27. శ్రావణమాస మహాత్మ్యము - 27వ అధ్యాయం - Sravana Masam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

27. శ్రావణమాస మహాత్మ్యము - 27వ అధ్యాయం - Sravana Masam

P Madhav Kumar

🍃🌷శ్రావణ అమావాస్య సంక్రమణ వ్రతం:

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll   


🌻ఈశ్వరుడు చెప్తున్నాడు:

శ్రావణమాసంలో కర్కాటక లేదా సింహసంక్రమణాలు వచ్చినపుడు చెయ్యాల్సిన విధుల గురించి తెలియజేస్తున్నను.


కర్కాటక సింహసంక్రమణాల మధ్యకాలంలో నదులు రజస్వలలుగా చెప్పబడతాయి. కాబట్టి సముద్రానికి సరాసరిగా వెళ్ళే నదులందు తప్ప మిగతా నదులలో ఆ సమయంలో స్నానం చెయ్యరాదు. కొందరు ఋషులు చెప్పినదాని ప్రకారం ఆగస్త్య నక్షత్రం ఉదయించినంతవరకు ఈ రజస్వలా నియమం నదులకు వర్తిస్తుంది.


కొన్ని నదులు గ్రీష్మఋతువులో వేడిమికి ఎండిపోయి, వర్షా కాలంలో నిండడం ప్రారంభిస్తాయి. అలాంటి నదులలో వర్షాకాలం వచ్చిన తరువాత పదిరోజులు స్నానం చెయ్యకూడదు. ఏ నదుల గమనం ఎనిమిది వేల ధనుస్సుల పరిమాణానికి తగ్గకుండా ఉంటుందో వాటినే నదులు అనాలి (1 ధనుస్సు = 6 అడుగులు). ఆ పరిమాణం లేనివాటిని గెడ్డలు అంటారు. కర్కాటక సంక్రమణం ప్రారంభం అయ్యాక మొదటి మూడురోజులు మహానదులు రజస్వలగా అవుతాయి. స్త్రీల వలె నాలుగవ రోజున అవి శుద్ధమవుతాయి..


గోదావరి, భీమరథి, తుంగభద్ర, వేణిక, తాపి, పయోష్టి ఈ ఆరు వింధ్యకు దక్షిణాన ఉంటాయి. భాగీరథి, నర్మద, యమున, సరస్వతి, విశోక, వితస్త ఈ ఆరు నదులు వింధ్యకు ఉత్తరభాగంలో ఉంటాయి. ఈ పన్నెండు మహానదులు దేవ, ఋషుల ప్రాంతంలో ఉద్భవించినవి. దేవిక, కావేరి, వంజరా, కృష్ణ - ఈ మహానదు లన్నిటికీ కర్కాటక సంక్రమణం ప్రారంభమయ్యాక ఒక్కరోజు మాత్రమే రజస్వలా దోషం వర్తిస్తుంది. గౌతమీ నదికి మూడురోజుల కాలం ఈ దోషం వర్తిస్తుంది.


చంద్రభాగ, సతీ, సింధు, సరయూ, నర్మద, గంగ, యమున, ప్లక్షజాల, సరస్వతి - ఇవి నదములుగా చెప్పబడడం వల్ల వీటికి రజస్వలాదోషం వర్తించదు. శోణ, సింధు, హిరణ్య, కోకిల, ఆహిత, ఘర్ఘర, శతద్రు - ఈ ఏడు నదులు ఎప్పుడూ పవిత్రమైనవే. ధర్మద్రవమయి అయిన గంగ, పవిత్రమైన యమున, సరస్వతి గుప్తరజోదోషం కలిగినవి మాత్రమే కాబట్టి ఇవి ఎల్లప్పుడూ నిర్మలమైనవే. ఈ రజోదోషం కేవలం నదులకే తప్ప నదీతీరాలలో ఉండేవారికి మాత్రం వర్తించదు. రజోదోషంతో దూషితమైన నదీజలాలు కూడా గంగాజలంతో కలిపితే పవిత్రమైపోతాయి. మేక, గోవులు, గేదెలు, స్త్రీలు, వర్షం వల్ల భూమిని చేరిన క్రొత్తనీరు - ఇవి పదిరాత్రులు గడచినంతనే శుద్ధిని పొందుతాయి.


నూతులు, బావులు లేని ప్రదేశాలలో మాత్రం నదీజలాలు అమృతతుల్యములే. అటువంటప్పుడు గ్రామానికి అవసరమైన నదీజలాలకు రజోదోషం వర్తించదు. మరొకరి చేత మోసుకుని తేబడిన నీటికి కూడా రజోదోషం వర్తించదు.


ఉపాకర్మ, ఉత్సర్గ కర్మ, ప్రాతఃకాల స్నానం, ఆపదలు కలిగినప్పుడు, సూర్య - చంద్ర గ్రహణ కాలాలలో రజోదోషం వర్తించదు.


🌷గోశాంతి విషయాలు:


సింహసంక్రమణ సమయంలో ఆవు ప్రసవిస్తే, ఆ ఆవుకు ఆరు నెలలలో మృత్యువు వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి దానికి పరిహారంగా శాంతికర్మ జరపాలి. ఆలస్యం కాకుండా ప్రసవించిన గోవును బ్రాహ్మణునకు అదే సమయంలో దానం ఇవ్వాలి. నల్లనువ్వులతో హోమం చెయ్యాలి. తరువాత నేతిలో కలిపిన నల్లనువ్వులతో వెయ్యీయెనిమిది ఆహుతులను వెయ్యాలి. 


ఆ రోజంతా ఉపవాసం ఉండి బ్రాహ్మణునకు శక్తికొలదిగా దక్షిణ సమర్పించాలి. సింహసంక్రమణ సమయంలో గోశాలలో గోవు ప్రసవిస్తే, అనిష్టపరిహారానికి శాంతికర్మ చెయ్యాలి. ‘అస్య వామం' అనే సూక్తంతోను, 'తద్విష్ణోః' అనే మంత్రంతోను నేతిలో కలిపిన నువ్వులతో నూటాయెనిమిది ఆహుతులతోను, మృత్యుంజయ మంత్రంతో వెయ్యి ఆహుతుల తోను హోమం చెయ్యాలి. తరువాత శ్రీసూక్తం లేదా శాంతిసూక్తమంత్రాలతో స్నానం చెయ్యాలి. ఈ విధంగా చెయ్యడం వల్ల అనిష్ట పరిహారం జరుగుతుంది.


🌷దానాల వివరాలు:


కర్కాటక సంక్రమణ సమయంలో మృతదేను దానం అనే కర్మను ఆచరించాలి. సింహసంక్రమణంలో గొడుగుతో పాటు బంగారం కూడా దానం చెయ్యడం శ్రేష్ఠం. శ్రావణ మాసంలో వస్త్రదానం అత్యంత శ్రేష్ఠఫలాన్నిస్తుంది.


భగవంతుడైన శ్రీధరుని ప్రసన్నతకై శ్రావణమాసంలో నెయ్యి, నేతిపాత్ర, పండ్లు వేద బ్రాహ్మణునకు దానం చెయ్యాలి. నా (శివుని) ప్రీతి కొరకు శ్రావణమాసంలో చేసే దానాలు మిగతా మాసాలలో చేసే దానాల కంటే అధికంగా అక్షయఫలితాలను కలుగజేస్తాయి. పన్నెండుమాసాలలో ఈ మాసం కంటే నాకు ప్రీతిపాత్రమైనది మరొకటి లేదు. 


శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా! అని నేను ఎదురుచూస్తుంటాను. ఈ మాసంలో వ్రతం చేసిన మానవుడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. కర్కాటక, సింహసంక్రమణాలు ఏ మాసంలో వస్తాయో అంతకంటే గొప్పదైన మాహాత్మ్యం ఏ మాసానికి ఉంటుంది?


ఎవరైతే ఈ మాసమంతా ప్రాతఃకాల స్నానం నియమ పూర్వకంగా చేస్తారో, వారు పన్నెండు మాసాలలోను ప్రాతఃస్నానం చేసిన ఫలితాన్ని పొందుతారు.


స్నానానికి సంకల్పం ఇలా చెప్పుకోవాలి - మహాదేవ! దయాసింధో! శ్రావణే మాస్యుషస్యహం, ప్రాతఃస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మే ప్రభో!


మాస మాహాత్మ్యం: స్నానం తరువాత శివుని విధివిధానాలతో పూజించి, శ్రావణమాస కథలను భక్తిశ్రద్ధలతో వినాలి. శ్రావణమాస కథల మాహాత్మ్యాన్ని వర్ణించి చెప్పడం ఎవరి తరమూ కాదు. ఈ మాసంలో చేసే వ్రత, స్నాన, కథాశ్రవణ ఫలితాల వల్ల గొడ్రాలు అయినప్పటికీ తప్పకుండా సుందరమైన పుత్రుని పొందుతుంది. 


విద్యార్థులు విద్యను, బలార్థులు బలాన్ని, ధనకాములు ధనాన్ని, భార్య కావలసిన వారు ఉత్తమభార్యను, రోగార్తులు ఆరోగ్యాన్ని పొందుతారు. బంధింపబడ్డవారు బంధవిముక్తులవుతారు. ఈ మాస వ్రతాచరణ చేసేవారికి ధర్మమునందు అనురాగం ఏర్పడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఎవరెవరు ఏవేవి కోరితే అవన్నీ పొంది, మరణానంతరం నా లోకాన్ని చేరి, నా సాన్నిధ్యంలో ఆనందాన్ని పొందుతారు.


శ్రావణమాస మాహాత్మ్య కథను చెప్పినవానిని వస్త్రభూషణాలతో గౌరవించాలి.


ఎవరైతే వక్తను సంతోషపెడతారో వారు నన్ను (శివుని) సంతోషపెట్టినట్లే. కాబట్టి

వక్తను వారి శక్త్యనుసారం గౌరవించాలి.


ఎవరైతే అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ శ్రావణమాస మాహాత్మ్యాన్ని చదువుతారో లేదా వినిపిస్తారో లేదా వింటారో వారు అనంతమైన పుణ్యఫలాన్ని పొందుతారు.


♦️శ్రీ స్కాందపురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాదరూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమందు ఇరువది ఏడవ అధ్యాయము సమాప్తము.   


ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏


🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow