భక్తుని రూపాన వచ్చిన భగవంతుడు*
సత్యధర్మాలకు నిలయంగా సస్యశ్యామళమైన నేపాళదేశమును *"మేరునందనుడు"* అను రాజు ధర్మము తప్పక పాలించుచుండెను. అతడు ఆదినాథుడైన శ్రీమహాశాస్తావారి పట్ల అతీతమైన భక్తిప్రపత్తులు నిండియున్నవాడు. అనునిత్యము అయ్యప్పస్వామి వారిని పూజించి ఆరాధించుచుండిననూ కర్మవశాత్తు కుష్టిరోగముతో మిక్కిలి బాధపడుచుండెను. అప్పుడు *"హిరణ్యపురము"* అను దేశమును *"దుష్టకుడు"* అను రాజు పాలించుచుండెను. అతడు మహావీరుడుగాను , పరాక్రమమునకు సాటిలేనివాడుగాను యుండిననూ స్వతఃహ దుర్బుద్ధినిండినవాడుగా యుండెను. ఎల్లవేళల పరుల రాజ్యముపై దండెత్తివారలను ఓడించి బానిసలు గావించుకొని ఆ దేశపు సిరిసంపదలను కొల్లగొట్టి తన దేశమునకు తెచ్చుకొనుటయు ఆ దేశమును అగ్నికి ఆహుతి గావించియూ ఆనందపడేటివాడు అగును. మిక్కిలి సైన్యబలము, కండబలము నిండిన అతనిని ఎదుర్కొనుటకు ఎవరు సాహసించలేక పోయిరి. అంతటి క్రూరుడైన రాజుకు సస్యశ్యామలమైన నేపాళ దేశముపై కన్నుపడెను.
ఇక అతడు ఆ దేశము గురించి తెలుసుకొన్నాక ఊరు కుండగలడా ? నేపాళ దేశము యొక్క సిరిసంపదలన్నిటిని తన దేశమునకు తరలించియే తీరుటయను దుష్ట తలంపుతో యొక పెద్ద సైన్యమును తనవెంట పెట్టుకొని ఆ దేశముపై దాడిచేసెను. ఎదురు చూడని ఆ దాడిమూలాన అదిరిపడిన నేపాళరాజు తన సైన్యాధిపతిని యుద్ధమునకు పంపెను. నేపాళదేశము యొక్క అతిపెద్ద సైన్యముతో తన శక్తిసామర్థ్యములు అన్ని కూడబెట్టుకొని ఆదేశపు సైన్యాధిపతి యుద్ధముచేసిననూ అతిబలవంతుడైన దుష్టకుని ఓడించుటకు అతని వల్లకాకపోయినది. చివరకు దుష్టకుడు ఆ సేనాధిపతిని హతమార్చెను. మిగిలిన నేపాళసైన్యము నడిపించుటకు నాయకుడు లేనందున తలా ఒకదిశకు పారిపోయిరి. దుష్టకుడు సైన్యము అంచలంచలుగా ముందుకు సాగి రాజధానిని సమీపించెను.
ఈ వార్తవిని మేరునందనుడు మిక్కిలి బాధాక్రాంతుడై అనుదినము తాను పూజించు వీరాధివీరుడగు శ్రీమహాశాస్తావారిని దలచి ప్రార్థించెను. *"శరణాగత రక్షకా ! హే శత్రుసంహారమూర్తే నీవేగతియని అనుదినము ప్రార్థిస్తూ జీవించియుండునాకు ఇంతటి కష్టము కలుగుటకు నీవు అనుమతించవచ్చునా ? నాయందు దయదలచి నన్ను , నాదేశమును నీవే రక్షించవలయును"* యని శ్రీస్వామివారితో కన్నీరుమున్నీరై వేడుకొనెను.
దీనార్తిగా చేయు ప్రార్థన శ్రీస్వామివారి చెవిలో పడక యుండునా ? లోకాలన్నిటిని ఏలేటి ఆ పరదైవం భక్తుని మొరవిని త్రుటిలో నేపాళరాజు వేషమును దాల్చెను. శ్రీశాస్తావారు మేరునందనుడుగాను, వారి భూతగణములన్నియూ నేపాళ సైన్యముగానూ మారెను. స్వామివారు సైన్యముతో రణరంగ ప్రవేశము చేసెను. నేపాళరాజుగారే స్వయాన రణరంగమునకు వచ్చియుండినది. గాంచిన దుష్టకుడు మిక్కిలి ఆక్రోషముగా యుద్ధముచేయుటకు మొదలిడెను. కొంతసేపు యుద్ధపరిపాటి ఆటలవలే జరిపించిన శ్రీస్వామివారు , చివర తన కరములోని పెద్ద కోరడాను దుష్టకునిపై విసెరెను. అతడు ఆ వింత ఆయుధమును చూసి క్షణకాలము ఆశ్చర్యపడి నిలబడి యుండువేళలో అది కోటి సూర్యప్రకాశము వంటి జాజ్వల్యమానమైన కాంతి ప్రభలను విరజిమ్ముతూ ఆ క్రూరరాజును సంహరించెను. పరమపావనమైన ఆ కొరడా అతనిని హతమార్చి నపుడు తగిలిన రక్తపుమరకలను శుభ్రపరచు కొనుటకొరకు సముద్రమున మునిగి లేచి , మరలా శ్రీస్వామివారి కరమునకు వచ్చిచేరెను. మిగిలియుండిన దుష్టకుని సైనికులు శ్రీస్వామివారు పెట్టిన యొక హూంకార శబ్ధముననే భస్మీపటలమై పోయిరి. పిదప రాజధానిలో పూజామందిరమున తననుగూర్చి ప్రార్ధన చేయుచూ యుండిన మేరునందనుని ముందు ప్రసన్నమైన స్వామివారు *"భక్తా మేరునందనా ! చింతనవీడుము.*
*నీకొరకు నేనే నీ రూపమున రణరంగమునకు వెళ్ళి శత్రుసైన్యములన్నిటిని దుష్టకునితో సహా సర్వులను సంహారము చేసివచ్చితిని. కర్మఫలముచే ఇన్నిదినములు నీ శరీరమును పట్టిపీడించు చుండిన కుష్టురోగము కూడా ఇన్నిదినములుగా నీవు చేసిన శరణఘోష మహిమతో వైదొలగినది. ఇకముందు నీవు వజ్రకాయుడవై యుండి పలుకాలము సుభిక్షముగా నీదేశమును పాలించి , సత్కీర్తి గడించెదవు. చివర నా సాయుజ్యము చేరుకొందువు"* యని అనుగ్రహించి అటునుండి స్వామివారు అదృశ్యమయ్యెను. ఆ క్షణమే రాజును పట్టిపీడిస్తూ యుండిన రోగము మాయమైనది. స్వామివారి దయ అందరూ కొనియాడిరి. *శ్రీ స్వామివారి నామజప పారాయణము వలన కర్మవ్యాధులుకూడా వైదొలగునని సర్వులు గ్రహించిరి. అప్పటినుండి ఆ దేశస్థులందరూ అనునిత్యము శ్రీస్వామివారి శరణఘోషను వదలక పారాయణము చేసి సర్వవిధబాధా విముక్తులైరి.*
