అశ్వారూఢ శాస్తా :
ఒకానొక సమయమున తపోసంపన్నుడైన *'మధుదీపుడు'* అను మునిశ్రేష్ఠుడు ఉండేవాడు. అతడికి వీరనందనుడు , విమలనందనుడు అను సోదరులు ఇరువురు శిష్యులుగా ఉండేడివారు. వారు గురువుయందు అమితమగు భక్తి విశ్వాసములు , చదువుయందు అపారమైన జ్ఞానసంపదయూ కలిగి యుండిరి. సద్గుణ శీలురిగా భాసిల్లువారికి ఒకనాడు గడ్డు సమస్య ఒకటి ఎదురాయెను.గోమాతను పూజించినచో శ్రీమహాలక్ష్మిని పూజించినట్లే యని భావించు గురువు. తన ఆశ్రమమున అనేక పశువులను సంరక్షించుచుండెను. ఒకనాడు పశువులకు మేత వేయుటకై పచ్చగడ్డి కోసుకురమ్మని దాపున నున్న అడవికి తన శిష్యులను పంపెను. గడ్డికొరకు వెళ్ళిన సోదరులిరువురూ అడవిలో చాలా దూరము వెళ్ళిపోయిరి. అదే సమయమున కాననమందుగల తటాకము నందు జలకాటలకై గంధర్వకన్యలు కొందరు భూలోకమునకు వచ్చిరి. వారు జలకములాడునపుడు పురుషులమైన తాము దొంగతనముగా చూచుట తప్పని తెలిసిననూ , ఒక్క క్షణము చంచలత్వము వారిని ఆవరించగా , దాపున నున్న చెట్టు నుండి తొంగి చూడసాగిరి. ఈ సంగతి నెరుంగని ఆ కన్యలు వచ్చిన విషయము ముగించుకుని తమ లోకమునకు వెడలిపోయిరి. అంతవరకూ ఇంగితము. మరచియున్న వారికి ఆ క్షణము తక్షణ కర్తవ్యము గోచరించి , గడ్డిని కోసుకుని ఆశ్రమమును చేరిరి
తక్కిన శిష్యులందరూ ఆశ్రమమును చేరిననూ , సోదరుల జాడ తెలియని గురువుగారు వారికి ఏ ఆపద వాటిల్లినదో యన్న శంకతో తన దివ్యదృష్టితో చూడగా , జరిగిన దంతయూ అవగతమైనది. శీలవంతురైన తన శిష్యులు ఇట్టి నీచ కార్యమును ఆచరించినందులకు కినుక బూని యుండగా , శిష్యులిరువురూ గురువు వద్దకు వచ్చి ఎదురుగా నిల్చుని యున్న వారిని చూచి , కోపము అధికము కాగా ఇట్లనెను *"మూఢులారా ! గురుకుల వాసము చేయు మీకు , గురువుగారి ఆజ్ఞను శిరసావహించుటయే కర్తవ్యము. ఈ సమయమున కఠోరమైన బ్రహ్మచర్యమును పాటించవలసిన మీరు , అన్యకాంతలపట్ల వ్యామోహితులై వారిని రహస్యముగా చూచి ఆనందించుట మన్నించదగిన పని కాదు. మనస్సు అను గుర్రమునకు సరియైన కళ్ళెము వేసి అరికట్టగలిగినవాడు మానవుడు. ఆ విషయము మరచిపోయి , మనస్సును యథేచ్ఛగా వదలివైచి అసురులవలె చేయకూడని పనిచేసిన మీరు , అసురగుణములు గలిగిన అశ్వములుగా మారిపోవుదురుగాక"* అని శపించెను.
చేసిన తప్పుని ఆలస్యముగా గ్రహించిన సోదరులిరువురూ భయకంపితులై కన్నీరు మున్నీరుగా విలపించుచూ గురువుగారిని క్షమాబిక్ష కోరిరి.
కొంతసేపటికి శాంతపడిన గురువుగారు , మొదటినుండీ శిష్యుల గుణగణములను ఎరిగిన వాడగుటచే వారి పట్ల కొంత దయగలిగినవాడై *"శిష్యులారా ! ఇచ్చిన శాపము తిరిగి తీసికొన సాధ్యము కాదు. ఎన్నడైననూ భగవంతుడు కోపించినచో గురువు వారిని కాపాడును. గురువే కోపగించినచో ఆ భగవంతుడు కూడా కాపాడజాలదు. అయిననూ మీరు నా ప్రియశిష్యులైన కారణము చేతనూ , మీ గురుభక్తికి మెచ్చినందువలననూ శాపవిమోచన తెలియజేయుచున్నాను. అశ్వరూపులై సంచరించు సమయమున నా ప్రభువైన దేవోత్తముని వలన మీకు శాపవిమోచన కలుగజేయుమని ఆ స్వామిని ప్రార్ధించుచున్నాను. ఆ స్వామి అనుగ్రహము వలన మీరు శాపవిముక్తలై ముక్తి పొందుదురు అని అభయమిచ్చెను.*
కొంతకాలమునకే వారు గురువు ఒక్క శావపశమున అసురశక్తులు గల అశ్వములుగా మారిపోయిరి. వీరనందనుడు ఆకుపచ్చరంగు కలిగిన అశ్వముగానూ , విమలనందనుడు , ఎరుపురంగుల అశ్వముగానూ మారి ప్రజలందరినీ అసురశక్తి గలవారై పలువిధముల బాధించుచుండిరి. కఠినమైన నియమనిష్టలు కలిగి ఆశ్రమవాసము చేసిన వారు , కఠినమైన మనస్సుగల అశ్వములవలె యధేచ్ఛగా సంచరించసాగిరి.
ఒకప్పుడు అశ్వములు బ్రహ్మాండమైన రూపు ధరించియూ , ఒక్కొక్కమారు సముద్రములను , పర్వతములను లంఘించుటయూ , వాటిని పెకలించుచూ , అతలాకుతలము చేయుచూ వచ్చినవి. ఎరుపు జీరలుగల నేత్రములు కలిగియూ , పెద్ద పెద్ద చెవులు కలిగియూ చూచుటకే జుగుప్స కలుగు విధముగా అమితమైన శక్తి కలిగియుండెను. ఎదురుగా వచ్చు వారిని ఇష్టము వచ్చిన రీతిగా కుమ్మసాగెను. వీరి ధాటికి ప్రజలందరూ భయపడుచూ , ఎప్పుడు ఏ ప్రమాదము వచ్చునో యని భయపడుచుండిరి.
అశ్వములు యధేచ్ఛగా తిరుగాడుచూ ఒకసారి ఆకుపచ్చరంగు గల అశ్వము దేవలోకము వైపు సాగిపోగా , రెండవదైన ఎరుపు వర్ణము గల అశ్వము పాతాళలోకమును చేరెను.
దేవలోకమువైపుగా సాగిపోవుచున్న ఆకుపచ్చ వర్ణముగల అశ్వము దారిలో ఎదురైన మేఘములను సర్వసాధారణమైనట్లుగా చిందరవందర చేయుచూ , సూర్యచంద్రులు సైతము భయపడి పారిపోవనట్లు. చేయుచూ , జన , తపోలోక వాసులను సైతము భయభ్రాంతులను చేయుచూ చివరగా సత్యలోకమును చేరెను. బ్రహ్మలోక వాసులందరూ దీని ధాటికి ఆగలేక భయపడి పారిపోయిరి. చివరకు బ్రహ్మదేవుడు సైతము దానిని అణచుశక్తి లేక యుండెను. చేయునది లేక ఈ విషయమును పరమశివునికి విన్నవించుటకై కైలాసమునకు వెడలెను.
ఇంతలో ఆ అశ్వము విరజ నదిని అనాయాసముగా దాటి , వైకుంఠమును చేరెను. అచట కూడా ఇష్టము వచ్చిన రీతిగా ప్రవర్తించుచూ విష్ణుభక్తులను బాధింపసాగెను.
