విభూతిని ఎందుకు ధరిస్తున్నాం?

P Madhav Kumar
విభూతి అనగా ? పరమైశ్వర్యము, ఈశత్వము, నిర్దిష్టమైన శక్తి, గొప్పతనము, అభ్యుదయము, క్షేమము, మహత్యము, వైభవము అని అర్థాలు.
విభూతి లౌకికం అని, వైదికం అని, శివాగ్నిజం అని మూడు విధములు.
పృథ్వి , గోవు , జలం అనే త్రిశక్తుల నుండి విభూతిని తయారు చేస్తారు.
నుదుటను విభూతిని ఎందుకు ధరిస్తున్నాం? విభూతిని ధరించడం వలన దుష్టశక్తులు మన వద్దకు రాకుండా మనకు రక్షణ కల్పిస్తుంది. భయాలను పోగొట్టి అభయాన్ని అందిస్తుంది. విభూతిని ధరించడంవలన ప్రసన్నత ఏర్పడుతుంది. విభూతి
భోగభాగ్యాలను, మోక్షమును అనుగ్రహించునని వేదాలు, ఆగమాలు, పురాణాలు చెప్పియున్నవి. కనుకనే విభూతిని ధరిస్తున్నాం.
విభూతిని ధరించడం వలన ఏం లాభం కలుగుతుంది?
మనలో నిద్రాణమైయున్న ఆత్మజ్ఞానాన్ని మేల్కొలిపేశక్తి “విభూతి” కి వుంది. విభూతిని ధరించడం వలన ప్రసన్నత ఏర్పడి సకలదోషాలు నివృత్తి కాబడును. మనస్సుకి ప్రశాంతత కలుగును. ఆధ్యాత్మికంగా పురోగమించేందుకు తగిన జ్ఞానం కలుగును. తేజస్సు, యశస్సు కలుగును. భయములను పోగొట్టి ధైర్యమును అనుగ్రహించును.
ఆపదలనుండి రక్షించును. కనుక సకల దేవతలకు ప్రీతికరమైన విభూతిని ధరించి భగవదనుగ్రహాన్ని పొందుదాం.
చందనాన్ని ఎందుకు ధరిస్తున్నాం? గంధం హృదయానికి హాయిని, ప్రశాంతిని అందించి, మంచి మార్గంలో మనల్ని నడిపిస్తుంది. అంతేగాక విష్ణుతత్యానికి సంకేతమైన చందనాన్ని, శివతత్యానికి గుర్తుగా విభూతిని ధరించి, హరిహరుల ఏకత్వాన్ని తెలియజేస్తున్నాం.

🌺 విభూతి మహిమ 🌺

ఏ మానవుడైతే మూడు సంధ్యలలో తెల్లని భస్మంతో త్రిపుండ్రాలని ధరిస్తాడో అతడు పాపాల నుంచి విముక్తుడై శివుడితో కలిసి ఆనందిస్తాడు.

తెల్లని పవిత్ర భస్మాన్ని లలాటం మీద త్రిపుండ్రంగా ధరించే భక్తుడు శరీరం వదిలిన తరువాత శాశ్వతంగా శివలోకాన్ని పొందుతాడు. భస్మస్నానం అనగా భస్మాన్ని ధరించకుండా “ఓం నమఃశ్శివాయ” అనే శ్రీమంత్రాన్ని జపించకూడదు. త్రిపుండ్రాన్ని ధరించి మాత్రమే జపం చేయాలి. 

దయలేని వాడు, అధముడు, ఎన్నో పాపాలు చేసినవాడూ, సూర్యోదయ సమయంలో నిద్రపోయేవాడు, మూర్ఖుడు, పతితుడూ అయినప్పటికీ అటువంటి దుర్గుణాలున్న వాడు విభూతి ధరించి ఎక్కడ ఉంటాడో అక్కడే అన్ని తీర్థాలు, క్రతువులు వాడి సమీపంలోకి వచ్చి చేరతాయి. త్రిపుండాలని ధరించే మానవుడు కఠిన పాపాత్ముడైనా అతడు దేవతలు దానవులు, అందరి చేతా పూజించబడతాడు. 

ఇక శ్రద్ధగా విభూతి ధరించేవాడి గాప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. కనుక పండితులు, జ్ఞానులు ఈ విషయాన్ని తెలుసుకుని తప్పనిసరిగా భస్మాన్ని ధరించాలి. నిత్యం లింగ పూజ ఆచరించాలి. ప్రతిరోజూ ఓం నమశ్శివాయ మంత్రాన్ని జపించాలి. ఇలా ఈ భస్మధారణ ప్రభావాన్ని బ్రహ్మ, విష్ణు, రుద్రులు, మునులు కూడా వర్ణించలేరు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat