మహాభారతం - భీష్మ పర్వము - ప్రథమాశ్వాసము

P Madhav Kumar


- భీష్మ పర్వము, మహాభారతంలోని ఆరవ భాగము. ఈ పర్వంలో కురుక్షేత్ర యుద్ధం ఆరంభమవుతుంది. భీష్ముని నాయకత్వంలో జరిగిన పది రోజుల యుద్ధం భీష్మపర్వంలో ఉన్నది. భగవద్గీత ఈ పర్వంలో ఒక భాగం. పర్వం ఆరంభంలో వ్యాసుడు యుద్ధాన్ని ఆపుజేయమని ధృతరాష్ట్రునికి బోధిస్తాడు కాని ఆ ప్రయత్నం ఫలించదు. ఇక యుద్ధాన్ని చూడడానికి సంజయునికి అతీంద్రియ శక్తులను ప్రసాదిస్తాడు వ్యాసుడు. ఆ శక్తుల ద్వారా తాను చూసిన యుద్ధాన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి వర్ణిస్తూ ఉంటాడు.భీష్ముడు పదవనాటి యుద్ధంలో నేలకు ఒరిగి అంపశయ్యపై చేరడంతో ఈ పర్వం ముగుస్తుంది.

ప్రధమాశ్వాసం


సంజయునికి శీఘ్రగమనము, దూరశ్రవణం మొదలైన శక్తులు ప్రసాదిస్తున్న వ్యాసుడు
జనమేజయుడు వైశంపాయనుని చూసి " ఒకరిని ఒకరు గెలవవలనన్న తలపుతో పాండవులు కౌరవులు ఎలా ప్రవర్తించారు. యుద్ధం ఎలా జరిగిందో నాకు వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. పుణ్య క్షేత్రమైన కురుక్షేత్రంలో చేరిన ఇరు పక్షముల వారు కదనోత్సాహంతో విడిసి ఉన్నారు. తన కుమారుల అవిధేయతకు కలత పడిన ధృతరాష్ట్రుడు సంజయుని పిలిపించుకుని ఇంతలో వ్యాసుడు అక్కడకు వచ్చాడు. ధృతరాష్ట్రుడు అర్ఘ్యపాద్యములు సమర్పించిన పిమ్మట వ్యాసుడు " దృతరాష్ట్రా ! ఈ భూమి మీద ఉన్న రాజులందరికి కాలం తీరింది కనుకనే ఈ యుద్ధం సంప్రాప్తమైంది. ఇందుకు నీవు చింతించ పని లేదు. నీకు నేను దివ్య దృష్టి ప్రసాదిస్తాను నీవు యుద్ధ భూమిలో ఏమి జరుగుతుందో స్వయంగా చూడవచ్చు " అన్నాడు. ధృతరాష్ట్రుడు " వ్యాసమహర్షీ ! అన్నదమ్ములు ఘోరంగా యుద్ధం చేసుకోవడం నేను ఎలా చూడగలను . నాకు యుద్ధ విశేషాలు వినే భాగ్యం ప్రసాదిస్తే చాలు " అన్నాడు. వ్యాసమహర్షి " సంజయుని చూసి " సంజయా ! నీవు దృతరాష్ట్రునుకి యుద్ధ విశేషాలు వివరించడానికి అనువుగా నీకు రెండు పక్షములలో జరిగే రహస్య సంభాషణలు, వారి మనో వృత్తులు తెలుసుకునే శక్తిని ప్రసాదిస్తున్నాను. నీవు తలచిన వెంటనే యుద్ధ భూమిలో ప్రవేశించి అంతటా సురక్షితంగా సంచరించగలవు ఏ అస్త్ర శస్త్రం నీకు హాని కలిగించదు. కనుక నీవు చూసినది చూసినట్లు దృతరాష్ట్రునికి వర్ణించు " అన్నాడు. వ్యాసుడు ఆ తరువాత సంజయునికి శీఘ్రగమనము , దూరశ్రవణం మొదలైన శక్తులు ప్రసాదించాడు. వ్యాసుడు " దృతరాష్ట్రా ! భూభారం తగ్గించడానికి సంభవించిన ఈ యుద్ధానికి చింత వలదు. పలు దుశ్శకునాలు గోచరిస్తున్నాయి. కనుక కుల క్షయం తప్పదు. అనేక రాజులు నశించక తప్పదు. ధర్మం జయిస్తుంది ఇప్పటికైనా మించి పోలేదు నీ కుమారులను ఒప్పించి పాండవుల రాజ్యభాగం ఇప్పించి ఈ మారణ హోమాన్ని ఆపించు " అన్నాడు. దృతరాష్ట్రుడు " మహాత్మా ! నా కుమారులు అవిధేయులు నా మాట వినరు. నా దోషం లేకుండా నేను అనేక విధముల చెప్పాను. అన్నీ నిష్ప్రయోజనం అయ్యాయి నేను ఏమి చేయగలను " అన్నాడు. వ్యాసుడు " దృతరాష్ట్రా ! జయాపజయాలు దైవాధీనాలు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది " అని చెప్పి వెళ్ళాడు.

దృతరాష్ట్ర సంజయుల సంభాషణ

దృతరాష్ట్రుడు సంజయుని చూసి " సంజయా ! ఈ భూమి కోసం ఎందరో యుద్ధాలు చేసి తమ ప్రాణాలు పోగొట్టు కున్నారు. భూమి అంటే అంత తీపి ఎందుకు? సంజయా ఈ భూమి యొక్క పరిమాణం, స్వరూపం గురించి నాకు వివరించు " అన్నాడు. సంజయుడు " రాజా ! ఈ భూమి నానా విధ చరాచరములకు నిలయం . ఆకాశం యొక్క గుణం శబ్దం. వాయువు గుణం శబ్దం, స్పర్శ. అగ్ని గుణములు శబ్దం, స్పర్శ, రూపములు. జలము యొక్క గుణము శబ్ధ, స్పర్శ, రూప, రసములు. భూమి యొక్క గుణం శబ్ధ, స్పర్శ, రూపం, రసము, గంధం (వాసన). కనుక పంచ భూతములలో ప్రధానమైనది. మేరు పర్వతమునకు దక్షిణమున సుదర్శనం అను పేరు కలిగిన ఒక సువిశాల ప్రదేశం ఉంది. దాని వైశాల్యం 2,500 యోజనములు. అందు మధురసభరితమైన ఒక జంబు (నేరేడు) వృక్షం ఉంది. దాని పండ్లు నేల రాలి చితికి ఆ రసము ఏరులై ప్రవహిస్తూ పర్వతములకు ప్రదక్షిణ చేస్తూ కురు భూమి గుండా ప్రవహించి సముద్రంలో చేరుతుంది. ఆ నదిని జంబు నది అంటారు. ఆ నదిలో ప్రవహించు నీరు సోకిన ప్రదేశం బంగారు మయమగును. కనుక బంగారమునకు జంబూనదం అనే పేరు కూడా ఉంది. ఆ జలం త్రాగిన వారికి ముసలి తనం, రోగములు, దాహం, ఉండదు. కనుకనే ఈ భూమికి జంబూ ద్వీపం, సుదర్శన ద్వీపం అనే పేర్లు వచ్చాయి. ఈ ద్వీపమునకు తూర్పు పడమరలు సముద్రముచే ఆవహించి ఉండును. ఈ ద్వీపమున హిమాలయం, దానికి ఆవల హేమకూటం, నిషిద పర్వతం క్రమముగా నీల, శ్వేత, శృంగ పర్వతములు ఉంటాయి. వీటన్నిటి నడుమ మేరు పర్వతం భూమి లోనికి చొచ్చుకొని 16,000 వేల యోజనములు విస్తరించి 84,000 యోజనములు పొడవున ఉంది. మేరు పర్వతములో దేవతలు, దేవమునులు, గంధర్వులు, కిన్నెర, కింపురుష, దిక్పాలకులు, బ్రహ్మదేవుడు విహరిస్తున్నారు. దానికి ఉత్తరంలో కర్ణికార వనంలో ఈశ్వరుడు గౌరీసమేతుడై విహరిస్తుంటాడు.

జంబూద్వీప విశేషాలు

జంబూద్వీపంలో ఉన్న జనపదాలు తొమ్మిది భాగాలుగా విభజించబడ్డాయి. వాటిని వర్షములు అంటారు. వాటిలో మొదటిది ఉత్తర సముద్రం శృంగవంతం మధ్య భాగాన్ని ఐరావత వర్షం అంటారు. రెండవది శ్వేతపర్వము శృంగవంతం మధ్య ఉన్న భూభాగం దీనిని హిరణ్మయము అంటారు. మూడవది నీల శైలముకు ఉత్తర మున ఉన్న ప్రదేశము దీనిని రమణక వర్షం అంటారు. నాలుగవది నీల శైలముకు దక్షిణమున ఉన్న ప్రదేశం దానిని నీలాకృత వర్షం అంటారు. ఐదవది మేరు పర్వతానికి తూర్పున ఉన్న ప్రదేశం దీనిని భద్రాశ్వ వర్షం అంటారు. ఆరవది మేరుపర్వతానికి పశ్చిమమున ఉన్న ప్రదేశం. దీనిని కేతు మాలా వర్షం అంటారు. ఏడవది మేరు పర్వతానికి ఉత్తరమున ఉన్న ప్రదేశం దీనిని హరి వర్షం అంటారు. హిమవత్పర్వతానికి అటు ఉన్న ప్రదేశం వీటిని కింపురుష వర్షం ఇటు వైపు ఉన్న ప్రదేశం దీనిని భారత వర్షం అంటారు. ఈ జంబూ ద్వీపము విస్తీర్ణం 80,600 యోజనములు. దీనికి రెండింతల విస్త్రీర్ణం కలిగి లవణ, ఇక్షురస, ఘృత, దధి, క్షీర, శుద్ధ జల సముద్రములు క్రమముగా ఒకదాని కంటే ఒకటి రెండింతల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. ఇందు లక్షద్వీపము, శాల్మల ద్వీపము, కౌంచద్వీపము, కుశద్వీపము, శాకద్వీపము, పుష్కరద్వీపము అను ఆరు ద్వీపములు ఉన్నాయి. ఈ ద్వీపములో అనేక పర్వతములు, నదులు, జనపదములు ఉన్నాయి.

దృతరాష్ట్ర సంజయుల వాదం

ఈ జంబూద్వీపానికి కర్త భర్త అయిన శ్రీమన్నారాయణుడు పాలసముద్రానికి ఆవల కనక మయమైన ఎనిమిది చక్రములు కలిగిన దివ్య రథం మనోజ్ఞ దివ్య రథము పైన వైకుంఠములో విహరించు చున్నాడు " అన్నాడు సంజయుడు. దృతరాష్ట్రుడు " సంజయా ! ఈ భరత వర్షం పైన దురాశతో పాండవులు కౌరౌవులు యుద్ధం చేస్తున్నారు కదా ! ఇంతకంటే దురాశపరులు ఈ లోకంలో ఉంటారా " అన్నాడు. సంజయుడు " రాజా ! నీవు అనవసరంగా పదే పదే పాండవులను నిందిస్తున్నావు నీ కుమారులే శకుని మాటలు విని వారి రాజ్యభాగాన్ని అన్యాయంగా అపహరించారు. పాండవులకు నీ రాజ్యంపై ఎలాంటి ఆశ లేదు. ఎందరో రాజులు పాండవులను గెలవాలనే తలపుతో సుయోధనుని పక్షాన యుద్ధం చేస్తున్నారు. వారిని నిందించి ప్రయోజనమేమి. పూర్వం యయాతి, భగీరధుడు, రఘువు, నహుషువు లాంటి మహానుభావులు రాజ్య విస్తరణ కొరకు యుద్ధాలు చేసారు. యజ్ఞ యాగాదులు చేసి యశస్సు గడించారు. రత్నగర్భ అయిన ఈ భారత దేశ సంపదల మీద ఆశతోను ఈ ర్ష్యతోను యుద్ధములు చేయుట అనివార్యం.

భరత వర్షంలోని సంపదలు

ఈ భరతవర్షమున మలయము, శక్తిమంతము, వింధ్య, పారియాత్ర, మహేంద్రము, ఋక్షవంతము, సహ్యాద్రి, పారియాత్ర, మహేంద్రం, ఋక్షవంతం, అను పది పర్వతములు ఉన్నాయి. ఈ భూమిలో రత్నములు, మణులు, ఇనుము, రాగి, తగరం, బంగారం, వెండి మొదలైన ఖనిజాలు ఉన్నాయి. ఇందు గంగ, తుంగభద్ర, వేత్రవతి, వేదవతి, కృష్ణవేణి, పెన్న, యమున, తమస, శారావతి, కావేరి, గోదావరి, నర్మద, బహుద, సరయు, శతద్రువు, వితస్త, విపాత, తామ్రపర్ణి అను మహా నదులు ప్రవహించి భరతవర్షాన్ని సశ్యశ్యామలం చేస్తున్నాయి. ఈ భూమి పాండిపంటలకు ధనధాన్యములకు పుట్టినిల్లు. భరతవర్షమున పాంచాల, పాండ్య, బర్బర, వత్స, మత్స్య, మగధ, మలయాళ, కళింగ, కుళింగ, కురు, కొంకణ, టెంకణ, త్రిగర్త, సాముద్ర, సాళ్వ, శూరసేన, సుధేష్ణ, సుహ్మ, కరూశ, కాశ, కోసల, యవన యుగంధర, ఆంధ్ర, సింధు, ధేది, చోళ, పుళింద, పుండ్రక, పాండ్య, అభీర, సౌవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, విదేహ, విదర్భ, ద్రవిడ, దశార్ణ, కర్ణాట, గౌళ, అంగ, వంగ, మరాఠ, లాట, బాహ్లిక, బహుదాన, కిరాత, కేకయ, అశ్మంతక, కాశ్మీర, గాంధార, కాంబోజ, కేరళ, మాళవ, నేపాళ, గూర్జర, కుంతల, అవంతి మొదలైన జనపదములలోని జనులు సమస్త వస్తు సంపదలతొ సుఖజీవనం చేస్తున్నారు. సమస్త జనులకు రాజులకు ఈ భూమి కామధేనువు వంటిది. ఈ భూమి మీద మమకారంతో రాజులు ఒకరిని ఒకరు అన్నదమ్ములు, తండ్రీ కొడుకులు అని కూడా చూడక చంపు కుంటున్నారు. ఈ భూమి మీద రాజులకు పోగాలం దాపురించి ఈ యుద్ధభూమిన చేరారు. ఏమి జరుగనున్నదో " అని చింతించాడు.

యుద్ధ సమాచారములు సంజయుడు దృతరాష్ట్రునికి చెప్పుట


కురు పాండవ యుధ్ధము గురించి ధృతరాష్ట్రునకు వివరిస్తున్న సంజయుడు
దృతరాష్ట్రుడు " సంజయా ! ఇక నీవు యుద్ధభూమికి వెళ్ళి ఏమి జరుగుతుందో చూసి రా " అని పంపాడు. యుద్ధభూమికి వెళ్ళిన సంజయుడు కొన్ని రోజుల తరువాత తిరిగి వచ్చి దృతరాష్ట్రుని ఏడుస్తూ పాదముల పై పడ్డాడు. అయ్యో రాజా ! పరాక్రమ వంతులలో పరాక్రమవంతుడైన భీష్ముడు అంపశయ్యపై పడి ఉన్నాడు. పరశురాముని జయించిన వీరుడు శిఖండి చేత భంగపడ్డాడు. ఏ భీష్ముని అండ చూసుకుని నీకొడుకు జూదంలో పాండవులను గెలిచాడో ఆ భీష్ముడు యుద్ధమనే జూదంలో ఓడి పోయాడు. పది వేల సైన్యం ఎదురు వచ్చినా ఒక్కడుగా ఎదుర్కొనగల వీరుడు పది రోజుల వీరోచిత పోరు సలిపిన పిదప నేలకొరిగాడు " అని విలపించసాగాడు. భీష్ముడు నేలకొరిగిన వార్త విన్న ధృతరాష్ట్రుడు మూర్చిల్లాడు. కొంతసేపటికి తేరుకుని " సంజయా ! దేవాసురులు ఒకటై వచ్చినా చలించని భీష్ముడు నేలకొరిగాడా ! శస్త్రాస్త్ర ప్రకరణములతో విరోధుల మద మణచుచున్న భీష్ముని శిఖండి ఒంటరిగా ఎదిరించడం కంటే ఆశ్చర్యం ఏమి ! ప్రఛండ ఛండమారుతం లాంటి భీష్ముని శిఖండి అనే చిరుగాలి ఎదిరించిందా ! అంబ కొరకు పోరిన పరశురాముని ఎదిరించి నిలిచిన భీష్ముడు పాండవుల కొరకు శిఖండి చేతిలో నేల కొరిగాడా ! అతని సత్వము, శౌర్యము, శీలము, పరాక్రమము, అతని శుద్ధ వ్రతము నాశం లేనివని నమ్మాను కదా ! ఇప్పుడు ఏమి చేయాలి " అని రోదించి తిరిగి " సంజయా ! భీష్ముని పై అస్త్ర వర్షం కురిపిస్తు న్నప్పుడు మన వాళ్ళు అడ్డుకొనలేదా ఇన్ని అక్షౌహినుల సైన్యం ఒక్క భీష్ముని రక్షించలేక పోయిందా ! ద్రోణుడు, అశ్వథామ, కృపుడు, శల్యుడు పారి పోయారా ! లేకున్న భీష్మునికి ఈ విధమైన స్థితి ఏమిటి . కుల వృద్ధుడైన గాంగేయుని వధించి రాజ్యా ధికారాన్ని చేపట్టడానికి ధర్మరాజు సాహసించడం అధర్మం కాదా ! అధర్మానికి ఒడికట్టిన పాండవులకు దైవం తోడైంది కదా ! కౌరవ సేన అనాధ అయింది కదా ! నా కుమారులు ఎంత కలత పడుతున్నారో కదా ! ఈ పది రోజులు యుద్ధం ఎలా సాగింది ? భీష్ముడు పోరు ఎలా సాగించాడు. నాకు సవివరంగా వివరించు " అన్నాడు. సంజయుడు " మహారాజా ! నీ అవినీతి వలనే కదా పాండవులు ఇన్ని కష్టాల పాలు అయింది. ధర్మపరులైన పాండవులకు అపకారం చేసినందుకు ఫలితం అనుభవించక తప్పదు " అని చెప్పి సంజయుడు యుద్ధం గురించి వివరించ సాగాడు.

కౌరవుల యుద్ధ సన్నాహం


ద్రోణునకు తన సైన్యాన్ని చూపిస్తున్నదుర్యోధనుడు
సంజయుడు వ్యాసభగవానుని స్మరించి వివరణ ప్రారంభించాడు. " రాజా ! ముందుగా నేను మన సైన్యం విదడిది చేసిన ప్రదేశంలో నీ కుమారుని స్తావరానికి వెళ్ళాను అక్కడ సుయోధనుడు గాంగేయాదుల మధ్య కూర్చుని మంతనాలు జరుపుతూ " దుశ్శాసనా ! పాండవులతో యుద్ధం చేయాలన్న మన కుతూహలం ఈ నాటికి తీరనున్నది. భీష్ముడు మన సైన్యాలకు ఆరవ ప్రాణం అతడు ఒక్కడే పాండవ సైన్యాలను అంత మొందించగల యోధుడు . మనలను రక్షించు భీష్ముని మనం కంటికి రెప్పవలె రక్షించుకోవాలి . ఈతడిని ఎదిరించి నిలువగలిగిన వీరుడు ఈ అవనిలో లేడు. శిఖండి తప్ప ఈడిని నిలుప గలిగిన వారు లేరు. కనుక మనం ఈ మహానుభావుడికి శిఖండి చేతిలో మరణం సంభవించకుండా కాపాడుకోవాలి. భీష్మునికి శిఖండి ఎదురు రాకుండా జాగ్రత్తగా చూడండి " అన్నాడు. ఆపై శంఖములు, దుందుభులు , మంగళ వాద్యముల నడుమ కౌరవ సేనలు యుద్ధానికి బయలు దేరాయి. సువర్ణ తాళ కేతనముతో భీష్ముడు, కాంచన వేదిక కేతనముగా ద్రోణుడు, బంగారు గోవు కేతనంగా కృపుడు, తోకసహిత సింహం కేతనంగా అశ్వధ్ధామ, అరటి చెట్టు కేతనంగా శల్యుడు మొదలైన వీరులు బయలు దేరారు. యాదవ బలంతో కృతవర్మ, ససైన్య సమేతంగా మహారధుడైన జయద్రధుడు, గజబలంతో విందానువిందులు, కళింగ సైన్య సమేతంగా భగదత్తుడు, ససైన్య సమేతంగా తన కుమారులు తమ్ములు వెంట రాగా గాంధార రాజు శకుని , సోమదత్తుడు, భూరి శ్రవుడు, బాహ్లికుడు తమ తమ సైన్యాలతో మొహరించారు. కాంభోజరాజు సుదక్షిణుడు, కోసలరాజు బృహద్బలుడు, మహిష్మతీ పురాధీశుడు నీలుడు, త్రిగర్తాధిపతి సుశర్మ, అసుర వీరుడు అలంబసుడు, సాళ్వ, సౌవీర, శూరసేన, యవన రాజులంతా పది అక్షౌహినుల సైన్యంతో సిద్ధంకాగా నీ కుమారుడు తన అక్షౌహిని సైన్యంతో పాము పడగ కేతనంతో యుద్ధానికి తరలి వెళ్ళారు. నీ కుమారునికి ఇరు వైపుల దుశ్శాసనుడు, దుర్మరణుడు, వివింశతి , వికర్ణుడు ఉన్నారు.

భీష్ముడు సైన్యాలను యుద్ధోన్ముఖులను చేయుట

సైన్యాధ్యక్షుడైన భీష్ముడు " మహావీరులారా ! క్షత్రియ వీరులకు యుద్ధభూమిలో స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి. ఇంతకు ముందు ఎందరో యుద్ధంలో మరణించి ఆ మార్గంలో ప్రయాణించారు. క్షత్రియ వీరులకు ఇంట్లో రోగాల బారిన పడి మరణించడం కంటే మరో పాపం లేదు కనుక మీరు కూడా ఆ మార్గంలో పయనించండి. రణరంగం క్షత్రియులకు పెన్నిధి వంటింది " అన్నాడు. ఆ మాటలు విన్న క్షత్రియ వీరులు ఉత్సాహంగా " మేమంతా మీ వెంట ఉండి విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాము " అన్నారు. తరువాత సుయోధనుని అడిగి కర్ణుడు తన పుత్ర, మిత్ర, అమాత్య, బంధు సహితంగా యుద్ధభూమిలో లేడని నిర్ధారించుకున్నాడు. సుయోధనుడు కర్ణుడు అతని సంబంధితులు యుద్ధ భూమిలో లేరని భీష్మునకు తెలిపి అలాగే వ్యూహ రచన చేయమని వేడుకున్నాడు. భీష్ముడు వ్యూహరచన చేసాడు. భీష్ముడు, ద్రోణుడు పడమర ముఖంగా నిలబడ్డారు. తమకు ఒక వైపు కృపాచార్య అశ్వథామలు, మరొక పక్క కృతవర్మ, శల్యులను నిలిపాడు. వెనుక బాహ్లిక సోమదత్తులు ఉన్నారు. నడుమ సుయోధనుడు ఉన్నాడు. సుశర్మ మొదలైన వారిని అక్కడక్కడ నిలిపారు.

పాండవుల యుద్ధసన్నాహం


పాండవ సేనాని ధృష్టధ్యుమ్నుడు
పాండవులు యుద్ధ సన్నద్ధులై రణ భూమిలో ప్రవేశించారు. యుధిష్టరుడు అగ్రభాగాన వెలిగి పోతున్నాడు. ధర్మరాజుకు ఒక వైపు భీముడు గధను ధరించి నిలువగా మరొక వైపు అర్జునుడు గాండీవధారి అయి నిలిచాడు. శ్రీకృష్ణ సారధ్యంలో , కపిధ్వజం రెపరెపలాడు చుండగా అర్జునుడు ధనుష్టంకారం చేసాడు. నకుల సహదేవులు అర్జునిని అనుసరించారు. ద్రౌపదీ సుతులు తమ సైన్యాలతో మొహరించారు. ప్రతి వింధ్యుడు, శ్రుతసోముడు, శతానీకుడు, శ్రుతసేనుడు, సౌభద్రుడు తమ సైన్యాలతో రణభూమిలో ప్రవేశించారు. గజసైన్య సహితంగా ద్రుపదుడు, అతనికుమారులు, అన్నదమ్ములతో వచ్చాడు. మత్స్య దేశాధిపతి విరాటుడు, యాదవ సైన్యాలతో సాత్యకి, వీర ప్రలాపములు చేస్తూ చేకితానుడు, వీరుడు, శిఖండి యుద్ధ భూమిలో విహరిస్తున్నారు. మగధాధీశుడు సహదేవుడు సముద్రం వంటి తన సైన్యంతో యుద్ధ భూమిలో ప్రవేశించాడు. దృష్టకేతు అధిక పరాక్రమంతో సోదర సహితంగా యుద్ధ భూమిలో ప్రవేశించాడు. భీముని పుత్రుడైన ఘతోత్కచుడు రాక్షస సైన్యంతో యుద్ధ భూమిలో ప్రవేశించాడు. కేకయ రాజులు అయిదుగురు, పాండ్య రాజు, శైభ్యుడు , ఇతర దేశముల నుండి వివిధ రాజులు తమ సైన్యాలతో పాండవ పక్షాన యుద్ధం చేయవచ్చారు. దృష్టధ్యుమ్నుని అధ్యక్షతలో పాండవ సైన్యం యుద్ధ భూమిలో ప్రవేశించింది. తన సైన్యంతో తూర్పు ముఖంగా నిలబడి యుధిష్టరుడు " వీరాధి వీరులారా ! ఈ యుద్ధం మనకు జయాన్నిచ్చిన భూమిని అంతా కైవశం చేయవచ్చు లేని ఎడల వీరస్వర్గం ఇవ్వనూ వచ్చు మనం ఎందుకైనా సిద్దంగా ఉండాలి " అన్నాడు. ఆ మాటలకు దేశాధిపతులు ఉత్సాహ పూరితులై జయజయ ధ్వానాలు చేసారు.

సంజయుడు యుద్ధాన్ని ఎదుర్కొను పాండవుల ధైర్యాన్ని వర్ణించుట

దృతరాష్ట్రుడు సంజయునితో " సంజయా ! అత్యధికమైన మన సైన్యంతో పోరుసల్పడానికి అల్పసైన్యం కలిగిన పాండవులు ఎలా సాహసించారు ? " అని ప్రశ్నించాడు. సమాధానంగా సంజయుడు " రాజా ! అర్జున యుధిష్టరుల సంభాషణ వింటే ఇది మీకు అవగతమౌతుంది . ధర్మరాజు అర్జునితో " అర్జునా ! కౌరవ సైన్యం బలంగా ఉంది మనసైన్యం స్వల్పం " అన్నాడు. అర్జునుడు " అన్నయ్యా ! పూర్వం నారదుడు భీష్మ, ద్రోణాదులు వింటూ ఉండగా ఇలా చెప్పాడు. అధర్మ వర్తనులైన సేనలు అధికమైనా ధర్మవర్తనులైన స్వల్ప సైన్యాలు వారిని గెలువగలవు అన్నాడు. అది కాక అసాధారణ భీముని గధాఘాతానికి తట్టుకుని నిలువ ఎవరికి శక్యం కాదు. దృష్టద్యుమ్న, శిఖండి మొదలైన పాంచాల భూపతుల గెవడం ఎవరి తరం. మత్స్య భూపతి విరాటుని బలం నీకు తెలియనిది కాదు. సాత్యకి, చేకితాసుల పరాక్రమం మనకు తోడుగా ఉంది. అవక్ర పరాక్రమ వంతుడైన అభిమన్యుడు , మాయా విధ్యా కోవిదుడైన ఘటోత్కచుడు మనకు చేదోడుగా ఉన్నారు. శ్రీకృష్ణుని తోడు మన కున్నది. నీ ధర్మనిరతి మనకు రక్షగా ఉంది. నా గాండీవం శక్తి నీకు తెలియనిది కాదు. నీ శక్తి నీకు తెలియదు. నీవు కోపించిన దేవతలు కూడా నీ ముందు నిలువ లేరు. కనుక కలత చెంద వద్దు " అన్నాడు. అర్జునిని మాటలకు ఆనందించిన ధర్మరాజు కౌరవులకు దీటుగా ఒక వ్యూహం పన్నమని దృష్టద్యుమ్నునకు చెప్పమని చెప్పాడు. అర్జునుడు అలాగే చేసాడు. దృష్టద్యుమ్నుని వ్యూహరచన ప్రకారం అభిమన్య, ఉప పాండవ, నకుల సహదేవుల సహితంగా భీముడు సైన్యాలకు అగ్రభాగంలో నిలబడ్డాడు. చేకితానుడు, సాత్యకి, పాంచాల దేశాధిపతులు, మత్సదేశాధీసుడు తమ తమ సన్య సమేతంగా ఉత్తర దక్షిణ భాగంలో నిలిచారు. నడుమ గజారూఢుడై ధర్మరాజు నిలిచాడు. అందరికన్నా ముందు అర్జునిని రక్షణలో శిఖండి భీష్ముని ఎదుట నిలిచాడు. వెనుక భాగంలో మగదాధీశుడు, దుష్టకేతువు నిలిచారు. రథములు, అశ్వములు, కాల్బలములతో శమంతక పంచకం నిండి పోయింది. ఈ భూమి పైన బాలవృద్ధులు తప్ప మిగిలిన మగవారంతా యుద్ధ భూమిలో ఉన్నారు. ధృతరాష్ట్రుడు " సంజయా ! ఇరువైపులా ఉన్న సైన్యంలో ఎవరు బలవంతులు " అన్నాడు. సంజయుడు " రాజా! ఇరువైపులా ఉన్న సైన్యాలు ఎవరికి వారే తమ బలం ఎక్కువని చెప్పుకుంటున్నారు. నాకు మాత్రం శ్రీకృష్ణుని అండ ఉన్న పాండవ సైన్యం బలమైనదని తోచుచున్నది " అన్నాడు.

ధర్మరాజు పితామహ గురువుల వద్ద యుద్ధానికి అనుమతి తీసుకొనుట


పితామహ వద్ద యుద్ధానికి అనుమతి తీసుకొనుచున్న ధర్మరాజు
కృష్ణార్జునులు పాంచజన్యం, దేవదత్తాలు పూరించగా అవి పాండవ సైన్యంలో ఉత్సాహాన్ని కౌరవ సైన్యంలో కలతను కలిగించాయి. కౌరవ సైన్యాలకు ఉత్సాహం కలిగించే విధంగా మంగళ తూర్య నాధాలు మ్రోగించారు. ఆ సమయంలో ధర్మరాజు తన ఆయుధములను కవచాన్ని రథంలో వదిలి భీష్ముని వైపు పాదచారి అయి నడువ సాగాడు. అది చూసిన కృష్ణ, సాత్యకి ఇతర ధర్మరాజ సన్నిహితులు కలవర పడి రథాలు దిగి ధర్మరాజును అనుసరించారు. " ఇందరం నీ వెంట ఉండగా నీవు ఇలా పాదచారివై వెడలుట ఏమి. శత్రువులు మనది పిరికితనం అని హేళన చేయరా " అని సోదరులు తలా ఒక విధంగా అడుగుతున్నా ధర్మరాజు మౌనం వీడక చేతులు ముకుళించి నడచి పోతునే ఉన్నాడు. అది చూసిన శ్రీకృష్ణుడు " ధర్మజుని తలపు నాకు తెలుసు. అతడు భీష్మ, ద్రోణ, కృపాచార్య, శల్యులకు నమస్కరించి యుద్ధం చేయడానికి అనుమతి తీసుకోవడానికి వెళుతున్నాడు. అలా చేస్తే విజయం తధ్యం " అన్నాడు. ఆ మాటలు విని అందరూ మౌనంగా జరిగేది వీక్షించ సాగారు. కృషార్జున, నకులసహదేవ, భీమాదులతో ధర్మరాజు భీష్ముని ఎదుట నిలువగా కౌరవ ప్రముఖులు మాత్రం ధర్మరాజులోని రాకకు అంతర్యం తెలియక భీమార్జున, నకులసహదేవ, ద్రుపద, సాత్యకుల అండ ఉన్న ధర్మరాజుకు భయమేల అని కొందరు అనుకోసాగారు. ధర్మరాజు పిరికి వాడు కాదు అయినా ఈ సమయంలో ఈ రాకలోని అంతర్యం ఏమిటో అనుకున్నారు. మానధనుడైన ధర్మరాజు ఏమి మాట్లాడతాడో, భీష్ముడు ఎలా సత్కరిస్తాడో, కృష్ణార్జునుల అంతర్య మేమిటో, భీమాదులు ఏమి చెప్తారో అని పలు పలు విధాలుగా ఆలోచించసాగారు. ధర్మరాజు భీష్ముని ఎదుట నిలిచి " మహానుభావా ! మీ ఎదుట నిలిచి యుద్ధం చేయవలసిన దుస్థితికి చింతిస్తున్నాను. మీ దీవెనలకు అనుమతికి వచ్చాను నాకు యుద్ధం చేయడానికి అనుమతి ఇచ్చి నన్ను దీవించండి . మీ దీవెనలు నాకు విజయాన్ని ప్రసాదిస్తుంది " అన్నాడు. భీష్ముడు ఆనందించి " ధర్మనందనా ! ఈ సమయంలో నీ రాక సముచితమే కాక ఎంతో శ్రేయస్కరం కూడా . నీవిట్లు చేయకున్న నా శాపానికి గురికావలసి ఉండేవాడివి. ఇక నీకు జయం కలుగుతుంది. నీ పక్షాన యుద్ధం చేయడం తప్ప ఏదైనా వరం కోరుకో అనుగ్రహసిస్తాను. నీకు మేలు జరుగుతుంది " అన్నాడు. ధర్మరాజు " పితామహా ! మీరు రారాజు తరఫున యుద్ధం చేయండి కాని మాకు మేలు చేయండి " అని కోరాడు. భీష్ముడు " ధర్మరాజా ! నీ ఆంతర్యం వివరించు " అన్నాడు. ధర్మరాజు " పితామహా ! మరేమి లేదు మీతో యుద్ధం చేసి గెలవడము ఎలాగో వివరించండి " అన్నాడు. భీష్ముడు చిరునవ్వుతో " ధర్మరాజా ! నాతో రణరంగాన గెలవడం దేవతలకు కూడా సాధ్యం కాదు. అడిగావు కనుక చెప్తాను. నే చేతి ఆయుధం కింద పడిన కాని అది సాధ్యం కాదు. ఇప్పటికి ఇంతకంటే చెప్పను . ఈ సారి మన కలయిక నీ మనోరధాన్ని నెరవేర్చ గలదు " అన్నాడు. భీష్ముని వద్ద అనుమతి పొందిన ధర్మరాజు తన వారితో కలసి ద్రోణ, కృపాచార్య, శల్యులకు నమస్కరించి వారి అనుమతి పొందాడు. ద్రోణుడు " ధర్మజా ! శ్రీకృష్ణుని అండ ఉన్న నీకు విజయం తధ్యం అన్నాడు. ధర్మరాజు ద్రోణుని అతడిని గెలిచే ఉపాయాన్ని చెప్పమని ప్రార్ధించాడు. ద్రోణుడు " ధర్మరాజా ! నా చేతిలో ఆయుధమున్నంత వరకు నన్ను గెలవడం సాధ్యం కాదు కాని నేను అస్త్రసన్యాసం చేసినా ప్రాయోపవేశం చేసినా నన్ను వధించగలరు. అశుభ వార్త వినినంతనే అస్త్రసన్యాసం చేస్తాను " అన్నాడు . కృపాచార్యుని గెలిచే ఉపాయం అడుగగా అతడు " నేను ఎవరి చేత చంపబడను కాని నీకు జయం తథ్యం " అన్నాడు. శల్యుని చూసి ధర్మరాజు తనకిచ్చిన మాట గుర్తు ఉంచుకొమ్మని చెప్పగా. అతడు ధర్మరాజుతో అతడికి ఇచ్చిన మాట గుర్తు ఉన్నదని అలాగే చేస్తానని నిశ్చింతగా ఉండవచ్చని మాట ఇచ్చాడు. శ్రీకృష్ణుడు యుద్ధాన్నికుతూహలంతో చూడవచ్చిన కర్ణుని చూసి " కర్ణా ! భీష్ముని మీద కోపంతో అతడు పడిపోయే వరకు యుద్ధం చేయనని చెప్పావట కదా ! అప్పటి వరకు పాండవ పక్షాన యుద్ధం చేస్తూ వినోదించవచ్చు కదా ! " అన్నాడు. కర్ణుడు " కృష్ణా ! నేను భీష్ముని మీద కోపంతో యుద్ధం నుండి వైతొలిగాను కాని సుయోధనునికి ఇచ్చిన మాట తప్పనని నీకు తెలియనిదా " అన్నాడు. ఆ పై ధర్మజుడు రధాన్ని అదిరోహించి కవచాన్ని ధరించి కౌరవ పక్షంవైపు కొంత ముందుకు వెళ్ళి " కౌరవ ప్రముఖులారా ! మీలో ఎవరైనా నాపై ఉన్న అభిమానంతో నా పక్షంలోకి రావచ్చు నేను వారిని నా తమ్ముల వలె చూసుకుంటాను " అన్నాడు. ఆ మాటలు విన్న యుయుత్సుడు ధర్మరాజు పక్షంలో చేరటానికి అంగీకరించాడు. యుయుత్సుడు సుయోధనుని దుష్కృత్యములను నిందిస్తూ పాండవులను పొగుడుతూ తన సైన్యాలతో పాండవ పక్షంలో చేరాడు. ధర్మరాజు సంతోషంగా యుయుత్సుని ఆహ్వానించాడు.

భగవద్గీత


భగవద్గీత
దృతరాష్ట్రుడు " సంజయా ! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయు నిశ్చయంతో సమావేశం అయిన నావారైన కౌరవులు, పాండవులు ఏమి చేసారు ?" అని అడిగాడు. సంజయుడు " రాజా ! నీ కుమారుడైన సుయోధనుడు పాండవులు పన్నిన వ్యూహం చూసి ద్రోణుని వద్దకు వెళ్ళి " ఆచార్యా ! దృష్టద్యుమ్న విరచిత సేనలో పాండవ బలం తిలకించండి. భీమార్జున సమాన సాత్యకి, ద్రుపదుడు, చేకితానుడు, పురుజిత్తు, కాశీరాజు, కుంతిభోజుడు, సైభ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ద్రౌపదీ పుత్రులు మొదలైన సైన్యాలు భీమ రక్షితమై పరిమితమై ఉన్నది. ఇక మన సేనలో మీరు, భీష్ముడు, శల్యుడు, వికర్ణుడు, భూరిశ్రవుడు పెక్కు మంది రధికులు అస్త్రాస్త్ర కోవిదులు నా కొరకు ప్రాణాలు ఒడ్డి యుద్ధం చేయ సిద్ధమై ఉన్నారు. భీష్మ రక్షితమైన మన సేనలకు మీరంతా రక్షణగా ఉండి భీష్మునికి రక్షణ కల్పిస్తూ ముందుకు సాగండి " అన్నాడు. భీష్ముడు సుయోధనునికి సంతోషం కలిగించేలా శంఖనాదం చేసాడు. అదివిన్న మిగిలిన వారంతా శంఖధ్వానాలు చేసారు. తూర్యనాదాలు మిన్నంటాయి.

పాండవ సన్నాహం


అర్జునుడికి భోదిస్తున్న కృష్ణుడు
పాండవ పక్షంలో కృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, భీముడు పౌండ్రాన్ని, యుధిష్టరుడు అనంత విజయాన్ని, నకుల సహదేవులు సుఘోష, మణి పుష్పకములు వారితో ద్రుపద, విరాట, సాత్యకి, దుష్టద్యుమ్నుడు, శిఖండి ఇతర ప్రముఖులు తమతమ శంఖములను పూరించారు. ఆ శంఖనాదాలు కౌరవ హృదయాలను ఛేదిస్తూ పాండవ సైన్యాలలో ఉత్సాహం కలిగించింది. అర్జునుడు వింటిని సారించి గాండీవావికి నారిని సంధించి కృష్ణుని చూసి " కృష్ణా ! నేను ఎవరితో యుద్ధం చేయాలో చూడాలి కనుక రధాన్ని ఇరు సైన్యాల మధ్యలోకి తీసుకు వెళ్ళాడు. కృష్ణడు రధాన్ని ఇరుసైన్యాల మధ్య భీష్మ, ద్రోణ, ప్రముఖ యోధుల ఎదుట నిలిపి వారిని చూడమని చెప్పాడు. అర్జునుడు కౌరవ సైన్యంలో ఉన్న కురు వృద్ధులను, గురువులను, అన్నలను, తమ్ములను, కుమారులను, బంధువులను, మిత్రులను చూసి మనసు విషాదంతో నిండి పోగా కృష్ణునితో " కృష్ణా ! దుర్మధాంధుడైన సుయోధనుని వలన ఈ యుద్ధం దాపురించిది కదా. ఇరుపక్షాలలోని బంధు మిత్రులను చూసి నా మనసు వికలమైంది. గాండీవం జారిపోతుంది కాళ్ళు వణికి పోతున్నాయి. ఈ యుద్ధం నేను చేయజాలను. ఎవరి సుఖం కొరకు ఈ యుద్ధం చేస్తున్నామో వారందరి రక్తంలో తడిసిన రాజ్యభోగాలు నాకు సుఖాన్ని ఇస్తాయా ! ఇందువలన కీర్తి, యశస్సు ఎలా వస్తుంది. పదునాలుగు భువనాలను ఏలడానికి కూడా ఈ పాపపు యుద్ధం నేను చేయజాలను. యుద్ధం వలన సంభవించే దుష్పరిణామాలు యోచించక సుయోధనుడు అహంకార పూరితుడై దురాశతో యుద్ధం చేస్తే చేయనీ నేను మాత్రం పెద్దలను, గురువులను, బంధువులను, మిత్రులను సంహరించడమే కాక కుల క్షయానికి కారణమైన ఈ యుద్ధం చేయ నాకు మనస్కరించ లేను. కులక్షయం వలన ధర్మం నశిస్తుంది ధర్మం నశించడం వలన వర్ణ సంకరం ఔతుంది. కుల నాశకులకు నరకం తప్పదు. బంధు మిత్రులను చంపి పాపం మూట కట్టుకొనే ఈ యుద్ధం నేను చేయజాలను " అని రథంపై కూలబడ్డాడు. ఇలా శోక విహ్వలుడైన అర్జునిని చూసి కృష్ణుడు " ఈ విపత్కర సమయంలో నీకు పిరికితనంతో కూడిన ఈ మోహం ఎలా కలిగింది. అవివేకులకు ఇది తగును కాని నీకు కాదు పిరికి తనం వదిలి యుద్ధానికి సన్నద్ధంకా అర్జునా ! లెమ్ము " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! పూజనీయులైన భీష్మ, ద్రోణాదులపై బాణాలు సంధించి జీవించడం కంటే బిక్షమెత్తుకు బ్రతకడం మేలు కదా ! నేను సోదరులైన దృతరాష్ట్ర కుమారులను చంగలనా ! నా హృదయం శోకతప్తమైంది ఇంద్ర పదవి కూడా ఈ శోకాగ్ని చల్లార్చదు . యుద్ధంలో ఎవరు గెలిచినా బంధునాశనం తప్పదు. కార్పణ్య దోషంతో కొట్టబడిన నేను ధర్మా ధర్మ విచక్షణ చేయ లేకున్నాను. నన్ను నీ శిష్యుని చేసుకొని కర్తవ్యాన్ని బోధించు కృష్ణా " అని చేతులు ముకుళించి ప్రార్ధించాడు.

కృష్ణుడు అర్జునినికి ఆత్మజ్ఞానం భోధించుట


అర్జునినికి ఆత్మజ్ఞానం భోధిస్తున్న కృష్ణుడు
శ్రీకృష్ణుడు " అర్జునా ! శోకించ తగని వారి కొరకు శోకిస్తున్నావు. కాని పండితుని వలె మాట్లాడుతున్నావు. పండితులు జీవించి ఉన్న వారిని గురించి కాని మరణించిన వారి గురించి చింతించరు. అవివేకంతో నీవు పడుతున్న వేదన వివేకంతో ఆలోచించిన పటాపంచలు కాగలదు. పరమ జ్ఞానవంతమైన వాక్యములు చెప్తాను విను జీవుడు ఈ లోకమున బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఎలాగో మరణానంతరం చిరిగిన వస్త్రం విడిచి కొత్త వస్త్రాన్ని ధరించిన విధంగా జీర్ణ శరీరాన్ని వదిలి వేరొక నూతన శరీరాన్ని ధరిస్తాడు. పుట్టుక మరణం శరీరానికే కాని ఆత్మకు కాదు. ఆత్మను ఖడ్గం ఖండించ లేదు, అగ్ని దహించ లేదు, జలం తడప లేదు, వాయువు ఆర్పివేయనూ లేదు ఆత్మ శాశ్వితుడు, పురాతనుడు మరణం శరీరానికే కాని ఆత్మకు కాదు. ఆత్మ నిర్గుణుడు ఎవరినీ బాధించడు తాను బాధపడడు. సుఖ దుఃఖములకు కారణం అహంకారం కనుక పార్ధా ! నీవు అహంకారమును వదిలి యుద్ధం చేయుము. స్వధర్మం ఆచరణ యోగ్యం పర ధర్మం పాపం. చక్కగా అనుష్టించ బడిన పరధర్మం కంటే లోప భూయిష్టమైన స్వధర్మం మంచిది. అర్జునా ! క్షత్రియులకు యుద్ధం పరమ ధర్మం తెరిచి ఉంచిన స్వర్గధామం. సందేహం వదిలి యుద్ధం చేయ సన్నద్ధిడివి కా . అర్జునా ! మనుష్యుడు కర్మానిని మాత్రమే ఆచరించ వలెను ఫలితాన్ని దైవానికి వదిలి వేయాలి. దీనిని కర్మ సన్యాసం అంటారు. ఇలా కృష్ణుడు అర్జునినికి తత్వజ్ఞానం అందించి అతని సందేహాలను తీర్చాడు.

విశ్వరూప సందర్శనం


విశ్వరూప సందర్శనం
అర్జునుడు తేలిక పడిన మనసుతో " కృష్ణా ! గుహ్యమైన ఈ శాస్త్రజ్ఞానమును నాకు దయతో ఉపదేశించి నాలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేసావు. నా లోని భ్రమలు తొలిగించావు. యోగుల హృదయములకు మాత్రం చూడ సాధ్యమైన నీ అతులిత అయిశ్వరై విభూతులతో కూడిన నీ రూపమును చూడవలెనన్న నా కోరికను మన్నించు కృష్ణా ! " అన్నాడు. కృష్ణుడు " అర్జునా ! నానావిధ శోభితము అనేక ఆకృతులు కలిగిన నా స్వరూపం నీవు ఈ మాంస నేత్రములతో దర్శించ జాలవు కనుక నీకు నేను దివ్య దృష్టిని ప్రసాదించగలను నా దివ్య రూపమును వీక్షించు " అని అర్జునినికి తన విశ్వరూపమును చూపించాడు. వేయు సూర్యుల సమాన కాంతితో వెలిగి పోతున్న ఆ విశ్వరూపుని రూపాన్ని చూసిన అర్జునుడు ఆశ్చర్యం ఆనందం ముప్పిరి గొనగా అనేక దండ ప్రమాణాలు ఆచరించి " దేవా ! బ్రహ్మ దేవుడు, దేవతలు, రాక్షసులు , కిన్నెర, కింపురుషాది సమస్త చరాచర జగత్తు నీ అందు నేను చూస్తున్నాను. అనేక ముఖములు, బాహువులు, కరములు, కన్నులు కనపడుచున్నవి. అనేక కిరీటములు, ఆయుధములు, భూషణములు కనపడుచున్నవి. ఆది, మధ్య, అంతం ఏదో తెలియక ఉన్నది. అప్రమేయమైన నీ రూపం దేదీప్యమై వెలుగుచున్నది. భూమి ఆకాశం నీవే అయి ఉన్నావు. సూర్య, చంద్రులు నీ కన్నులుగా పెద్ద కోరలు కలిగిన నీ ముఖం ప్రజ్వలించుచున్నాయి. నీలో రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, వసువులు లాంటి సకల జగత్తు ప్రవేశిస్తూ ఉన్నది. గుంపులు గుంపులుగా మహామునులు నిన్ను స్తుతిస్తున్నారు. సిద్ధ, సాధ్య, గంధర్వులు నిన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. దృతరాష్ట్ర సంతతి, భీష్ముడు, ఈ సమస్త రాజలోకము ససైన్య సమేతంగా అగ్ని జ్వాలలు ప్రజ్వలిస్తున్న నీ ముఖం లో ప్రవేసిస్తున్నారు. దుర్నిరీక్షమై ఉగ్రమై ఉన్న నీ విశ్వరూపం చూడ భీతి కలుగుతున్నది. నా ధైర్యం సడలి పోతున్నది అవయవములు పటుత్వం కోల్పోతున్నవి . ఓ మహానుభావా ! నాయందు కరుణ చూపి నీ వెవరో తెలిపి భయంకరమైన నీ విశ్వరూపమును ఉపసంహరింఛుము. " అర్జునా ! నేనే పరమేశ్వరుడను, కాలుడను, ఇక్కడున్న ఈ జనములను నాశనం చేయుటకు ఉపయుక్తుడనై ఉన్నాను. ఇప్పటికే భీష్మ, ద్రోణాది వీరులను సంహరించాను. నాచే సంహరించబడిన వీరిని నీవు చంపుట కేవలం నిమిత్త మాత్రమే. కనుక అర్జునా లెమ్ము యుద్ధము చేసి రాజ్యాన్ని కైవశం చేసుకొనుము " అన్నాడు. ఆ మాటలకు అర్జునుడు గడగడా వణుకుచూ " వాయుదేవుడను, వరుణ దేవుడవు, అగ్ని దేవుడవు, సూర్యుడు, చంద్రుడు నీవే. అనేక తత్వసారము నీవే, నీవే పుండరీకాక్షుడవు, శాశ్వతుడవు, అచ్యుతుడవు నీవే. నీ మహిమ ఎరుగక నీవు యాదవుడవని సఖుడవని నా మేన బావవవి నీతో సరస సల్లాపములు ఆడాను. సఖుడవన్న చనువుతో నీ పట్ల తెలియక అపరాధం చేసి ఉంటాను. నీ దివ్య రూపం కనులారా చూసాను ఆనందం, భీతిని కలిగిస్తున్నది తల్లి తండ్రులు బిడ్డల అపరాధములు మన్నించినట్లు నన్ను మన్నించు దేవా " ని ప్రార్ధించాడు. " అర్జునా ! అనేక తపములు ఆచరించిన వారికి, వేదాధ్యయనం చేసిన వారికి దుర్లభమైన నా దివ్యరూపం నీ యందు కలిగిన ప్రీతి చేత నీకు నాయందు కలిగిన భక్తి భావం చేత నీకు లభించింది. నీవు భయభ్రాంతులు విడిచి సంప్రీత మనస్కుడవు కమ్ము " అని పలికి శ్రీ కృష్ణుడు తన విశ్వరూపం ఉపసంహరించి సహజ రూపం ధరించాడు . స్వస్థత చెందిన అర్జునిని చూసి కృష్ణుడు " అర్జునా ! నా యందు అచంచల భక్తి ఉంచి నన్నే పూజించు వాడు నన్నే పొందగలడు. అత్యంత గుహ్యమైన జ్ఞానమును నీకు అందించాను. సర్వ ధర్మములను నాకు సమర్పించి నన్ను శరణు వేడుము. నన్ను ఆశ్రయించిన నీ సకల దురితములు తొలగించి నీకు మేలు చేస్తాను. నా యందు భయ భక్తులైన వారికి ఈ శాస్త్రమును ప్రీతితో చెప్పుము . అర్జునా చక్కగా వింటివా నీ అజ్ఞానం తొలగి పోయిందా " అన్నాడు. అర్జునుడు " దేవా! నీ దివ్యరూపం చూసిన నా సందేహాలు తొలగి పోయాయి. సర్వలోక నిర్వాహకుడైన నీ మాటలు నాకు శిరోధార్యము. స్థిర చిత్తుడనై నీవు చెప్పినట్లు నడచుకుంటాను " అని చెప్పి శ్రీకృష్ణునికి నమస్కరించి గాండీవాన్ని చేత ధరించాడు.

గీత పరిసమాప్తి

శ్రీకృష్ణుని జ్ఞాన భోధను చూసిన సంజయుడు " దేవా! వ్యాసుని దయ వలన కృష్ణార్జుల సంవాదం విన్నాను. మహా యోగీంద్ర ఆనంద కరుడైన పరమాత్ముని దివ్యరూప సందర్శనం నాకు లభించింది. ఆ మహాను భావుని అమృత తుల్యమైన పలుకులు విని ధన్యుడనైనాను. నా మనసు ఆనందంతో నిండి పోయింది. గుహ్యమైన జ్ఞానం విని పులకించాను. ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ ధర్మము, నీతి, సిరి సంపదలు, విజయము ఉంటాయి " అని భక్తి పారవశ్యంతో చెప్పాడు.

యుద్ధారంభం


ఆరంభమైన యుధ్ధం
దృతరాష్ట్రుడు " సంజయా ! ఒకరికి ఒకరు ఎదురుగా నిలిచిన కౌరవులు పాండవులు ఏమి చేసారో చెప్పు " అని అడిగాడు. సంజయుడు " మహారాజా ! నీ కుమారుడైన సుయోధనుడు తరఫున దుశ్శాసనుడు తన వారిని పురికొల్పాడు. కౌరవ సైన్యం భేరి, మృదంగం, శంఖనాదం చేసారు. భీష్ముడు ముందుగా కదిలాడు. పాండవులు కూడా యుద్ధ సన్నద్ధమైయ్యారు. తూర్యనాదాలు మిన్నంటాయి. ఒకరిని ఒకరు ఘర్జించు కుంటున్నారు. భీముడు సింహనాదం చేసాడు. యుద్ధం మొదలైంది. భీష్ముని దుశ్శాసనుడు, దుర్ముఖుడు, దుష్ప్రహుడు, దుర్మరణుడు, వివిశంతి, వృషసేనుడు, చిత్రసేనుడు, వికర్ణుడు, పురుమిత్రుడు ఎదుర్కున్నాడు. అది చూసిన సుయోధనుడు సంతోషించాడు. నకులసహదేవులు, అభిమన్యుడు, ఉపపాండవులు దుష్టద్యుమ్నుని ఆధ్వర్యంలో శరపరంపర కురిపించారు. వారి పరాక్రమం చూసిన ఇరు పక్షాలు ఆశ్చర్య చకితులైయ్యారు. ధర్మరాజు, సుయోధనుడు తమ తమ సైన్యాలను యుద్ధానికి పురికొల్పారు. ఉభయ సైన్యాలు ఒకరితో ఒకరు తలపడ్డారు. రథములు, హయములు, గజములు, కాల్బలములు ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు భీకరంగా పోరుతున్నారు. భీష్ముడు కౌరవ సైన్యాలకు ఉత్సాహం కలిగిస్తూ మధ్యందిన మార్తాండుని వలె వెలిగి పోతున్నాడు. అర్జునుడు శంఖం పూరించి గాండీవం ధరించి నారి సారించి భీష్మునితో తలపడ్డాడు. ఇరువురు ఒకరిపై ఒకరు అస్త్ర శస్త్ర పరంపర కురిపించుకున్నారు. సాత్యకి కృతవర్మను ఎదుర్కొని భీకరంగా పోరు సల్పారు. ఇరువురి శరీరాలు రక్తంతో తడిసి పోయాయి. అభిమన్యుడు కోసల రాజుతో యుద్ధం చేస్తున్నాడు. కోసల రాజు అభిమన్యుని సారథిని పడగొట్టి హయములను చంపాడు. అభిమన్యుడు కోసల రాజు కేతనములను, విల్లును విరిచి అతడిని గాయపరిచాడు. భీమునిపై భీష్ముడు బాణములు విడిచాడు. ఇరువురి నడుమ పోరు భీకరంగా పోరు జరుగుతుంది. నకులుని దుశ్శాసనుడు ఎదుర్కొన్నాడు. నకులుడు అతడి విల్లును ఒకేఒక బాణంతో విరిచి వేసాడు. దుశ్శాసనుడు వేరొక విల్లు అందుకుని నకులుని మీద శరవర్షం కురిపించాడు. సహదేవునితో దుర్ముఖుడు యుద్ధం చేస్తున్నాడు. అతడు సహదేవునిపై శరపరంపర కురిపించ సాగాడు. సహదేవుడు అతని బాణములు తుంచి, హయములను చంపి, సారథిని కొట్టాడు. యుధిష్టరుడు శల్యునితో యుద్ధానికి తలపడ్డాడు. యుధిష్టరుడు శల్యుని విల్లును తుంచాడు. శల్యుడు వేరు విల్లు తీసుకుని యుదిష్టరునిపై బాణములు కురిపించాడు.

కౌరవ ప్రముఖులు పాండవ ప్రముఖుల మధ్య భీకర యుద్ధం

దృష్టద్యుమ్నుడు ద్రోణునిపై ఉరికాడు. ద్రోణుడు అతడి విల్లును మూడు ముక్కలుగా విరిచాడు. దృష్టద్యుమ్నుడు వేరొక విల్లును తీసుకుని ద్రోణునిపై పదునాలుగు బాణాలు వేసాడు. మగధ రాజైన భూరిశ్రవునితో యుద్ధం చేస్తున్నాడు. వారిరువురు ఇంద్రుడు వృత్తాసురుని వలె యుద్ధం చేస్తున్నాడు. దుష్టకేతువు బాహ్లికునితో తలపడ్డాడు. మహావీరుడైన శిఖండి అశ్వథామతో తలపడ్డాడు. అశ్వథామ శిఖండి శరీరం నిండా శరములతో చీల్చుతున్నాడు. శిఖండి అశ్వధ్ధామ హృదయాన్ని చీలుస్తూ శరసంధానం చేసాడు. భగదత్తుడు విరాటునిపై ఉరికి ఆకాశం నిండిపోయేలా బాణములు వదిలాడు. కేకయరాజు కృపాచార్యుని ఎదుర్కొన్నాడు. ఇరువురు ఒకరి కేతనములు వేరొకరు విరిచారు. రథములు దిగి ఇరువురు కత్తి తీసుకుని యుద్ధం చేసుకుంటున్నారు. అది చూసిన జయద్రధుడు, ద్రుపదుడు వారికి సాయంగా నిలబడ్డారు. వికర్ణుడు యుధామన్యుడితో తపపడి ఒకరితో ఒకరు రౌద్రంగా పోరుతున్నారు. చేకితానుడు త్రిగర్తాధిపతి సుశర్మతో తలపడి అతడి ఒళ్ళంతా శరపరంపరతో తూట్లు పొడిచాడు. శకుని యుధిష్టరుని కుమారుడు ప్రతివింధ్యునితో పోరు సల్పుతున్నాడు. భీముని కుమారుడు శ్రుతసోమునితో పోరు సల్పుతున్నాడు. అర్జునిని కుమారుడు ఇరావంతుడు శ్రుతాయువుతో యుద్ధం చేస్తున్నాడు. వారిరువురు ఒకరి రథాన్ని ఒకరు విరుగ కొట్టుకుని వేరు రథములపై ఎక్కి యుద్ధం చేస్తున్నారు. విందాను విందులు కుంతి భోజుడు అతని కుమారునితో తలపడ్డారు. కుంతి భోజుని బాణములుఎదుర్కొంటూ అనువిందుడు అతనిపై శరపరంపర కురిపించాడు. కేకయ రాజులు అయిదుగురు గాంధార రాజు అయిదుగురితో తలపడ్డారు. విరాటుని కుమారుడైన ఉత్తరునిపై నీ కుమారుడు దీర్ఘబాహుడు తలపడ్డాడు. నకులుని కుమారుడు శతానీకుడు ఉలూకునితో తలపడ్డాడు. చతురంగ బలాలు పదులు, వందలు, వేలుగా ఒకరితో ఒకరు పోరుతున్నారు. కత్తులతోను, బాణములతోను ఒకదానితో ఒకటి తలపడ్డాయి.

భీకర సమరం

ఏనుగుల దంతములు ఒరుసుకుంటున్నాయి. రథములు రథములతో ఢీకొన్నాయి. ఏనుగుల రథముల తాకిడికి కాల్బలములు నిలువ లేక పోతున్నాయి. గజారోహకులు విచక్షణా రహితంగా తొక్కుకుంటూ విహరిస్తున్నారు. బాణవర్షాలు, కత్తులు, ఈటెలు, గధలు, అస్త్ర శస్త్రములు, హయములు, రథములు, విన్యాసాల శబ్ధాలు, హాహాకారాలతో యుద్ధభూమి మారు మ్రోగి పోతుంది. వారి రక్తంతో యుద్ధ భూమి తడిసి పోతుంది. ఒక కాలు తెగినా విడువక ఎదుటి వాడిపై రౌద్రంగా దూకుతున్నారు. ఒక చేయి తెగిన పిమ్మట వేరొక చేతితో యుద్ధం చేస్తున్నారు. తల తెగి పడినా విడువక ఎదుటి వాడి తల నరికి కింద పడుతున్నారు. కింద పడినా తలలలో కూడా వీరత్వం వీడ లేదు. తమ రథములు, హయములు పోయినా పక్క వాడి రథాలను ఎక్కి యుద్ధం చేస్తున్నారు. గాయపడినా లెక్క చేయక బంధు మిత్రులకు సాయపడుతున్నారు. శత్రు బలంగంలో ఉన్నది బంధువైనా తలపడుతున్నారు. సారథి చనిపోగా రథములు దిక్కు తోచక పరుగెడుతున్నాయి. పదాతి దళములు రథముల కింద పడుతున్నాయి వారినిఏనుగు తొక్కుతూ దంతంతో ఎత్తి ఆవల విసురుతున్నాయి. ఈ విధంగా మంధర పర్వతంతో చిలికినప్పుడు పాల సముద్రంలా యుద్ధభూమి అల్లకల్లోలమై ఉంది. ఇలా మధ్యాహ్న సమయం వరకూ యుద్ధం సాగింది.

కౌరవ సేనల విజృంభణ

కురుక్షేత్రంలో భీకర పోరు జరుగుతున్న సమయంలో నీ కుమారుడు ప్రేరేపించగా దుర్ముఖుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, వివిశంతులు తమ బాణాగ్నితో పంచాగ్ని హోత్రంలా భీష్మునికి ఇరు వైపులా చేరి పాండవ సేనలను తరిమి తరమి కొడుతున్నారు. భీష్ముడు విజృంబించి పాండవ సేనలను తుత్తునియలు చేస్తున్నాడు. ఛేది, పాంచాల, కేకయరాజుల వారి ధాటికి తట్టుకోలేక పోతున్నారు. తెగిపడుతున్న తలలు, విరిగిన విల్లులు, నేలకూలిన శరీరములు, విరిగి పడుతున్న రథాలు తమ పక్షంలో తరుగుతున్న సైన్యాలను చూసి పాండవ సైన్యం తల్లడిల్లుతుంది. ప్రళయ కాల రుద్రుడు వలె విజృంబిస్తున్న భీష్ముని ఎదిరించే వారు లేక పాండవ సైన్యం కకావికలై పోతుంది. ఇంతలో అభిమన్యుడు విజృంభించి శల్యుని అయిదు బాణాలతో కొట్టాడు. ఒక బాణంతో కృతవర్మ హృదయాన్ని చీల్చాడు. మరి ఒక బాణంతో దుర్ముఖుని సారథిని కొట్టాడు. ఇంకొక బాణంతో వివిశంతి విల్లు విరిచాడు. మూడు బాణాలతో కృపాచార్యుని రథముకు కట్టిన హయములను చంపాడు. తరువాత భీష్ముని మీద శరవర్షం కురిపించాడు. అంతా అభిమన్యుని పరాక్రమానికి ఆశ్చర్య పోతున్నారు భీష్ముడు " ఏమిటి వీడు అర్జునునిలా విజృంభిస్తున్నాడు.వీడు సామాన్యుడు కాదు " అనుకున్నాడు. భీష్ముడు వెంటనే అభిమన్యుని కేతనమును విరిచాడు. సారథిని చంపి అభిమన్యునిపై శరవర్షం కురిపించాడు. మిగిలిన వారు కూడా భీష్ముని అనుసరించారు. అభిమన్యుడు ఉగ్రుడై వారి అందరి బాణాలు తిప్పి కొట్టాడు. భీష్ముని తాళ ద్వజాన్ని విరుగకొట్టాడు. పాండవ సేనలు హర్షద్వానాలు చేయగా కౌరవ సేనలో కలకలం రేగింది. ఇంతలో భీముడు సింహనాదం చేస్తూ అభిమన్యునికి సాయం వచ్చాడు. భీష్ముడు భీముని కేతనమును విరిచాడు. భీముడు మూడు బాణాలతో భీష్ముని కొట్టాడు. కృపాచార్యుని, కృతవర్మను ఎనిమిది బాణాలతో కొట్టాడు. శల్యుని ఎదుర్కొన్నాడు శల్యునికి సాయంగా ఉన్న వీరులు భీముని ఎదుర్కొన్నారు. భీముడు రౌద్రుడై వారి సారధులను హయములను చంపి వారిని విరధులను చేసాడు. తరువాత సాత్యకి, విరాటుడు, కేకయరాజులు, దృధ్టద్యుమ్నుడు, అతని కుమారులు, ఊత్తరుడు విరాటుని కుమారుడు ఉత్తరుడు భీమునికి సాయంగా వచ్చారు. భీష్ముడు వారినీందరిని సమర్ధవంతంగా ఎదుర్కొని మూడు బాణాలతో వారిని గాయపరిచాడు. విరాటుని కుమారుడు తన గజబలంతో శల్యుని ఎదుర్కొన్నాదు. ఉత్తరుని ఏనుగు శల్యుని రథం విరుగ కొట్టి హయములను నలిపి వేసాయి. ఇది చూసి కోపించిన శల్యుడు ఉత్తరుని గుండెలకు గురి పెట్టి శక్తి ఆయుధాన్ని విసిరాడు. అది విష్పులింగాలను విసురుకుంటూ ఉత్తరుని గుండెను చీలుస్తూ బయటకు వెళ్ళింది. ఉత్తరుడు భూమిపై పడి వీరస్వర్గం అలంకరించాడు. అంతటితో శల్యుని కోపం ఆగలేదు. ఉత్తరుడి గజమును తొండం నరికి దానిని చంపి వేసాడు. తన అనుజుని మరణం కళ్ళారా చూసిన శంఖుడు కోపించి శల్యునిపై దాడి చేసాడు. తన గజబలంతో శల్యునితో ఘోరంగా యుద్ధం చేస్తున్న తరుణంలో శంఖుని వెంట ఉన్న రథికులు ఒక్క మారుగా శల్యుని మీద పడ్డారు. అది చూసిన భీష్ముడు మరి కొంత మంది రథికులను వెంట పెట్టుకుని శల్యునికి సాయంగా వచ్చాడు. భీష్ముని ధాటికి శంఖుడు రథికులు ఆగలేక పోయారు. అది చూసిన అర్జునుడు శంఖునికి సాయంగా వచ్చి భీష్మునకు మధ్యగా నిలిచాడు. అర్జుననకు భీష్మునకు మధ్య భయంకరంగా పోరు సాగింది. ఇంతలో అపహార్ణం అయింది.

అపహార్ణం పై యుద్ధం

అప్పటి వరకు కృతవర్మ రథంపై ఉన్న శల్యుడు రథం దిగి గధ తీసుకుని శంఖుని రథం విరుగ కొట్టాడు. రథం విరిగిన శంఖుడు వేగంగా కత్తి తీసుకుని అర్జునిని రథం చాటుకు వెళ్ళాడు. భీష్ముడు శంఖుని విడిచి వేగంగా పాండవ సేనలోకి చొచ్చుకు వెళ్ళి వీరవిహారం చేస్తున్నాడు. మంచి ఎండలో రగిలిన కార్చిచ్చు అడవిని దహించిన విధంగా భీష్ముని ధాటికి పాండవ సైన్యం నేల కూల సాగింది. కేకయ రాజులను చికాకు పరచి భీష్ముడు తన రథాన్ని చిత్ర విచిత్ర రీతుల నడుపుతూ అంతటా తానై యుద్ధం చేస్తూ విరాట సైన్యాలను దునుమాడు తున్నాడు. భీష్ముని చేతిలో తన బలం చావు దెబ్బ తినడం చూసిన పాండవులు నివ్వెర పోయారు. ఇంతలో సూర్యుడు పడమట వాలాడు. అయినప్పటికీ భీష్ముడు మధ్యదిన మార్తాండుని వలె తేజస్సుతో వెలుగు తుండగా మొదటి రోజు యుద్ధం పాండవుల మనసులో గుబులు పుట్టిస్తూ ముగిసింది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat