శక్తిపీఠాలు

P Madhav Kumar



హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు (Shakthi Peethas) అంటారు. ఈ శక్తిపీఠాలను గుతించడానికి ఎటువంటి ఇతిహాసిక ఆధారాలూ లేవు . పురాణాలు , శాసనాల ఆధారముగా ఈ శక్తిపీఠాలను గుర్తించగలిగారు. ఈ శక్తిపీఠాలు మందే్శములోనే కాక ... పాకిస్తాన్‌, శ్రీలంక , టిబెట్ , నేపాల్ దేశాలలోనూ కనిపిస్తాయి . ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. పరిశోధకుల అంచనాల మేరకు ఆసియాఖండములో 52 శక్తిపీఠాలు ఉన్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

శక్తిపూజా నేపధ్యాన్ని తెలుసుకోవడము అవసరము . మానవుడు తిన బుద్ధి శక్తిని వికసించినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచింపసాగాడు . ఈ శకులన్నిటి వెనుక ఒక విశిష్టశక్తి ఉన్నదని తెలుసుకొన్నాడు . ఆ శక్తినే " దేవుడు " అని అన్నాడు . ఆ దేవుడికి విభిన్న రూపాలను సమకూర్చి ... ఆడ , మగ అని విడదీసి పెళ్ళిల్లు చేసే ఆచారమూ తీసుకువచ్చాడు . ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క కార్యాన్ని అంకితమివ్వసాగాడు . అందులోనూ స్త్రీ దేవతకు ఎక్కుక మహిమనిస్తూ భయ భక్తులతో ఆరాధింప సాగాడు . ఈ ప్రక్రియలో త్రిమూర్తుల కల్పన రూపుదాల్చింది . వీరిని బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులన్నాడు . వారు క్రమముగా సృష్టి , స్థితి , లయ కర్తలని పేర్కొన్నాడు . వీరి భార్యలను సరస్వతి , లక్ష్మి , పార్వతి అనియూ వీరు .. .. విధ్య , ధన , మాతృరూపాలలో ఉన్నారని అన్నాడు . ఈ విధము గా ప్రకృతిశక్తి ఒక్కటే అయినా మానవుడు తకిష్టమైన రూపములో , తనకిష్టమైన రీతిలో ఆరాధించడము సాగిస్తూఉన్నాడు .
  • అష్టాదశ శక్తి పీఠాలు -పురాణ కధ

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి , సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు' అని చెబుతోంది దేవీభాగవతం.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.

  • అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉంది. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ(గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్‌పూర్‌-నాభిగయ) రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం. ఆ క్షేత్రాల గురించిన వివరాలు...

  • 1.శాంకరీదేవి
లంకాయాం శాంకరీదేవి అంటే...మునులూ రుషుల లెక్కప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది.

  • 2.కామాక్షి
సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితయై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి. స్థలపురాణం ప్రకారం... మహిషాసురుణ్ని సంహరించిన చాముండేశ్వరీదేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏంచేయాలని శివుణ్ని అడగ్గా నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట. అలా ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో... ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి యోగపీఠంగానూ కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు భక్తులు.

  • 3.శృంఖల
అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరూ కోల్‌కతకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంఖలా(శృంగళా)దేవిగా భావిస్తారు. కానీ... పశ్చిమబెంగాల్‌లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.

  • 4.చాముండి
హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.

  • 5.జోగులాంబ
మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో వెుదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీనముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి.

  • 6.భ్రమరాంబిక
విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు... ఇక్కడ కొలువైన సతి 'శక్తి' భ్రమర(తుమ్మెద) రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు.

  • 7.మహాలక్ష్మి
రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయకాలంలిో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు.

  • 8.ఏకవీరాదేవి
మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు.

  • 9.మహాకాళి
సప్త వోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం కూడా.

  • 10.పురుహూతిక
పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో)... తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే.

  • 11.గిరిజాదేవి
గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.

  • 12.మాణిక్యాంబ
సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణప్రతీతి. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు.

  • 13.కామాఖ్య
అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో మూడురోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. ఈ ఆలయం కూచ్‌బేహార్‌ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.

  • 14.మాధవేశ్వరి
అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ... సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వ్యవహరించడం కద్దు.

  • 15.సరస్వతి
పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.

  • 16.వైష్ణవీదేవి
అమ్మవారి నాలుక హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు... 'జ్వాలాయాం వైష్ణవీదేవి' అంటే అది ఈ గుడి కాదనీ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమనీ చెబుతారు.

  • 17.మంగళగౌరి
సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక... పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు.

  • 18.విశాలాక్షి
సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.

...ఇవీ ప్రధానమైన 18 శక్తిపీఠాలు. ఇంకా అమ్మవారి ఆభరాణాలు పడినచోట్లనూ లెక్కిస్తే 51 శక్తిపీఠాలని కొందరూ 108 పీఠాలని మరికొందరూ అంటారు. ఇందులో చాలా క్షేత్రాలు నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, శ్రీలంక తదితర దేశాల్లో ఒకప్పుడు ఉండేవని చెబుతారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat