మహిషి సంహారము | మహిషి పూర్వగాథ
ఈ లోకము నందు ధర్మమును నెలకొల్పవలయునను సత్సంకల్పముతో, ఒక పర్యాయము త్రిమూర్తులైన బ్రహ్మవిష్ణుమహేశ్వరులు , తమ తమ దివ్య శక్తులను మమేకము గావించి , ఒకమహాపురుడిని సృష్టించి , అతడికి *'దత్తుడు'* అను పేరిడిరి. అతడిని ధర్మసంస్థాపపన కార్యమును
నెరవేర్చుమని ఈ భూలోకమునకు పంపించిరి. అతడు , ప్రతివ్రతా శిరోమణియైన అనసూయాదేవి ,
అత్రిమహాముని దంపతులకు *'దత్తాత్రేయుడు'* అను పేరుతో పుత్రుడిగా జన్మించెను. త్రిమూర్తుల
సతీమణులైన సరస్వతి , లక్ష్మీ , పార్వతులు మువ్వురు కూడా తమ భర్తల యంశముల వలన
ఉద్భవించిన దత్తకుమారుడి కొరకై , తమ తమ శక్తులను ఏకముగావించి , ఒక స్త్రీ రూపమున కపిల
మహర్షిని పుత్రికగా అవతరించునట్లు చేసిరి. ఆ మహాముని తన కుమార్తెకు *'లీలా దేవి'* అని నామకరణము గావించి , ప్రేమమీరగా ఆమెను పెంచి పెద్దజేసెను. ఆమెకు యౌవ్వన దశ
సంప్రాప్తము గానే దత్తాత్రేయుడికిచ్చి వివాహము గావించెను.
త్రిమూర్తుల దివ్యతేజస్సుతో అవతరించిన దత్తుడు లోకమునందు అధర్మమును పారద్రోలి ,
ధర్మమార్గమును ప్రజలకు ఉపదేశించి , తన అవతార లక్ష్యమును పరిసమాప్తము గావింపవలయునని
సంకల్పించెను తత్ కారణము వలన , అతడు ప్రాపంచిక సౌఖ్యములను త్యజించవలయుననియు , వనములకేగి నియమానుసారముగా తీవ్ర తపము నాచరింపవలయుననియు దృఢమైన నిర్ణయమును
గైకొనెను.
జ్ఞాన స్వరూపుడైన దత్తుడు తన అర్థాంగికి శాశ్వతమైన సత్యమార్గమును ఉపదేసము గావించుటకు
ప్రయత్నము చేసెను. *“ఈ ఐహిక భోగములన్నియూ మాయమయమైనవి మానవులు ఇటువంటి తుచ్ఛమైన సుఖములను అనుభవించి తీరవలయునన్న కోరికను మటుమాయము గావించి , నిత్యసత్యమైన పరమపదమును చేరుట యొక్కటియే పరమధర్శముగా భావింపవలయును. అని ధర్మబోధ గావించెను.*
లీలాదేవికి భర్త మొనరించిన హితోపదేశము తలకెక్కలేదు సరికదా , *'నా మనస్సుకు తీవ్రముగా బాధ కలిగించి , మీరు అరణ్యములకేగి తపము నాచరించుట యనునది ఎంత మాత్రమూ జరుగని విషయము'* అని పలికి , అతడి మార్గమునకు అడ్డుతగిలెను. తన జ్ఞానబోధను పెడచెవినిబెట్టి తనను
నిరోధించుచున్న భార్య యెడ దత్తుడిక సహనమును ప్రదర్శింపజాలక పోయెను. ఆగ్రహావేశములకు
గురియయ్యెను.
*“పరమానంద భాగ్యమును ప్రసాదించునట్టి ఆ పరమాత్మను దర్శించు భాగ్యమునకు నోచుకొనక , మూఢురాలివై జంతుజాలము వలె నడచుకొనుచున్నావు. మాటి మాటికి నిన్ను నీవే 'మహిషి' , 'మహిషి' అని సంబోధించుకొనుచున్నావు. కనుక , నీవునూ ఆ మహిషి రూపమునే పొందుదువుగాక అని శాపమునొసగెను.*
బహుకాలమునకు పూర్వము *'ధనువు'* అను పేరుగల రాక్షసుడికి రంభుడు , కరంభుడు అను పేర్లుగల ఇరువురు కుమారులు ఉండెడివారు. ఆరాక్షస సహోదరులు తమ క్రూరకృత్యములతో
లోకులను బహువిధములుగా హింసించుచుండెడివారు. భవిష్యత్ కాలమునందునూ తమ
వారసులు సైతము తమ వలెనే లోకకంటకులై వ్యవహరింపవలయునను దుష్టచింతనతో ఘోరమైన
తపస్సును చేయుటకు పూనుకొనిరి. కరంభుడు *'పంచనదము'లో* నదీజలములలో పూర్తిగా
మునిగియుండి జలస్తంభనము గావించి తీవ్రతపము గాచరింపసాగెను. అన్నయగు రంభుడు ఆ
నదీతీరమునందే పంచాగ్నులను ప్రజ్వలనము గావించి , ఆ జ్వాలల మధ్య అమరినవాడై తపస్సు
చేయుటకు ప్రయత్నించెను. వీరిద్దరి తపస్సు ఫలించిన యెడల తనగతి యేమగునో అనుభయముతో
దేవేంద్రుడు జలసంచారియగు మొసలి వలె రూపమును దాల్చి కరంభుడి పాదములను గట్టిగా పట్టుకొని పీడించసాగెను. చివరివరకు , ఇంద్రుడు నీటిలోనే యుండి వంచనతో కరంభుడి ప్రాణములను
బలిగొనెను. కానీ , రంభుడిని గెలుచుట అనునది మాత్రము ఇంద్రుడికి అసాధ్యకార్యముగా తోచెను. రంభుడితో తన శక్తి మేరకు పోరాటము సలిపి , పరిపూర్ణ విజయమును సాధింపజాలక , అసంతృప్తితో ఇంద్రుడు చివరకు వెనుదిరిగి వెళ్లవలసి వచ్చెను.
రాక్షస జాతికి చెందినవాడైనను రంభుడు తన సహోదరుడి మరణమును కన్నులారా గాంచి , అతడిపట్ల గల విపరీతమైన మమకారభావమును వీడజాలక , జీవితముపట్ల విరక్తి కలిగినవాడై ,
తనప్రాణములను సైతము త్యజించుటకు సిద్ధపడెను. అగ్నిజ్వాలల మధ్య ప్రవేశించి , ఆత్మాహుతి
గావించుకొనుటకై ప్రయత్నించెను. అగ్నిజ్వాలలు అతడి శరీరమును ఆలింగనము గావించుకున్నవే
కాని దహింపలేదు. ఇక , చేయునదేమియు కానిపింపక పోగా , కత్తి దూసి తన శిరస్సును తానే ఖండించుకొనుటకు పూనుకొనెను. అపరిమితమైన సోదరప్రేమతో దేహత్యాగమును గావించుకొనుటకై
రంభుడు ప్రదర్శించిన సాహసకృత్యమును గాంచి అగ్నిదేవుడు మిక్కిలి సంతసించినవాడై , అతడి
యెదుట ప్రత్యక్షమయ్యెను. *'నీ యొక్క అభీష్టవరమును కోరుకొనుము. దానిని నీకు అవశ్యము అనుగ్రహించుదును గాక'* అని అభయమునొసగెను. పుత్రసంతతి కొరకై పరితపించుచున్న రంభడు , తనకు సాటి వచ్చునటువంటి యొక్క కుమారుడిని ప్రసాదించుమని అగ్నిదేవుడిని కోరగా , అతడు 'తథాస్తు' అని పలికి ఆశీర్వదించెను.
*లీలాసా నీల పద్మాక్షి కరంభస్యసురద్విషః |*
*తనయా హృభవద్భూమౌ మహిషీ ముఖసంయుక్తా*
*జ్యేష్ఠభ్రాత కరంభస్య రంభోనామ మహాసురః*
*తస్యపుత్రస్తు మహిషోవిద్ధి నిర్జానాయకా ||*
(భూతనాధో పాఖ్యానము)
