తరువాత ఆ వేదిక పైన గురువు బియ్యమును పరచి, దానిపై మధ్యభాగములో తనకు సంబంధించిన కలశమును స్థాపించవలెను. మిగత నాలుగు కలశములను స్థాపించి, ఇట్టి పంచ కలశములకు దారమును (సూత్రమును) జుట్టి ఆ కలశములలో పాదోదక మిశ్రితమైన నీరును నింపి. మామిడి ఆకులను, గరికను, పోకలు, అరటిపండ్లు, తమలపాకులను, మున్నగువాటితో నలంకరించి రత్నములను (రజత రూప్యములను) అందుంచి, పిదప నా కలశములను భస్మము, గంధము, పుష్పాక్షతలతో విధ్యుక్తముగా పూజించి నైవేద్యము, తాంబూలము, దక్షిణ మొదలగునవి. కొత్త బట్టలలో బాపతులను (హక్కు) గట్టి ఉంచి ఒక కొత్త వస్త్రమును పంచకలశములపై కప్పి, ఈ విధముగా సిద్ధగించి, తరువాత దీక్షను స్వీకరించే శిష్యుడు తన హస్త ద్వయ సమన్వితుడై పూర్ణ కుంభమును గ్రహించి, పరిశుద్ధమగు వస్త్రములను దాల్చి విభూతితో గూడిన ఫలపుష్పాదులను దీసికొని, భయభక్తియుక్తుడై గురు సమీపమునకు వచ్చి, సాష్టాంగ ప్రణామంబు నాచరించవలెను. ఆ శిష్యుని పక్షమున ఈ విధముగ చెప్పించవలెను.
“ఓ గురూ ! నేను పాప సహితుడను. నన్ను ఈ పాపము నుండి యెడము చేయుము. (పాపముక్తుడిని జేయుము) ఓ దయా సాగరా ! నా హృదయమున గురు చిహ్నములు అంకురించినవి. కావున నో దేవా దయామయా ! నాకు ముక్తి నొసంగు మంత్రమును బోధించి సంసార సాగరమునుండి తరింపజేయుము.” అని ఈ విధముగా చెప్పించవలెను. ఆ మీదట శిష్యుని హస్తతలమునందు దర్భ ఉంగరమును గట్టిన సూత్రమును (దారమును) బట్టించి, గురువు లింగమును, మరియు శిష్యుని పంచగవ్యాదులతో పరిశుద్ధుడిని గావించి, మొదలు శిష్యుని హస్తమును అతని మస్తకమును పూజించి, తరువాత లింగపూజను క్రమముగా ఏడుమారులు. హస్తమునకు మరియు ఏడుమారులు, మస్తకమునకు ఏడుమారులు, పూజించి, మరల లింగమునకు ఏడుమారులు, ఇట్లు ఇరువది యొక్క పూజలను విధ్యుక్తముగా పదునొకండు పాత్రలలో (పాత్రలలో-గ్లాసుల్లో) మిశ్రిత మొనర్చిన వస్తు సామగ్రితో క్రమముగా నీదిగువ దెల్పిన విధముగా నాయాయామంత్రోచ్ఛారణలతో పూజ చేయించినంతరము నలుగురు ఆచార్య పుంగవులతో నామోదమును బడసిన వాడై. శ్రీగురువు పంచాక్షరీ మంత్రమును తన శిష్యునికి యుపదేశించి, అట్టి లింగాన్ని కంఠమునందు ధరించి, పాదతీర్థము నొసగి, దర్భ సహితముగా సూత్రమును కంకణముగాజేసి, కుడి ముంజేతికిగట్టి దండ-కమండల (జోలెను)మును చేతికిచ్చి భిక్షాటనజేయ వల్సిందిగా నాదేశించి అక్కడికాసమయములో ఉపస్థితులైయున్న భక్తా మహేశ్వరుల నుండి భిక్షనడిగి గురువునకు సమర్పించి నమస్కరించి వెళ్ళవలెను.
ఈ ప్రకారముగా మిగత శిష్యులకు నాచరింపజేసి మధ్యాహ్నము గణ తృప్తి జేయించవలెను.