“ఆత్మ నిజమైతే”
నేనే నిజమైతే నా స్వామి నిజమౌనా
నా ఆత్మ నిజమైతే పరమాత్మ నీవేగా ||నేను నిజమైతే||
ఆవువంటివాడు నేనైతే – పాలవంటివాడు నా స్వామియే
ఆవుకు రంగులు ఉన్నవిగాని – పాలకు రంగులు లేవుగా ||నేను నిజమైతే||
జాతివంటివాడు నేనైతే – నీతివంటివాడు నా స్వామియే
జాతికి కులములు ఉన్నవిగాని – నీతికి జాతులు లేవుగా ||నేను నిజమైతే||
పూలవంటివాడు నేనైతే – పూజవంటివాడు నా స్వామియే
పూలకు రంగులు ఉన్నవిగాని – పూజకు రంగులు లేవుగా ||నేను నిజమైతే||
చెరుకువంటివాడు నేనైతే – తీపివంటివాడు నా స్వామియే
చెరుకుకు గనుపులు ఉన్నవిగాని – తీపికి గనుపులు లేవుగా ||నేను నిజమైతే||
ఏరువంటివాడు నేనైతే – నీరువంటివాడు నా స్వామియే
ఏరుకు వంపులు ఉన్నవిగాని – నీరుకు వంపులు లేవుగా ||నేను నిజమైతే||
భజనవంటివాడు నేనైతే – భక్తివంటివాడు నా స్వామియే
భజనకు వంతులు ఉన్నవిగాని – భక్తికి వంతులు లేవుగా ||నేను నిజమైతే||