వినాయక చవితి, Vinayaka chavithi
వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. హిందూ సంప్రదాయములో శైవములోను, వైష్ణవములోను, అన్ని ప్రాంతములంలో, అన్ని ఆచారములంలో వినాయకుని ప్రార్ధన, పూజ సామాన్యము. తెలుగువారి పండుగలలో వినాయకచవితి ముఖ్యమైన పండుగ. పంచాయతనపూజా విధానం లో వినాయకుని పూజకూడా ఒకటి (వినాయకుడు, శివుడు, శక్తి, విష్ణువు, సూర్యుడు - వీరి పూజా సంప్రదాయాలు పంచాయతన విధానములు)
ప్రాణులకు హితాన్ని బోధిస్తాడు కనుక పార్వతీ పుత్రుణ్ని వినాయకుడంటారని అమరం చెబుతోంది. సర్వప్రకృతికి మేలు చేకూర్చే గణపతిని పూజచేసే విధానమూ విశిష్టమైందే. వినాయక చవితినుంచి తొమ్మిది రోజులపాటు కొనసాగే వినాయక పూజలో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గణపతి తత్వం నేటి పర్యావరణ లక్ష్యానికి దగ్గరగా ఉంటుంది. ప్రకృతికీ, ప్రాణికి మధ్య ఉండాల్సిన సామరస్యాన్ని సూచిస్తుంది.
మహోన్నతమైన హైందవ ధర్మంలో మహర్షులు మూలికల్ని, ఓషధుల్ని పూజాద్రవ్యాలుగా, యాగాది క్రతువుల్లో సమిధలుగా వినియోగించడమనే సంప్రదాయాన్ని ఆరంభించారు.
వినాయకుడు శివపార్వతుల పెద్దకొడుకు (కుమారస్వామి వారి రెండవ కొడుకు). వినాయకుని ఆకారం హిందూమతంలో విశిష్టమైనది. ఏనుగు ముఖము, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఒకే దంతము, ఎలుక వాహనము, పొట్టకు పాము కట్టు , నాలుగు చేతులు - ఒక చేత పాశము, మరొకచేత అంకుశం, ఒక చేత ఘంటము లేదా లడ్డూ, మరొక అభయహస్తము - ఇది నమ్మినవారికి సర్వ మంగళ ప్రదము. హిందూ సంప్రదాయము తో పరిచయము లేనివారికి ఆశ్చర్యకరము.
భారతీయులకు గణపతి జీవనాధారమైన ఒక మూలతత్వము . భారతీయ హిందువులు ప్రతి పనికి ముందు గణేష్ ని పూజించి తమ పనులు చేసుకుపోతుంటారు .