గురు మంత్రోపదేశ సాధన విధానం.

P Madhav Kumar

ధ్వజదత్తుడు అనే ఒక మహాత్ముడు ఉండేవాడుట. అతడు వేదవేదాంగ పండితుడు. సామాన్యుడు కాదు. పైగా అనేక శాస్త్రములలో నిష్ణాతుడు. ఆయనని ఆధారం చేసుకొని అనేకమంది శిష్యులు, విద్య నేర్చుకొనేవారు. విద్య నేర్పేవారు. వచ్చినవాడు నేర్చుకోవడానికి అర్హుడా? లేదా? అనే చూసేవారు గానీ, ఇవ్వగలడా లేదా అని, చూసేవారు కాదు. గురువుయొక్క లక్షణం, విద్యార్థి యొక్క శ్రద్ధ మాత్రమే. కానీ చిత్రమేమిటంటే ఈయనకి పూర్వజన్మ విశేషం చేత ఆర్థికంగా బలం లేదట. ఎవరికి? ధ్వజదత్తుడికి. విద్యంటే కావలసినంత ఉన్నది. పండితునిగా గౌరవమున్నది. కానీ ఆర్థికంగా పుష్టిలేదు. కానీ ఆ ఇల్లాలు ఎంత గొప్ప తల్లి అంటే ఈయన ఎంత తెచ్చాడో అంతే. ఇంటికి సరిపోయినంత ఆదాయం లేకపోయినా, ఎక్కడా లేమిని చెప్పేది కాదుట ఆ తల్లి. ఎంత గొప్ప విషయం చూడండి. ఆయన వచ్చేటప్పటికల్లా కావలసిన పదార్థాలుండేవి. తానూ, తన పిల్లలు తినీ తినక, ఈయనకి ఈ దరిద్రం కనపడకుండా చూసుకున్నారట. అలా భర్తను గమనించుకున్నారు. చరిత్ర చెప్పేటప్పుడు చాలా గొప్ప విషయం.

ఒక సమయంలో విద్యనేర్పుతూ ఎప్పుడూ తనతో పాటు వేదం వల్లె వేసే కుర్రవాడు కనపడకపోయేసరికి ఎక్కడున్నాడురా? అని తను లోపలికి వెళ్తాడు. ఆకలితో ఉన్న పిల్లవాడికి పండు పెడుతూందిట తల్లి. అది చూస్తాడు తండ్రి. ఏమిటి? భోజనం లేదా? పండు పెడుతున్నావు అంటే, మాకు భోజనం లేక చాలారోజులైంది. దొరికిన పండు, నీళ్ళే త్రాగుతున్నాం అనగానే, కళ్ళనీళ్ళు తిరుగుతాయి. భార్య ఎలా ఉందో, ఏంచేస్తోందో కూడా గమనించకుండా, నా విద్య, నా వ్యాపకంలో పడిపోయానే, ఎంత తప్పు చేశాను. నువ్వు మహా పతివ్రతవు. నీలాంటి పతివ్రతను బాధపెడితే, నాకు పాపం వస్తుంది, అన్నాడు. భార్యాభర్తల అనుబంధం చూడండి. అక్కడ పాతివ్రత్య ధర్మం ఎంత చెప్పాడో, ఇక్కడ పతిధర్మం అంత చెప్పాడు. ఆమె ఆవిధంగా గుట్టుగా సంసారం సాగిస్తున్నా, ఈయన నిన్ను ఇంత బాధ పెట్టాను అని, దుఃఖితుడయ్యాడు. ఇప్పుడు గృహస్థుగా నా బాధ్యత ఒకటుంది. ఇంట్లో దరిద్రం లేకుండా చూడవలసిన బాధ్యత గృహస్థుది. ఇంటి యజమానిగా నాబాధ్యత. అయితే దరిద్రం పోగొట్టుకోవడానికి, నాలాంటి వేదవేత్తలకి మార్గములేమిటి? చెప్తాడు. 

*1. అధ్యాపనము*
 *2. దానము*
*౩. జపము*

 ఈ మూడింటితో ప్రస్తుతము నేనున్న  దుర్దశనుంచి బయటపడాలి. ఎందుకంటే ఇవాళ దరిద్రం కానీ, సంపద కానీ, ఇవాళ ప్రయత్నం వల్ల రాదు. ప్రారబ్ధం బట్టి వస్తూంటాయి. కనుకనే ఇంత పండితుడైనా, ఇంత మంది విద్యార్ధులకి విద్య నేర్పుతున్నా, తన దారిద్ర్యానికి కారణం, పూర్వజన్మయొక్క పాపమే. దానినుంచి బయటపడాలి అంటే, దానికి అనేక పరిహారాలున్నాయి. 

తాను దైన్యాన్ని ఆశ్రయించి, కొన్ని యాచించాలి. 

లేదా, మంత్రాన్ని ఆశ్రయించి, జపం చేయాలి. అందులో ముఖ్యంగా, విప్రుడికి చెప్పిన పెద్ద ఉపాయమేంటంటే, “జప్యేనైవతి సిద్ధ్యంతే” – జపం చేతనే ఏదైనా సాధింపజేసుకోవాలి. 

ఇది ప్రధానం. అందుకు నేను ఈ దరిద్రం నుంచి బయట పడడానికి, ఏదైనా మంత్రం, గురువును ఆశ్రయించి, స్వీకరించి, తరించుతాను. అప్పుడు ఆధనాన్ని స్వీకరించి వచ్చి, ఇక్కడ కుటుంబాన్ని, పోషిస్తాను. మంత్రసిద్ధితో, దరిద్రం నుంచి, బయటపడాలి, అనుకున్నాడు. సరియైన గురువు ఎవరు దొరుకుతారా అని బయలుదేరాడట.

అంతమంది మహర్షులకీ ఆశ్రయమైన చోటు ఒకటుంది – నైమిశారణ్యం. ఆ నైమిశారణ్యంలో, పుష్కరుడు అనే మహాత్ముడు ఉన్నాడు. ఆయన గురించి విని, ఆయనను శరణు వేడాడు. స్వామీ! నేను దరిద్రంలో బాధపడుతున్నాను. దీనినుంచి బయటపడే ఉపాయాన్ని నాకు చెప్పు, అని ప్రార్థన చేస్తే, అప్పుడు ఆ పుష్కరుడు, బాగా ఆలోచన చేసి, తనదైన దైవాన్ని ధ్యానిస్తే, ఆ దైవం ప్రేరణ ఇచ్చాడట. *ఇతనికి హనుమన్మంత్రం ఇవ్వు అని*. ఎందుకంటే ఆయన హనుమదుపాసకుడు కనుక, వెంటనే ద్వాదశాక్షరీ మంత్రాన్ని ఉపదేశం చేశాడు. దీనిని స్వీకరించి, జపం చెయ్యి అని. పైగా ఈయన పండితుడు గదా! అదొచ్చింది బాధ. పాండిత్యం ఉంటే ఒక ప్రమాదం, లేకపోతే మరో ప్రమాదం. పాండిత్యం ఉంటే అహంకారం వస్తుంది. దానితో ఇచ్చిన గురువును పట్టించుకోకుండా ఇది మంత్రం, అది దైవం. ఆ దైవం మంత్రం ఆయన ఇచ్చాడు అంతే. ఒక వస్తువు ఇచ్చినట్లు మంత్రం ఇచ్చాడు. ఇక గురువును ప్రక్కన పెట్టాడు.
మంత్రాన్ని మాత్రం జపం చేశాడు. చాలా జాగ్రత్తగా. ఈ మంత్రం సిద్ధినిస్తుంది అనే ఆశతో, పైగా పండితుడు గదా, ఆయనకి తెలుసు, మంత్రం అక్షర లక్షలు చేయడం, దశాంశ హోమం చేయడం, దశాంశం తర్పణం చేయడం, దశాంశం అన్నదానం, ఇవన్నీ చేశాడు. అలా ఈ మంత్రానికి అనేక పురశ్చరణలు చేశాడట. కానీ మంత్రం సిద్ధించలేదు. పరిస్థితి అలాగే ఉంది. ఎప్పుడైతే సిద్ధి దూరమైందో వెంటనే అనుమానం మొదలైంది. నేనేమిటి? అనేక వేదములు తెలిసినవాడిని. ఆ వేదములలో ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని, జపం చేయచ్చుగా. ఇక్కడికెందుకు రావాలి? నా ప్రారబ్ధం ఇలా ఉన్నది. వచ్చినప్పుడు ఏదో మంత్రం ఇచ్చాడు. అదేదో హనుమన్మంత్రంట. ఇది అసలు ఆభాస మంత్రమా? అసలు మంత్రమా? ఆలోచిస్తున్నాడు. ఇచ్చిన ఆయనలో లోపమో, మంత్రంలో లోపమో, దేవతలోనో లోపముంది . అందుకు ఈ మంత్రం పండలేదు అనుకున్నాడట. ఇన్ని పురశ్చరణలు చేశాను అని ఒక నైరాశ్యంలో ఉన్నాడు.

ఆ సమయంలో ఒక
దొంగ, రోగిష్టియై అటు వస్తున్నాడు. ఎందుకంటే ఒళ్ళు బాగున్నప్పుడు దొంగతనాలు, పాపాలు ఎన్నో చేశాడు. అనారోగ్యం వచ్చిన తర్వాత అతనిలో పశ్చాత్తాపం మొదలైంది. ఈ తప్పులనుంచి ఎలా బయటపడతాను? ముందు రోగం నుంచి ఎలా బయటపడతాను? అని కాదు. ఇన్ని పాపాలనుంచీ ఎలా బయటపడతాను, అని ఆర్తితో, అటు వస్తూ ఉన్నాడు. ఈయన జపం చేసుకుంటూ కనపడ్డాడు. (ధ్వజదత్తుడు). ఆయన దగ్గరికి వచ్చాడు ఈ దొంగ. ఆయన పేరు గాలుడు. ఒక బోయ జాతికి చెందినటువంటి చోరుడితను. ఈయన ఎవరు నువ్వు? అని అడిగాడు. దాచుకోకుండా విషయాలు చెప్పాడు. "నేను తరించడానికి ఈ నైమిశారణ్యంలో ఎందఱో మహాత్ములుంటారు కనుక, ఏ మహర్షియైనా, ఏదో ఒక మంత్రాన్ని ఇవ్వడా, అని ఎదురుచూస్తున్నాను" అన్నాడు.

అయితే ఈయన చెప్పాడు, " " " ఏమిటో నాకు ఇన్నాళ్ళు జపం చేసిన అనుభూతితో చెప్తున్నాను, మంత్రాలూ లేవు, దేవుళ్ళూ లేరు, ఫలించడం అంతకంటే లేదు. ఇదంతా కొంతమంది చేసిన, ఒకానొక వంచన మాత్రమే. నిజంగా మంత్రం సిద్ధించాలంటే, శాస్త్రంలో చెప్పినట్లు, అక్షర లక్షలు ఏమిటి, అక్షర కోట్లే చేశాను, పురశ్చరణ, హోమాలు, ఎన్నో చేశాను. కనుక ఇవన్నీ అబద్ధమే. లేదా ఇవన్నీ అబద్ధం కాకపొతే, గురువైనా అబద్ధం అయి ఉండాలి. గురువులో బలం లేదు. అందుకని ఇంకొక్క మాట చెప్తున్నాను. నా దగ్గరా పండించుకునే మంత్రములేమీ లేవు, తేలిపోయింది. గురువులెవరైనా ఉంటారా అంటే, ఇక్కడ పుష్కరుడు అని ఉన్నాడు, ఆయన దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరైనా తీసుకో అన్నాడు. అతను వంచకుడు. అతని వల్లే, నాకాలమంతా వ్యర్తమైంది. అతను ఇచ్చిన ఆభాస మంత్రం పట్టుకొని, ఇంతకాలం జపం చేస్తూ, పాడయ్యాను, అందుకు ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళకు" అన్నాడట.

ఈ దొంగ ఆయన దగ్గరికే వెళ్ళాడు. "చూద్దాంలే. కొంతకాలం ఆగు" అన్నాడుట. ఈయన చూద్దాంలే అన్నాడు కానీ గాలుడు వదలలేదు. ఆయన కంటి చూపులో పడేటట్లుగా, ఆయనకి శుశ్రూష చేయడం, మొదలుపెట్టాడట. కావలసినవన్నీ సమకూర్చడం, దణ్ణం పెట్టడం..ఈయన శ్రద్ధను గమనిస్తున్నాడు. అలా కొంతకాలం గమనించాక జాలి కలిగిందిట. ! ఇతనికి ఏ మంత్రం ఇవ్వను? ఏ మంత్రం ఇవ్వాలో నేను నిర్ణయించడం ఏమిటి? నా బుద్ధికి కూడా ప్రేరణ నా దైవము, నా సర్వస్వము అయిన ఆంజనేయస్వామి. అనుకోని ఒక్కసారి హనుమంతుణ్ణి ధ్యానం చేసాడట. స్వామీ! ఇతను ఆర్తిపరుడు. నిజమైన పశ్చాత్తాపం ఇతనియందు ఉన్నది. ఇన్నాళ్ళూ నా కనుసన్నలలోనే మసలుతూ ఉన్నాడు. రోజూ తెల్లవారుఝామున స్నానం చేయడం, పవిత్రంగా ఇక్కడ కూర్చోవడం, ఏదో భగవన్నామం జపం చేసుకుంటూ ఉండడం, పువ్వులు పండ్లు తీసుకు వచ్చి నా యజ్ఞానికి కావలసిన సంబారములు దూరం నుండే సమకూర్చుతూ, నియమబద్ధంగా ఉన్నాడు. ఇతనిపై నాకు జాలి కలుగుతోంది. ఏమంత్రం ఇస్తే యితడు సిద్ధి పొందుతాడో, చెప్పు" అన్నాడు. అప్పుడు హనుమంతుడు చెప్తున్నాడు. 

“నా మంత్రములు అనేకములున్నాయి. నా మంత్రానికి అన్ని వర్ణముల వారూ అర్హులే. ప్రతివారూ నామంత్రానికి అర్హులే. అయితే వాడికి నాపై నిష్కపటమైన భక్తి ఉంటే, తప్పకుండా మంత్రానికి అర్హుడవుతాడు. కాబట్టి నామంత్రం ఇతనికి ఇవ్వు" అని, ఆంజనేయస్వామి వారే, ఉపదేశించారు. 

"మొత్తానికి నువ్వు భాగ్యవంతుడి
 వయ్యావయ్యా, నీకు మంత్రం ఇమ్మని హనుమంతుడే ఆదేశించాడు" అని చెప్పి హనుమన్మంత్రం ఇచ్చాడట.

 మంత్రం పుచ్చుకుంటూనే శిష్యుడు పరవశించి పోయాడు గురువు కృప లభించింది అని.

అయితే ఈ మంత్రం ఇచ్చేముందు, ఒక పధ్ధతి చెప్పాడట. "ముందు వెళ్ళి నదిలో స్నానం చేసిరా" అన్నాడు. 

"నదీ స్నానం కంటే మీ పాద జలం ఇంకా గొప్పది కనుక అది నాపై జల్లండి" అన్నాడుట.

 ఆశ్చర్యపోయాడు గురువు. చెప్పిన ప్రకారంగా కాళ్ళు కడిగిన నీళ్ళు జల్లాడట. "ఇదే నాకు సర్వనదీ స్నానము, మంత్రమివ్వు" అన్నాడు.


 గురుభక్తి – అదీ ప్రధానం. అది చూశాడు. ఆమంత్రాన్నివ్వగానే," ఎక్కడికి వెళ్ళి చేసుకుంటావు?"అడిగాడు 

"గురుసన్నిధి కంటే గొప్ప తీర్థం లేదు. నువ్వు ఇక్కడే ఉండు." అన్నాడుట. 

గురుసేవ చేసుకుంటూ, జపమాల తీసుకొని, అష్టోత్తర శతం తిప్పగానే, హనుమత్ దర్శనం అయింది మహానుభావుడికి. ఆనంద పరవశుడై, నమస్కారం చేస్తున్నాడు.

హనుమంతుడు "నీకేం కావాలి?" అని అడిగాడు. 

"నాకేమీ అక్కరలేదు, ఎందుకంటే నాకు గురుకృప లభించింది, నీ కృప లభించింది, ఇంకేం కావాలి నాకు?" అన్నాడు. 

"నువ్వు ఆధివ్యాధులతో ఇక్కడికి వచ్చావు. గురుపాదజలం నీమీద పడగానే, నీ రోగాలన్నీ పోయాయి. అది తెలుసా నీకు? ఎందుకంటే నిరంతర మంత్రజప పరాయణుడైన గురువు శరీరం, మంత్రమయం. అలాంటి పాదాలను కడిగి వచ్చిన నీరు, అది మంత్రమయం. అది నీపై పడింది కనుక, నువ్వు శుద్ధుడివైపోయావు అప్పుడే. ఎల్లవేళలా నా అనుగ్రహం నీకుంటుంది."

" నాకింతకంటే వరం ఇంకొకటి అక్కరలేదయ్యా, నువ్వు నాకుంటే చాలు" అన్నాడు. 

"ధన్యుడవయ్యావు" అన్నాడు. 

వెంటనే వచ్చి," నాకు స్వామి దర్శనమయ్యిందండీ" అన్నాడుట. 

"చాలా సంతోషం నాయనా! కానీ మంత్రం సిద్ధించింది అని చెప్పి జపం మానేయకు. ఇది నిరంతరం చేయవలసిందే. మంత్రం జాపకుడికి అహంకారం కూడదు.

అది లభించిన దగ్గరి నుంచీ, సిద్ధింప జేసుకోవాలి, అని తపన ఉండాలి. అందుకు గురుభక్తి చాలా ముఖ్యం.


*”యస్య దేవే పరాభక్తిః యథా దేవే తథా గురౌ!”* 

ఉపనిషత్తు చెప్తోంది. సాధకుడికి దేవతయందు పరమ భక్తి కలిగి
ఉండాలి.దేవతయందు ఎంత భక్తి ఉందో, గురువుయందు,
 అంత భక్తీ ఉండాలి. నీకు మంత్రం సిద్ధించి గనుక, ఇంక నువ్వు వెళ్ళు" అన్నాడు. 

"నేను వెళ్ళను. మీ దగ్గర ఉంటే ఇంత అనుగ్రహం లభించినప్పుడు, మీ దగ్గరే ఉంటాను" అన్నాడు.

"కాదు, నువ్వు చేయవలసిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి వెళ్ళు. ధర్మ బద్ధములైన భోగములు అనుభవించు. ధర్మబద్ధమైన సంపదని ధర్మకార్యాలకి వినియోగించు. ఇంతవరకూ అధర్మంగా వచ్చి అధర్మంగా సుఖించావు. ఇప్పుడు ధర్మముగా సంపాదించి, త్యాగానికి వినియోగించు. ధనాన్ని త్యాగానికి వినియోగించు, స్వార్థానికి వినియోగించకు. తద్వారా, నీవు ఆర్జనతో సంపాదించిన పాపములన్నీ, పోగొట్టుకొంటావు. ఒకప్పుడు ఆర్జనా దోషం నీదగ్గర ఉంది. ఆర్జన దోషం పోవాలి అంటే, త్యాగముతో పోగొట్టుకోవాలి. మంత్రాన్ని ఎప్పుడూ వీడకు. ఇది నా ఆజ్ఞ. నువ్వు వెళ్ళు" అన్నాడుట. 

గురుపాదాల దగ్గర ఏడ్చాడట. గురువును విడిచి వెళ్ళవలసి వస్తోందే అని ఏడ్చాడు, కానీ గురువాజ్ఞను శిరసా వహించి వెళుతూ ఉన్నాడు.

అరణ్యంలో ధ్వజదత్తుడు ఉన్న చోటునుంచి వెళుతూ ఉన్నాడట, దూరంనుంచి ధ్వజదత్తుడు చూసి పిలిచాడట. ఆయనకి దొరకకుండా పరుగెత్తడం మొదలుపెట్టాడు." మిత్రమా! ఉండు." అని వెనక్కి వెళ్ళి, గట్టిగా పట్టుకున్నాడు ధ్వజదత్తుడు. 

"ఏంటి అలా పరుగెడుతున్నావు? ఒకప్పుడు దీనుడవై ఇటునుంచి వెళ్లావు. ఇప్పడు చాలా కళకళలాడుతూ ఉన్నావు. ఏం జరిగిందేమిటి?" అన్నాడు. 

"నేను నీకు కనపడకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నది ఎందుకంటే, నువ్వు గురునింద చేస్తావు. గురునింద వినకూడదు. అందుకే పారిపోతున్నాను" అన్నాడు. 

"ఎందుకంటే ఉత్తమ సాధకుడు, ఆత్మస్తుతి, గురునింద, ఈరెండూ వినడు. గురునింద వింటే మహాపాపం. నిష్కృతి లేదు. నేను వినకూడదని బయలుదేరాను. పొరపాటున కూడా నువ్వు ఒక్కమాట అనకూడదు." అన్నాడు. 

"ఏంటి అలా అంటున్నావు?"

 నోరు తెరిచి ఎక్కడ తిడతాడో అని భయం గాలునికి. 'నేను ఈ స్థితి పొందడానికి కారణం నా గురుపాదజలం."అన్నాడు. అంతేకానీ, మంత్ర మహిమ అనలేదు. "గురువు వల్ల నాకు హనుమంతుని అనుగ్రహం లభించింది. "అన్నాడు.

"ఎంత పురశ్చరణ చేశావేంటి? ఎన్ని కోట్లు చేశావేం?" అన్నాడు
ధ్వజదత్తుడు.

" కోట్లు తెలియవు. ఒక మాల త్రిప్పాను" అన్నాడు. 

వెంటనే ఆశ్చర్యచకితుడై పోయాడు ధ్వజదత్తుడు. అంత పొగరు ఇప్పుడు దిగింది. అంత పురశ్చరణ చేశా, ఇన్ని హోమాలు చేశా, ఇన్ని చేశా ఏమైంది నాకు? ఏమీ లేదే! అని దుఃఖితుడయ్యాడు.

" ఎవరింతకీ గురువు?" అన్నాడు. 

"ఎవరేమిటి? పుష్కర స్వామే నా గురువు" అన్నాడు.

వెంటనే ఏడుపు వచ్చింది. ఛీ ఏమిటి ఈ పాండిత్యం? ఏమిటి ఈ అహంకారం? అని, అహంకార రహితమైన వైరాగ్యం కలిగి, పుష్కర స్వామి వద్దకు వెళ్ళి, కాళ్ళమీద పడి, ఏడ్చాడు.

" లేలే మంత్రం పండిందా? "అని అడిగాడట స్వామి. 

"స్వామీ! ముందు గురుభక్తి పండకపోతే, మంత్రం కూడా పండదు అని బుద్ధి ఇప్పుడు వచ్చింది" అన్నాడు. 


అందుకు గురుభక్తి లేనివాడికి ఎన్ని మంత్రములు చేసినా ప్రయోజనం లేదు. అందుకు నీ కృప కావాలి నాకు. అప్పడు ధ్వజదత్తుడు ధ్యానంలో చెప్పాడు. నీకు గురువుయందు శ్రద్ధ లేకపోవడం వల్లనే, మంత్రం పండలేదు అని, హనుమంతుడు చెప్పిన మాట. మంత్రము ఇచ్చినప్పుడు ఆ మంత్ర దేవత, గురుమూర్తిగా అనుగ్రహిస్తోంది. గురువే ఆ మంత్రముయొక్క దేవత అని, ముందు తెలుసుకోవాలి. అని చెప్పి, ఒక్కసారి ధ్యానం చేసి, ఒక్కమాట చెప్తున్నాడు.


*”మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భిషజే గురౌ యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాదృశీ”* – స్వయంగా పుష్కరుడు చెప్పిన మాట.


మంత్రమునందు, తీర్థమునందు, ద్విజునియందు, దైవముయందు, దైవజ్ఞునియందు, ఔషధమునందు, గురువుయందు, నీకు ఎలాంటి భావన ఉంటే సిద్ధి అలా ఉంటుంది.


అది చాలా ముఖ్యమైన అంశం. మనం చేస్తూ, అంత చేశాను కానీ నిజమేనా అని, అనుమాన పడితే, అసలు జరుగదు.


*”శ్రద్ధావాన్ లభతే జ్ఞానం”* అనే మాట ఇక్కడ మనం తెలుసుకోవాలి. శ్రద్ధ అంటే శాస్త్రవాక్యములయందు విశ్వాసం.


 *మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భిషజే గురౌ యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాదృశీ* -ఇదీ తెలుసుకోవలసినటువంటి అంశం.

ఆ విధంగా ఆశ్రయించు అంటే, ఇంక గురువును వదలకుండా, మంత్రజపం చేసి, సిద్ధి పొందాడు ధ్వజదత్తుడు. 


ఈ  కథ పరాశరసంహితలో చెప్పబడినటువంటిమాట


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat