గణపతి మాత్రమే కాదు...ఘన పతి కూడా! | Not only Ganapati...also Ghanapati
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

గణపతి మాత్రమే కాదు...ఘన పతి కూడా! | Not only Ganapati...also Ghanapati

P Madhav Kumar

వినాయక చవితి ప్రతీ యేడు లాగే ఈ సంవత్సరమూ వస్తుంది. మనం మళ్లీ ఆయన విఘ్నాధిపతి అని, మూషిక వాహనుడని, పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పుకుంటాం. ఇంతలో నిమజ్జనానికి ముహూర్తం వస్తుంది. స్వామి వారి ప్రతిమల్ని నీళ్లలో కలిపేస్తాం. అంతటితో మన భక్తి పారవశ్యం గంగపాలై సమాప్తమైపోతుంది! అసలు గణపతి వృత్తాంతం నుంచి ఇంతకంటే కొత్తగా తెలుసుకునేది ఏం లేదా? లంబోదరుడి ఉదార కోణం అంటూ ఏం లేదా? వినాయకుడు కూడా ఇతర అందరు హిందూ దేవుళ్లలాగే ఎన్నో మర్మాలు దాచుకున్న వాడు! ఊరికే కోరికలు కోరుకుని ఆయన దయతో నేర్చుకోవటం కాదు... ఆయన నుంచే మనం ఎంతో ప్రేరణ పొందవచ్చు! దీనికి భక్తితో పాటూ కాస్త శ్రద్ధ కూడా అవసరం.


గణపతి వ్రత కథలో మనకు మొట్ట మొదట ఎదురయ్యేది ఆ పార్వతీ నందనుడు శివుడ్ని అడ్డగించటం. తల్లి ఆజ్ఞ మేరకు ద్వారం వద్ద వున్న తాను స్వయంగా పరమేశ్వరుడే వచ్చినా అనుమతించడు. ఇందులోంచి కొందరు నాస్తిక వాదుల్లాగా... ''శివుడికే తన కొడుకు ఎవరో తెలియాదా?'' వంటి మూర్ఖపు ప్రశ్నలు వేయకుండా కాస్త ఆలోచిస్తే మనకు ఒక విషయం స్పష్టం అవుతుంది!


విఘ్నేశ్వరుడు తనకు ఒక పని అప్పజెబితే దాన్ని ఎంత నిజాయితీతో, నిర్భీతగా చేశాడు... ఇదీ గ్రహించాల్సింది! అలా తన కర్తవ్యం పాటించే క్రమంలో ప్రాణాలకే ముప్పొచ్చినా బెదరలేదు. చెదరలేదు. బాలగణఫయ్య మనకు నేర్పే మొదటి పాఠం ఇది!


శివుడి ఆగ్రహం కారణంగా గజ ముఖంతో గజాననుడు అయిన అఖు వాహనుడు మరో సారి తన తెలివి ప్రదర్శిస్తాడు. విఘ్నాధిపత్యం కోసం కుమార స్వామితో పోటికి దిగాల్సిన అవసరం ఏర్పడితే ఆవేశపడి పరుగులు తీయడు. తెలివిగా తల్లిదండ్రుల్నే దైవాలుగా గ్రహించి వారికి ప్రదక్షిణ చేసి అనంత పుణ్యాన్ని పొందుతాడు. సుబ్రహ్మణ్యుడు ఎంత వేగంగా పుణ్యనదులన్నీ చుట్టి వచ్చినా తాను ముందే విజయం సాధిస్తాడు! ఈ ఉదంతంలో గణపతి బలం కంటే తెలివి ఎంత ముఖ్యమో నిరూపిస్తాడు!


శివుడ్ని అడ్డగించినప్పుడు ధైర్యం, కుమార స్వామితో పోటిపడ్డప్పుడు తెలివి ప్రదర్శించిన స్కందాగ్రజుడు .... వ్యాసుడి వద్ద తన వేగాన్ని ప్రయోగిస్తాడు. వ్యాస మహర్షి మహాభారతం రచించాలనుకున్నప్పుడు ఈయనే ఆయనకు సమాధానమయ్యాడు! వ్యాసుడు చెబుతోన్న వేగం కంటే రెట్టింపు వేగంతో గణపయ్య మహాభారతమంత గ్రంథస్తం చేశాడు! ఇంతే కాదు, మరో సందర్భంలో వినాయకుడు రావణాసురుడి తప్పుడు ప్రయత్నానికి అడ్డుపడతాడు. ఆత్మ లింగం పట్టుకుని లంకకి వెళుతోన్న దశకంఠుని బ్రాహ్మణ బాలుడిగా మారు వేషంతో మోసగిస్తాడు.


అవసరమైతే చెడుని ఎదుర్కోటానికి కాస్త వక్ర మార్గంలో అయినా ప్రయాణించటం తప్పు కాదని సందేశం ఇస్తాడు. నిజానికి రావణాసురుడు శివుని మెప్పించి ఆత్మ లింగం ఇంటికి తీసుకుపోతుంటే మోసగించి వేరోక చోట ప్రతిష్ఠంచటం తప్పు. కాని, ఆత్మ లింగం తనకు దక్కితే రావణుడు ఎలా విజృంభిస్తాడో అందరికీ తెలిసిందే! అందుకే, చెడ్డవానికి మేలు జరగకుండా వుంచేందుకు తానేం చేయాలో అది చేస్తాడు విఘ్నేశుడు! చెడుపై పోరాటంలో ఆయనలోని ఈ లక్షణం మనమూ నేర్చుకోవాలి.


మొత్తం మీద, గణపతి దేవుడిగా మన కోరికలు తీరుస్తాడన్నది ఎంత నిజమో... ఒక ప్రేరణగా తన వృత్తాంతంతో ఎన్నో మంచి లక్షణాలు నేర్పుతాడన్నదీ అంతే నిజం! అవి శివుడ్ని ఎదిరించిన ధైర్యం కావొచ్చు, స్కందుడ్ని ఓడించిన తెలివి కావొచ్చు, వ్యాసుడ్ని మెప్పించిన వేగం కావొచ్చు, రావణుడ్ని మోసగించిన సమయస్ఫూర్తి కావొచ్చు. మనకు నేర్చుకోవాలనే శ్రద్ధే వుండాలిగాని లంబోదరుడు బోధించే పాఠాలెన్నో!

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow