీ నాలుగు మాసములు నాకు ప్రీతికరమైనవి, మఱియు పండ్రెండు మాసములలోను శ్రావణమాసము శివ స్వరూపమైనది. శ్రావణమాసములో తిథులు అన్నియు వ్రతములు కలవియేయగును. ఐనను శ్రేయస్సును ఒసగునట్టి ప్రధానమగు కొన్ని తిథులను గురించి చెప్పెదను వినుము.

ఈ శ్రావణమాసములో ఏ వారముతో, ఏ తిథి గూడిన ఏ వ్రతమును జేయవలయునో చెప్పెదను వినుము. 

శ్రావణ మాసములో సోమవారము పాడ్యమి యందు వచ్చిన యెడల, ఆ మాసమునందు ఐదు సోమవారములు వచ్చును. కాఁ బట్టి, పాడ్యమి సోమవారం నాడు, రోటకము అను వ్రతమును మనుష్యులు చేయతగియున్నది. 

ఆది మొదలు,  మూడు మాసముల పదిహేను దినముల పర్యంతము రోటకమను వ్రతమును చేయవలయును. అట్లు చేసిన లక్ష్మీ ప్రదమనియు, సమస్త కోరికలను ఇచ్చుననియు చెప్పఁబడెను.

ఓ మునీశ్వరుడా! ఆ వ్రతము యొక్క విధానమును చెప్పెదను సావధాన చిత్తముగలవాడవై వినుము. వ్రతమును చేయదలచిన వాడు శ్రావణ శుద్ధపాడ్యమి సోమవారం ఉదయమున - ఈ రోజు మొదలు ప్రారంభించి రోటకవ్రతమును జేసెదను. ఓ జగద్గురువా! నాయందు దయగలవాడగుమని ప్రార్థన చేసి, సంకల్పము చేయవలయును.

భగ్నము గాని మారేడు దళములు, తులసీ దళములు, నల్లకలువలు, పద్మములు, ఎర్ర కలువలు, సంపంగి పువ్వులు, జాజి పువ్వులు, గోరింట పువ్వులు, జిల్లేడు పువ్వులు, మఱియు ఆ ఋతువు యందు కలిగెడు శుభ ప్రదములగు ఇతర పుష్పములు మొదలగువాని చేతను సాంబమూర్తికి నిత్యము పూజచేసి ధూప దీపములనొసగి యనేక విధములగు ఫలములను నివేదన చేయవలయును. మఱియు వురుషుడు భుజించునట్టి ఆహార పరిమితి గల ఐదు రొట్టెలను చేసి వానిలో ఒకటి దేవునకు నివేదన చేసి రెండు రొట్టెలను బ్రాహ్మణునకిచ్చి రెండు రొట్టెలను తాను భక్షింపవలయును.

మిగిలిన పూజనంతయు చేసి అర్ఘ్యమును విడువవలయును. నివేదన చేయుటకు అరటిపండ్లు, కొబ్బరికాయలు, నిమ్మపండ్లు, మాదీఫలములు, ఖర్జూర పండ్లు, దోసపండ్లు ద్రాక్ష పండ్లు, నారింజ పండ్లు, జామపండ్లు, పనస పండ్లు, దానిమ్మ పండ్లు మొదలగునవి ఆ ఋతువునందు సంభవించిన ఫలములన్నియు నివేదనకు ఉపయోగింపవలయును.

అర్ఘ్యప్రదానము చేయుట ముఖ్యమైనది అందువలన కలిగెడు పుణ్యఫలమును చెప్పెదను వినుము. సప్తసముద్రముల పర్యంతము ఉండునట్టి భూమిని దానమిచ్చిన ఫలమును యధావిధిగా వ్రతము చేసినందువలన పొందును, మఱియు విశేషమగు ధనమును కోరువాడు ఈ వ్రతము ఐదు సంవత్సరములు చేసినయెడల సంపూర్ణ ధనవంతుడగును. అనంతరము ఉద్యాపన చేయవలయును. రోటక వ్రతమునకు ఉద్యాపన చేయునప్పుడు బంగారముతోను వెండితోను రెండు రోటకములను చేయించవలెను. 

పూర్వ దినమున మంటపారాధనము చేసిన మరునాడు ఉదయమున శివ సంబంధమగు మంత్రముచే నేతితోటి, శుభప్రదములగు మారేడుదళములతోటి, హోమమును చేయవలయును.

ఓ సనత్కుమారుడా! ఈ ప్రకారము రోటక వ్రతమునకు ఉద్యాపన చేసిన యెడల సమస్త కోరికలను పొందును. 

మఱియు,  విదియ తిథి యందు జేయతగినదియు, శుభప్రదమగునదియు, పాపములను పోగొట్లునదియు ఐన ఔదుంబరము అను వ్రతమును చెప్పెదను. ఆ వ్రతమును శ్రద్ధతో చేసిన మనుజుడు లక్ష్మీసంపన్నుడును పుత్రులు గలవాడును అగును.

శ్రావణమాసము రాగానే శుభప్రదమగు విదియ తిథి యందు ఉదయమున స్నానము చేసి పరిశుద్ధుడై సంకల్పించి వ్రతము చేయవలయును.

యీ వ్రతమును చేసిన పురుషుడుగాని, స్త్రీగాని, సమస్త సంపదలను పొందును. ప్రత్యక్షముగా మేడిచెట్టు సంభవించిన యెడల దానికి పూజచేయవలయును. లేనియెడల గోడయందు దాని రూపమును లిఖియించి నాలుగు నామములచే పూజించవలెను, అవి యేవి యనగా, ఉదుంబర, హేనుపుష్పక, జంతుఫల, రక్తాండశాలి, అను నామములచే పూజింపవలయును. దానికి అధిదేవతలగు శివుని శుక్రుని ఆ ప్రకారముగానే పూజింపవలెను.

ముప్పదిమాడు పండ్లను తీసుకొనివచ్చి మూడు భాగములు చేసి పదకొండు పండ్లు దేవతకు నివేదన చేయవలెను. పదకొండు పండ్లు బ్రాహ్మణునకు దానమియ్యవలయును. పదకొండు పండ్లు తాను భుజింపవలయును గాని, ఆ దినంబున అన్నము తినకూడదు, మఱియు శివుని శుక్రుని పూజించి, ఆ రాత్రి యంతయు జాగరణము చేసి గడపవలయును.

ఓ మునీశ్వరా! యీ ప్రకారము పదకొండు సంవత్సరములు వ్రతము చేసి, అనంతరము వ్రత సంపూర్తి కొఱకు ఉద్యాపనము ముఖ్యముగా చేయవలెను.

ఆకులు, పువ్వులు, కాయలు, కలుగునట్లుగా బంగారముతో మేడి చెట్టును చేయించి, ఆ ప్రతిమను శివ శుక్రుల ప్రతిమలను పూజింపవలయును. మరునాడు ఉదయమున మేడి పండ్ల తోను లేక మృదువైన చిన్న కాయలతో గాని నూట యెనిమిది పర్యాయములు హోమము చేయవలయును. మఱియు మేడి సమిధలతోను నువ్వులు నేతి మొదలగు వానితో హోమము చేసి సంపూర్తినొందించి పిమ్మట, ఆచార్యుని పూజించవలయును.

అనంతరము శక్తి యున్న యెడల నూరుగురు బ్రాహ్మణులకు గాని లేక పదిమందికి గాని, భోజనము పెట్టవలెను. ఓ చిన్నవాడా! ఈ ప్రకారము వ్రతము చేసినందువలన గలిగెడు ఫలమును వినుము. మేడి వృక్షము విశేష ఫలములు గలదగుచు, అన్ని కర్మలకు ఎట్లు ఉపయోగించునో ఆ ప్రకారముగానే అనేక, పుత్రులు కలిగి వంశవృద్ధి కలవాడగును.

మేడి వృక్షము బంగారము వంటి పుష్పములచే ప్రకాశించినట్లుగా, ఈ వ్రతమును చేసినవారు లక్ష్మీ సంపన్నులై యుందురు. ఇంత వరకు, ఈ వ్రతమును ఎవరికిని తెలియపరచలేదు. మిక్కిలి రహస్యమైన ఈ వ్రతమును నీవు యోగ్యుడవైనందున నీకు ఒక్కనికే జెప్పితిని. నీవు ఎంతమాత్రము సంశయింపక భక్తి గల వాడవై ముఖ్యముగా ఈ వ్రతమును చేయమని సాంబమూర్తి సనత్కుమారునితో చెప్పెను.

♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే - ప్రతిపత్ రోటక, ద్వితీయౌదుంబర  వ్రత కథనం నామ ఏకాదశోధ్యాయ స్సమాప్తః.                           

ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow