17. శ్రావణమాస మహాత్మ్యము - 17వ అధ్యాయం - Sravana Masam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

17. శ్రావణమాస మహాత్మ్యము - 17వ అధ్యాయం - Sravana Masam

P Madhav Kumar

 

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


🍃🌷సప్తదశోధ్యాయము - పవిత్రారోపణ వ్రతము:


(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll


🌻ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి చెప్పుచున్నాడు...


ఓ మునీశ్వరుఁడా! శ్రేయస్కరమగు *పవిత్రారోపణ* వ్రతమును చెప్పుచున్నాను వినుము. 


ఈ వ్రతమును సప్తమి దినంబున ప్రారంభించి, అష్టమి దినంబున సమాప్తి చేయవలసినదిగా శాస్త్రమునందు జెప్పబడెను.


పవిత్రారోపణ వ్రతమును జేయువాని యొక్క ఫలమును జెప్పెదను వినుము. సమస్త యజ్ఞములు చేసిన ఫలమును,  సమస్త తీర్థముల యందు స్నానము చేసిన ఫలమును, సమస్త దానములు చేసిన ఫలమును పొందుచున్నాడు. ఇందులో ఎంతమాత్రము సందేహము లేదు. పార్వతీదేవి సమస్త జీవములందును వ్యాపించియున్నందు వలన జేయఁదగినది. ఈ వ్రతము చేసినవానికి ధనము లేకపోవుట, దుఃఖములు, పీడ రోగములు, శత్రువుల వలన భయము సంభవింపదు. అట్టివానికి ఎప్పుడును గ్రహముల పీడయు కలుగదు. వానియొక్క కార్యములు కొద్దివైనను గొప్పవైనను సిద్ధించుచున్నవి.


ఓ చిన్నవాడా! సమస్త ప్రజలకు ఇంతకంటే పుణ్యమును వృద్ధిపొందించునట్టి వ్రతము మరియొకటి లేదు. స్త్రీలకు ముఖ్యముగా సౌభాగ్యమును కలిగించును, ఇది నీయందు ప్రేమచే ప్రకటన చేసి చెప్పబడుచున్నది. కాఁబట్టి, ఓ మునీశ్వరా! శ్రావణశుక్ల సప్తమీ దినంబున ప్రారంభించి, గౌరీదేవి యందు భక్తి కలవారలై, సమస్త సాధన ద్రవ్యములను సమకూర్చుకొని, గంధము, పుష్పమాలు, ఫలములు మొదలగు పూజా ద్రవ్యములనన్నియు సంపాదించి, అనేక విధములగు నైవేద్య పదార్ధములను, వస్త్రములు ఆభరణములు మొదలగువానిని సంపాదించి, శుభ్ర పఱచి, పిమ్మట తాను పంచగవ్యములను ప్రాశన చేయవలయును.


అన్నముతో అష్టదిక్కులయందును బలులను ఉంచి, గౌరీదేవిని ఆవాహన జేసి, ఆధివాసము జేయవలయును. శుభ్రమగు నూతనవస్త్రముల చేతను పవిత్రములగు మామిడి చిగుళ్లు మొదలగువాని చేతను పవిత్రమును జుట్టవలయును.


దేవి యొక్క మూలమంత్రముచే నూఱు పర్యాయములు పవిత్రమును అభిమంత్రించి, సమస్త శుభములను ఒనగూడునట్లుగా అలంకరించి, దేవి ముందు ఉంచవలయును.


దేవతకు మంటపమును ఏర్పరచి, నేర్పరులగు వేశ్యలు, నర్తకులు మొదలగు వారిచే నాట్యము, గీతము వాద్యము మొదలగునవి మనోహరముగా నుండునట్లు చేయించి, ఆ రాత్రియంతయు జాగరణముచే కాలక్షేపము చేసి, ప్రాతః కాలంబున యధావిధిగా స్నానాది నిత్యకృత్యములు నెరవేర్చి, తిరిగి ఎనిమిది దిక్కులయందును భూతబలిని ఉంచవలెను.


పిమ్మట దేవతను యధావిధిగా పూజించి, స్త్రీలకును బ్రాహ్మణులకును భోజనము పెట్టవలయును. పవిత్రమును దేవతకు అర్పణ జేయవలయును. ఆదియందును, అంతమందును తన శక్తికొలది దక్షిణను ఉంచవలయును. 


ఓ మునీశ్వరా! వ్రతమును ఆచరించు వాని యొక్క నియమములను జెప్పెదను వినుము. 


స్త్రీలయందు అభిలాష, జూదమాడుట, వేటాడుట, మద్యపానము మొదలగునవి రాజులు విడువవలయును.


బ్రాహ్మణులు స్వాధ్యాయము చేయగూడదు. వైశ్యులు వ్యవసాయము, వర్తకము చేయకూడదు. ఇటువంటి నియమము ఏడు దినములు గాని, ఐదు దినములు గాని, మూడు దినములు గాని, ఒక్కదినము గానీ లేక నాలుగు జాములు పర్యంతము గాని నియమము జరపవలయును. ఎల్లప్పుడు దేవతాపూజా వ్యాపారమునందే తన మనస్సున కోరికను ఉంచవలెను.


ఓ మునీశ్వరా! విద్వాంసుడైనవాడు పవిత్రారోపణ వ్రతమును చెప్పిన రీతిగా చేయకుండెనేని సంవత్సర పర్యంతము జేసిన పూజ అంతయు నిష్ఫలమగును.


కాఁబట్టి, శుభములను ఒసగునటువంటి పవిత్రారోపణ వ్రతమును దేవీ ధ్యానాసక్తులై, భక్తికలవారలగుచు, ప్రతి సంవత్సరమును తప్పక చేయుచుండవలెను. 


సూర్యుఁడు కర్కాటక రాశియందు గాని, సింహరాశి యందు గాని ప్రవేశించియుండగా, శుక్ల పక్ష అష్టమి యందు వ్రతమును చేసి, పవిత్రమును దేవతకు అర్పణ చేయవలయును. ఈ వ్రతమును చేయనియెడల నిశ్చయముగా దోషము సంభవించును.


🌻సనత్కుమార ఉవాచ:

దేవతలకు దేవుండవగు ఓ సాంబమూర్తీ!  నీ చేత చెప్పబడిన పవిత్రము అనునది ఏవిధముగా చేయవలయునో దాని విధానమునంతయు సవిస్తరముగా చెప్పుమని సనత్కుమారుడు అడిగెను.


🌻ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి చెప్పుచున్నాడు...


బంగారము, వెండి, రాగి మొదలగువానితో సూత్రములు చేయవలయును, లేక పట్టుదారముతో చేయవలయును లేక ప్రత్తితో చేయవలయును లేక దర్భరెల్లుతోనైనా చేయవలయును. బంగారము మొదలగు లోహములతో చేయని పక్షమునందు ప్రత్తితో చేయుట మంచిది, ప్రత్తితో జేయని పక్షమునందు బ్రాహ్మణునిచే దారము తీయించి, ఆ దారమును మూడు మడుపులు మడచి, ఆ మడచిన దారమును తిరిగి మూడు ముడుపులు మడువవలయును. ఇట్లు పవిత్రమునకు ఉపయోగించు దారము మొదటగా (360) మూడువందల ఆరువది బెత్తల పొడుగు గలిగియుండుట ముఖ్యము. (270) రెండు వందల డెబ్బది బెత్తల పొడుగు కలిగి యుండుట,  రెండవ పక్షం, నూటయెనుబది బెత్తల పొడుగు గలిగియుండుట మూడవపక్షము, కాఁబట్టి తన శక్తిననుసరించి చేయవలయును.


ఆ పవిత్రమునకు నూరు ముడులుండుట ముఖ్యము. యాభై ముడులుండుట మధ్యమము. ముప్పదియారు ముడులుండుట కనీసము. నాలుగు వేదములను, షడంగ విద్యలచే హెచ్చింపగా ఇరువది నాలుగు సంఖ్యగా అవి యగును, లేక రెండు పండ్రెండ్లు యిరువది నాలుగు యగును కాఁబట్టి అటువంటి యిరువది నాలుగు ముడులు గాని పండ్రెండు ముడులుగాని యెనిమిది ముడులు గాని పవిత్రమునకు ఉండునట్లు చేయవలయును. లేక, మఱియొక పక్షమున నూటయెనిమిది ముడులు ముఖ్యము, యాభై నాలుగు మధ్యమము, యిరువదియేడు కనీసము.


ఇక పవిత్ర ప్రమాణమెంత అనగా... శిరస్సు మొదలు నాభి వరకు ఉండునంత పొడవు గలది, హీనము, తొడలు వరకు నుండునటువంటి పొడవు మధ్యమము, మోకాళ్ల వరకు నుండునటువంటి పొడవుగలది ఉత్తమము. ఇటువంటి ప్రమాణము ముడివేసిన పిమ్మట ఉండవలెను.


శ్రేయస్కరములగు ఆ పవిత్రములకు వేయబడిన ముడులనన్నింటిని కుంకుమచే అలంకరింప చేసి, శోభస్కరమగు ఆ మండపమున దేవతకు ముందుభాగమున ఉంచవలయును. అది ఏవిధముగా అనగా, ఆ పవిత్రములను ఒక కలశమునందుంచి,  ఆ కలశమును వేరు పాత్రయందు ఉంచవలయును. మొదట మూడు ఆవృత్తులుగా ఉండు సూత్రము నందు బ్రహ్మ విష్ణు రుద్రులను ఆవాహనము చేయవలయును. తొమ్మిది ఆవృత్తులు కలుగు దానియందు... 


1. ఓంకారము

2. చంద్రుఁడు

3. అగ్ని

4. బ్రహ్మ

5. ఆదిశేషువు

6. చంద్రుడు

7. సూర్యుడు

8. ఈశానుడు

9. విశ్వేదేవతలు


ఈ తొమ్మండుగురు అధిదేవతలను తొమ్మిది పోగులందు ఆవాహనము జేయవలెను.


ఇకముందు పవిత్రమునకు వేయఁబడిన ముడులయందు ఆవాహనము చేయతగిన దేవతలను చెప్పెదను వినుము…


"క్రియా, పౌరుషీ, వీరా, విజయా, అపరాజితా, మనోన్మనీ, జయా, భద్రా, ముక్తిః, ఈశా" 


ఈ చెప్పఁబడిన దేవతలను ఆవాహనము చేయవలయును. ఈ నామములకు మొదట 'ఓం' కారమును, చివర 'నమః' పదమును చేర్చవలయును. ఆది ఏవిధముగా అనగా..


1. ఓం క్రియాయైనమః

2. ఓం పౌరు ష్యైనమః

3. ఓం వీరాయైనమః

4. ఓం విజయాయైనమః

5. ఓం అపరాజితాయైనమః

6. ఓం మనోన్మన్యైనమః 

7. ఓం జయాయైనమః

8. ఓం భద్రాయైనమః

9. ఓం ముక్యైనమః

10. ఓం ఈశాయైనమః


ఈ ప్రకారం నామములు పదింటిని యుచ్చరింపుచు, పదిముడులు అయిన పిమ్మట తిరిగి 'క్రియా' మొదలగు నామములనే చెప్పుచు ఆ పవిత్రమునకు ఉండు ముడులను అనుసరించి ఆవృత్తిగా చెప్పవలయును.


ఓ మునీశ్వరా! పవిత్రారోపణము గుఱించి చెప్పితిని. ఇకముందు పాడ్యమి మొదలు పౌర్ణమి వఱకు పదునైదును, అమావాస్యతో కూడా పదునారు తిథుల యందు ఆవాహనము చేయతగిన దేవతలను చెప్పెదను వినుము. కుబేరుడు, లక్ష్మీ, గౌరి, వినాయకుడు, సోముడు, బృహస్పతి, సూర్యుఁడు, చండిక, అంబ, వాసుకి, సప్తఋషులు, విష్ణువు, అనంతుడు, శివుడు, బ్రహ్మ, పితృదేవతులు, ఈ పదియారు అధిదేవతలను పాడ్యమి మొదలుగా, ఆయా తిధులయందు, ఆయా దేవతలను ఆవాహనము చేసి, పూజింపవలయును. పవిత్రమును అర్పణచేయుట ముఖ్య దేవతకే చేయవలయును. ఇతర దేవతలకు అర్పించు పవిత్రమునకు మూడు పోగులు గలదిగా ఏర్పరచవలయును.


🌻ఈశ్వర ఉవాచ

సాంబమూర్తి చెప్పుచున్నాడు...

ఓ మునీశ్వరా! యిక ముందు నవమి యందు చేయతగిన వ్రతమును చెప్పెదను వినుము..


శ్రావణమాసములో రెండుపక్షముల నవముల యందును 'కుమారీ' అను పేరుచే జెప్పబడు దుర్గాదేవిని యధావిధిగా పూజించి, నక్త వ్రతము చేయుచు, రాత్రివరకు ఉండి, పాలును గాని, తేనెను గాని భక్షించి యుండవలయును, లేక ఏమియు భక్షింపక నిరాహారుడుగానైనా ఉండవలయును.  రెండు నవములయందు దు గాక' ౯ దేవిని కుమారియను నామముచే నావాహనము చేసి పూజింప వలయును.


పాపములను హరింపచేయునట్టి దుర్గాదేవి యొక్క ప్రతిమను వెండితో చేయించి, ఈ ప్రతిమను గన్నేరు పువ్వులతోను, అగరు మొదలగు సుగంధద్రవ్యములు కలసిన మంచి గంథముతోను, పది విధములగు సుగంధద్రవ్యములు గల ధూపముతోను, కుసుములతోను, పూజింపవలయును. అనంతరము పెండ్లి కాని కన్యకకు భోజనము పెట్టి, పిమ్మట బ్రాహ్మణులు సువాసినీ స్త్రీలను భుజింపచేయవలెను.


అనంతరము తాను ఇతర సంభాషణలను ఏమియు చేయక, మౌనము గలవాడై మారేడుదళములను భక్షించియుండవలయును. ఈ ప్రకారము మిక్కిలి శ్రద్ధ గలవాడై యెవడు దుర్గాదేవిని పూజించునో అటువంటి వాడు సమస్తమైనవారికి గురువగు భగవంతుడు ఉండే ఉత్కృష్టస్థానమునకేగును. కాఁబట్టి, బ్రహ్మమానసపుత్రుడవగు ఓ సనత్కుమార మునీశ్వరా! సమస్త పాపములను పోగొట్టునదియు, మనుష్యులకు సమస్త సంపత్తులను ఇచ్చునదియు, పుత్రులు పౌత్రులు కలిగించునదియు, చివరకు మోక్షమునొసగునదియు అగు ఈ నవమీ వ్రతసంబంధమగు కృత్యమునంతయును నీకు సవిస్తరముగా చెప్పితినని సాంబమూర్తి, సనత్కుమార మునీశ్వరునితో జెప్పెను.


♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే - "అష్టమ్యాం దేవీ పవిత్రారోపణ" వ్రత కథనం నామ సప్తదశోధ్యాయస్సమాప్తః.        


ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏


🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow