ఓ రోజు గణేశుడు మూషికవాహనంపై తిరుగుతుండగా ఓ పాము కనిపించేసరికి, మూషికం కంగారుపడి వినాయకుడ్ని పడేస్తుంది. ఆయన దగ్గర వున్న మోదకాలన్నీ పడిపోతాయి. దాంతో వినాయకుడికి కోపం వచ్చి పాముని పొట్టకు ఆభరణంగా చుట్టుకుంటాడు.
తనను చూసి నవ్విన చంద్రుడిపైన కోపంతో విరిగిన దంతాన్ని విసిరి ఇక నుండి నీవు కాంతి విహీనుడివి అవుతావని శపిస్తాడు. చంద్రుడు కాంతి విహీనుడయ్యే సరికి ప్రతిరోజూ చీకటి రాత్రులవుతాయి.
అప్పుడు బ్రహ్మాది దేవతలు వినాయకుడిని తన కోపాన్ని ఉపసంహరించుకోమని కోరతారు. దాంతో ఆయన నెలలో సగం రోజులు పూర్ణ చంద్రుడిగాను, మిగిలిన రోజులలో అర్ధ చంద్రుడిగాను వుంటాడాని అనుగ్రహిస్తాడు. చంద్రుడు శాపానికి గురైన రోజు భాద్రపద చతుర్థి.
ఆ రోజు చంద్రుడిని చూడకూడదు. చంద్రుడు శాపానికి గురికానప్పుడు అన్ని లోకాల్లోనూ రాత్రుళ్ళు పూర్ణ చంద్రుడే వుండేవాడట. శాపోపహతుడైన తరువాతే శుక్లపక్ష, కృష్ణపక్ష చంద్రుడయ్యాడు.
