🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻ఈశ్వరుడు చెప్తున్నాడు:
శ్రావణమాసంలో ఏ తిథినాడు ఏమి ఆచరించాలో చెప్పడం అయింది. ఇప్పుడు ఆ వ్రతాల పాలనకు తిథులు సమయాన్ని ఎలా నిశ్చయించుకుని ఆచరించాలో తెలియజేస్తాను.
నక్తవ్రతం ఆచరించేవారు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చెయ్యాలన్నది ప్రధాన నియమం.
వ్రతాలకు ఉద్యాపన చేసుకోవడానికి సంబంధిత తిథులలో చెయ్యడం ఉత్తమం. ఒకవేళ ఆ తిథులలో కుదరనప్పుడు పంచాంగశుద్ధి ఉండే రోజున ఆచరించాలి.
శ్రావణమాసమంతా ఉపవాస వ్రతపాలన చెయ్యాలనుకున్నవారు ముందుగా శుక్ల పాడ్యమి నాడు ఉపవాసానికి సంకల్పం చెప్పుకుని ప్రారంభించి , రెండవరోజు (విదియ) పారణ చెయ్యాలి. మరల ఆ మరుసటిరోజు ఉపవాసం ఉండి తరువాతి రోజు పారణ చెయ్యాలి. ఇలా క్రమంగా చెయ్యడం మాస ఉపవాసవ్రతం అనిపించుకుంటుంది. పారణ రోజున హవిష్యాన్నం (నేతిలో వేయించి ఉడికించిన బియ్యం) స్వీకరించడం ఉత్తమం.
ఏకాదశి తిథికి పారణ జరిగాక మునుపు చెప్పినట్లు మూడు రోజులు ఉపవాసం చెయ్యాలి.
🌻వారవ్రతాలకు సమయపాలన:
రవివారవ్రతానికి ప్రాతఃకాలమే పూజా సమయంగా భావించాలి. సోమవార వ్రతానికి సాయంకాల పూజ ప్రధానం. మంగళ , బుధ , గురువార వ్రతాలకు ప్రాతః కాలమే పూజ చెయ్యవలసినదిగా పరిగణించాలి. శుక్రవారం పూజ ఉషఃకాలం నుండి సూర్యోదయం లోపుగా ప్రారంభించి రాత్రి జాగరణ నియమం పాటించాలి. శనివారం నరసింహుని పూజ సాయంకాలం చెయ్యాలి.
శనివారం శనికి సంబంధించిన దానం మధ్యాహ్నం చెయ్యాలి. హనుమంతుని పూజకు కూడా మధ్యాహ్నసమయమే ఉత్తమం. రావిచెట్టు పూజ ప్రాతఃకాలంలో చెయ్యాలి.
🌻తిథివ్రత పాలన నియమాలు:
రోటకవ్రతం ఆచరించడానికి సోమవారం-పాడ్యమి కలిసి వస్తే, పాడ్యమి కనీసం మూడు ముహూర్తాల కాలం అయినా ఉండాలి. లేకపోతే ముందురోజు ఉన్న పాడ్యమినే గ్రహించాలి. ఔదుంబరపూజకు విదియ తిథి సాయంత్రానికి ఉండాలి. రెండురోజులు విదియ తిథి వస్తే, తదియతో కలిసి ఉన్న విదియనే గ్రహించాలి. స్వర్ణగౌరీవ్రతం చవితితో కూడిన తదియను పరిగణలోకి తీసుకుని ఆచరించాలి. గణపతివ్రతానికి తదియతో కూడిన చవితి ఉత్తమం. నాగపూజ విషయంలో షష్ఠితో కలిసిన పంచమినాడు చెయ్యడం శ్రేష్ఠం. సూపౌదనవ్రతానికి ఉదయం షష్ఠి ఉండి. సాయంకాలానికి సప్తమి ఉన్నది పాటించాలి.
శీతలావ్రతానికి మధ్యాహ్నసమయానికి సప్తమి ఉండాలి. అమ్మవారికి పవిత్రారోపణ వ్రతానికి రాత్రిసమయానికి అష్టమి ఉన్నది గ్రహించాలి. నక్త(ప్రదోష) సమయానికి నవమి ఉన్నది కుమారీవ్రతానికి ప్రశస్తమైనది. ఇదేవిధంగా ఆశాదశమి వ్రతపాలనకు కూడా నక్తసమయానికి దశమి ఉండాలి. ఏకాదశీ వ్రతపాలనకు వైష్ణవులు అరుణోదయానికి దశమివిద్ధ అయినదానిని గ్రహించాలి. స్మార్తులకు మాత్రం అరుణోదయానికి ఏకాదశి ఉన్నదే గ్రాహ్యం. రాత్రిభాగానికి చివరి ప్రహరలో సగభాగ సమయం అరుణోదయం అని చెప్పబడుతుంది (ఒక ప్రహర=సుమారు మూడుగంటలు). ద్వాదశి ఉన్నప్పుడు నారాయణుని పవిత్రారోపణవ్రతం చెయ్యాలి.
మన్మథుని పూజకు రాత్రి సమయానికి త్రయోదశి ఉండాలి. అది కూడా రెండవ యామానికి కూడా వ్యాపించనదిగా ఉంటే మరీ శ్రేష్ఠం. శివుని పవిత్రారోపణకు రాత్రి చతుర్దశి ఉన్నది గ్రహించాలి. అది కూడా అర్ధరాత్రికి ఉన్నదైతే ఉత్తమం. ఉపాకర్మ లేదా ఉత్సర్జనకు శ్రవణానక్షత్రం, పూర్ణిమ కలసి ఉన్నది మంచిది. ఒక వేల రెండవ రోజున ఉదయం మూడు ముహూర్తాలు పూర్ణిమ ఉంటే అదే స్వీకరించాలి. ఋగ్వేదులు మాత్రం ముందురోజే చెయ్యాలి. తైత్తిరీయ యజుశ్శాఖవారికి మాత్రం తరువాత రోజు మూడు ముహూర్తాలు శ్రవణంతో కూడిన పూర్ణిమ ఉన్నప్పటికీ ముందురోజే కర్మను ఆచరించాలి.
ఉపాకర్మ తరువాత చేసే దీపదానం , స(ర్ప)ర్వబలికి కూడా ఈవిధంగానే సమయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ దీపదానం, స(ర్ప)ర్వబలికి సాయంకాలానికి పూర్ణిమ ఉన్నట్లైతే అది ప్రశస్తమైనది. వారి వారి గృహ్యసూత్రాలననుసరించి ఏ సమయం ఉత్తమమైనదో ఆ సమయంలో ఆచరించవచ్చు.
హయగ్రీవజయన్తి ఉత్సవానికి మధ్యాహ్నానికి పూర్ణిమ ఉన్నది గ్రహించాలి. రక్షాబంధనానికి అపరాహకాలానికి పూర్ణిమ ఉండాలి. సంకష్టహరచతుర్థి వ్రతపాలనకు చంద్రోదయానికి చవితి ఉన్నదే గ్రాహ్యం. రెండురోజులలోను చంద్రోదయవ్యాపిని చవితి ఉంటే, ముందురోజునే వ్రతపాలన చెయ్యాలి ఎందుకంటే తదియతో కలసి ఉన్న చవితి అత్యంత పుణ్యఫలప్రదం.
గణేశ చతుర్థి, గౌరీచతుర్థి, బహుళచతుర్థి - ఈ మూడు తప్ప ఇతర దేవతల వ్రతపాలనకు పంచమితో ఉన్న చవితినే గ్రహించాలి. అర్ధరాత్రికి అష్టమి ఉన్న రోజునే కృష్ణాష్టమి జరుపుకోవాలి. పిఠోర వ్రతానికి మధ్యాహ్నానికి ఉండే అమావాస్యను గ్రహించాలి. వృషభ(పోల) పూజకి సాయంకాలానికి ఉండే అమావాస్య శుభప్రదం. దర్భలను సేకరించడానికి సంగమకాలానికి అమావాస్య ఉండాలి. (సంగమకాలం - ఒకరోజుని అయిదు భాగాలుగా చేస్తే అందులో రెండవ భాగం).
కర్కాటక సంక్రమణానికి ముందుండే మూడు ఘడియలు పుణ్యకాలం, సింహసంక్రాంతికి తరువాత వచ్చే పదహారు ఘడియలు పుణ్యకాలం. కొన్ని సంప్రదాయాల ప్రకారం ముందుండే పదహారు ఘడియలు పుణ్యకాలం. అగస్త్య అర్ఘ్యం పుణ్యకాలం గురించి వ్రత వివరణ చెప్పిన అధ్యాయంలోనే ఇవ్వడం జరిగింది.
ఎవరైతే ఈ అధ్యాయాన్ని చదువుతారో లేదా వింటారో వారికి అన్ని వ్రతాలు ఆచరించిన ఫలితం కలుగుతుంది.
♦️శ్రీ స్కాందపురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాదరూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమందు ఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏
🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿
