మానవుడు స్వర్గం లబిస్తుందన్నా చనిపోవటానికి ఇష్టపడడు. చావంటే భయం. జీవితం కలలో కనబడే, వినబడే ఒక పాటలా వున్నట్లనిపిస్తుంది. కానీ, తెలిసిన వారు చనిపోయిన తరువాత, చావంటే భయంగా అనిపిస్తున్నది. చావంటే ఎందుకు భయంగా వుంది.. జీవితం, మరణం వీటిని తలుచుకుంటే ఇప్పుడు ఎందుకో ఆందోళనగా వున్నది. ఎందుకీ ఆందోళన.. ఇవీ, ప్రతి మనిషి లోని భావతరంగాలు, సంశయాలు, ప్రశ్నలు..
పుట్టుక.. మరణాంతరం ఏమి జరుగుతుంది..
తెలుసుకునే ముందు ”పుట్టుక” గురించి కొంత తెలుసుకుంటే బాగుంటుంది. ఆధునిక జీవశాస్త్రం ప్రకారం, మనిషి కోతి నుండి పుట్టాడని చెప్పబడింది. అంటే, కోతి యొక్క అనేక జీవపరిణామ దశలు దాటి, అత్యున్నతమైన దశారూపమే నేటి మానవుడు అని అర్ధం. అయితే, భారతదేశ పురాణాలు, శాస్త్రాల ప్రకారం, బ్రహ్మ సృష్టి ద్వారా, మనువులు అనేవారి ద్వారా మానవులు పుట్టబడ్డారు అని తెలియబడుతున్నది.
మరణాంతరము, పునర్జన్మ అనేది వున్నదని, జీవుల యొక్క పాప, పుణ్యాలను బట్టి (ఇవి మనిషి యొక్క మానసిక స్థితి) జీవులు తిరిగి, వారి, వారి తీవ్రమైన కోరికలనుసరించి, మానవులుగా గానీ, క్రిమి కీటకాదులుగా గానీ, చెట్లు, పక్షులు, జంతువులుగా గానీ పుట్టవచ్చును. అయితే, ఈ ప్రక్రియ అంతా, “చైతన్యశక్తి”చే నడిపించ బడుతూవుంటుంది. ఈ శక్తి, తనకు తానుగా, అనేక రూపాలుగా, జీవులుగా పుడుతూ వుంటుంది.
దేహంలోవున్న “దేహి” అంటే “ఆత్మ శక్తి”. ఈ ఆత్మ శక్తికి పుట్టుక, చావు అనేవి లేవు అని చెప్పబడింది.
మరణం...
మరణానికి మరొక మారుపేరు, ” మార్పు“. మార్పుని మనందరం చాలా సహజంగా స్వీకరిస్తాం. కానీ, మరణం అనే పదాన్ని వాడగానే, చాలా భయపడి పోతూవుంటాం. మానవునికి జీవించి వున్నప్పుడు ఆరు దశలున్నాయి. వీటినే “అవస్థాషట్కము” అని అంటారు. అవి..
1) పుట్టుట,
2) ఉండుట,
3) పెరుగుట,
4) మారుట,
5) క్షీణించుట,
6) నశించుట.
..దీనినే, భగవద్గీతలో, రెండవ అధ్యాయం, 13వ శ్లోకంలో నాలుగు అవస్థలుగా చెప్పారు..
*దేహినోస్మిన్ యధాదేహే కౌమారం యౌవనం జరా |*
*తథాదేహాన్తర ప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి ||*
అర్ధం: జీవికి బాల్యము, యౌవనము, వార్ధక్యము, మరియు దేహాంతర ప్రాప్తి అను నాలుగు అవస్థలు. ఇవన్నియూ మార్పులే. మనిషి, బాల్యముపోయి, యౌవనము వచ్చినప్పుడు, దుఃఖించుట లేదు, యౌవనముపోయి, వార్ధక్యము వచ్చినప్పుడు దుఃఖించుటలేదు, కానీ, వార్ధక్యము పోయి, మరణం ఆసన్నమైనప్పుడు మాత్రము దుఃఖపడుతూ, బయం పొందుతూ వుంటాడు. అయితే, మరణమనే మార్పు తరువాత, ” దేహాంతరప్రాప్తి ” అనగా మరొక దేహమును పొందుట అనేది ఖచ్చింతగా వున్నప్పుడు, ప్రస్తుత జన్మలో మరణం గురించి భయపడనవసరం లేదు.
ఇక్కడ, ఈ విషయాన్ని రెండు కోణాల్లో పరిశీలిస్తే, చివరిగా రెండిటి లక్ష్యము, పరిణామం ఒకటి గానే కనిపిస్తుంది.
దేహాన్ని ఆవరించియున్న ఆత్మశక్తి. ఈ శక్తికి చావు, పుట్టుకలు లేవు అన్నాంకాబట్టి, ఎప్పుడూ నిత్యంగానే వుంటున్నది కాబట్టి, మరణం గురించి భయపడనక్కరలేదు.
మరణం, దేహానికి అని చెప్పబడింది. కానీ, దేహాంతరము, కొత్త దేహప్రాప్తి వున్నది అని చెపబడినపుడు, మరణం గురించి భయపడనక్కరలేదు. “ఉనికి” కి అంతము లేదు. జీవి అనే ఉనికికి కూడా అంతం లేదు.
ఇదంతా ఆద్యాత్మికత, తెలివితో ఆలోచించ గలిగిన వారికి మాత్రమే వర్తిస్తుంది. లేనివారికి, మరణం ఎప్పుడూ భయంకరం గానే వుంటుంది...