🍃🌷ద్వావింశోధ్యాయము - చతుర్థ్యాం సంకష్టహరణ వ్రత కథనం:
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻ఈశ్వర ఉవాచ:
ఓ మునీశ్వరుఁడా! శ్రావణ బహుళ చవితి యందు సమస్త కోరికలను ఒసగునట్టి "సంకష్టహరణము" అను వ్రతము కలదు, అని సాంబమూర్తి చెప్పెను...
🌻సనత్కుమార ఉవాచ:
ఓ భగవంతుఁడా ! ఈ సంకష్ట హరణ వ్రతము ఏ ప్రకారము చేయవలయునో, ఏఏ వస్తువులు కావలయునో, ఏ ప్రకారముగా పూజించవలెనో, ఉద్యాపనను ఎప్పుడు చేయవలయునో...ఇది అంతయు సవివరముగా జెప్పుమని సనత్కుమారుడు సాంబమూర్తిని తిరిగి ప్రశ్నచేసి అడిగెను.
🌻ఈశ్వర ఉవాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు...
ఓ మునీశ్వరా! శ్రావణం బహుళ చవితి యందు ఉదయంబున లేచి దంతధావనాది కృత్యములను దీర్చి, స్నానము చేసి, పరిశుద్ధుడై, ఓ స్వామీ! ఈ దినంబున పుణ్యప్రదమైనదియు, శ్రేయస్కరమగు సంకష్టహరణ వ్రతమును చేసెదను. చంద్రోదయమగు పర్యంతము నిరాహారుడనై, నిన్ను పూజించి, పిమ్మట భుజించెదను. కావున నన్ను కష్టముల నుండి తొలగింపుము.
ఓ బ్రహ్మపుత్రుడా! యీ ప్రకారము ప్రాతఃకాలంబున సంకల్పమును చేసి, నల్ల నువ్వుల నూనెతో అభ్యంగనముచే స్నానము చేసి, సంధ్యావందనము, అగ్ని హోత్రము, వైశ్వదేవము మొదలగు పగటి కృత్యములు నెరవేర్చి పిమ్మట వినాయకుని పూజింపవలయును.
వ్రతమును చేయదలచినవాడు జ్ఞానసంపన్నుడై, పదిహేను గురువింద గింజల బరువు గల బంగారముతో గాని, దానిలో సగము గాని, మూడవవంతు బంగారముతోగాని, లేక తన శక్తిననుసరించి బంగారపు ప్రతిమను చేయించవలెను. బంగారము లేనప్పుడు, వెండితోగాని, రాగితో గాని, చేయించవలెను, అంతకును శక్తిలేక దరిద్రుడుగా ఉండువాడు మట్టితోనైనను చేయవలెను. తనశక్తికొలది చేయవలయును గాని, శక్తి కలిగిన యెడల, లోపము చేయకూడదు అలా చేసిన యెడల తాను చేసిన కార్యము వ్యర్ధమగును. కావున, ప్రారంభమున అష్టదళములు గల మనోహరమగు పద్మాకారమును ఏర్పరచి, ఉదకముతో నిండింపబడిన పూర్ణకలశమును ఉంచి, దానియందు ఆ ప్రతిమను ఉంచి, వేదోక్తమంత్రములచే షోడశోపచారములతో వినాయకుని పూజింపవలెను.
ఓ బ్రాహ్మణుఁడా! నువ్వులతో గూడినవియు శ్రేష్ఠంబగు పది కుడుములను చేసి, అయిదు కుడుములను స్వామికి నివేదన చేసి అయిదు కుడుములను బ్రాహ్మ ణునకు వాయనమియ్యవలెను.
భక్తికలవాడై, ఆ బ్రాహ్మణుని దేవతతో సమామనిగా దలచి, పూజించి, తన శక్తికొలదియు దక్షిణనిచ్చి, పిమ్మట ఈ విధముగా ప్రార్ధింపవలెను.
ఓ బ్రాహ్మణోత్తమా! నీకు నమస్కారము చేసెదను. ఓ స్వామీ! పండ్లతోను దక్షిణతోను గూడిన అయిదు కుడుములను నీకు దానమిచ్చుచున్నాను, ఆవి గ్రహించినవాడవై ఆపత్తుల వలన నన్ను తరింపచేయుము, ద్రవ్యము లేనివాడనై యిట్టి వ్రతమును చేయుచుంటిని కావున, బ్రాహ్మణ స్వరూపమును ధరించిన ఓ వినాయకుడా! దానినంతయు సంపూర్ణమగునట్లు చేయుము. అని ప్రార్థించి, పిమ్మట రుచిగల పదార్ధములతో బ్రాహ్మణులకు భోజనం పెట్టవలెను.
అనంతరము చంద్రునకు అర్ఘ్యమియ్యవలెను. ఆ మంత్రమును సవివరముగా వినుము. పాలసముద్రమునందు పుట్టినవాడవును, అమృత స్వరూపుడవగు ఓ చంద్రుడా! నేను ఇచ్చునటువంటి అర్ఘ్యమును గ్రహింపుము. సంతోషముతో నన్ను వృద్ధిపొందింపుము అని చెప్పి అర్ఘ్యమియ్యవలెను. ఈ ప్రకారము చేసిన యెడల గణాధిపతి సంతోషించినవాడై, కోరిన సమస్త కోరికలను ఒసగును, కావున, ఈ సంకష్ట హరణ వ్రతమును ఆచరించవలయును.
విద్యను కోరినవాడు విద్యను, ధనమును కోరినవాడు ధనమును పుత్రులను కోరినవాడు పుత్రులను, మోక్షమును కోరినవాడు మోక్షమును, కార్యములను కోరినవాడు కార్యములను పొందును. రోగము కలవాడు ఆరోగ్యం కలవాడగును. ఆపత్తులతో గూడుకొనిన వారియొక్కయు, మనోవ్యాకులము గల వారి యొక్కయు, చింతతో గూడిన వారియొక్కయు స్నేహితుల వియోగము గలవారి యొక్కయు, సమస్త కష్టములను తొలగించునదియు సమస్త కోరికలనిచ్చునదియును, పుత్రులను పౌత్రులను కలిగించునదియు మమష్యులకు సమస్త సంపత్తులు ఒసగునటువంటి ఈ వ్రతమును ముఖ్యముగా చేయవలయును. పూజచేయనప్పుడును, జపము చేయునప్పుడును, ఉపయోగించవలసిన మంత్రమును చెప్పెదను వినుము. *ఓంనమో భగవతే హేరంబాయ మదమోదితాయ నమస్వాహా* అను ఇరువది యొక్క అక్షరములు గల మంత్రమును పఠించిన యెడల సమస్త కష్టములును తొలగి పోవును.
ఇంద్రుఁడు మొదలగు అష్టదిక్పాలకులను అందరిని పూజింపవలెను. మఱియు ఇంకొక విషయము గలదు. అది కుడుముల సంబంధమైనది దానిని నీకు చెప్పెదను వినుము.
పక్వమగు నువ్వులు, కొబ్బరి, బెల్లము కలిపి, అది పూర్ణముగా లోపల పెట్టి, పైన గోధుమపిండితో కప్పుగా ఉండునట్లుజేసి, నేతితో వండి, అవి వినాయకునకు నివేదన చేయవలెను.
అనంతరము గరిక చిగుళ్ల తో ముందు చెప్పబోయెడు ఈ గణాధిపతి నామములను స్మరింపుచు వేరువేరుగా గణనాధుని పూజింపవలయును..
గణాధిపనమస్తేస్తు ఉమాపుత్రాఘనాశన
ఏకదంతేభవక్త్రేతి తధా మూషకవాహన
వినాయ కేశవుత్రేతి సర్వసిద్ధిప్రదాయక
విఘ్న రాజస్కందగురో సర్వసంకష్టనాశన
లంబోధరగణాధ్యక్ష గౌర్యంగమలసంభవః
ధూమ్రకేతో బాలచంద్ర సిందూరాసురమర్దన
విద్యావిధానవికట శూర్పకర్ణైతి చైవహి
పూజయేద్గణపంచైవ మేకవింశతినామభిః
గణాధిప, ఉమాపుత్ర, ఆఘనాశన, ఏకదంత, ఇభవక్త్ర, మూషకవాహన, వినాయక, ఈశపుత్ర, సర్వసిద్ధి ప్రదాయక, విఘ్నరాజ, స్కందగురో, సర్వసంకష్టనాశన, లంబోదర, గణాధ్యక్ష, గౌర్యంగమల సంభవ, ధూమ్రకేతో, బాలచంద్ర, సిందూర, అసురమర్దన, విద్యా విధాన, వికట, శూర్పకర్ణ….నీకు నమస్కారము.
అని చెప్పి యీ యిరువదియొక్క నామముల చేతను వినాయకుని పూజింప వలయును.
అనంతరము దేవతను నిర్మలమగు బుద్ధి కలవాడగుచు, భక్తి కలవాడై ప్రార్ధించవలయును. ఓ విఘ్నరాజా! నీకు నమస్కారము చేసెదను. ఉమాపుత్ర, ఆఘనాశన, దేనిని గుఱించి నా శక్తికొలదియు పూజించితినో, అటువంటి నా పూజచే గణాధిపతి సంతోషించినవాడై, నా మనస్సు యందుండెడి సర్వ కోరికలనిచ్చి, నా మనోరథము సఫలము చేయు గాక! నా సంబంధమగు అనేకవిధములైన విఘ్నములను నశింపుచేయుము. నీ అనుగ్రహముచే సమస్త కార్యములను చేయుగలవాడనైతి.
ఓ వినాయకా! నా శత్రువులను నశింపఁజేసి, మిత్రులను వృద్ధి చేయుము. అని ప్ర్రార్ధించి, పిమ్మట నూటయెనిమిది పర్యాయములు హోమం చేయవలెను.
వినాయకుడు ప్రీతినొందుట కొఱకును, వ్రతము పూర్తినొందుట కొఱకును, బ్రాహ్మణునకు నేను వాయనము ఇచ్చుచున్నానని, ఏడు లడ్డూలను గాని, బూరెలనుగాని, ఫలములతోగూడ బ్రాహ్మణునకు వాయనమిచ్చి పిమ్మట పుణ్యప్రదమైన కధను విని, ఓ మునీశ్వరుఁడా! ఈ ముందు చెప్పబోవు దానిచే చంద్రునకు ఐదు పర్యాయములు అర్ఘ్యమియ్యవలయును. అది యేవిధముగాననగా, పాలసముద్రము నందు జన్మించిన వాడవును, అత్రిమహాముని వంశమునందు జన్మించిన వాడవునగు ఓ చంద్రుడా! నీ భార్యయగు రోహిణీదేవితో గూడినవాడవై నేను ఇచ్చునటువంటి అర్ఘ్యమును గ్రహింపుమని చెప్పి అర్ఘ్యం విడువవలెను.
అనంతరము, భగవంతుని క్షమార్పణ గోరి, పిమ్మట తన శక్తికొలదియు బ్రాహ్మణులకు భోజనము పెట్టి, మిగిలిన పదార్ధమును బ్రాహ్మణుల వలన అనుజ్ఞ గొని తాను భుజింపవలెను.
మౌనము కలవాడై ఏడు కబళములను భుజింపవలయును. అందువలన, దృఢముగా నుండువాడు కాకుండెనేని తన ఇష్ట ప్రకారము భుజింపవలెను. ఈ ప్రకారము మూడు మాసములు గాని, నాలుగు మాసములు గాని యధావిధిగా వ్రతమును చేయవలయును.
విద్వాంసుడు ఈ ప్రకారము వ్రతమాచరించి, అయిదవ మాసములో ఉద్యాపనము చేయవలయును. అందునిమిత్తమై తన శక్తికొలదియు బంగారపు వినాయక ప్రతిమను చేయించవలయును.
అనంతరము పూజించువాడు, భక్తికలవాడగుచు, పరిమళించుచున్న మంచిగంధముతోను, శుభప్రదములగు అనేక విధములగు పువ్వులతోను పూర్వము చెప్పబడిన ప్రకారముగా పూజచేయవలయును.
స్వస్తచిత్తుడై కొబ్బరిజలముతో అర్ఘ్యము ఇవ్వవలయును. అనంతరం చేటలు, పరమాన్నము ఫలములు మొదలగు వానితోగూడ యెఱ్ఱని వస్త్రముతో జుట్బబడిన బంగారపు వినాయక ప్రతిమను దక్షిణ సహితముగా భక్తుడగు బ్రాహ్మణునకు వాయన మియ్యవలయును.
వ్రతము సంపూర్తినొందుటకు, తూమెడు నువ్వులను దనమియ్యవలయును. అనంతరము విఘ్నేశ్వరుడు సంతోషించుగాక యని క్షమార్పణగోరవలెను.
ఈ ప్రకారము ఉద్యాపనము చేసిన యెడల అశ్వమేధయాగము చేసిన ఫలము నొందును. మఱియు మనస్సున కోరబడిన సమస్త కార్యములు సుఫలమగును.
పూర్వకల్పంబున నేను చెప్పగా కుమారస్వామియు పార్వతీదేవియు నాలుగు మాసములు చేసిరి. యిట్లు పార్వతియు, కుమారస్వామియు చేయగా చూచి, అగస్త్యుడు సముద్రపానము చేయదలచినప్పుడు అయిదవ మాసమునందు ప్రారంభించినవాడై మూడు మాసములు చేయగా విఘ్నేశ్వరుని అనుగ్రహము కలవాడై సిద్ధి పొందెను. దమయంతి నలమహారాజును వెతుకునప్పుడు ఈ వ్రతం ఆరంభించి, ఆరు మాసములు చేయగా, విఘ్నేశ్వరుని అనుగ్రహం వలన తిరిగి భర్తను పొందెను.
అనిరుద్ధుని - చిత్రలేఖ, బాణాసురుని పట్టణమునకు తీసికొని వెళ్లినప్పుడు, తండ్రియగు మన్మధుడు - నా కుమారుని యెవరు తీసుకొని వెళ్లిరో, యెక్కడికి వెళ్లిరో అని విచారపడుచుండగా మన్మధుని తల్లియగు రుక్మిణీదేవి కుమారునితో ఇట్లు చెప్పుచున్నది.
ఓ పుత్రకా! నేను చేసిన వ్రత ప్రభావమును చెప్పెదను వినుము. నా గృహంబువ నీవు జన్మించినప్పుడు శంబరాసురుడు వచ్చి నిన్ను, బాలుడవైయుం డగా ఎత్తుకొనిపోయెను, అప్పుడు నీ వియోగముచే దుఃఖము వలన నా మనస్సు భేదింపబడెను. మిక్కిలి సుందరుడగు నా కుమారుని యొక్క ముఖమును ఎప్పుడు చూచెదనా.. యని విచారపడితిని.
ఇతర స్త్రీల యొక్క పుత్రులను జూడగా, వయస్సు చేతను గానీ, శరీర సౌందర్యము చేతనుగాని, నా కుమారుడు ఈ విధముగానే యుండునని నా మనస్సు పరితాపబడుచుండెను. ఇట్లు కొన్ని సంవత్సరములు వెళ్లగా, కొంతకాలమునకు దైవయోగము వలన నావద్దకు రోమశ మహాముని వచ్చెను. సమస్తచింతలను పోగొట్టునట్టి సంకష్ట చతుర్థీ వ్రతమును ఆ రోమశ మునీశ్వరుడు నాకు చెప్పగా నేను నాలుగు పర్యాయములు యధావిధిగా చేసితిని.
అప్పుడు వినాయకుని అనుగ్రహము వలన, యుద్ధమునందు శంబరాసురుని నీవు సంహరించినవాడవై తిరిగి మన గృహమునకు వచ్చితివి, కావున, నీవును ఈ వ్రతవిధానము తెలిసికొనిన వాడవై, చేసినయెడల నీ కుమారుడు యెక్కడ ఉన్నదియు నీవు తెలిసికొనగలవు.
యిట్లు, రుక్మిణీదేవి చెప్పగా, మన్మధుడు వినాయకునకు ప్రీతికరమగు సంకష్ట చతుర్థీ వ్రతము చేసెను. అప్పుడా వ్రత మహిమ వలన, నారదుడు వచ్చి బాణాసుర పట్టణము నందు అనిరుద్ధుండు కలడని చెప్పగా, మన్మధుడు బాణాసుర పట్టణమునకు వెళ్లి, ఆ బాణాసురునితోను, వానికి సహాయకారియైన సాంబమూర్తితో ఘోరమగు యుద్ధము చేసి, వారిని జయించి, కోడలితో సహితముగా అనిరుద్ధుని తీసుకొని వచ్చెను. మఱియు, ఓ మునీశ్వరుడా! ఇతరులగు దేవతలు రాక్షసులు మొదలగువారు విఘ్నేశ్వరుని ప్రీతికొఱకు పూర్వము ఈ వ్రతము చేసిరి.
కావున, దీనితో సమానమగునదియు, సమస్త కార్యసిద్ధులను చేయునట్టి వ్రతము మఱియొకటిలేదు. తపస్సు గాని, దానము గాని, తీర్థము గాని దీనితో సమానమగునది లేదు.
దీని మహిమను గుఱించి విశేషముగా చెప్పనవసరము లేదు. కార్యసిద్ధిని చేయునట్టిది మఱియొకటిలేదు. కావున, భక్తి లేనివానికిని, భగవంతుడు లేడనువానికిని, మూర్ఖునకును, ఈ వ్రతమును ఉపదేశింపగూడదు. కుమారునకును, శిష్యునకును శ్రద్ధ కలవానికిని, సత్పురుషునకు ఉపదేశింపవలయును.
బ్రహ్మ కుమారుడవగు ఓ మునీశ్వరుడా! నాకు ప్రియమగువాడవును, లోకములకు ఉపకారమగు కార్యములను చేయువాడవు కావున, ఈ వ్రతమును నీకు ఉపదేశించితినని సాంబమూర్తి సనత్కుమారునితో చెప్పెను.
♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే -- "చతుర్థ్యాం సంకష్టహరణ వ్రత" కథనం నామ ద్వావింశోధ్యాయస్సమాప్తః.
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏
🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿
