మహాభారతం - ద్రోణ పర్వము - పంచమాశ్వాసము-1

P Madhav Kumar


-పాండవ శిబిరంలో ఆనందోత్సాహాలు


సైంధవుని మరణానంతరం ధర్మజుని కలసిన కృష్ణార్జునులు
సైంధవవధా సందర్భమున కృష్ణార్జునులు చూపిన ప్రతిభ ధృతరాష్ట్రుడిలో భయోత్పాతాలు కలిగించాయి. " సంజయా ! సైంధవ వధానంతరం నా కుమారులు ఏమి చేసారో వివరించుము " అన్నాడు. సంజయుడు " మహారాజా ! సైంధవవధ కలిగించిన ఉత్సాహంతో పాండవసేన కౌరవసేనతో తలపడింది. కృపాచార్యుడు, అశ్వత్థామ అర్జునుడి మీద శరవర్షం కురిపించారు. అర్జునుడు ఆ శరములన్నీ ఖండించి తిరిగి వారి మీద శరవర్షం కురిపించాడు. శరధాటికి కృపాచార్యుడు స్పృహతప్పాడు. అతడి సారధి కృపాచార్యుని పక్కకు తీసుకు వెళ్ళాడు. అశ్వథ్థామ కూడా అతడి వెంట వెళ్ళి పోయాడు. అది చూసి అర్జునుడు ఖిన్నుడైయ్యాడు. కృష్ణుడు అర్జునుడుని ఓదారుస్తూ " అర్జునా ! దేవేంద్రునికైనా గెలువ సాధ్యం కాని కురుసేనను ఒంటి చేత్తో గెలిచిన నీ పరాక్రమము ప్రశంశనీయము. సైంధవుని తల వృద్ధక్షతుడి ఒడిలో పడవేసి మహా తపోధనుడి శాపం నుండి తప్పించు కున్నావు. ఇంద్రుడిచ్చిన శక్తాయుధంతో విర్ర వీగుతున్న కర్ణుని జయించి ప్రశంశా పాత్రుడవు కమ్ము " అన్నాడు. అర్జునుడు కృష్ణా ! అలా అనకు నీ కృపతో నేను సైంధవుని వధించగలిగాను. నీ కటాక్షవీక్షణం పొందిన వాడికి కార్య సిద్ధి కలుగక మానదు " అన్నాడు. ఆ మాటలకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి " అర్జునా! మన కొరకు ధర్మరాజు ఎదురు చూస్తుంటాడు. మనం వెళ్ళాలి " అన్నాడు. అర్జునుడు, సాత్యకి, భీముడు, ఉత్తమౌజుడు ధర్మరాజు వద్దకు వెళుతుండగానే సూర్యాస్తమయం అయింది. ఇరు పక్షాలు యుద్ధం మాని తమ శిబిరాలకు వెళ్ళారు. ధర్మరాజు శిబిరం చూసి కృష్ణుడు పాంచజన్యం పూరించాడు. ఆ శంఖధ్వని విని ధర్మరాజు వెలుపలకు వచ్చి ఒకే సారి వారిద్దరిని కౌగలించుకొని ఆనందబాష్పాలు రాల్చి " అర్జునా! అర్జునా! నీ శపధము నెరవేర్చుకున్నావు. ఈ మహానుభావుని దయ వలన ఈ గండం గడిచి బయట పడ్డాము " అని శ్రీకృష్ణుని కృతజ్ఞతాభావంతో చూసాడు. శ్రీకృష్ణుడు " ధర్మజా! కౌరవుల మీద మీకు ఉన్న కోపమే ఈ విజయానికి కారణం అయింది. మీ వంటి సత్పురుషుల కోపాన్ని తట్టుకోవడం ఎవరి తరం ? ఒక్క అర్జునుడే కాదు, సైంధవుని వధించుటే కాదు, ఇలాంటి దుస్సాధ్యమైన కార్యాలు ఎన్నైనా ఎవరైనా అవలీలగా చేయగలరు. మీలాంటి సత్ప్రుషుల కోపానికి ఉన్న ప్రభావం అలాటింది " అన్నాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజు " కృష్ణా! నీవే అలిగిన దేవాసురులు సహితం రూపు మాసిపోతారు. నీ దయ ఉంటే మాత్రమే జీవులు సుఖంగా జీవించగలరు. మా మీద నీ దయ ప్రసరించినంత కాలము మాకు కార్య సిద్ధి లభిస్తుంది " అన్నాడు వినయంగా. ఇంతలో భీముడు, సాత్యకి ధర్మరాజుకు నమస్కరించారు. ధర్మరాజు వారిని లేవనెత్తి కౌగలించుకున్నాడు. శత్రు సంహారంతో ధర్మరాజు ఆనందానికి అవధులు లేక పోయింది.

కౌరవశిబిరంలో విషాదచ్ఛాయలు

కౌరవ శిబిరంలో విషాదచ్ఛాయలు అలముకున్నాయి. సుయోధనుడు తనలో తాను ఇలా తర్కించుకున్నాడు. " అర్జునుడికి కోపం వచ్చిన దేవతలకే అలవి కాడు. ఇక ద్రోణుడు, కర్ణుడు ఎంత అని నేడు తేటతెల్లం అయింది. ద్రోణుడు, కర్ణుడు మమ్ము ఎంత ఆదుకొనవలెనని ప్రయత్నించినా అర్జునుడి ముందు శక్తిహీనులు అయ్యారు " అనుకుంటూ ద్రోణుని వద్దకు వెళ్ళి " ఆచార్యా ! ప్రతిరోజు యుద్ధంలో మనకు అపజయం పాండవులకు విజయం లభిస్తుంది. నా తమ్ములతో సహా అనేక యోధులు మరణించారు. ఆ శిఖండి కారణంగా మహాబలవంతుడైన భీష్ముడు పడిపోయాడు. మన సైన్యంలో ఏడు అక్షౌహినుల సైన్యం మరణించారు. సైంధవుడు మరణించాడు, మన కొరకు ప్రాణాలు లెక్క చేయక యుద్ధము చేయవచ్చిన రాజులు అసువులు బాసారు. ఇక నేను పాండవులను వధించి విజయం సాధించడమో లేక వీరస్వర్గం అలంకరించడమో మాత్రమే మిగిలి ఉంది . మరేదైనా మార్గం ఉంటే శలవివ్వండి. మీకు అర్జునుడు ప్రియశిష్యుడు ఆ కారణంగా అతడు చేజిక్కినా చంపక వదిలివేయడమే కాక అతడికి సాయం చేస్తున్నారు. కర్ణుడు ఎంతటి వీరుడైనా యుద్ధనైపుణ్యంలో కాని కార్య సాధనలో కాని మీకు సాటి రాడు. ఉపాయము అనుభము ఉన్న మీరు మాకు సహకరించడం లేదు. కర్ణుడు ఎంత ప్రయత్నించినా సైంధవుని రక్షించ లేక పోయాడు. సామర్ధ్యం కలిగిన మీరు కాపాడ లేదు " అన్నాడు.

ద్రోణుని వ్యధ

సుయోధనుడి ములుకుల వంటి మాటలకు నొచ్చుకున్నద్రోణుడు " సుయోధనా ! నా గుండెలు తూట్లు పొడిచే మాటలు ఎందుకు మాట్లాడతావు. కృష్ణుని సాయం ఉన్నంత వరకు అర్జునుడిని గెలవడం అసాధ్యమని నీకు ముందే చెప్పాను నీవు వినలేదు. దేవతలకే గెలువ శక్యము కాని భీష్ముని పడగొట్టిన అర్జునుడికి సాధ్యము కానిదేముంది. నేను నీ పక్షాన యుద్ధము చేస్తున్నది నా అభిమానం కాపాడు కోవడనికే కాని పాండవులను జయిస్తానని కాదు. సుయోధనా ! నాడు నిండు సభలో శకుని చేత పాచికలాడించి పాండవులను అనేక విధముల అవమానించి హింసించావు. నేడు ఆ పాచికలే అర్జునుడి బాణాలై నిన్ను బాధిస్తున్నాయి. వాటిని నిలువరించడం ఎవరి తరం చెప్పు. విదురుడు ఎంత చెప్పినా వినక నాడు పాండుసతిని కొలువు కూటముకు ఈడ్చి చేసిన అవమానం ఊరక పోతుందా ! ఆ వీరపత్నిని నిండు సభలో నీవు, దుశ్శాసనుడు, కర్ణుడు తూలనాడి అన్న మాటలు ఊరకే పోతాయా ! ప్రశస్త చరితులైన పాండుసుతులను అధికారమదంతో కళ్ళు నెత్తికెక్కి చేసిన అవమానం మీకు చెరుపు చేయదా ! సుయోధనా ! మీరు చేసిన అవమానములు సహించి అరణ్య అజ్ఞాత వాసం ముగించుకుని అంతా మరచి వారికి రావలసిన అర్ధభాగం అడిగితే నీవు కనికరం లేక నిర్ధాక్షిణ్యంగా నిరాకరించావు. ఇంత అధర్మవర్తనుడివైన నీ తరఫున యుద్ధం చేస్తున్న నేను ఒక బ్రాహ్మణుడినా ! నాది ఒక బ్రాహ్మణ జన్మా ! నేనంటే శకట వ్యూహం వద్ద ఉన్నాను సైంధవునికి సమీపంలో ఉన్న నువ్వు, కర్ణుడు మిగిలి యోధులు ఏమి చేసారు. నీవు వారందరిని మాటలతో ఎందుకు బాధించవు నన్ను మాత్రమే నిందుస్తున్నావెందుకు వారు నీకు కావలసిన వారు నేను కానా ! యుద్ధసమయంలో పాండవయోధులు వారి శరములతో బాధిస్తున్నారు అలసి వచ్చిన నా మనసును నీవు నీ మాటలతో బాధిస్తున్నావు ఇది నీకు న్యాయమా ! గతజల సేతుబంధన మేలనయ్యా ! రేపటి యుద్ధంలో మీరంతా వీరోచితంగా పోరాడండి. నా వంతుకు నేను పాంచాలురను వధిస్తాను. కావలసిన కార్యము మీద మనసుంచి సైన్యాలను యుద్ధోన్ముఖులను చెయ్యి. వారి మనసులో ఉత్సాహాన్ని నింపి నీవు కూడా నీ పరాక్రమము చూపు. రేపు నేను యుద్ధభూమికి వెళ్ళి జరగరానిది జరిగి తిరిగి రాకుంటే అశ్వత్థామ తట్టుకోలేడు. నా మాటగా అశ్వత్థామకు చెప్పు " నాయనా అశ్వత్థామా ! బ్రాహ్మణుల ఎడ, వృద్ధుల ఎడ భక్తి శ్రద్ధలు చూపుతూ ధర్మవర్తనుడవై మెలగుము. నేను చంపగా మిగిలిన పాంచాల వీరులను నీవు తుదముట్టించుము. ఇదే నా కడపటి సందేశం " అన్నాడు.

కర్ణుడు సుయోధనుడిని ఓదార్చుట

ద్రోణశిబిరం నుండి కర్ణుని వద్దకు వెళ్ళి " కర్ణా ! నేడు జరిగిన యుద్ధం చూసావు కదా ! మన గురువు ద్రోణుడు శత్రుదుర్భేద్యమైన శకటవ్యూహము పన్ని అర్జునుడిని, సాత్యకిని లోనికి వదిలాడు. అర్జునుడు ఒక్కడే లోనికి ప్రవేశించి వీరవిహారం చేసి సైంధవునికి రక్షణగా ఉన్న రాజులను ససైన్యంగా తుద ముట్టించి సైంధవుడిని ఎలా చంపగలడు. అర్జునుడి శత్రుసంహారం ద్రోణుడు ఆపలేక పోయాడు అంటే మనం నమ్మాలా ! అసలు ద్రోణుడు సైంధవుడిని రక్షిస్తాను అనబట్టే మనం సైంధవుని యుద్ధానికి తీసుకు వచ్చాము. లేకున్న అతడు తన ఇష్టానికి ఎక్కడో ఉండే వాడు. మనం ఇంత సైన్యాన్ని నష్టపోవలసిన అవసరం ఉండేది కాదు. కేవలం సైంధవుడిని రక్షిచించడానికి మనం ఇంత సైన్యాలను నష్టపోవలసి వచ్చింది. ద్రోణుడికి మనం ఎంత కావలసిన వారము కాదో అర్జునుడు అంత కావలసిన వాడు అయ్యాడు. ఈ పరిస్థిలో మనం ద్రోణుని నమ్మి యుద్ధం చేయడం సమంజసమా ! " అన్నాడు. సుయోధనుడి మాటలు సావధానంగా విన్న కర్ణుడు " రారా రాజా! మనం ద్రోణుని నిందించడం ఎందుకు ? అతడు తన శక్తి కొలది యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడిని చంపలేక పోవడం నిజమే ద్రోణునికి కూడా అర్జునుడిని చంపడం సాధ్యము కాదేమో ! పాండవులను చంపడానికి మనం ఎంత ప్రయత్నించాము. విషం పెట్టాము, లక్క ఇంట్లో పెట్టి కాల్చాము, అడవులకు పంపాము అయినా వారు నాశనం కాలేదు. ఇది దైవఘటన కాక మరేమి. సైంధవుని చంపడం విధి విలాసమే ! అర్జునుడు నిమిత్తమాతృడు. కనుక నీవు ధైర్యం కోల్పోవద్దు. మన శక్తి వంచన లేక యుద్ధం చేస్తాము. ఫలితం దైవ నిర్ణయం. సైంధవుడిని రక్షించడానికి మనం చేయవలసినది చేసాము ఇక కలత చెందుట ఎందుకు " అన్నాడు.

ద్రోణసారధ్యంలో ఐదవనాటి యుద్ధం

ఇరు పక్షములు యుద్ధ భూమిలో మొహరించాయి. సుయోధనుడు సైంధవుని మరణంతో కలిగిన వ్యధతో తెగించాడు. అంత సాహసం పనికిరాదు అని ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు ఎంత చెప్పినా వినక పాండవులతో ఘోరయుద్ధం చేస్తున్నాడు. భీముని పది బాణములతోను, నకులుడిని మూడు బాణములతో, శిఖండిని నూరు బాణములతో, ధృష్టధ్యుమ్నుని డెబ్బై బాణములతోను, ధర్మరాజును, సాత్యకిని ఐదేసి బాణములతోను కేకయరాజులను లెక్కకు మించిన బాణములతోను ఎదుర్కొని సింహనాదం చేసాడు. ఇది చూసి ధర్మరాజు కోపంతో ఊగిపోతూ సుయోధనుడి విల్లు విరిచి అతడిని మూర్చిల్లేలా కొట్టాడు. సుయోధనుడు రథము మీద కుప్పకూలగానే అతడు మరణించాడని వార్త గుప్పుమంది. పాండవ సైన్యంలో సంతోషం వెల్లి విరిసింది భేరి నాదాలు మోగాయి. ఇది చూసి ద్రోణుడు పాండవసేనలపై విరుచుకు పడ్డాడు. ఇంతలో సుయోధనుడు తేరుకుని ధర్మరాజును ఎదుర్కొన్నాడు. కౌరవ సేనలు పాండవులు సేనలను ఎదుర్కొన్నాయి. పాడవులు, సాత్యకి మొదలుగా యాదవవీరులు, విరాటరాజాది మత్స్యదేశపు వీరులు, ద్రుపదుడు మొదలైన పాంచాలవీరులు, ఉపపాడవులు ద్రోణుని మీద శరవర్షం కురిపించాడు. కర్ణుడు, ద్రోణుడు పాండవ సేనలపై విజృంభించారు. ఇరుపక్షముల మధ్య పోరు ఘోరమై రక్తం ఏరులై పారుతుంది. ద్రోణుడు పాండవపక్షంలో ఉన్న కేకయవీరులను, ధృష్టధ్యుమ్నుని కుమారులను హతమార్చాడు. అప్పుడు శిబి ద్రోణుని ఎదుర్కొని అతడి సారథిని చంపి శరీరం మీద ముప్పై బాణములు క్రూరంగా నాటాడు. ఆగ్రహించిన ద్రోణుడు ఆరు భల్లబాణాలతో శిబి హయములను, సారథిని నరికి మరొక బాణంతో శిబి తల నరికాడు.

భీమసేనుని పరాక్రమం

భానుమంతుని కుమారుడు భీమసేనుని ఎదుర్కొని అతడి మీద శరవర్షం కురిపించాడు. భీమసేనుడు భానుమంతుని కుమారుని మీదకు రథమును పోనిచ్చి అతడి రథమును ఢీకొట్టి అతడి రథము మీదకు లంఘించి అతడిని కాలితో తన్ని ఎముకలు విరిచి చంపాడు. ఇది చూసిన పాంచాలసేనలు జయజయధ్వానాలు చేసాయి. అది సహించలేని కళింగ రాజకుమారుని సోదరులు ధ్రువుడు, జయరాధుడు భీముని మీద విరుచుకు పడ్డారు. భీముడు ధ్రువుడి రథము మీదకు ఎక్కి అతడిని పిడికిలితో కొట్టి చంపి జయరాధుని రథము ఎక్కి అతడిని సారథిని తుదముట్టించాడు. ఇది చూసిన కర్ణుడు తన శక్తి ఆయుధమును భీమునిపై విసిరాడు. భీముడు దాన్ని పట్టుకుని తిరిగి కర్ణుడి మీద వేసాడు. అది చూసి శకుని తన భల్ల బాణంతో దానిని ముక్కలు చేసాడు.

భీమసేనుడు కురురాజకుమారులను వధించుట

ఇంతలో ధృతరాష్ట్రకుమారులు దుర్మదుడు, దుష్కర్ణుడు భీమసేనుని ఎదుర్కొన్నారు. భీమసేనుడు కోపించి దుర్మదుడి రథము మీదకు లంఘించి అతడి సారథిని చంపాడు. దుర్మదుడు, దుస్కర్ణుడి రథము మీదకు దూకి భీమసేనుడి మీద శరవర్షం కురిపించి భీముని రథము కూలత్రోసారు. భీముడు తన రథమును తన్ని తాను కూడా వారి రథము ఎక్కి వారిని కాళ్ళతో చేతులతో మర్ధించి ఇద్దరిని మాంసపు ముద్దలు చేసి చంపాడు. ఇది చూసి సుయోధనుడు ఏమి చేయలేక పోయాడు. భీముని పరాక్రమము చూసిన కౌరవ సేనలు పారిపోయాయి. అప్పుడు ద్రోణుడు, కర్ణుడు ఒకటై భీమసేనుడిపై బాణములు గుప్పించారు. భీమునికి సాయంగా ధర్మరాజు, నకులసహదేవులు, సాత్యకి, విరాటుడు యుద్ధం చేస్తున్నారు.

సాత్యకిని సోమదత్తుడు ఎదుర్కొనుట

సోమదత్తుడు సాత్యకిని ఎదుర్కొని " ఓ సాత్యకీ ! నిలువుము ప్రాయోపవేశం చేస్తున్న భూరిశ్రవసుడిని కిరాతకంగా చంపడం వీరత్వమా ! అదే రాజ ధర్మమా ! ఈ రోజు నీవు నా చేతిలో మరణించావులే " అంటూ సాత్యకి మీద దూకాడు. ఆ మాటలకు సాత్యకి నవ్వి " సోమదత్తా ! భూరిశ్రవసుని చంపడం రాజధర్మమని నువ్వు అనుకుంటే ఇప్పుడు నిన్ను చంపి రాజధర్మం ఏమిటో నిరూపిస్తాను కాచుకో " అన్నాడు. అంటూ సోమదత్తునితో తలపడ్డాడు. అంతలో సుయోధనుడు తన సైన్యంతో సోమదత్తునికి సాయంగా వచ్చాడు. ఒంటరిగా పోరుతున్న సాత్యకికి ధృష్టద్యుమ్నుడు తన అపారసైన్యముతో సాయంగా వచ్చాడు. సోమదత్తుడు నిశిత తొమ్మిది బాణములతో సాత్యకిని కొట్టాడు. బదులుగా సాత్యకి తొమ్మిది బాణములతో కొట్టి సోమదత్తుడిని మూర్చిల్లజేసాడు. సోమదత్తుడి రథసారథి సోమదత్తుడిని దూరంగా తీసుకు వెళ్ళాడు. తరువాత అశ్వత్థామ సాత్యకిని ఎదుర్కొన్నాడు. మధ్యలో ఘటోత్కచుడు తన రాక్షస సైన్యంతో అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. ఇది చూసి భయపడిన దుర్యోధనుడు, కర్ణుడు మొదలైన వారు అక్కడి నుండి పక్కకు తొలిగారు.

అంజనపర్వ అశ్వత్థామల పోరు

అప్పుడు సంధ్యా సమయం అయింది. సంధ్యాసమయంలో రాక్షసులకు బలం పెరుగుతుంది కనుక కురు సైన్యంలోని మహాయోధులు కూడా ఘటోత్కచుని ముందు నిలువ లేక పోయారు. కాని అశ్వత్థామ మాత్రం నిలిచి ఘటోత్కచునితో పోరుసాగిస్తూ ఘటోత్కచుని గుండెలకు గురి పెట్టి పది బాణములు వేసాడు. ఘటోత్కచుడు తన చక్రాయుధాన్ని అశ్వత్థామ మీద వేసాడు. అశ్వత్థామ దానిని మధ్యలోనే నరికాడు. ఘటోత్కచుని కుమారుడు అంజనపర్వుడు అశ్వత్థామను ఎదుర్కొని అశ్వత్థామ మీద శరవర్షం కురిపించాడు. అశ్వత్థామ అంజనపర్వుని విల్లు విరిచి అతడి రథము విరిచాడు. అంజనపర్వుడు ఒక ఖడ్గం తీసుకుని అశ్వథ్థామ మీద లంఘించాడు. అశ్వత్థామ ఆ ఖడ్గమును విరిచాడు. ఆ రాక్షస వీరుడు ఆకాశంలోకి ఎగిరి అశ్వత్థామ మీద శరవర్షం కురిపించాడు. అశ్వత్థామ వాటిని తుత్తునియలు చేసి అంజనపర్వుని శరీరాన్ని శరములతో నింపాడు. ఆ బాధభరించ లేక అంజనపర్వుడు భూమి మీదికి దిగి రథము ఎక్కి అశ్వత్థామ మీద శరసంధానం చేసాడు. అశ్వత్థామ ఒక వాడి అయిన బాణంతో అంజనపర్వుని తల తెగనరికాడు.

ఘటోత్కచుడు అశ్వత్థామను ఎదుర్కొనుట

తరువాత అశ్వత్థామ పాండవసైన్యమును సంహరిస్తున్నాడు. కుమారుని మరణం చూసి ఘటోత్కచుడు తీవ్రమైన కోపంతో అశ్వత్థామను చూసి " అశ్వత్థామా! నిలువుము నీవు ఈ రోజు నన్ను తప్పించుకుని పోలేవు అని అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ " ఘటోత్కచా ! నీవు బాలుడవు నాతో యుద్ధం చేయ లేవు. నీవు నాకు పుత్రసమానుడవు నీ మీద నాకు కోపం కలగడం లేదు కనుక నీతో యుద్ధం చేయలేను వెళ్ళు " ఘటోత్కచుడు బదులుగా " అశ్వత్థామా ! కొడుకును పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న నాకు నువ్వు ఎక్కడి తండ్రివి నా తండ్రి భీమసేనుడు. నేను నిన్ను వధించక మానను " అని ఘటోత్కచుడు వెంటనే తన అసుర మాయలు అశ్వత్థామ మీద ప్రయోగించాడు. అశ్వత్థామ వాటిని తిప్పి కొట్టి కొండ వలె తన మీదకు వస్తున్న ఘటోత్కచుని తన వజ్రాస్త్రంతో కొట్టాడు. ఘటోత్కచుడు మేఘంలా మారాడు. అశ్వత్థామ వాయవ్యాస్త్రం ప్రయోగించి ఆ మేఘమును చెదరగొట్టాడు. వెంటనే ఘటోత్కచుడు ఉగ్రమైన ఆకారందాల్చాడు అతడి అనుచరులు భయంకరాకారాలతో కౌరవ సైన్యాలతో తలపడి సుయోధనుడు బలములు నిర్మూలిస్తున్నాడు. అది చూసి ఖిన్నుడైన సుయోధనుడు స్వయంగా తానే ఘటోత్కచుని ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ రారాజా ! ఘటోత్కచుని ఎదుర్కొనుటకు నీవు కావాలా ! నేను చాలనా నువ్వు చూస్తుండు చాలు " అని ఘటోత్కచునితో తలపడ్డాడు. సుయోధనుడు శకునిని చూసి " మామా! ఇక మనకు భయం లేదు ఘటోత్కచుడితో సహా పాండవసైన్యం నిర్మూలించబడినట్లే మనం జయించామని ప్రకటించు నీవు, కృపాచార్యుడు, కర్ణుడు మొదలైన యోధులు అశ్వత్థామకు సాయం వెళ్ళండి అని తాను అశ్వద్దామకు సాయంగా వెళ్ళాడు. ఘటోత్కచుడు అశ్వత్థామ విల్లు విరిచాడు. అశ్వథ్థామ మరొక్ల విల్లు తీసుకుని ఘటోత్కచుని రాక్షస సైన్యమును నాశనం చేస్తున్నాడు. అది చూసి సుయోధనుడు అశ్వత్థామను ఎంతగానో కొనియాడాడు. పాండవ వీరులు అశ్వథ్థామ ధాటికి ఆగలేక దిక్కుతోచక చూస్తున్నారు. ఘటోత్కచుడు అశ్వత్థామ మీదకు పరిఘను విసిరాడు. అశ్వత్థామ దానిని పట్టుకుని తిరిగి ఘటోత్కచుని మీదకు విసిరాడు. ఘటోత్కచుడు ధుష్టద్యుమ్నుని రథము మీద ఎక్కి దాని నుండి తప్పించుకున్నాడు. అశ్వత్థామ విసిరిన పరిఘ ఘటోత్కచుని రథమును సారథిని ధ్వంశం చేసింది. ఘటోత్కచుడు దుష్టద్యుమ్నునితో చేరి యుద్ధం చేస్తుండగా భీమసేనుడు వారి వద్దకు వచ్చి యుద్ధం చేయసాగాడు. అశ్వత్థామ వారి ముగ్గురిని ఎదుర్కొని శరవర్షం కురిపించాడు.

అశ్వత్థామ పరాక్రమం

ఆ రోజు విజృంభించి యుద్ధం చేస్తున్న అశ్వత్థామ రణరంగాన్ని పీనుగుల పెంట చేసాడు. విరిగిన రథములు, ఏనుగుల గుర్రముల కళేబరములు యుద్ధభూమిలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అలా ఒక్కరోజే అశ్వత్థామ ఒక అక్షౌహిని సైన్యాలను నిర్మూలించాడు. అది చూసి ద్రుపదుని కుమారులైన సురధుడు, శత్రుంజయుడు, బలానీకుడు, జయానీకుడు, పృషధృడు, జయానీకుడు, జయుడు, చంద్రసేనుడు అశ్వత్థామను ఎదుర్కొని అశ్వత్థామ మీద శరవర్షం కురిపించారు. మరుక్షణంలో అశ్వత్థామ వారినందరిని యమసదనానికి పంపాడు. ఆ తరువాత కుంతిభోజుని కుమారులు అశ్వత్థామను ఎదుర్కొన్నారు. అశ్వత్థామ వారిని తృటికాలంలో సంహరించి కాలదండం లాగ ఉన్న బాణమును ఘటోత్కచుని మీదకు ప్రయోగించాడు. ఆ బాణము ధాటికి ఘటోత్కచుడు రథము మీద పడి మూర్చిల్లాడు. వెంటనే దుష్టద్యుమ్నుడు ఘటోత్కచుడిని తీసుకు వెళ్ళాడు. అది చూసి అశ్వత్థామ సింహనాదం చేసాడు. ధర్మరాజు, సాత్యకి వచ్చి భీమునికి సాయంగా యుద్ధం చేయసాగారు. ఇంతలో ఘటోత్కచుడు మూర్చ నుండి తేరుకుని అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. పాండవ సైన్యాలు ఒక వ్యూహముగా ఏర్పడి అశ్వత్థామను చుట్టుముట్టాయి. అది చూసి కౌరవసేనలు సోమదత్తుని బాక్లికుని ముందుంచుకుని పాడవ సేనతో తలపడ్డాయి.

భీమసేనుడి విజృంభణ

సాయంసమయం అయింది. సాత్యకి సోమదత్తుని ఒక నిశితశరముతో కొట్టాడు. ఘటోత్కచుడు సోమదత్తుడిని ముద్గర అనే ఆయుధముతో కొట్టాడు. ఆ దెబ్బలకు సోమదత్తుడు సోలిపోయాడు. తన కుమారుడు సోమదత్తుడు సోలిపోగానే బాహ్లికుడు సాత్యకితో యుద్ధముకు తలపడ్డాడు. భీముడు బాహ్లికునితో తలపడి బాణప్రయోగం చేసాడు. బాహ్లికుడు శక్తి ఆయుధంతో భీముని కొట్టాడు. ఆ శక్తిఆయుధ ఘాతానికి భీముడు మూర్చిల్లినా వెంటనే తేరుకుని బాహ్లికుని ముద్గర అను ఆయుధముతో కొట్టాడు. ముద్గర దెబ్బకు వయోధికుడైన బాహ్లికుడు తలపగిలి చనిపోయాడు. పాండవసేనలు జయజయధ్వానాలు చేసాయి.

భీమసేనుడి చేతిలో కురురాజకుమారులు మరణించుట

బాహ్లికుని మరణం చూసి దుర్యోధనుడి తమ్ములు పది మంది భీముడితో తలపడ్డారు. తనను చుట్టుముట్టిన పది మంది రాకుమారులను భీముడు పది బాణములతో సంహరించాడు. అది చూసి కర్ణుని తమ్ముడు వృకరధుడు భీమునితో తలపడ్డాడు. తనను సమీపించిన వృకరధుని భీముడు ఒకే దెబ్బతో చంపాడు. తరువాత భీమునితో శకుని తమ్ములు పన్నెండు మంది తలపడ్డారు. భీముడు వారిని అవలీలగా సంహరించాడు. భీముని పరాక్రమానికి ఎదురు లేక పోయింది. భీముని ఎదుర్కొన్న వారు ప్రాణాలతో బయటపడటం కష్టమైంది. ఆ తరువాత త్రిగర్త, బాహ్లిక, శూరసేన, మాళవ, వసాతి సేనలు ఒక్కుమ్మడిగా భీమసేనుని చుట్టుముట్టాయి. అది చూసి ధర్మరాజు తన సేనలతో భీమసేనుడిని చేరి కౌరవ సేనలను చీలి చెండాడటం మొదలు పెట్టారు. కౌరవ సేన క్రమంగా సన్నగిల్ల సాగింది.

ద్రోణుడు పాండవులను ఎదుర్కొనుట

కురుసేన క్షీణించడం చూసి సుయోధనుడు ద్రోణునికి జరిగిన విషయం వివరించగానే ద్రోణుడు వెంటనే ధర్మరాజును ఎదుర్కొని అతడి మీద దివ్యాస్త్రప్రయోగం చేసాడు. ధర్మరాజు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ద్రోణుడు ధర్మరాజు మీద ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ధర్మరాజు తిరిగి ఇంద్రాస్త్ర ప్రయోగంతో దానిని నిర్వీర్యం చేసాడు. ద్రోణుడు దర్మజునిపై బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయగా ధర్మరాజు అదే అస్త్రాన్ని ప్రయోగంచి దానిని నిర్వీర్యం చేసాడు. ఇంతలో ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు అతడిని లక్ష్యపెట్టక పాంచాలసేనను సంహరిస్తూ వారిని తరిమి కొట్టాడు. అదే సమయంలో మత్స్య కేకయ సేనలు కురుసేనను చుట్టుముట్టాయి.

కృపాచార్యకర్ణుల వాదం

సుయోధనుడు కర్ణుని వద్దకు వెళ్ళి తన పరాక్రమం చూపమని అర్ధించాడు. కర్ణుడు " అర్జునా! అర్జునుడు, భీముడు నాకు ఒక లెక్కా ! నేను ఒక్కడినే వారిరువురిని సంహరించి నీకు ఆహ్లాదం కలిగిస్తాను " అన్నాడు. కర్ణుని మాటలు విన్న కృపాచార్యుడు " కర్ణా ! చాలా బాగా పలికావు ఈ రోజుతో పాండవులను చంపి సుయోధనుడికి పట్టం కట్టేలా ఉన్నావు. ఈ పరాక్రమం ఘోషయాత్ర సమయాన, ఉత్తర గోగ్రహణ సమయాన ఏమైంది. ప్రగల్భములు వదిలి కార్యశూరత్వం చూపించు. అయినా నీవు ఇంత వరకు పాండవులను ఎదుర్కొన్నదే లేదు వారిని ఎలా గెలుస్తావు. మనమందరం అర్జునుడి చేత ఎన్ని సార్లు ఓడిపోయాము. ఇప్పుడు అతడికి ధర్మరాజు, భీముడు, ఘటోత్కచుడు ఉన్నారు. సాత్యకి విషయం సరేసరి. వీరినందరిని నీవు ఒక్కడివే గెవడం సాధ్యమేనా ! " అన్నాడు. ఆమాటలకు కర్ణుడు రోషపడి " కృపాచార్యా ! నేను ఆడిన మాట తప్పను పాండవులను జయించి అన్న మాట నెరవేర్చుకుంటాను. మీరంతా ఎప్పుడూ పాండవులను పొగిడి కౌరవసేనలో ఉత్సాహం తగ్గిస్తున్నారు. మన సైన్యంలో నేను, ద్రోణుడు, అశ్వత్థామ, శల్యుడు మొదలైన అతిరధ మహారధులు లేరా నీ మాటలు వారిని కాని వారిని చేస్తున్నాయి. నీవు బ్రాహ్మణుడివి కనుక నీ అధిక ప్రసంగం సహించాను. ఇక ఒక్క మాట మాట్లాడినా నీ నాలుక కోస్తాను జాగర్త " అన్నాడు. తన మేనమామను దూషించడం చూసి అశ్వత్థామ క్రుద్ధుడై కత్తి తీసుకుని కర్ణుని మీదకు లంఘించాడు. సుయోధనుడు అశ్వత్థామను వారించగా కృపాచార్యుడు అశ్వత్థామను గట్టిగా పట్టుకుని " నాయనా అశ్వత్థామా ! అంతకోపం పనికి రాదు శాంతం వహించు " అని అనునయించాడు. సుయోధనుడు అశ్వత్థామను చూసి " గురుపుత్రా ! మీ అందరి లక్ష్యం పాండవులను జయించి నన్ను ఈ భూమండలానికి పట్టాభిషిక్తుడిని చేయడం. మనలో మనం కలహించుకుంటే విజయం ఎలా ప్రాప్తిస్తుంది. కర్ణుడి బదులుగా మీ అందరిని నేను క్షమాపణ అడుగుతున్నాను అతడిని క్షమించండి " అన్నాడు. ఆ మాటలకు కర్ణుడు, అశ్వత్థామ శాంతించి తిరిగి యుద్ధసన్నద్ధమైయ్యారు.

కురు పాండవుల సమరం

కర్ణుడు యుద్ధానికి రావడం చూసిన పాండవ యోధులు అందరూ " మన పాండవులు ఇంతటి దుర్ధశకు ఈ వినాశనానికి కారణమైన కర్ణుని వదలకండి వధించండి " అని అతడిని చుట్టుముట్టారు. కర్ణుడు అందుకు బెదరక ధైర్యంగా వారిని ఎదుర్కొని చీల్చిచెండాడసాగాడు. అది చూసి అర్జునుడు కర్ణుని ఎదుర్కొని ముప్పది బాణములతో అతడిని కొట్టాడు. కర్ణుని చేతిలో నుండి విల్లు జారిపోయింది. వేరొక విల్లు అందుకుని కర్ణుడు అర్జునుడు ఆశ్చర్యపడేలా శరములు గుప్పించాడు. అర్జునుడు ఆగ్రహించి ఒకే బాణంతో కర్ణుని విల్లు విరిచి, సారథి, హయములను చంపి కర్ణుని శరీరం నిండా శరములు గుచ్చాడు. వెంటనే కర్ణుడు కృపాచార్యుని దూషించానన్న సిగ్గు వదిలి పక్కనే ఉన్న అతడి రథము ఎక్కి తలదాచుకున్నాడు. కృపాచార్యుని రథము అక్కడి నుండి నిష్క్రమించింది. కర్ణుని పరాజయం చూసి కౌరవ సైన్యం పారిపోసాగింది. సుయోధనుడు " సైనికులారా ! పారిపోకండి నేను ఉన్నాను పాండవులను జయించగలము రండి " అని అర్జునుడిని ఎదుర్కోడానికి ముందుకు ఉరికాడు. ఇది గమనించిన కృపాచార్యుడు అశ్వత్థాను చూసి " కుమారా! అశ్వత్థామా ! రారాజు తన బలం ఎంతో ఎరుగక అర్జునుడితో యుద్ధానుకి సన్నద్ధమౌతున్నాడు. అలా జరిగితే అతడు అర్జునుడికి పట్టుబడగలడు. నీవు ఇక్కడ ఉండగా అది జరుగరాదు. కనుక నీవు రారాజుకు సాయంగా వెళ్ళు " అన్నాడు. అశ్వత్థామ సుయోధనుడిని సమీపించి " సుయోధనా ! నేనుండగా నీ కెందుకు శ్రమ నేను అర్జునుడిని ఎదుర్కొంటాను నువ్వు వెళ్ళు " అన్నాడు. సుయోధనుడు " గురుపుత్రా ! నీకు నీ తండ్రికి అర్జునుడంటే వల్లమాలిన ప్రేమ మీరు అర్జునుడితో మనసారా యుద్ధం చేసి అతడిని చంపరు. ఇప్పటికే నా తమ్ములు చనిపోయారు సైన్యం క్షీణించింది. కనుక మీరు పాండవుల వద్దకు రావద్దు. మీరు పాండవులతో యుద్ధం చెయ్య వద్దు నేను వారితో యుద్ధం చేస్తాను. మీరు వారి సేనలను నశింపచేయండి " అన్నాడు. అశ్వత్థామ " రారాజా ! నాకు నా తండ్రికి అర్జునుడంటే అభిమానం ఉన్న మాట నిజమే అయినా యుద్ధరంగంలో శత్రుపక్షాన ఉన్న వారు మిత్రులైనా, బంధువులైనా, అభిమానాలకు తావుండదు. మేము మా ఒళ్ళు దాచక యుద్ధం చేయడం చూస్తూనే నువ్వు మమ్ము నమ్మడం లేదు నువ్వు ఎవరినీ నమ్మవు అసలు నిన్ను నువ్వే నమ్మవు. అదంతా ఎందుకు నేను శత్రు సైన్యంలో ప్రవేశించి ధృష్టద్యుమ్నుని ఎదుర్కొని అతడి సైన్యమును పారతోలుతాను " అంటూ పాండసేనలో ప్రవేశించాడు.

అశ్వత్థామ ధృష్టద్యుమ్నుని ఎదుర్కొనుట

అది గమనించిన కేకయ, పాంచాల సేనలు అశ్వత్థామను చుట్టుముట్టాయి. అశ్వత్థామ వారి మీద శరవర్షం కురిపించి వారిని పారతోలాడు. అది చూసి ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామను ఎదుర్కొని " అశ్వత్థామా! నేను నీ తండ్రి ద్రోణుని చంపడానికి పుట్టిన వరప్రసాదిని. నీ తండ్రినే కాదు నిన్ను కూడా వధిస్తాను రా! " అన్నాడు. అశ్వత్థామ " ధృష్టద్యుమ్నా! నీ కోసమే ఎదురుచూస్తున్నాను రా! నా బాణములకు నిన్ను బలిచేస్తాను రా! " అంటూ ధృష్టద్యునుని ఎదుర్కొన్నాడు. ధృష్టద్యుమ్నుడు " నీ తండ్రి పని తరువాత చూడవచ్చు ముందు నీ పని పడతాను " అంటూ అశ్వత్థామ మీద శరములు గుప్పించాడు. అశ్వత్థామ కోపించి ధృష్టద్యుమ్నుని కేతనము ఖండించి, సారథిని, హయములను చంపి అతడి చక్రరక్షకులను నూరు మందిని చంపి సింహనాదం చేసాడు. పాంచాల సేనలు అశ్వత్థామ ధాటికి నిలువ లేక చెరిరి పోయాయు. అది చూసి ధర్మరాజు, భీముడు తమ సైన్యాలతో ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చారు. సుయోధనుడు ద్రోణుని తీసుకుని అశ్వత్థామకు సాయం వచ్చాడు. అది చూసిన అర్జునుడు ధృష్టద్యుమ్నునికి సాయం వచ్చాడు. ఇరు పక్షాల నడుమ పోరు ఘోరమైంది. అర్జునుడు తన వాడి అయిన బాణములతో మగధ, మద్ర, వంగదేశముల నాశనం చేస్తున్నాడు. భీముడు అంబష్ట, శిబి, వంగదేశ సైన్యములను తుద ముట్టించాడు. అది చూసి ఆగ్రహించిన ద్రోణుడు వాయవ్యాస్త్రమును ప్రయోగించి పాండవసేనలను చెల్లాచెదురు చేసాడు. అర్జునుడు, భీముడు ద్రోణునికి రెండు వైపుల నిలిచి శరములు గుప్పించాడు. ద్రోణుడు బెదరక పాండవ సేనలను తనుమాడుతున్నాడు. సుయోధనుడు పాండవ సేనలను చెల్లాచెదురు చేస్తున్నాడు. అప్పుడు సోమదత్తుడు పాండవ సేనలను ఎదుర్కొన్నాడు. సాత్యకి సోమదత్తుడిని ఎదుర్కొన్నాడు. సోమదత్తుడు ఒకే బాణంతో సాత్యకి విల్లు విరిచి సాత్యకిని ముప్పై అయిదు బాణాలతో కొట్టాడు. సాత్యకి మరొక విల్లందుకుని సోమదత్తుని విల్లు విరిచాడు . సోమదత్తుడు మరొక విల్లు తీసుకున్నాడు. అది చూసి భీముడు సోమదత్తుడిని ఎదుర్కొన్నాడు. ఘటోత్కచుడు సోమదత్తుడి మీద పరిఘను విసిరాడు. సోమదత్తుడు దానిని రెండు ముక్కలు చేసాడు. సాత్యకి ఒక వాడి అయిన బాణములతో సోమదత్తుడి సారథిని, హయములను చంపి మరొక నారసముతో సోమదత్తుడి తల నరికాడు. సోమదత్తుడి మరణం చూసి కౌరవ సేనలు సాత్యకిని ఒక్కుమ్మడిగా ఎదుర్కొన్నాయి. అది చూసిన ధర్మరాజు సాత్యకిని అక్కడి నుండి తప్పించి తాను ద్రోణుని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు ధర్మరాజు విల్లు విరిచి, కేతనము పడగొట్టి ధర్మజుని శరీరం తూట్లు పడేలా కొట్టాడు. ధర్మరాజు ఉగ్రరూపందాల్చి మరొక విల్లందుకుని ద్రోణుని శరీరంలో గుచ్చుకునేలా బాణములు సంధించాడు. ద్రోణుడు తన రథము మీద మూర్చిల్లాడు. కొంచెం సేపటికి తేరుకున్న ద్రోణుడు తేరుకుని పాండవ సైన్యం మీద వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ధర్మరాజు కూడా వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి దానిని నిర్వీర్యం చేసి ద్రోణుని మీద శరములు గుప్పించాడు. అది చూసిన శ్రీకృష్ణుడు ధర్మజుని వద్దకు వెళ్ళి " ధర్మజా ! నిన్ను పట్టుకుని సుయోధనుడికి అప్పగిస్తానన్న ద్రోణుని ప్రతిజ్ఞ మరిచావా ! ద్రోణునితో యుద్ధము మంచిది కాదు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళి భీముడికి సాయపడు " అన్నాడు. కృష్ణుడి మాట మన్నించి ధర్మజుడు భీముని వద్దకు వెళ్ళాడు. ద్రోణుడు ధర్మజుడిని వదిలి పాంచాల సేనలను ఎదుర్కొన్నాడు. ధర్మరాజు, భీముడు, ధృష్టద్యుమ్నుడు, సాత్యకి కౌరవ సేనలను తనుమాడుతున్నారు. కృపాచార్యుడు, కర్ణుడు, ద్రోణుడు వారిని ఎదుర్కొన్నారు. యుద్ధం ఘోరరూపందాల్చింది. సేనల పదఘట్టనలకు రేగిన ధూళి ఆకాశాన్ని తాకి సూర్యుడిని మరుగున పరిచి చీకట్లు కమ్ముకున్నాయి. సైనికులకు కళ్ళు కనిపించడం కష్టమైంది. ద్రోణాచార్యుడు ఒక వైపు సుయోధనుడిని ఒక వైపు కురు సేనలను ప్రోత్సహిస్తూ యుద్ధోన్ముఖులను చేసి అప్పటికప్పుడు ఒక వ్యూహమును ఏర్పరిచాడు.

రాత్రి సమయంలో పోరు

ద్రోణుడు పన్నిన వ్యూహానికి ముఖభాగంలో అతడే నిలబడ్డాడు. వ్యూహమునకు రెండు వైపులా అశ్వత్థామను శకుని నిలిపాడు. మధ్యలో శల్యుడు నిలబడ్డాడు. సుయోధనుడు వ్యూహం అంతా తిరుగుతున్నాడు. సుయోధనుడు తన సైనికులను దివిటీలను పట్టుకుని నిలబడమని చెప్పాడు. వెంటనే సైనికులకు దివిటీలు అందించబడ్డాయి. రథికునకు అయిదు దివిటీలు, గజముకు మూడు దివిటీలు, హయముకు ఒక దివిటీ చొప్పున ఇచ్చారు. వ్యూహముకు ముందు భాగమున సైనికులు దివిటీలు పట్టుకుని బారులు తీరారు. పాండవసైనికులు దివిటీలు పట్టుకున్నారు. రథముకు పది దివిటీలు, గజముకు ఏడు దివిటీలు, హయముకు రెండు దివిటీలు పట్టుకున్నారు. సుయోధనుడు తన సోదరులను పిలిచి " సోదరులారా ! మీరూ, శల్యుడు, కృతవర్మ మొదలైన యోధులు ధృష్టద్యుమ్నుడు ద్రోణునితో తలపడకుండా చూడండి ద్రోణుడు మిగిలిన వారితో యుద్ధము చేస్తున్నాడు. కర్ణుడు ధృష్టద్యుమ్నుని చంపి తరువాత అర్జునుడిని జయిస్తాడు. నేను భీమునితో యుద్ధము చేసి గెలుస్తాను " అని పలికి సైన్యమును కదలమని సైగ చేసాడు. ధర్మరాజు ద్రోణుని ఎదుర్కొను సమయంలో మధ్యలో కృతవర్మ ఎదుర్కొని యుద్ధం చేయసాగాడు. సాత్యకితో భూరి అను రాజు, సహదేవునితో కర్ణుడు, భీమునితో సుయోధనుడు, నకులునితో శకుని, శిఖండితో కృపాచార్యుడు, ప్రతివింద్యునితో దుశ్శాసనుడు, అశ్వత్థామతో ఘటోత్కచుడు, ద్రుపదునితో వృషసేనుడు, విరాటరాజుతో శల్యుడు, శతానీకునితో చిత్రసేనుడు, అర్జునుడితో అలంబసుడనే రాక్షసరాజు యుద్ధం చేస్తూ మరొక పక్క ద్రోణుని కాపాడుతున్నారు. పాండవపక్షంలోని అతిరధ మహారధులు ద్రోణునితో తలపడడానికి ప్రయత్నిస్తుంటే కౌరవ యోధులు శయశక్తులా అడ్డుకుంటున్నారు. ద్రోణుడు సోమకసైన్యంతో పోరి వారిని హతమార్చాడు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ఎదుర్కొన్నాడు. వారిరువురు ఘోరంగా యుద్ధం చేసుకుంటున్నారు. కృతవర్మ ధర్మరాజు విల్లు విరిచాడు. ధర్మరాజు మరొక విల్లు తీసుకుని కృతవర్మ విల్లు విరిచి కృతవర్మ మీద శక్తి ఆయుధమును ప్రయోగించాడు అది కృతవర్మను చేతిని చీల్చింది. కృతవర్మ మరొక విల్లు తీసుకుని ధర్మరాజు రథసారథిని, హయములను చంపి ధర్మరాజు విల్లు విరిచాడు. ధర్మరాజు తోమరము అనే ఆయుధాన్ని తీసుకున్నాడు. కృతవర్మ ఆ అయుధమును రెండు ముక్కలు చేసి ధర్మరాజు కవచము చీల్చే విధంగా బాణముతో కొట్టాడు. కృతవర్మతో యుద్ధం చేయ లేక ధర్మరాజు యుద్ధభూమి నుండి తొలగి పోయాడు. సాత్యకి కురు వంశీయుడైన భూరి అనేరాజుతో తలపడి అతడి విల్లు విరిచాడు. భూరి మరొక విల్లు తీసుకుని అతడి వింటిని ముక్కలు చేసాడు. సాత్యకి శక్తి ఆయుధాన్ని ప్రయోగించి భూరి తల తెగనరికాడు. ఇది చూసిన ఇది చూసి అశ్వత్థామ సాత్యకితో తలపడ్డాడు. ఇంతలో ఘటోత్కచుడు అశ్వత్థామతో తలపడి పది బాణములతో అశ్వత్థామ వక్షస్థలం మీద కొట్టాడు. ఆ బాణముల ధాటికి తాళ లేక అశ్వత్థామ రథము మీద సొమ్మసిల్లి పడి వెంటనే తేరుకుని ఘటోత్కచుడి గుండెలకు గురిపెట్టి తీవ్రమైన బాణములతో కొట్టాడు. ఆ బాణముల ధాటికి ఘటోత్కచుడు సొమ్మసిల్లి పడిపోయాడు. ఘటోత్కచుడి రథసారథి రథమును పక్కకు తీసుకు వెళ్ళాడు.

భీమసుయోధనుల పోరు

మరొక పక్క సుయోధనుడు భీముడు తలపడి ఘోర యుద్ధం సాగిస్తున్నారు. భీముడు సుయోధనుడి ధనస్సు ముక్కలు చేసి, అతడి కేతనమును విరిచి అతడి శరీరాన్ని తూట్లు పడేలా కొట్టాడు. సుయోధనుడు మరొక విల్లందుకుని భీముని విల్లు విరిచాడు. భీముడు మరొక విల్లందుకుని ఏడు బాణములతో సుయోధనుడిని తీవ్రంగా గాయపరిచి అతడి విల్లు విరిచాడు. సుయోధనుడు మరొక విల్లు తీసుకొనగానే దానిని కూడా విరిచాడు. భీముడు అలా సుయోధనుడి నాలుగు ధనస్సులు విరిచి రథాశ్వములను, సారథిని చంపాడు. సుయోధనుడికి భీముడంటే భయమేసింది. ఎవరూ చూడకుండా పక్కకు తప్పుకున్నాడు. అది గమనించని భీముడు సుయోధనుడు చనిపోయాడనుకుని సింహనాదం చేసాడు. సుయోధనుడు కనిపించక కౌరవ సేనలు కలవరపడ్డాయి. పాండవ సేనలో ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. ఇంతలో సుయోధనుడు వేరొక రథము మీద రావడంతో కల్లోలం సద్దు మణిగింది.

కర్ణ సహదేవుల పోరు

కర్ణుడు సహదేవునితో తలపడ్డాడు. సహదేవుడు కర్ణుని తొమ్మిది బాణములతో కొట్టాడు. కర్ణుడు సహదేవుని నూరు బాణములతో మర్మస్థానములలో కొట్టి సహదేవుని ధనస్సును ముక్కలు చేసాడు. సహదేవుడు మరొక విల్లందుకున్నాడు. కర్ణుడు సహదేవుని సారథిని, రథాశ్వములను చంపాడు. సహదేవుడు కత్తి డాలు తీసుకున్నాడు. కర్ణుడు వాటిని ముక్కలు చేసాడు. సహదేవుడు కర్ణుని మీద గధాయుధాన్ని విసిరాడు. కర్ణుడు ఆ గధను మధ్యలోనే తుంచాడు. సహదేవుడు కర్ణుని మీద శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. కర్ణుడు దానిని ముక్కలు చేసాడు. ఇక చేసేది లేక సహదేవుడు రథచక్రాన్ని కర్ణుని మీద వేసాడు. కర్ణుడు దానిని కూడా తన బాణ్ములతో ముక్కలు చేసాడు. కర్ణునితో యుద్ధం చేయలేక సహదేవుడు అక్కడ నుండి తప్పుకుంటున తరుణంలో కర్ణుడు అతడిని వెంబడించి పట్టుకుని చంపబోయి కుంతికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి చంపకుండా వదిలి హేళనగా " సహదేవా! నీ బలం ఎదుటి వాని బలం తెలుసుకుని యుద్ధం చెయ్యి. నీ కన్నా బలవంతులతో యుద్ధం చెయ్యడం అవివేకమని తెరులుసుకో పో " అని పంపాడు. సహదేవుడు అవమానభారంతో కుమిలి పోతూ అక్కడ నుండి వేరొక రథము ఎక్కి వెళ్ళాడు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat