పర్వతరాజు తనయగా జనించిన పర్వతి పుణ్యకవ్రతమాచరించి శ్రీకృష్ణుని ప్రసన్నం చేసుకుంది.
ఆమె కోరిక ప్రకారం ప్రతి యుగంలో పార్వతీ తనయుడుగా జన్మిస్తానన్నాడు. అలా జన్మించిన కృష్ణ అంశ బాలుడిని దేవతలందరూ వచ్చి ఆశీర్వదించారు.
ఆ సంబరాలు చివరిదశలో వుండగా, శనిదేవుడొచ్చాడు. శని ఆ పసిబాలుని వైపు చూడకపోవటంతో పార్వతికి కోపం వచ్చింది. కాని శని " నా చూపునేరుగాపడితే ఏదైనా సరే నాశనమవుతుంది. ఇది నాకున్న శాపం. ఆ కారణంగా నేను నా భార్య ముఖమే చూడలేకపోతున్నాను” అని వివరించాడు.
"అది సామాన్యులకు వర్తిస్తుంది. పార్వతి, పార్వతీ తనయుడికి ఏమీ కాదు” అని చెప్పి పార్వతి శని తలతిప్పి చూసేలా బలవంతం చేసింది. శని చూపుపడగానే ఆ పసివాని తలతెగి ఎక్కడో గోలోకంలో పడింది. ఆ ఘోరం చూడలేక పార్వతి స్పృహ తప్పింది.
ఆ సంగతి తెలుసుకున్న శ్రీకృష్ణుడు హుటాహుటిన వస్తూ, పుష్పభద్రానదీ తీరంలో వున్న ఒక ఏనుగుతలను సుదర్శనంతో ఖండించి ఆ శిరస్సును ఆ బాలుడి మొండానికి కలిపి ప్రాణప్రతిష్ఠ చేశాడు. అలా జన్మించినవాడు గజాననుడు. ఆ పార్వతి తనయునికి బ్రహ్మక మండలం, భూదేవి మూషికాన్ని బహుమతులుగా ఇచ్చారు. పార్వతి కుడుములు పెట్టి ముద్దుచేసింది. దాదాపు అన్ని గథలలోను వినాయకుడు పార్వతీ తనయుడిగానే చెప్పటం ఒక విశేషం.
