🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉
🍃🌷శ్రావణ అమావాస్య - పిఠోరవ్రతం:
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
శ్రావణ అమావాస్యనాడు సకల సంపదలనూ ప్రసాదించే ఉత్తమమైన 'పిఠోరవ్రతం' ఆచరించాలి. అన్ని వస్తువులను, కుటుంబసభ్యులను తనలో ఉంచుకోవడం వల్ల ఇళ్ళు పీఠంగా చెప్పబడింది. వస్తువులన్నిటి సమూహాన్ని ‘ఆర ‘ అంటారు. అందువల్ల దీని పేరు 'పిఠోర' వ్రతం.
ఇంటిగోడకు రాగిరంగు లేదా నలుపు లేదా తెలుపురంగును లేపనం చేసి అనగా రాగిరంగుతోపాటు పసుపురంగు, నలుపుతో పాటుగా తెలుపు రంగు లేదా తెలుపు - పసుపు కలిపిన రంగులు వేసి అనేక రకముల చిత్రాలను లిఖించి ఇంటిమధ్యలో పార్వతీపరమేశ్వరుల మూర్తిని లేదా శివలింగాన్ని పెట్టాలి.
ఇంటికి పావువంతు భాగంలో వంటగది, పూజగది, పడకగది, అటకలు, అంతఃపురం, అందమైన చెట్లు, మారేడు, తులసి, సున్నం మొదలైనవాటితో గట్టిగా కట్టబడిన రాళ్ళు, ఇటుకలతో అలంకరించి, చక్కని తలుపులు, ఆటస్థలం మొదలైనవన్నీ చిత్రించాలి.
అంతే కాక ఆవులు, గేదెలు, ఒంటెలు, రథాలు, బండ్లు, స్త్రీలు, పిల్లలు, ముసలివాళ్ళు, యువకులు, పల్లకీలు, ఊయల, మరియు అనేకరకాలైన వేదికలు మొదలైనవన్నీ చిత్రించాలి. బంగారం, వెండి, రాగి, సీసం, ఇనుము, మట్టి, ఇత్తడి మొదలైన అనేక రంగుల పాత్రలను, మంచాలను చిత్రించాలి.
మైనా మొదలైన శుభంకరమైన పక్షులను, పిల్లిని, స్త్రీపురుషులు ధరించే అనేక ఆభరణాలను, దుస్తులను, యాగానికి ఉపయోగించే పాత్రలను, రెండు స్తంభాలను, పాలు, పెరుగు, నూనె, వెన్న, గోధుమలు, బార్లీ, మొక్కజొన్న, పప్పుదినుసులు, నువ్వులు, రుబ్బురోలు, పొత్రం, రోకలి, చీపురు, విసనకర్ర, చెప్పులు, గొడుగు, వివిధ ఆయుధాలు, పుస్తకం, పెన్ను, పువ్వులు, పండ్లు, అనేకరకాల ఆకులు, దీపాలు, కూరగాయలు, వివిధ వంటకాలు, ఇక్కడ ప్రస్తావించినవే కాక ఇంటికి అవసరమైనవన్నీ చిత్రించి, పార్వతీపరమేశ్వరులతో కలిపి అన్నిటికీ షోడశోపచారాలతో పూజించి, గంధం, పువ్వులు, ధూపం సమర్పించి బ్రాహ్మణులకు, పిల్లలకు, సువాసినులకు భోజనం పెట్టాలి.
తరువాత పార్వతీసహిత పరమేశ్వరుని ఇలా ప్రార్థించాలి…
శివ సాంబ దయాసిన్దో గిరీశ శశిశేఖర l
వ్రతేనానేన సన్తుష్టః ప్రయచ్ఛాస్మాన్ మనోరథాన్ ll
ఈ విధంగా అయిదు సంవత్సరాలు చేసి, ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపనలో మారేడుదళాలతో శివమంత్రంతో ఆహుతులు సమర్పిస్తూ హోమం చెయ్యాలి. దీనికంటే ముందుగా గ్రహహోమం చెయ్యాలి. ఆహుతుల సంఖ్య వెయ్యిఎనిమిది లేదా నూటా యెనిమిది ఉండాలి. గురువులను, బ్రాహ్మణులను గౌరవించి శక్తివంచన లేకుండా దక్షిణను సమర్పించాలి. తరువాత బంధుమిత్రులతో కలిసి భోజనం చెయ్యాలి.
ఇలా వ్రతం ఆచరించిన మానవులు అన్ని కోరికలు తీరినవారై, ఇహలోకంలో కావలసిన అన్నిటినీ పొందుతారు. అభీష్టాలు నెరవేర్చడానికి దీనికి మించిన వ్రతం లేదు. గోడలపై ఏ ఏ చిత్రాలను లిఖించి ఇలా పూజిస్తారో వాటన్నిటినీ తప్పకుండా పొందుతారు అనడలో సందేహం లేదు.
♦️శ్రీ స్కాందపురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాదరూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమందు ఇరువది అయిదవ అధ్యాయము సమాప్తము.
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏
🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿
