(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
(చివరి అధ్యాయము)
🌻ఈశ్వరుడు చెప్తున్నాడు:
ఓ సనత్కుమారా! నేను శ్రావణమాస మాహాత్మ్యం కొంతవరకే నీకు చెప్పాను. ఈ మాస మహాత్యం సంపూర్ణంగా చెప్పడానికి వందల సంవత్సరాల కాలమున్నా సరిపోదు.
నేను శ్రావణమాస వ్రతపాలన చెయ్యడం వల్లనే దక్షుని యజ్ఞంలో తనువు చాలించిన సతీదేవిని మరల హిమవంతుని కుమార్తెగా పొందగలిగాను కాబట్టి ఈ మాసం నాకు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసపు వాతావరణం కూడా ఎక్కువ వేడి, చల్లదనం కాకుండా అందరికీ అనుకూలంగా ఉంటుంది.
రాజైనవాడు శ్రావణమాసంలో శ్రౌతాగ్ని ద్వారా వచ్చిన తెల్లని భస్మాన్ని వళ్ళంతా రాసుకుని, భస్మాన్ని తడిపి నుదుటికి, వక్షఃస్థలానికి, నాభికి, రెండు బాహువులకు, మోచేతులకు, మణికట్టులకు, మెడకు, శిరస్సుకు, వెనుకవైపు - ఇలా పన్నెండు భాగాలకు త్రిపుండ్రాలను ధరించాలి. 'మానస్తోకే' మంత్రం లేదా 'సద్యోజాతం' మొదలైన మంత్రాలతో లేదా షడక్షరమమంత్రం (ఓం నమశ్శివాయ)తో ఈ భస్మాన్ని ధరించాలి. తరువాత నూటాయెనిమిది రుద్రాక్షలను ధరించాలి. మెడలో ముప్పదిరెండు, తలపై ఇరువదిరెండు, రెండు చెవులకు పన్నెండు, రెండు చేతులకు ఇరువదినాలుగు, ఒకొక్క భుజానికి ఎనిమిది, నుదుటిస్థానంలో ఒకటి, శిఖ మొదటిభాగంలో ఒకటి - ఇలా ధరించి నన్ను (శివుని) పూజించి పంచాక్షర మంత్రాన్ని జపించాలి. శ్రావణమాసంలో ఇలా చేసినవారు సాక్షాత్తుగా నా స్వరూపులే అనడంలో సందేహం లేదు.
“ఈ నెలలో నా ప్రీతిగా నన్ను లేదా కేశవుని పూజించాలి. ఈ మాసంలోనే నాకు అత్యంత ప్రీతికరమైన కృష్ణాష్టమి వస్తుంది. ఆ రోజే భగవంతుడైన శ్రీహరి దేవకీ గర్భం ద్వారా ఉదయించాడు. సంక్షేపంగా నీకు అన్నీ తెలియజేశాను. ఇంకా ఏమి తెలుసుకోవాలని ఉందో చెప్పు" అని ఈశ్వరుడు సనత్కుమారుని అడుగగా, సనత్కుమారుడు, “ఓ పార్వతీపతీ! మీరు చెప్తున్నప్పుడు ఆనందసాగరంలో తన్మయుడను అవడం వల్ల వ్రతాల క్రమం సరిగ్గా గుర్తుంచుకోలేదు. కాబట్టి మరొకసారి వ్రతాల క్రమం తెలియజేస్తే ఈసారి గుర్తుంచుకుంటాను" అని చెప్పగా, పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు..
మొదటిగా శౌనకాది మహర్షుల ప్రశ్న, సూతుడు చెప్పిన సమాధానం..
వినేవారికి ఉండవలసిన గుణాలు, నీ (సనత్కుమారుని) ప్రశ్నలు, శ్రావణ శబ్ద వ్యుత్పత్తి, దానికి స్తుతి, నీచే నాకు చేయబడిన స్తుతి, నా సమాధానం, నక్తవ్రత విధి, రుద్రాభిషేకం, లక్షపూజావిధి, దీపదానం, ఇష్టమైన వస్తువును విడిచిపెట్టడం, పంచామృతం తీర్థంగా స్వీకరించడం వల్ల వచ్చే ఫలం, భూశయనం, మౌనవ్రతం వలన వచ్చే ఫలితాలు, మాసోపవాస ధారణ - పారణ నియమాలు, సోమాఖ్యానంలో లక్షరుద్రవర్తి విధి, కోటిలింగ విధానం, 'అనౌదనం' పేరుతోనున్న వ్రతం ఈ వ్రతాచరణలో హవిష్యాన్నం స్వీకరించడం, ఆకులో భోజనం చెయ్యడం, ఆకుకూరలు తినడం మానివెయ్యడం, ప్రాతఃస్నానం, శమదమాల గురించి, స్ఫటికం మొదలైన ధాతునిర్మిత లింగపూజ, జపఫలం, ప్రదక్షిణ, నమస్కారం, వేదపారాయణ, పురుషసూక్తవిధి, గ్రహయజ్ఞవిధి, రవి - సోమ - మంగళవార వ్రతాల వర్ణన, బుధ- గురువుల వ్రతం, శుక్రవారం జీవంతికావ్రతం, శనివారంనాడు నరసింహ శని-వాయుదేవ అశ్వత్థపూజాదుల విధులు తెలియజేశాను.
తరువాత రోటకవ్రతం, ఔదుంబర వ్రతం, స్వర్ణగౌరీవ్రతం, దూర్వాగణపతి వ్రతం, నాగపంచమి, సూపౌదనవ్రతం, శీతలా సప్తమి, అమ్మవారి పవిత్రారోపణం, దుర్గాకుమారీపూజ, ఆశాదశమి, ఉభయ ఏకాదశులు, హరి పవిత్రారోపణం, కామదేవ పూజ, శివుని పవిత్రారోపణం, ఉపాకర్మ, ఉత్సర్జనం, శ్రావణపూర్ణిమ విధులు, సర్పబలి, హయగ్రీవ జయంతి, సభాదీపం, రక్షాబంధనం, సంకష్టహర చతుర్థి, కృష్ణజన్మాష్టమి, పిఠోరవ్రతం, పోలామావాస్య, కుశగ్రహణం, నదుల, రజోధర్మాలు, కర్కాటక - సింహ సంక్రమణవిధులు, శ్రావణమాసంలో చేసే స్నాన దాన మాహాత్మ్యం, శ్రావణమాస మాహాత్మ్యం వినడం వల్ల వచ్చే ఫలితాలు, అగస్త్యార్ఘ్యవిధి, వ్రతముల కాలనిర్ణయం.
సనత్కుమారా! ఈ అనుక్రమణికను హృదయంతో ధారణ చెయ్యు. ఈ అధ్యాయం ఎవరైతే వింటారో వారు అన్ని వ్రతాలు చేసిన ఫలితాన్ని పొందుతారు.
శ్రావణమాసంలో ఆచరించవలసిన విధులలో ఏ ఒక్కటి ఆచరించినా వారి పట్ల నేను ప్రీతుడనై ఉంటాను.
🌻సూతుడు చెప్తున్నాడు:
ఓ శౌనకా! శివుని ముఖపద్మం నుండి వెలువడిన ఈ అమృతవాక్కులు చెవులతో పానం చేసిన సనత్కుమారుడు ఆనందం పొంది కృతకృత్యుడయ్యాడు. శ్రావణమాస మాహాత్మ్యాన్ని , శివుని హృదయంలో స్మరిస్తూ దేవర్షిశ్రేష్ఠుడైన సనత్కుమారుడు శంకరుని అనుమతి తీసుకుని బయల్దేరాడు.
ఇందులో చెప్పబడ్డవన్నీ అత్యంత రహస్యమైన విషయాలు. అర్హులు కానివారికి వీటిని తెలియజేయరాదు. మీరందరూ యోగ్యులు కాబట్టి మీకు తెలియజేశాను.
♦️శ్రీ స్కాందపురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాదరూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమందు ముఫ్ఫెయ్యవ అధ్యాయము సమాప్తం..
🌷శ్రావణమాస మహాత్మ్యము సమాప్తం.
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏
🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿
