శ్రీ మహాశాస్తా చరితము - 104 | శరణుఘోష ఫలితము | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 104 | శరణుఘోష ఫలితము | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

శరణుఘోష ఫలితము*

చతుర్వేదములచేత సదా ప్రశంసింపబడు శాస్తా యొక్క అనుగ్రహమును పొందుటకు సులభమైన
మార్గము శరణఘోషయే. దీని మహిమ సాధారణమైనది కాదు. ధర్మార్ధకామమోక్షములను నాలుగు విధములైన పురుషార్థములను సంధానము చేయగలశక్తి దీనికి గలదు. దీనిని పారాయణ చేయువారికి
అత్యంత శక్తివంతమైనది. స్వామి అనుగ్రహము అను ఐశ్వర్యమును ప్రసాదించునది.

*'ఆదిత్యపురి'* అను దేశమునందు, ఇరువురు దొంగలు , చాలాకాలముగా అత్యంత సమర్థులై , ఎవరికీ చిక్కని విధముగా దొంగతనము చేయసాగిరి.

ఒకసారి ఆ దేశపు ప్రధానమంత్రి ఇంటనే దొంగతనము చేయబోయి కాపలాదారులు చూచుటలో , వారికి చిక్కకుండా పారిపోసాగిరి.

ఆనాడు ఉత్తరానక్షత్ర దినమగుటచే ,
రాత్రియందు భక్తులు కూడి , స్వామి యొక్క మహత్మ్యమును
పొగడుచూ , నామసంకీర్తన చేయుచూ , శరణుఘోష చేయుచుండిరి. కాపాలాదారుల చేతికి చిక్కకుండా పారిపోవుచున్న దొంగలు తలదాచుకొనుటకై , శరణుఘోష చేయుచున్న భక్తుల బృందమున
దాగి యుండిరి. వారు కూడా శరణుఘోష చేయుచుండిరి.

అంతలో పూజ ముగిసి , భక్తులందరూ తమ తమ నివాసములకు పోసాగిరి. అడ్డుగా వచ్చిన
కాపలాదారులు , దొంగలను గుర్తుపట్టి , బంధించి , రాజసభకు గొనిపోయిరి.

ఆ దేశపు రాజైన సుధర్ముడు విద్య , పరాక్రమములందు ఆరితేరినవాడు. శాస్తా యందు అమితమైన భక్తి కలిగినవాడు. స్వామి అనుగ్రహము వలన అనేక సిద్ధులను పొందియున్నవాడు.

సభయందు హాజరుపరుచబడిన దొంగలను చూచి , విషయమంతయూ విచారించి , వారికి
శిక్షగా , ఏనుగులచే తొక్కింపుమని ఆజ్ఞాపించెను. శిక్ష నెరవేరు సమయమున , దివ్యశక్తులను పొందిన మహారాజు ఒక దృశ్యమును తన మనోనేత్రమున గాంచెను. అదేమనగా ఒక అందమైన విమానము నందు , శాస్తా యొక్క గణములు , ఆ దొంగ లిరువురినీ మర్యాద పూర్వకముగా
తీసికొనుపోవునట్లు” తిలకించెను.

ఇది చూచిన మహారాజు , వీరిరువురూ దొంగలు కదా , వీరికి ఇట్టి యోగము ఎట్లు కలిగినదని ఆలోచించెను.

అయోమయము వెంటాడిన మహారాజు , తన పూజాగ్రహమునకేగి శాస్తాతో మొరబెట్టుకొనెను.

స్వామి ఆకాశవాణి రూపున ఇట్లు పలికెను. *“మహారాజా ! నీవు తలచినది తప్పుకాదు. వారిరువురూ దొంగలే. కానీ నిన్నటిదినమున వారు నీ కాపలాభటుల చేతికి చిక్కకుండుటకై , ఒక ఆలయమున దాక్కుని, నా భక్తులు శరణుఘోష చేయుచుండగా , తప్పించుకొనుటకై వారునూ వారితో కలిసి శరణుఘోష చేసిరి. ఆ కారణముగానే వారికి అట్టి యోగము సంప్రాప్తమైనది”* అని
తెలియజేసెను.

*“శరణుఘోష కారణముగా వారు పూర్వ జన్మలో చేసిన పాపములు కూడా నశించిపోయినవి. నేను శరణుఘోషప్రియుడను. కాబట్టి శరణుఘోష చేయువారికి వారు తలచిన కార్యములన్నియూ నెరవేరును. కాబట్టి దేశమందంతటా శరణుఘోష చేయుమని భక్తులకు తెలియజేసి , తద్వారా సుభీక్షముగా జీవించు స్థితిని పొందుదురుగాక”* అని తెల్పెను.

స్వామి యొక్క వాక్కును విన్న మహారాజు మిక్కిలి సంతోషించి , రాజ్యప్రజలందరికీ శరణుఘోష
మహత్మ్యమును వివరించి , సుఖించెను.

*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow