మహాభారతం - వన పర్వము - పంచమాశ్వాసము

P Madhav Kumar

 

 ధర్మరాజు మార్కండేయునితో " మహర్షీ! నాకు గొప్ప పతివ్రతల గురించి వినాలని ఉంది. సంతానం కొరకు తల్లి తండ్రులలో ఎవరు ఎక్కువ కష్టపడతారు? తల్లి తండ్రుల పట్ల పుత్రుని బాధ్యత ఎలాంటిది? తక్కువ జాతిలో పుట్టినా ధార్మికులు పొందు లోకాలను పొందడమెలా? అన్నవి నాకు వివరించండి " అని అడిగాడు.

సంతానం తల్లితండ్రులు

ధర్మరాజు అడిగిన దానికి మార్కండేయుడు " ధర్మజా! తల్లి బిడ్డను నవమాసాలు కడుపున పెట్టుకుని మోసి ప్రాణాలకు లెక్క చేయక ప్రసవిస్తుంది. తండ్రి సంతానం క్షేమం కొరకు శ్రమించి అర్ధం సంపాదించి యగ్న యాగాదులూ, దానధర్మాలు లాంటి కార్యాలు నిర్వర్తిస్తుంటాడు. కనుక తల్లి తండ్రులు ఇరువురూ సంతానం కొరకు సమానంగా కష్టపడతారు. తల్లి తండ్రులు తమ కుమారుడు ధర్మ వర్తనుడై తమపట్ల వినయ విధేయతలు ప్రదర్శించాలని కోరుకుంటారు. తల్లితండ్రుల ఆశలను నెరవేర్చిన పుత్రుడు ఉత్తమడై ధనం, కీర్తి గడించి ఉత్తమ లోకాలను పొందగలడు . ఏ స్త్రీ భర్తను సేవించడంలో ఆసక్తి కలిగి ఉంటుందో ఆమె యజ్ఞయాగాదులు చేసిన పుణ్యం పొందగలదు ఉదాహరణగా నీకు కౌశికుని వృత్తాంతం చెబుతాను విను " అన్నాడు.

కౌశికుడు

పూర్వం కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండే వాడు. అతడు ధర్మపరుడు ఎన్నో యగ్న యాగాదులు చేసాడు. ఒకరోజు అతడు ఊరి బయట చెట్టు కింద కూర్చుని వేదాలు వల్లిస్తున్న సమయంలో ఒక కొంగ అతని మీద రెట్ట వేసింది. కౌశికుడు ఆగ్రహించి ఆ కొంగ వైపు తీక్షణంగా చూసాడు. ఆ చూపుల తీక్షణతకు ఆ కొంగ చచ్చి పోయి కింద పడింది. కౌశికుడు అది చూసి కలత పడి. " అయ్యో ! నేను ఎంత నిర్ధయగా ఈ కొంగను చంపాను. నా పాపానికి నిష్కృతి లేదు " అని విలపించాడు. ఇంతలో మధ్యాహ్నం అయింది ఒక ఇంటికి బిక్షకు వెళ్ళాడు. ఆ ఇంటి ఇల్లాలు అతనికి బిక్ష వేయడానికి పాత్రను సిద్ధం చేస్తున్న సమయంలో ఆమె భర్త ఆకలితో ఇంటికి వచ్చాడు. ఆమె భర్తకు అభ్యంగన స్నానం చేయించి భోజనం పెట్టి అతని కాళ్ళు వత్తే సమయంలో బిక్షకు వచ్చిన బ్రాహ్మణుడు గుర్తుకు వచ్చాడు. ఆమె ఒక పాత్రలో అన్నం తీసుకు వచ్చి బిక్ష వేయాటానికి రాడం చూసి కౌశికుడు కోపించి " ఏమీ ఇంత గర్వమా! నన్ను చూసిన వెంటనే పొమ్మంటే పోదును కదా! ఇంత సేపు ఎందుకు ఆలస్యం చేసి అవమానించావు? " అని అడిగాడు. అయ్యా మీకు బిక్ష తెచ్చేటప్పడు నా భర్థ వచ్చాడు. అయనకు పరిచర్యలు చేసి వచ్చేసరికి నాకు ఆలస్యం అయింది ఓర్పు వహించండి " అన్నది. కౌశికుడు " నీకు ఇంత గర్వమా బ్రాహ్మణులు లోకవంద్యులు. బ్రాహ్మణుల కంటే భర్త ఎక్కువా? సాక్షాత్తు దేవేంద్రుడు కూడా బ్రాహ్మణులను గౌరవిస్తాడు. వారి ఆగ్రహానికి గురైతే లోకాలు భస్మం కాగలవు " అన్నాడు. ఇల్లాలు " అయ్యా ! బ్రాహ్మణుల మహిమ నాకు తెలియనిది కాదు. వాతాపిని జీర్ణం చేసుకున్నది, సముద్ర జలాలను త్రాగరానివిగా చేసినది, దండకారణ్యం తగుల బెట్టినది మొదలైన ఎన్నో మహత్తర కార్యములు చేసిన బ్రాహ్మణులను అవమానించి కోరి కష్టాలు తెచ్చుకుంటానా ? నాకు భర్తే పరమ దైవం అంతకంటే స్త్రీకి ఉత్తమ ధర్మం లేదు. బ్రాహ్మణోత్తమా మీకు ఆగ్రహం ఎక్కువ అని నా పాతివ్రత్య మహిమతో తెలుసు కున్నాను. కోపం, మోహం మనిషికి ప్రథమ శత్రువులు వాటిని జయించని బ్రాహ్మణులు ఉత్తములు కాజాలరు. మీరు మీ పై రెట్ట వేసిన కొంగను దహించిన విషం నేనెరుగుదును. ఇంద్రియములను జయించిన వాడు, అహింసను కలిగిన వాడు, సత్య వ్రతమును ఆచరించిన వాడు, సకల జనుల యందు సమ భావం కలిగిన వాడు, గురువులను పూజించే వాడు, ధర్మవర్తనుడు అయిన బ్రాహ్మాణుడు పూజనీయుడు కాగలడు. సత్ప్రవర్తన, వేదాధ్యనం లాంటి ఉత్తమ కర్మలే బ్రాహ్మణ సంపదలు. ధర్మం బహు సూక్ష్మమైనది. నేను ఆడుదానిని నాకు వివరంగా తెలియదు. నీకు తెలిపగల వాడు మిధిలా నగరంలో ఉన్నాడు. అతని పేరు ధర్మవ్యాధుడు. అతడు ఒక కిరాతుడు. అతడు సత్య వ్రతుడు, సత్గుణ సంపన్నుడు, ధర్మవర్తనుడు, మాతాపితలను పూజించే వాడు. అతని దగ్గరకు పోయి ధర్మం గురించి తెలుసుకో. నీవు సాధ్యాయన పరుడవే కాని ధర్మసూక్ష్మములు ఎరుగవు. నేను చెప్పిన దానిలో అపరాధం ఉంటే నన్ను మన్నించు " అన్నది. కౌశికుడు " అమ్మా! నీ వలన నాకు జ్ఞానోదయం అయింది. నా మనసుకు శాంతి లభించింది " అని చెప్పి మిధిలకు ప్రయాణమయ్యాడు. కౌశికుడు ఆ పతివ్రత మహిమకు అచ్చెరువంది ఆమెను దూషించి నందుకు పశ్చాత్తాపపడ్డాడు.

ధర్మవ్యాధుడు

మిథిలకు చేరుకుని కౌశికుడు ధర్మవ్యాధుడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. ధర్మ వ్యాధుడు మాంసం విక్రయిస్తున్నాడు. అది చూసిన కౌశికుడు అసహ్యించుకుని ఒక ప్రక్కకు ఒదిగి నిలబడ్డాడు. బ్రాహ్మణుని చూసిన ధర్మవ్యాధుడు అతని దగ్గరకు వచ్చి భక్తితో నమస్కరించి " మహానుభావా ఆ మహాపతివ్రత నిన్ను నా వద్దకు పంపిందా? చాలా సంతోషం రండి మా ఇంటికి పోదాం " అని చెప్పి కౌశికుని తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. పతివ్రత పంపిన విషయం ధర్మవ్యాధునికి ఎలా తెలిసిందోనని ఆశ్చర్యపోయాడు. కౌశికుడు ధర్మవ్యాధుని చూసి " అయ్యా! మీరు అన్ని ధర్మాలు తెలిసిన వారు. ఇలాంటి వృత్తి స్వీకరించి జీవహింస చేయడం ధర్మమా? " అని అడిగాడు. అందుకు బదులుగా ధర్మవ్యాధుడు " అయ్యా! బ్రాహ్మణులకు స్వాధ్యయనం, తపస్సు, సత్యము, శౌచం, బ్రహ్మచర్యం పరమ ధర్మం. క్షత్రియులకు ప్రజా రక్షణ, దండనీతి ధర్మం. శూద్రులకు సేవించడం ధర్మం. మృగ మాంసం విక్రయించడం నా ధర్మం. మిధిలా నగరాధీశుడైన జనకుడు ఎవరి ధర్మాన్ని వారు మాత్రమే ఆచరించాలని కోరతాడు. స్వధర్మం ఆచరించని వాడు కొడుకైనా అతనికి శిక్షార్హుడే. కనుక నేను నా ధర్మం ఆచరిస్తున్నాను. కాని నేను జీవహింస చేయను. ఇతరులు చంపి తెచ్చిన వాటిని మాత్రమే విక్రయిస్తాను. నేను గురువులను, దేవతలను, అతిధులను పూజిస్తాను. సత్యమును, శౌచమును ఆచరిస్తూ అణుకువతో ఉంటాను. బంధువులను ఆదరిస్తాను. ఏకపత్నీ వ్రతుడను. అసూయలేదు, కోరికలు లేవు, ఇతరులలో దోషం ఎంచను. ఉపవాస నియమాలతో ఆహారం తీసుకుంటాను. పొగడ్తలకు లొంగను, తెగడ్తలకు కుంగను. అందువలన హీనకులములో పుట్టినా నిర్మలంగా జీవిస్తున్నాను. అడిగావు కనుక చెప్పాను కాని నను నేను కీర్తించుకోవడం తగదు. నీవు నా వద్ద ధర్మసూక్ష్మం తెలుసుకోవడానికి వచ్చావు కనుక చెపుతాను విను . కులధర్మం ఆచరించతగిన పరమ ధర్మం. త్యాగ గుణం కలిగి ఉండటం, ఇతరుల భావాలను మన్నించడం, సత్పురుషులను గౌరవించడం, సత్యం పలకడం సహనం కలిగి ఉండడం ఉత్తముల లక్షణం. కోరికలను ధర్మమార్గంలో మాత్రమే తీర్చుకోవాలి. కషాన్ని, సుఖాలను సమదృష్టితో చూడాలి. అపకారికి ఉపకారం చేయాలి. అపకారం చేసిన వాని పాపం వాడిని దహించి వేస్తుంది. నాస్తికులు దేవుడు లేడని వాదిస్తారు. వారిని చూసి ధర్మాన్ని విడువరాదు. పశ్చాత్తాపానికి సగం పాపం పోతుంది. ఆ పాపాన్ని పరిత్యజించడంతో మొత్తం పాపం పోతుంది. పాపానికి మూలకారణమైన కోపం, లోభం లాంటి దుర్గుణాలను విడిచి పెట్టాలి. చెడు కార్యములు దట్టమైన గడ్డితో నిండిన ఉబివలె అందంగా కనిపిస్తాయి కనుక వాటిని పరిత్యజించాలి " అని చెప్పాడు.

శిష్టాచారములు

కౌశికుడు ధర్మవ్యాధుని " అయ్యా! శిష్టాచారముల గురించి వివరిస్తారా " అని అడిగాడు. ధర్మవ్యాధుడు " దానము, సత్యము, ధర్మము, మంచితనం, కోపాన్ని త్యజించడం, ఇంద్రియ నిగ్రహం, సదా ఆనందంగా ఉండటం, వేదాధ్యనం, డాంభికత్వం లేకుండుట, యజ్ఞము, నిరాశ, దైన్యం దరి చేరనీయక పోవడం, అసూయను అహంకారాన్ని వదలడం, సత్ప్రవర్తన, తీర్ధయాత్రలు చేయడం, మితభాషణ, పారిశుభ్రం, ఆశ్రిత రక్షణ మొదలైనవి శిష్టాచారములు అని పెద్దలు చెప్తారు. అసూయను విడిచి సత్ప్రవర్తనతో జీవించడంలోగల హాయి ఇతర మార్గంలో జీవించే వారికి ఉండదు. కనక శిష్టాచారాలు పాటిస్తూ గురువులను గౌరవిస్తూ వేదాధ్యయనం చేస్తూ కామము, మోహము, క్రోధం అనే మొసళ్ళు ఉన్న సంసారసాగరాన్ని చెరగని ధైర్యం అనే నావ మీద పయనించి దాటకలిగిన వాడు ధన్యుడు. మహాత్మా! అహింస అన్ని ధర్మాలలో ఉత్తమమైనది. దానిని సత్యముతో చేర్చి ఆచరించాలి. వేద సమ్మతాలు, శాస్త్ర సమ్మతాలు, శిష్టాచారాలు అని ధర్మములు మూడు విధములుగా వర్ధిల్లు తుంటాయి. వేదాధ్యయనం చేసిన వాడు శిష్టాచార మార్గంలో ప్రయాణించి బుద్ధి అనే మేడను అధిరోహించి మోహము అనే ఉబిలో కూరుకున్న వాడిని చూసి నవ్వుకుంటాడు.

హింస అహింస

మహాత్మా! నేను చేస్తున్నది హింస కాదా అని ప్రశ్నించారు. నేను సమాధానం చెప్పాను. ఏది హింస ఏది అహింస అని చెప్పటం ఎవరి తరం కాదు. ప్రాణి పుట్టుకకు మరణానికి అతడు చేసిన కర్మలే కారణం. చంపే వాడు కేవలం నిమిత్త మాతృడు. పండ్లు, వేర్లు, ఔషధాలు, శాకములు, జంతువులు ప్రాణులకు ఆహారంగా భగవంతుడు ఏర్పరచాడని వేదాలు చెప్తున్నాయి. పూర్వం శిబి తనమాంసాన్ని డేగ రూపంలో ఉన్న ఇంద్రునికి ఇచ్చి పుణ్యం సంపాదించ లేదా? రంతి దేవుడు వేలకొలది ఆవులను వధించి సంతర్పణ చేసి పుణ్యలోకాలు సాధించలేదా? వేదాలు చదివిన వారు యజ్ఞయాగాలు చేస్తూ పశువధ చేస్తారు కదా? పితృ కార్యాలలో, దైవ కార్యాలలో మాంసాహారాన్ని ఉంచి మిగిలిన దానిని భుజించడం ధర్మమని ఋషి వాక్కు చెప్పలేదా? రైతులు నాగలితో దున్నుతున్నప్పుడు ఎన్నో జీవులు నశిస్తాయి కనుక అది హింస కాదా? మానవులు నడిచేటప్పుడు కాళ్ళ కింద పడి అనేక జీవులు నశించడం హింస కాదా? నీరు భూమి ఆకాశం జీవులతో నిండి ఉంది. మనిషి చేసే ప్రతి కర్మలో అహింస అనివార్యం. ముని వృత్తిని స్వీకరించి అరణ్యాలలో జీవిస్తున్న మునులు తాము అహింసను ఆచరిస్తున్నామని భ్రమ పడుతుంటారు. వారు భుజించే ఆకులూ, పండ్లూ, కందమూలాలలో కూడా జీవం ఉంది కదా? కనుక ఈ లోకంలో హింస చేయని వాడు లేడు. కనుక తెలిసీ జీవులను హింసించక పోవడమే అహింస. ధర్మం పలు విధాలు దాని సూక్ష్మం గ్రహించడం కష్టం. కనుక వేదవిహతమైనదీ, పెద్దలు చెప్పినదీ, మునులు ఆచరించేదీ గమనించి ధర్మ నిర్ణయం చేయడం ఉత్తమం.

ధర్మమూ సత్యమూ

ధర్మం చాలారకాలుగా ఉంటుంది. చాలా సూక్ష్మంగా ఉంటుంది. వేదవిహితము, పెద్దలమాటలూ, వారి ఆచరణ చూసి ధర్మసూక్ష్మాన్ని గ్రహించాలి. సత్యవ్రతం గొప్పది. కాని ఇతరులకు జరిగే అపాయాన్ని నివారించడానికి చెప్పే అబద్ధం నిజం కంటే గొప్పది. ఏ ప్రాణికైనా అపకారం కలిగించే నిజం అబద్ధం చెప్పడంతో సమానం. ప్రాణాపాయ స్థితిలో, వివాహసమయంలో చెప్పే అసత్యం నిజంతో సమానం. కులవృత్తి దైవ సమానం. ఇష్టాయిష్టాలతో పని లేకుండా దానిని ఆచరించడం మానవ ధర్మం. మనము అనుభవించే కష్టసుఖాలు మనం పూర్వజనమలో చేసిన పాపపుణ్యాలే కారణం. ఇది తెలియని మూఢులు దైవాన్ని దూషిస్తారు. మానవులు తాము చేసే పనులకు తామే కర్తలమని భావిస్తారు. అది అజ్ఞానం అదే నిజమైతే తాము చేసే కార్యములన్నీ ఎందుకు ఫలించడం లేదు. ధర్మాత్ములు, నీతిమంతులు చేసే కార్యములు ఒక్కోసారి నిష్ఫలమతున్నాయి కాని దుర్మార్గులు చేసే పనులు ఫలిస్తున్నాయి. కొందరికి అనాయాసంగా ధనరాశులు వచ్చి పడుతున్నాయి. కొందరికి ఎంత శ్రమించినా పేదరికం పోదు. కటిక దరిద్రులకు పేదవారికి వద్దన్నా సంతానం కలుగుతుంది. కొందరు ధనవంతులకు ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలుగదు. ఇదంతా పూర్వజన్మ కర్మ ఫలమే. మానవులు కర్మాధీనులు కాకుంటే రోగాలు, మరణం లేకుండా బ్రతకవచ్చు కదా. కనుక ఈ శరీరం కర్మ ఫలంగానే ఏర్పడుతుంది. శరీరం చేయవలసిన పనులు కర్మవశాన నిర్ణయించబడతాయి. మరణానంతరం కర్మఫలాన్ననుసరించి దేహధారణ నిర్ణయించ బడుతుంది.

జీవుడియాత్ర

ఇక జీవుడు ఎలాంటి వాడో చెప్తాను. జీవుడు అనఘుడు, సనాతనుడు, శాశ్వతుడు. జీవునికి పాపం అంటదు. కర్మానుసారం శరీరాన్ని ధరిస్తూ ఉంటాడు. కొంత కాలానికి శరీరం జీర్ణమై మరణిస్తుంది కాని జీవుడు మరణించడు. శరీరాన్ని విడిచిన జీవుడు వేరు శరీరాన్ని ధరిస్తాడు. ఆ శరీరంలో సుఖదుఃఖాలు అనుభవిస్తాడు. ఇలా జీవుడు ఎన్నో దేహబంధాలలో చిక్కుకుంటాడు. మహానుభావా! నీవు పాపపుణ్యముల వలన కలుగు దేహ బంధముల గురించి వివరిస్తాను. స్థిరమైన పుణ్యం చేసిన వాడికి దైవత్వం సిద్ధిస్తుంది. కొంత పాపం కొంత పుణ్యం చేసిన వాడికి మనుష్య జన్మ లభిస్తుంది. పాపములు మాత్రమే చేసే జనులు క్రిమి కీటకాదులుగా పుట్టుతూ మరణిస్తూ జన్మబంధాలలో చిక్కుకుంటాడు. ఇలా కోరికలు అను సముద్రంలో కొట్టు మిట్టాడుతూ ఎన్నటికీ ఒడ్డుకు చేరుకో లేడు. ఇది ఎరిగిన వాడు పాపకార్యాలజోలికి వెళ్ళక ధర్మమార్గాన పయనిస్తాడు. మదమూ, అహంకారం విడిచి పుణ్యకార్యాలు చేస్తాడు. ధర్మాచరణ వలన మనసు నిర్మలమౌతుంది. కోరికలను విడిచి సుఖాలు ఎందుకూ పనికి రానివని గ్రహిస్తాడు. తపస్సు, ఇంద్రియ నిగ్రహం, సత్యం పలకడం మేలని గ్రహించి వాటిని ఆచరించి దైవత్వాన్ని పొందుతాడు.

ఇంద్రియ నిగ్రహం

కౌశికుడు ధర్మవ్యాధుని " ఇంద్రియ నిగ్రహం అంటే ఏమిటి? ఇంద్రియాలను నిగ్రహించకుంటే కలిగే పాపం ఏమిటి? ఇంద్రియాలను నిగ్రహించడం వలన కలిగే పుణ్యం ఏమిటి? " అని అడిగాడు. ధర్మవ్యాధుడు కౌశికునితో " మనం మనసుతో విషయాలను గ్రహిస్తాము. మనస్సు ఎప్పుడూ కోరికలతో, కోపముతో నిండి ఉంటుంది. వాటి వలన లోభం ఏర్పడుతుంది. లోభంతో ఏర్పడిన విషయ వాంఛల వలన మానవుడు సదా సతమతమౌతుంటాడు. లోభికి కరుణ లోపించి పాపములతో కోరికలు తీర్చుకుంటాడు. మంచి మాటలు చెవికెక్కవు. దుర్మార్గులతో చెలిమి చేస్తాడు. చెప్పే మాటలకు చేసే పనికి పొంతన ఉండదు. అలాంటి వాడు దుఃఖంలో మునిగి తేలుతుంటాడు. కనుక మానవులు విషయ వాంఛలకు లొంగక జ్ఞానమార్గం అవలంభించి మోక్షప్రాప్తికి ప్రయత్నించడం ఉత్తమం " అన్నాడు. " మహాత్మా! ఇంద్రియములను నిగ్రహించడం ఎలా? అని నన్ను అడిగారు. బ్రహ్మకోవిదులు చెప్పతగిన బ్రహ్మ విద్య గురించి నేను చెప్పకూడదు. కాని బ్రాహ్మణోత్తముడివి అడిగావు కనుక బ్రహ్మ కోవిదులకు నమస్కరించి చెప్తాను సావధానంగా విను. అనంతాకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి అనేవి పంచ భూతములు. మరలా భూమి నీటిలోను, గాలి అగ్ని లోను, అగ్ని వాయువులోను, వాయువు ఆకాశంలోను లీనమౌతాయి. మొదట ఆకాశానికి హద్దులు లేని అనంతాకాశం. అంతా చీకటి, శూన్యము. ఆ ఆకాశంలో నుండి ప్రచండ వాయువు, ఉధృతమైన గాలి ఆగాలిలోని ధాతు సంయోగంతో నీరు పుడుతుంది. ఆ నీరు ఘనీభవించి మంచుఖండాలు, ధూళి మేఘాలు ఏర్పడతాయి. అవి శిలా రూపం చెంది భూమి ఏర్పడుతుంది. మరలా అదే క్రమంలో ప్రళయ కాలంలో సముద్రాలన్నీ ఏకమై భూమి జలమయమౌతుంది. అనావృష్టి ప్రారంభమై ఎండలు అధికమై ఆ ప్రంచండాగ్నికి నీరు ఆవిరై వాయు రూపం పొంది ఆకాశంలో లయమౌతుంది. చెవితో వినడం, నాలుకతో రుచి చూడటం, కంటితో చూడటం, ముక్కుతో వాసన చూడటం పంచేద్రియాలు చేసే పనులు. అంటే పంచ భూతములస్కు గుణములైన శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాలు ఇంద్రియవిషయాలు. పంచేద్రియములకు మూలం మనసు. మనసు ఆరవది, బుద్ధి, అహంకారం మనసుకు తోడు మొత్తం ఎనిమిది. సత్వ, రజో, తమో గుణాలు మానవులకు సహజం. ఈ భూత ప్రపంచం అవ్యక్తము నుండి సృష్టింపబడి అవ్యక్తంలో లీనమౌతాయి. అవ్యక్తమనగా వ్యక్తముకానిది. కాని పంచేద్రియాలకు ఈ అవ్యక్త రూపం దైనందిన కార్యాలలో గోచరమౌతూ ఉంటుంది. అది నిరాకారమైన మనో భావనలో వివిధ రూపాలలో గోచరమౌతుంది. మానవులు పంచ గుణాలకు వశుడై భోగలాలసుడౌతున్నాడు. మానవుడు పంచేడ్రియాలను అదుపులో పెట్టుకుని జీవిస్తూ జ్ఞాన సముపార్జన చేయాలి. జ్ఞానం కలిగిన వాడు అన్ని భూతాలలో తనను చూసుకుంటాడు. విషయవాంఛల నుండి మనసుని మళ్ళించడమే తపస్సు, వైరాగ్యం. ఇంద్రియముల నివారించిన స్వర్గం ఇంద్రియములకు లొంగి పోయిన నరకం. కోరికలతో సతమమయ్యే మనసును అదుపులో పెట్టుకోవడమే మోక్షం. దేహం రథమైతే ఇంద్రియాలే గుర్రాలు ఆత్మ సారథి, ధైర్యం పగ్గాలు. మానవుడు మనసును నిగ్రహించి ధైర్యమనే పగ్గాలతో ఇంద్రియాలనే గుర్రాలను అదుపు చేస్తూ మోక్షమనే గమ్యాన్ని చేరాలి. ఇంద్రియము పోవు చోటుకు మనసు పోతుంది కనుక ఇంద్రియములను అదుపు చేస్తూ జ్ఞాని యోగి.

త్రిగుణములు

గుణములు మూడు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము. వీటిలో తమోగుణము నీచమైనది, నిందార్హమైనది. సత్వగుణము ఉత్తమమైనది. జ్ఞాన సముపార్జనకు అనుకూల మైనది. రజోగుణము ఈ రెండింటి మిశ్రితం. పరిశుభ్రం లేని ఆకారం, అతి నిద్ర, దీనత్వం, అసహనం, హద్దులేని కోరికలు తమో గుణ లక్షణాలు. ధైర్యం, శాంతి, కరుణ, సంతోషం, విద్యలయందు ఆసక్తి సాత్వికగుణ లక్షణం. సాత్వికడైన వాడు మానవుడు జ్ఞానాన్ని సంపాదిస్తాడు. ఈ లోకంలోని సమస్తం అశాశ్వతం అని తెలుసుకుంటారు. సుఖదుఃఖాలకు అతీతంగా ఉంటాడు. అహంకారాన్ని వదిలి ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి ఉత్తమ శాంతి పొందుతాడు. సత్వగుణ సంపన్నుడు శూద్రుడైనా తరువాతి జన్మలలో వైశ్యునిగా, క్షత్రియునిగా, బ్రాహ్మణుడిగా జన్మించి కడకు కైవల్యాన్ని చేరుకుంటాడు " అని చెప్పాడు.

అగ్ని వాయువు

కౌశికుడు " అయ్యా ! ఈ శరీరంలో అగ్ని ఎలా పుడుతుంది. వాయువులు శశరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయి " అని అడిగాడు. ధర్మవ్యాధుడు " మహాత్మా! మన శరీరంలో ఆత్మ అనే అగ్ని శరీరం అంతా నాభి ఆధారంగా వ్యాపించి ఉంటుంది. నాభి నుండి తల వరకు వ్యాపించి ఉన్న ఈ అగ్నిలో ప్రాణవాయువు సంచరిస్తూ ఉంటుంది. ఆ ప్రాణవాయువే సకల జీవులకు ఆధారం. ప్రాణవాయువు, ఆపానవాయువు కలిసి ప్రాణాగ్నిని జ్వలింప చేస్తుంటాయి. మానవుడిలో ఆపానము, పొత్తికడుపు, బ్రహ్మరంధ్రం మధ్యలో ప్రాణాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆపానము మలమూత్రముల విసర్జనా స్థానం. కంఠంలో ఉండే ఉదానము అనే వాయువు కర్మలను నియంత్రిస్తుంటుంది. వ్యానము అనే వాయువు శరీరావయవాల కలయికలో సంచరిస్తూ ఉంటుంది. ప్రాణ ఆపాన వాయువులను ఆధారం చేసుకుని సమాన వాయువు మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసి రక్తంలో కలుపుతుంది. నాభి వద్ద ఉండే ఆ వాయువు శరీరంలోని సకల ధాతువులను పోషిస్తుంది. పంచప్రాణములను, ఆత్మాగ్నిని గురించి తెలుసుకున్న యోగులు నిరంతర అభ్యాసము వలన ఆత్మను మూర్ధత్వ స్థానమున నిలుపుకుంటారు. ఆపాన సమాన వాయువులలో సంచరిస్తున్న అగ్ని శరీరమందు జీవాత్మగా వెలుగుతున్నాడు. ఆ జీవాత్మ తామరాకు మీద నీటి బొట్టులా శరీరంలో ఉంటూ నిర్లిప్తంగా ఉంటాడు. శరీరాన్ని విడిచిన జీవాత్మయే పరమాత్మ. అచేతనంగా పడి ఉన్న శరీరాన్ని పరమాత్మ జీవాత్మగా చైతన్యవంతం చేస్తాడు. పరమాత్మ ఈలోకాలను సృష్టించే సృష్టికర్త. బుద్ధిమంతులు తమ బుద్ధి కుశలతతో జీవాత్మను పరమాత్మగా తెలుసుకుంటారు. మహాత్మా! బ్రహ్మవిద్యాతత్వం ఆచరణ సాధ్యం చేయటమెలా అన్నది వివరిస్తాను. పండితుడు శుభం, అశుభంలలో ఆసక్తి లేక సమానంగా స్పందిస్తాడు. క్రమంగా సుఖ దుఃఖములు, రాగద్వేషములు, శీతోషణముల పట్ల సమంగా ప్రవర్తిస్తాడు. అటువంటి వాడు పుణ్యాత్ముడై ఇంద్రియములను జయించి యోగసాధన చేస్తాడు. తన ఆత్మలో పరమాత్మను దర్శించి గాలి లేని చోట నిశచలంగా జ్వలించే దీపంలా ప్రకాశించి అమరత్వం పొందుతాడు. కనుక కామక్రోధాలను వదిలి కర్మఫలత్యాగం చేసి కర్మలను ఆచరించడం ఉత్తముల ధర్మం. జీవితం అశాశ్వతం అనే ఎరిగి ఇతరులకు అపకారం చేయడం వదిలి వేయాలి. ఉన్న దానికి సంతృప్తి చెంది ఇతరుల ఎడ దయ, కరుణ, మైత్రితో ప్రవర్తించాలి. ఇందియ నిగ్రహాన్ని సాధించిన వాడు పరమ సుఖాన్ని పొందుతాడు " అని చెప్పాడు. కౌశికుడు " మహాత్మా! నీవు సర్వజ్ఞుడవు. నీ వలన ధర్మసూక్ష్మాలు ఎరిగి ప్రబుద్ధుడనయ్యాను " అన్నాడు.

మాతాపితలను సేవించడం


కౌశికునికి తన తల్లి తండ్రులను చూపిస్తున్న ధర్మవ్యాధు
ధర్మవ్యాధుడు " మహర్షీ! నేను సర్వజ్ఞుడిని కావడానికి మూలమైన ధర్మం నీకు తెలుపుతాను " అన్నాడు. అతనిని గృహాంతర్భాగానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ సుఖాశీనిలై ఉన్న తల్లి తండ్రులకు నమస్కరించి కుశలం అడిగాడు. వారు " కుమారా! నీవంటి కొడుకు ఉండగా మాక్షేమమునకు లోటు ఏమి? నీ ధర్మం నీకు తోడుగా ఉండి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాయి. నీ వలన మన వంశం పవిత్రమైనది. నీవు మనుష్య జన్మ ఎత్తిన దేవతామూర్తివి. త్రికరణ శుద్ధిగా తల్లితండ్రులను సేవించే నీవు పరశురాముని కన్నా గొప్పవాడివి " అన్నారు. అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికుని తల్లి తండ్రులకు పరిచయం చేయగా వారు కౌశికుని కుశలం అడిగారు. ధర్మవ్యాధుడు కౌశికునితో " వీరు నా జననీ జనకులు వీరిని సేవించి నేను ఇంత జ్ఞానం సంపాదించాను. నేను ఇతర దేవుళ్ళను ఎరుగను తల్లితండ్రులే నా దైవాలు. నేను వీరికి పండ్లు, ఆహారం, వస్త్రములు ఇచ్చి వీరిని సేవిస్తుంటాను. నా భార్యా బిడ్డలు వీరికి సేవ చేస్తుంటారు. యజ్ఞాలు, క్రతువులూ, వేదాలూ అన్నీ వీరే అని భావిస్తాను. తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ ఈ అయిదిటిని ఎవరు పూజిస్తారో వారే మహాత్ములు. అయ్యా! పతివ్రత పంపగా ధ్ర్మసూక్ష్మం తెలుసుకోవడానికి నా దగ్గరకు వచ్చారు. ఆమె అనుగ్రహంతో నేను నీకు చెప్పగలిగాను. నీ వంటే నాకు అప్రియంగా ఉంది. అందుకు కారణం నీవు నీ తల్లి తండ్రుల అనుమతి లేకుండా వేదాద్యయనానికి వెళ్ళి వారిని వ్యాకులతకు గురి చేసావు. వారి పట్ల కృరంగా ప్రవర్తించావు. నీవు వేదజ్ఞానం సంపాదించినా నీ తల్లి తండ్రులను బాధించినందుకు నాకు నీ ఎడల అప్రియం కలిగినది. నీ తల్లితండ్రులు నీ కొరకు రోదించి గుడ్డి వాళ్ళు అయ్యారు. ఆ సంగతి నీకు తెలుసా? ఇకనైనా వారి వద్దకు వెళ్ళి వారి శోకమును చల్లార్చు. నీ జ్ఞానం పుణ్యం తల్లి తండ్రులను బాధించడం వలన నిష్ఫలం ఔతాయి. నేను చెప్పినది విని వారిని సేవించి తరించు " అని ధర్మవ్యాధుడు చెప్పాడు. కౌశికుడు " మహాత్మా! నీవు చెప్పినట్లే వెళ్ళి నా తల్లితండ్రులను సేవించుకుంటాను. నేను చేసిన పాపం నుండి నీ బోధనలతో విముక్తుడని అయ్యాను. నా భాగ్యవశమున నీ పరిచయ భాగ్యం కలిగినది. నా మనసు ఆహ్లాదం అయింది. నీవు నాకు దైవ సమానుడవు. నీ వలె ధర్మమార్గాన సంచేరించే వాడు అరుదు. వేలకొలది మానవులలో ఏ ఒక్కరో నీ వంటి వాడు ఉంటాడు. నేను నిన్ను శూద్రునిగా తచడంలేదు. భూత, భవిష్యత్తు, వర్తమానాలను ఎరిగిన నీవు ఏలా ఈ శూద్ర జన్మను ఎత్తావో చెప్పు " అన్నాడు.

ధర్మవ్యాధుని పూర్వ జన్మ వృత్తాంతం

అయ్యా మీరడిగినది చెప్పడం నాధర్మం. నేను పూర్వజన్మలో బ్రాహ్మణుడను. వేదవేదాంగాలు చదువుకున్నాను. నాకు ఒక రాజకుమారునితో మైత్రి కలిగిన కారణంగా విలువిద్య కూడా నేర్చుకున్నాను. ఒకరోజు నేను రాజకుమారునితో వేటకు వెళ్ళి అనేక మృగములను చంపాను. నే విడిచిన ఒక బాణం పొదల మాటున గడ్డిచాటున ఉన్న మునీశ్వరునికి తగిలింది. నేను మునీశ్వరుని వద్దకు వెళ్ళి బాధతో నేలమీద దొర్లుతున్న ఆయనతో అనునయ వాక్యాలు పలికాను. ఆయన బ్రాహ్మణుడుగా పుట్టి శూద్రునిలా మృగములను చంపావు కనుక మృగములను చంపు వ్యాధుడిగా జన్మించు " అని శపించాడు. ఎరుగక తప్పు చేసిన నన్ను మన్నించి శాపవిమోచనం కలిగించమని ఆయనను వేడుకున్నాను. ఆ ముని కరుణించి " నా శాపానికి తిరుగు లేదు వ్యాధుడిగా జన్మించినా నీకు ధర్మసూక్ష్మములు తెలియగలవు. నీవు తల్లితండ్రులను సేవించినంత కాలం పూర్వ జన్మ స్పురణ ఉంటుంది. సత్కర్మాచరణము వలన నీవు తిరిగి బ్రాహ్మణ జన్మ పొందగలవు " అని పలికాడు. నేను ఆ ముని శరీరం నుండి బాణం బయటకు తీసి ఆయనను ఆశ్రమానికి చేర్చి గాయానికి మందు వేసి బ్రతికించాను. కానీ నాకు ఈ వ్యాధుని జన్మ తప్పలేదు " అన్నాడు.

కౌశికుడు ధర్మవ్యాధుని అనునయించుట

కౌశికుడు ధర్మవ్యాధునితో " అయ్యా! నీవు వ్యాధుని జన్మ ఎత్తిననూ బ్రాహ్మణుని వలె ప్రవర్తిస్తున్నావు. నీవు నిజంగా బ్రాహ్మణుడివే. ఎందుకనగా పుట్టుకతో బ్రాహ్మణుడైనా శుద్రుని వలె ప్రవర్తించిన అతడు శూద్రుని కంటే నీచుడు ఔతాడు. జన్మతః శూద్రుడైనా సత్యమూ, శౌచమూ, ధర్మము అవలంబించిన అతడు స ద్బ్రాహ్మణునితో సమానమని పెద్దలు చెప్పారు కదా! నీ కర్మల వలన శుద్రుడిగా జన్మించినందుకు బాధపడ వలదు. మనం చేసే కర్మల వలన సుఖదు॰ఖాలు ఏర్పడతాయి ప్రాజ్ఞులు రెండింటిని సమానంగా చూస్తారు. సత్కర్మలచే పాపాన్ని పోగొట్టుకుంటారు. మూఢులు అప్రియానికి కలత చెంది, ప్రియములు జరిగినప్పుడు ఆనందిస్తారు. అందువలన హృదయతాపం హెచ్చుతుందే కాని తగ్గదు. ధీరులు రెండింటినీ సమ దృష్టితో చూస్తారు. జరిగిన దానికి జరగబోవుదానికి దుఃఖించక అన్నిటినీ సమదృష్టితో చూడటం ప్రాజ్ఞుల ధర్మం. దు॰ఖం వలన విచక్షణ కోల్పోతారు. కనుక అన్నింటినీ సమదృష్టితో చూసి శుభములు పొంది ఆనందంగా ఉండుము. అన్ని భూతములందు సమత్వము కలిగి ధీరుడవై ఉండుము నీకు మేలు జరుగుతుంది " అని అనునయ వాక్యాలు చెప్పాడు. ధర్మవ్యాధుడు " మహానుభావా! తమరు చెప్పినట్లే నేను దు॰ఖమును వదిలినాను. నాకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను " అన్నాడు. కౌశికుడు " మహాత్మా! నీవు పుణ్యమూర్తివి. నీ దర్శనంతో నాకు ఎన్నో ధర్మాలు తెలిసాయి నా జన్మ ధన్యం అయింది. ఇక నాకు శలవు ప్రసాదించండి " అని అడిగాడు. ఆ తరువాత కౌశికుడు తన తల్లితండ్రులను చేరుకుని వారిని సేవించి తరించాడు. కనుక ధర్మరాజా ! నీవు అడిగినట్లు పతివ్రతా ధర్మము, మాతాపితల శుశరౄష, హీనకులములో పుట్టినా ఎలా ధర్మాత్ముడు కాగలడో వివరించాను కదా " అన్నాడు మార్కండేయ మహర్షి.

అగ్నిదేవుని తపసు

ధర్మరాజు " మహర్షీ ! నీ దయవలన ఎన్నో విషయములు తెలుసుకున్నాను. పూర్వము అగ్ని దేవుడు ఎందుకు తపస్సు చేసాడు? అంగీరసుడు అగ్నిగా మారటానికి కారణం ఏమిటి? అ గ్నులు ఎన్ని విధాలు? వివరిస్తారా " అని అడిగాడు. మార్కండేయ మహర్షి " ధర్మనందనా ! అగ్ని దేవుడు హవ్యవాహనుడు. యజ్ఞ యాగాదులలో వేసే హోమద్రవ్యాలను అగ్ని దేవుడు దేవతలకు చేరుస్తాడు. ఇలా చేసి విసుగు చెందిన అగ్ని దేవుడు హవిస్సులను అందించడం మాని అడవులకు వెళ్ళి తపస్సు చేయనారంభించాడు. అతని దేహం కృశించి పోయింది. అగ్ని మనసులో " నేను ఇలా నా విధులను విడిచి తపసు చేసుకుంటున్నాను ఏమిటి. నేను లేకపోతే లోకం స్థబించధు కదా! అలా స్తంభించిన బ్రహ్మదేవుడు వేరొకరిని నా పదవిలో పెట్టాడా! ఇక నేను ఇక్కడ ఉండక వెంటనే పోవలయును " అని తలచి తపము చాలించి తన స్వస్థలముకు వెళ్ళుచుండగా బ్రహ్మదేవుడు తన పదవిలో నియమించిన అంగీరసుడనే అగ్ని మూడు లోకాలలో అగ్ని కార్యములు నిర్వర్తించడం చూసి భయపడ్డాడు.

అంగీరసుడు అగ్నిదేవుని పదవిని తిరిగి తిసుకొనమని చెప్పుట

తిరిగి వెళ్ళబోతున్న అగ్నిదేవుని చూసి అంగీరసుడు " అగ్నిదేవా! నీవు పాపరహితుడవు ముల్లోకాల చీకటిని పారద్రోలకలవు. బ్రహ్మదేవుడు మొదట నిన్ను ఈ పదవిలో ఉంచాడు కనుక నీవు నీ పదవిని సంశయించక తీసుకొనుము. నేను ఈ పదవిలో ఉండలేను " అన్నాడు. అగ్నిదేవుడు " అయ్యా! నా కీర్తి లోకాలలో నిస్తేజమై పోయింది. ముల్లోకాలలో పూజ లందుకుంటున్నావు. కనుక ఈ అగ్ని పదివి నీకే కాని నాకు పనికి రాదు. నీవు చెప్తున్నావు కనుక నీవు ప్రథమ స్థానంలో ఉండు. నేను రెండవ స్థానంలో ప్రజాపత్య అగ్నిగా ఉంటాను " అన్నాడు. అంగీరసుడు " దేవా! నీవు నన్ను అలా ఆజ్ఞాపించ వలదు. ప్రథమ పదవి నీదే నన్ను నీకుమారునిగా అంగీకరించి ఆదరింపుము " అని వేడుకున్నాడు. అగ్నిదేవుడు అందుకు అంగీకరించాడు. ఈ విధంగా అంగీరసుడు రెండవ అగ్నిగా ప్రకాశించ సాగాడు.

అంగీరసుడి వంశం

అంగీరసునికి భార్య శివ వలన అతనికి బృహత్కీర్తి, బృహత్జ్యోతి, బృహద్బ్రహ్మ, బృహన్మనసుడు, బృహన్మంతుడు, బృహత్భానుడు, బృహస్పతి అనే ఏడుగురు కుమారులు కలిగారు. భానుమతి, రాగ, సినీవాలి, కుహువు, నశ్చిష్మతి, మహిష్మతి, మహామతి అను ఏడుగురు కుమార్తెలు జన్మించారు. అంగీరసుని కుమారుడు బృహస్పతికి శంయుడు జన్మించాడు. యాగములలో నేతి హవిస్సును అతనికి సమర్పించే వారు. శంయుని భార్య సత్య. వారికి భరద్వాజుడు, భరతుడు అనే కుమారులు కలిగారు. భరతునకు భారతుడు అనే కుమారుడు, భారతి అనే కుమార్తె కలిగారు. భరద్వాజునకు వీరుడు పుట్టాడు. వీరునకు భానుడు అనే కొడుకు పుట్టాడు. భానునికి నిశ్ఛ్యవనుడు పుట్టాడు. నిశ్చ్యవనునికి నిష్కృతి అనే కుమారుడు పుట్టాడు. నిష్కృతి అనే అగ్నిని ఆరాధించేవాడికి పాపాలన్నీ పోతాయి. నిష్కృతికి రుజస్కరుడు పుట్టాడు. రుజస్కరునకు క్రోధుడు పుట్టాడు. క్రోధునికి రుసుడు అనే కుమారుడు కలిగాడు. రుసునికి స్వాహా అనే కుమార్తె, కాముడు అనే కుమారుడు కలిగారు. కామునికి అమోఘుడు, అమోఘునికి సక్థుడు పుట్టారు. కాశ్యపుడు, వాశిష్టుడు, ప్రాణుడు, అంగీరసుడు, చ్యవనుడు అనే అయిదుగురు తమకు తేజోవంతుడైన కొడుకు పుట్టాలని తపస్సు చేసారు. వారికి కలిగిన కుమారునికి తల నిప్పు రంగులోను, చేతులు సూర్యునిలా, కళ్ళు బంగారు రంగులో, శరీరం నలుపు రంగులో ఉంది. బలవంతుడైన అతడు అయిదుగురు తండ్రులకు జన్మించిన కారణంగా పాంచజన్యుడయ్యాడు. అతడు పది వేల సంవత్సరాలు తపస్సు చేసాడు. అతని తల నుండి బృహద్రథంతరులు, ముఖమునుండి హరి, నాభినుండి శివుడు, బలము నుండి ఇంద్రుడు, ప్రాణముల నుండి వాయువు, అగ్ని జనించగా భుజముల నుండి దంతముల నుండి సమస్త భూతములు సృష్టించబడ్డాయి. తపుడు అనే అగ్ని నిరంతరం తపస్సు చేసి పదునైదు మంది కుమారులను కన్నాడు. కాని వారంతా కపటులు అయ్యారు. వారు వరుసగా సుభీముడు, అతి భీముడు, భీముడు, భీమబలుడు, అతి బలుడు, అను వారు ఒక పక్క సుమిత్రుడు, మిత్రవంతుడు, మిత్రజ్ఞుడు ఒక పక్క సురప్రవీరుడు, వీరుడు, సువేషుండు, సువర్చలుడు, సురహంత అను వారలు చేరి యజ్ఞ ఫలములు అపహరిస్తూ ఉండే వారు. వారి దుశ్చర్యలకు బ్రాహ్మణులు తరచూ అగ్ని శాంతి చేయవలసి వచ్చేది. వారి పనులకు బ్రాహ్మణులు మంత్రశక్తితో భయపెట్టి వారిని యజ్ఞశాలకు దూరంగా ఉంచే వారు. తపునకు మరి అయిదుగురు పుత్రులు ఉన్నారు. వారిలో వైశ్వానరుడు బ్రాహ్మణులచే చాతుర్మాస వ్రతములో పూజింపబడే వాడు. రెండవ వాడు విశ్వపతి. అతడు జగత్ప్రభువు. మూడవ వాడు విశ్వకుడు. నాల్గవవాడు విశ్వభుక్కు అతను భూతములు తినే ఆహారాన్ని జీర్ణం చేసే వాడు. ఐదవ వాడు గోపతి అతడు సమస్త ధర్మక్రియలకు కారణ భూతుడు. భానుడు అనే అగ్నికి ఆరుగురు కుమారులు నిశ అనే కుమార్తె కలిగారు. పురంధరుడు అనే అగ్నికి మనువు అనే కుమారుడు కలిగాడు. అతను నిశను వివాహమాడాడు. ఆ మనువుకే ప్రజాపత్యుడు అనే పేరు కూడా ఉంది. ఆ విధంగా సకల విధ అగ్నులు సకల ధర్మ కార్యాలకు కారణమయ్యాయి. ఆపుడు అనే అగ్నికి ముదిత అనే కన్యకు అగ్ని జన్మించాడు. మూడు లోకాలలో జరిగే అన్ని వ్యవహారాలను ఆ అగ్ని నిర్వహిస్తున్నాడు. యజ్ఞాలలో సమర్పించే హవిస్సును దేవతలకు అందిస్తుంటాడు.

అగ్ని సముద్రములో దాగుట

కార్యభారంతో అలసి పోయిన అగ్ని అధర్వునితో ఇలా చెప్పాడు " యజ్ఞయాగాదులలో సమర్పించే హవిస్సులను దేవతల కందించి నేను అలసి పోయాను. ఇకపై ఆ కార్యాన్ని నీవు నిర్వహించు " అని చెప్పి అగ్ని సముద్రంలో దాక్కున్నాడు. దేవతలందరూ అగ్ని ఎక్కడున్నాడో తెలియక వెదక సాగారు. ఇంతలో సముద్రంలోని చేపలు అగ్ని సముద్రంలో దాక్కుని ఉన్న విషయం దేవతలకు అందించాయి. అగ్నిదేవుడు ఆగ్రహించి " మీ చేపజాతిని మానవులు నిర్ధయులై తినెదరు కాక " అని శపించాడు. దేవతలంతా " అగ్నిదేవా! నీవు యధావిధి మాకు హవిస్సులను అందించు అని అడిగారు " కాని అందుకు అగ్ని సమ్మతించక శరీరాన్ని విడిచి భూమిలో ప్రవేశించాడు. భూమి పై పడిన అగ్ని నుండి అనేక ధాతువులు ఆవిర్భవించాయి. చీము నుండి గంధకం, ఎముకల నుండి దేవదారు వృక్షములు, కఫం నుండి కర్పూరం, పిత్తం నుండి పచ్చలు, వాతము నుండి నల్లటి పాషాణము, గోళ్ళనుండి అభ్రకము, రక్తనాళముల నుండి పగడములు ఏర్పడ్డాయి. అగ్ని దేవుడు భూగర్భంలో తపస్సు చేసుకుంటున్నాడు. అధర్వుడు అగ్ని కార్యములన్నీ నిర్వహిస్తున్నాడు. దేవతలంతా అధర్వుని పూజిస్తున్నారు. అధర్వుని కాంతిని దేవతలు అతనిచే తృప్తి పడటాన్ని ఓర్వలేక అగ్ని బయటకు వచ్చి మరల హవిస్సును అందిస్తానని ముందుకు వచ్చాడు. ధర్మరాజా ఆ విధంగా ఎందరో అగ్నులు ఉన్నాఅందరిలో వెలిగే అగ్ని ఒకటే " అన్నాడు మార్కండేయుడు.

కుమారస్వామి

ధర్మరాజు "మహర్షీ ! మహాసేనాని అని పిలువబడే కుమారస్వామి అగ్నిదేవునికి, కృత్తికలకు, శివునకు కుమారుడెలా అయ్యాడు " అని అడిగాడు.

దేవసేన

మార్కండేయుడు " ధర్మరాజా ! పూర్వం దేవేంద్రుడు రాక్షసులతో యుద్ధం చేసి ఓడి పోయాడు. రాక్షసులను గెలవడమెలా అని దేవేంద్రుడు మానస అనే కొండ మీద ఆలోచించే సమయంలో ఒక స్త్రీ ఆర్తనాదం వినపడింది. దేవేంద్రుడు ఆ స్త్రీని రక్షించాలని వెళ్ళి కేశి అనే రాక్షసుడు ఒక స్త్రీని ఆకాశమార్గంలో తీసుకు వెళ్ళడం చూసాడు. డేవేంద్రుడు తనవజ్రాయుధంతో అతనిని వెంబడించాడు. అతడు తన గధాయుదాన్ని ఇంద్రుని మీద విసరగా ఇంద్రుడు వజ్రాయుధంతో గధను ముక్కలు చేసాడు. కేశి ఆస్త్రీని వదిలి పారిపోయాడు. ఇంద్రుడు ఆ కన్యను చూసి " నీవెవరు? ఈ రాక్షసుడికి ఎందుకు చిక్కావు? " అని అడిగాడు. ఆమె " అయ్యా! నాపేరు దేవసేన, నా అక్క పేరు దైత్య సేన మేము అరిష్టనేమి అనే ప్రజాపతి పుత్రికలము. మేము ఇక్కడ విహరిస్తుండగా ఈ రాక్షసుడు కామచేష్టలతో మమ్ము వేధిస్తున్నాడు. నా సోదరి దైత్యసేనకు అవి నచ్చాయి ఆమె అతనితో వెళ్ళింది. నాకు నచ్చలేదు కనుక నేను వెళ్ళలేదు. అతడు అంతటితో ఆగక తిరిగి వచ్చి నన్ను బలవంతంగా తీసుకు పోతున్నాడు. ఆ సమయంలో తమరు వచ్చి నన్ను రక్షించారు " అని చెప్పింది. ఇంద్రుడు మీ తల్లి మాతల్లి దక్షుని పుత్రికలు. అందు వలన నీవు నాకు సోదరివి. నీకేం వరం కావాలో కోరుకో " అని దేంద్రుడు అడిగాడు. ఆమె " దేవేంద్రా! మా తండ్రి నా చిన్నతనం నుండి నాకు మహా పరాక్రమవంతుడు, కీర్తిప్రతిష్టలు కల వాడు భర్తగా రాగలడని చెప్పాడు. ఆ మాటను మీరు నిజం చెయ్యండి. దేవతలకు రాక్షసులకు గెలువ శక్యం కాని వాడు, భయంకరమైన రాక్షసులను సంహరించే వాడు, ముల్లోకాలను రక్షించే వాడు, నీకు ఇష్టమైన వాడిని నాకు భర్తగా ప్రసాదించు " అని కోరింది. ఆమె మాటలు విని దేవేంద్రుడు " ఈ రోజు అమావాస్య సూర్యచంద్రులు ఏక రాశిలో ఉంటారు. ఇది సూర్యోదయం రౌద్ర ముహూర్తం. అగ్ని మునులు అర్పించిన హవిస్సులను తీసుకుని సూర్య మండలంలో ప్రవేశిస్తున్నాడు. కనుక సూర్యుడు, చంద్రుడు, అగ్ని తేజములతో జన్మించిన వాడు ఈమెకు భర్త కాగలడు " అని అనుకున్నాడు. దేవసేనను తీసుకుని బ్రహ్మ వద్దకు వెళ్ళి దేవసేనకు తగిన భర్తను ప్రసాదించమని కోరాడు. బ్రహ్మదేవుడు " దేవేంద్రా! ఈ కన్యకు గొప్ప వీరుడు భర్త కాగలడు. అతడు దేవసేనకు సేనాదిపతి కాగలడు. నీ కష్టములు తీర్చగలడు " అన్నాడు.

కుమారసంభవం

వశిష్ఠుడు మొదలైన సప్తఋషులు అమావాస్య హోమం చేస్తున్నారు. హవిస్సులను స్వీకరించి దేవతలకు ఇవ్వడానికి అగ్ని దేవుని ఆహ్వానించారు. అగ్నిదేవుడు సర్వాలంకార భూషితలై భర్తల ప్రక్కన సప్త ఋషి పత్నులను చూసి మోహించాడు. వారిని తన జ్వాలలతో తాకాలని ఆరాటపడ్డాడు. హోమం ముగిసింది అగ్ని దేవుడు విరహంతో బాధపడ్డాడు. అగ్ని భార్య స్వాహాదేవి ఇది పసికట్టింది. తన భర్త కోరిక తీర్చడానికి అంగీరసుని భార్య శివ రూపంలో భర్త దగ్గరకు వచ్చి " నేను అంగీరసుని భార్యను. నా తోటి వారైన సప్త ఋషుల భార్యలపై నీకు వలపు ఏర్పడింది మేమంతా నీ కోరిక తీర్చాలనుకున్నాము. నీ మనస్సు తెలుసు కోవడానికి నన్ను పంపారు " అన్నది. అగ్ని దేవుని ఆనందానికి అవధులు లేవు ఆమె యందు తన కోరిక తీర్చుకున్నాడు. స్వాహాదేవి గరుడ పక్షిగా మారి భర్త తేజస్సును వాయువేగంతో వెళ్ళి శ్వేతపర్వతంలో అక్కడ ఉన్న రెల్లు కుండలో దాచింది. ఇలా ఆమె ఆరు రూపాలలో భర్తను కూడి తేజస్సును కుండలో భద్రపరచింది. ఆమె ఒక అరుంధతి రూపం ధరించ లేక పోయింది.

కుమార జననం

ఆ విధంగా ఆరు మార్లు కూర్చిన అగ్ని తేజస్సుతో కుమారస్వామి ఆరు ముఖాలతో అగ్ని తేజస్సుతో పన్నెండు చేతులతో జన్మించాడు. శుక్లపక్ష పాడ్యమిలో వీర్య సేకరణ, విదియలో గర్భం ధరించడం, తదియలో రూపం ఏర్పడటం, చవితిలో అన్ని అవయవాలు ఏర్పడి, పంచమి నాడు పూర్తి ఆకారంతో నిలబడి శివుని విల్లు ధరించడం జరిగింది. కుమారస్వామి విల్లు ఎక్కు పెట్టగానే ఆ ధ్వనికి ఐరావతం, సుప్రీతకం అనే ఏనుగులు కుమారస్వామి మీదకు లంఘించాయి. కుమారస్వామి వాటిని తన చేతులతో అణచి పెట్టాడు. ఒక చేత్తో తనకు సహజసిద్ధంగా లభించిన శక్తి ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఒక చేత్తో వినోదంగా కోడిని పట్టుకుని శంఖం పూరించాడు. బొటన వేలిని చప్పరిస్తూ ఆకాశాన్ని చేతులతో చరిచాడు. ఒక బాణంతో క్రౌంచ పర్వతాన్ని, శక్తి ఆయుధంతో శ్వేతపర్వతాన్ని భేదించాడు. ఆరు ముఖాలతో సింహనాదంచేసాడు. ఆ సింహనాదానికి పర్వతాలు చలించాయి, సముద్రాలు పొంగాయి, భూమి కంపించింది. ఆ ఉత్పాతాలకు భయపడి ఋషులు శాంతి హోమాలు చేసారు. అప్పుడు చైత్రరథం అనే అడవిలో ఉన్న జనం " సప్తఋషి పత్నులకు అగ్నిదేవుని వలన జన్మించిన బాలుని వలన ఈ ఉత్పాతాలు సంభవిస్తున్నాయి " అని ఆక్రోశించారు. ఈ అపనిందని భరించలేక ఋషులు తమ భార్యలను వదిలి వేసారు. కొందరు మాత్రం " ఇందులో ఋషిపత్నుల దోషం ఏమీ లేదు. అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగినిదేవుని చేరింది " అని చెప్పుకున్నారు. స్వాహాదేవి " అయ్యా! ఈ బాలుడు నాకు నా భర్తకు జన్మించాడు. మీ పత్నులకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు. వారిని స్వీకరించండి " అని చెప్పింది. ఋషులు ఆమె మాటలు విశ్వసించ లేదు. తరువాత విశ్వామిత్రుడు అనే ముని అగ్ని కుమారునకు జాతక కర్మలు చేసాడు.

దేవేంద్రుడు యుద్ధముకు వచ్చుట

దేవతలు దేవేంద్రుని వద్దకు వెళ్ళి " దేవేంద్రా! అగ్ని కుమారుడు తేజోవంతుడు, గర్వం కలవాడు. అతని వలన నీ పదవికి ముప్పు రాగలదు. నీ పదవి దక్కాలంటే వెంటనే అతనిని సంహరించడం మంచిది " అన్నారు. దేవేంద్రుడు సప్త మాతృకలను పిలిచి " మీరు అగ్ని కుమారుని సంహరించండి " అని ఆజ్ఞాపించాడు. అందుకు అంగీకరించి వెళ్ళిన సప్త మాతృకలు బాలుని తేజస్సు చూసి భయపడి అతనిని శరణు వేడారు. కుమార స్వామి వారిని మన్నించాడు. సప్త మాతృకలు బాలుని సంరక్షణ కొరకు లోహితాస్య అనే దాదిని సృష్టించారు. అగ్నిదేవుడు కుమారుని సంరక్షణా భారం స్వీకరించాడు. ఇది తెలుసుకున్న దేవేంద్రుడు ఆగ్రహించి తన సేనలతో కుమారస్వామి మీదకు దండెత్తి వచ్చాడు. కుమారస్వామి ముఖము నుండి వెలువడిన అగ్ని జ్వాలలకు భయపడిన దేవతలు అతనిని శరణుజొచ్చారు. దేవేంద్రుడు కుమారస్వామి మీదకు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అది కుమారస్వామి కుడి భాగాన్ని తాకగా అందు నుండి బంగారు చాయతో, మేషముఖంతో శక్తి ఆయుధంతో ఒక పురుషుడు జన్మించాడు. అతని పేరు విశాఖుడు. అతనితో పాటు అనేక మంది బాల బాలికలు పుట్టారు. ఇది చూసిన దేవేంద్రుడు భయపడి కుమారస్వామిని శరణు వేడాడు.

కుమారస్వామి దేవతల మన్ననలను అందుకొనుట


దేవసేనను చూపిస్తున్న ఇంద్రుడు
దేవతలు సింహనాదాలు చేస్తూ కుమారస్వామి చెంత చేరారు. దేదీప్యమానంగా వెలుగుతున్న అగ్ని పుత్రుని చూసి లక్ష్మీ దేవి సాకారమై అతని చెంతన నిలిచింది. ఆరవదినం ఋషులు కుమారస్వామిని భక్తితో నమస్కరించి " దేవా! నీవు పుట్టిన ఆరుదినములకే లోకాలను జయించావు. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, సుపరిపాలనా దేవేంద్రుని కర్తవ్యం. షణ్ముఖా నీవు అందుకు తగిన వాడివి కనుక ఇంద్ర పదవిని స్వీకరించుము " అని దేవతలు, ఋషులూ అడిగారు. ఇంద్రుడు " కుమారస్వామీ! నీవు శౌర్యవంతుడవు కనుక ఇంద్రపదవిని అంగీకరించుము " అని అడిగాడు. " దేవేంద్రా! నాకు ఇంద్ర పదవి అక్కర లేదు. నీ తేజస్సు చూసి దేవతలు తిరిగి నీవే ప్రభువు అని మోహంకలుగ చేసిన నీకు నాకు శత్రుత్వం వస్తుంది కనుక ఆ పదవిలో నీవే ఉండు " అని కుమారస్వామి అన్నాడు. దేవేంద్రుడు ఆ మాటలకు ఆనందించాడు. " కుమారా! నీవు మా సేనలకు ఆదిపత్యం వహించు " అని ఇంద్రుడు కుమారస్వామిని అడుగగా అతడు అందుకు అంగీకరించాడు. ఋషులు దేవతలు జయజయధ్వానాలు చేసి కుమారస్వామిని దేవ సేనాధిపతిగా అభిషేకించారు. మహాశివుడు అక్కడకు వచ్చి కుమారస్వామిని చేరదీసి విశ్వకర్మచే కూర్చ బడిన బంగారు పుష్పమాలను బహూకరించాడు " అని చెప్పగా ర్మరాజు ఇక్కడ ఒక సందేహం వెలిబుచ్చాడు " మహర్షీ! కుమారస్వామి రుద్రాంశ సంభూతుడంటారు కదా అదెలా సంభవించింది " అని అడిగాడు. మార్కండేయుడు ధర్మరాజుతో " ధర్మరాజా! పూర్వం శివుడు తన తేజస్సును అగ్నియందు ప్రవేశపెట్టాడు. ఆ వీర్యము చేత అగ్నిహోత్రుడు కుమారస్వామిని పుట్టించాడు. అగ్నికి రుద్రుడనే నామాంతరం కూడా ఉంది. అందుచే కుమారస్వామిని అగ్ని పుత్రుడు, శివపుత్రుడు అని కూడా అంటారు " అన్నాడు. అగ్నిదేవుని భార్య స్వాహాదేవి కృత్తికల రూపంలో ఆరుగురు ముని పత్నుల రూపంధరించి భర్తను చేరి కుమారస్వామికి జన్మ ఇచ్చినందున కార్తికేయుడనే నామం కలిగింది. ఈ సమయమున దేవేంద్రుడు తన వద్ద పెంచుకుంటున్న దేవసేనను అక్కడకు రప్పించి " కుమారా! ఈ కన్యను బ్రహ్మదేవుడు నీ కొరకే సృష్టించాడు ఈమెను స్వీకరించు " కుమారస్వామి అందుకు అంగీకరించి దేవసేనను వివాహమాడాడు.

కుమారస్వామి పదవులను ఇప్పించుట

ఈ సమయమున భర్తలచే విడువబడిన సప్తఋషి పత్నులు అక్కడకు వచ్చారు. " కుమారా! దుర్జనులు కొందరు మేము అగ్నిదేవునితో చేరి నిన్ను కన్నామని అసత్యప్రచారం చేసారు. ఏ పాపం ఎరుగని మమ్ము భర్తలు వదిలి వేసారు. పుత్ర సమానుడవైన నీవే మమ్ములను రక్షించాలి " అని ప్రార్ధించారు. కుమారస్వామి దేవేంద్రునితో " అమ్మా! మీరు నాకు తల్లులు సందేహం లేదు" అని " దేవేంద్రా వీరికి తగిన పదవులు ఇమ్ము " అన్నాడు. దేవేంద్రుడు " కుమారా! దక్షప్రజాపతి కుమార్తెలు చంద్రుని వివాహమాడి అతని చుట్టూ తారలుగా విర్రాజిల్లు తున్నారు. అందులో రోహిణి నక్షత్రం పక్కన ఉన్న అభిజిత్ అనే తార చంద్రుని ప్రేమను అందరికన్నా అధికంగా పొందాలని తపస్సు చేసుకోవడానికి వెళ్ళింది. ప్రస్తుతం ఆస్థానంలో ఈ ఆరుగురు కృత్తికలను ఉంచవచ్చు " అన్నాడు. ఇంతలో స్వాహాదేవి అక్కడకు వచ్చి " కుమారా! నీవు నా పుత్రుడవు నాకు ఎప్పుడూ నీ దగ్గర ఉండాలని కోరికగా ఉంది " అన్నది. " అలాగే నీవు ఎల్లప్పుడూ నా చెంతనే ఉండి నాచే మీ కోడలుచే సపర్యలందుకుంటూ సుఖంగా ఉండు" అన్నాడు. ఇంతలో సప్తమాతృక లైన హవిష, కాళి, కౌశికి, ఉద్ధత, శారిక, ఆర్య, వైధాత్రి అక్కడకు వచ్చారు. వారు "షణ్ముఖా! ఇప్పుడు లోకమాతలుగా ఉన్న వారిని తొలగించి మమ్ములను ఆపదవిలో ఉంచు " అన్నారు. కుమారస్వామి " ఇప్పటివరకు ఉన్న మాతలను ఎలా తొలగిస్తాం. మీరు వేరే వరం కోరుకోడి " అన్నాడు.వారు "లోకంలోని పసిపాపలను బాధించి పీడించే వరం ప్రసాదించు " అన్నారు. కుమారస్వామి " ఇలాంటి వరం కోరడం అనుచితము అలాంటి వరం ఇస్తున్నాను. మీకు మొక్కిన బాలలను ఎలాంటి హాని లేకుండా రక్షించండి. మీరి నరులను పదనారు వయసు వచ్చేదాకా బాధించండి. మీకు నా అంశతో పుట్టిన వాడిని రక్షగా నియమిస్తాను " అన్నాడు. ఇంకా శకుని మాత వినత, దైత్యమాత దితి, గోమాత సురభి, శునక మాత సరమ, వృక్షమాత కరంజ, సర్ప మాత కద్రువ, కుమారుని మాత లోహితాస్య ఈ మాతృకలతో కలసి శిశువులను బాధిస్తూ ఉంటారు. అలాగే దేవ గ్రహములు, పితృ గ్రహములు, గంధర్వ గ్రహము లు, యక్ష గ్రహములు నరులను బాధిస్తుంటాయి. కాని ధర్మరాజా ! శివభక్తులను, పరిశుభ్రంగా ఉండే వారిని, శాంతి కాముకులకు, ఇంద్రియాలను జయించిన వారిని భాధించవు " అన్నాడు.

కుమారస్వామి స్వాహాదేవిని అనుగ్రహించుట

ఇంతలో అగ్నిదేవుని భార్య అక్కడకు వచ్చి " కుమారా! నేను దక్షప్రజాపతి కూతురును. నా తండ్రి నన్ను చిన్నతనంలోనే అగ్నిదేవునకిచ్చి వివాహం చేసాడు. నా భర్తకు నాపై అనురాగం లేదు నీవెలాగైనా అనురాగం కలిగేలా చెయ్యి " అని కోరింది. కుమారస్వామి " అమ్మా! బ్రాహ్మణులు అగ్నిలో హవ్యములు వేసేటప్పుడు స్వాహా కార మంత్రంతో వేస్తారు. అందు వలన నీకు నీ భర్తతో నిరంతర సాన్నిహిత్యం లభిస్తుంది " అన్నాడు. బ్రహ్మదేవుడు అక్కడకు వచ్చి అక్కడ ఉన్న శివుని చూసి " కుమారా! ఈయన మహాశివుడు త్రినేత్రుడు, త్రిపురాంతకుడు. ఈమె ఈయన భార్య పర్వతరాజ పుత్రి పార్వతి వీరు నీ తల్లి తండ్రులు. వీరు యోగ బలంచే తమ తేజస్సును అగ్నియందు అతని భార్య యందు ప్రవేశపెట్టి నిన్ను కన్నారు. వీరిని భక్తితో ఆరాధించు " అన్నాడు. కుమారస్వామి పార్వతీపరమేశ్వరులను భక్తితో నమస్కరించాడు. శివుడు కుమార సమేతుడై భద్రవటం చేరుకున్నాడు. వారి వెంట కుబేరుడు, దేవేంద్రుడు, అమోఘుడు అనే యక్షనాయకుడు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, యముడు, ఆదిత్యుడు, చంద్రుడు, వరుణుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు వెంట నడిచారు.

మహిషాసురమర్ధన


మహుషుని వధ
ధర్మరాజా ! ఆ సమయంలో మహిషాసురుడు రాక్షస సేనలతో దండెత్తి వచ్చాడు. క్షణాలలో దేవసైన్యాన్ని చిందరవందర చేసాడు. ఇది చూసి దేవతలు యుద్ధం చేయడం ఆపి పారిపోయారు. దేవేంద్రుడు వారికి ధైర్యం చెప్పి యుద్ధోన్ముఖులను చేసాడు. దేవతలకు రాక్షసులకు మధ్య భీకర పోరు జరిగింది. ఆ యుద్ధంలో శివుడు కూడా పాల్గొన్నాడు. మహిషాసురుడు శివుని రథం పట్టుకున్నాడు. దేవతలు శివుడు మహిషాసురుని చేతిలో మరణిస్తాడని భయపడ్డారు. శివుడు కుమారస్వామిని చూసి " కుమారా! చూసితివా వీడి సాహసం. నా రథాన్ని పట్టుకున్నాడు. వీడికి ఆయుషు మూడింది. వెంటనే వీడిని సంహరించు " అన్నాడు. కుమారస్వామి శక్తి ఆయుధాన్ని మహిషాసురుని పై ప్రయోగించాడు. అది మహిషాసురునితో అతని సైన్యాన్ని దహించింది. దేవతలు కుమారస్వామిని స్తుతించారు. శివుడు దేవతలతో " ఇతని పరాక్రమం చూసారా! ఇకపై మీరి నన్ను ఎలా పూజ్య భావంతో సేవిస్తారో ఇతనిని అలాగే సేవించండి " అని చెప్పి భద్రవటానికి వెళ్ళాడు. ఈ విధంగా కుమారస్వామి దేవతల శత్రువులను ఒక్క రోజులో జయించాడు.

ద్రౌపది సత్యభామలు

ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద అనే విషయాలు తెలుసుకుంటున్న సమయంలో ద్రౌపది సత్యభామలు ఇష్టాగోష్టి సలుపుతున్నారు. సత్యభామ ద్రౌపదిని " ద్రౌపదీ ! నీకు ఐదుగురు భర్తలు. వారియందు నీవు భక్తి కలిగి ఉన్నావు. వారు నీయందు అనురాగం కలిగి ఉన్నావు. ఇదెలా సాధ్యం నీ వద్ద ఏదైనా మంత్రమూ ఔషధమో ఉన్నదా? ఈ మహిమ నీకు ఎలా చేకూరింది. నీ అలంకరణా సామర్ధ్యమా లేక సంభాషణా చాతుర్యమా నాకు ఎరిగింపుము. ఆ నేర్పరితనంతో నేను నా భర్త అయిన శ్రీకృష్ణుని వశం చేసుకుంటాను " అని అడిగింది. ఆ మాటలకు ద్రౌపదికి కించిత్ కోపం వచ్చింది. ఆమె సత్యభామతో " సత్యా! నీవు నన్ను దుష్టస్త్రీగా జమకట్టడం తగదు. ఆ పురుషోత్తమునకు నీవు భార్యగా తగవు అని నా భావన. మంత్ర తంత్రములతో భర్తను వశం చేసుకోవాలి అనుకోవడం నీ భ్రమ. అలాంటి పనులు చేస్తే భర్తకు భార్య మీద ఉన్న ప్రేమ కూడా పోతుంది. అలాంటి భార్యతో చెలిమి పాముతో చెలగాటం అని భావిస్తాడు. అలాంటి మందులకు భర్తకు రోగం, భార్యకు అపకీర్తి వస్తుంది. భర్తల పట్ల భార్యలు ఇలాంటి కపటాలతో మోసగించిన నరకం తప్పదు. భర్తకు అనుకూలవతిగా చరించడమే భార్యకు ఉత్తమ ధర్మం. నేను పాండవుల పట్ల ఎలా ప్రవర్తిస్తానో నీకు వివరిస్తాను. నా భర్తలు పరస్త్రీలతో చరించినా నేను అసూయ చెందను. వారి పట్ల అహంకరించక పూజ్యభావంతో ఉంటాను. నా భర్తలు తప్ప మిగిలిన వారు దేవతలైనా, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులైనా నాకు తృణప్రాయం. స్నానం భోజనం శయనం ఏదైనా భర్తలకు సమకూర్చి నేను అనుభవిస్తాను. భర్తల మనసెరిగి వారికి కావలసినవి సమకూరుస్తాను. భర్తల యొక్క బంధు మిత్రుల ఎడ ఆదరం చూపిస్తాను. గృనిర్వహణలో పరిశుభ్రత పాటిస్తాను. ఏదీ వ్యర్ధం చేయను. అనవసర ఖర్చులు చేయను. భర్తలు ఇంట లేనప్పుడు పువ్వులు ధరించను. అలంకారం చేసుకోను భర్తలయందు మనసు నిలిపి వారి కోసం నిరీక్షిస్తుంటాను. ఎక్కువ సేపు వాకిట నిలబడటం, అతిగా నవ్వడం, దుష్టులతో స్నేహం చెయ్యడం చేయను. నా భర్తలు ఎంతటి సున్నిత మనస్కులో అంతటి కోపాన్ని ప్రదర్శిస్తారు. వారి పట్ల భయభక్తులతో ప్రవర్తిస్తాను. మా అత్త కుంతికి స్నాపానాదులు నేనే సమకూరుస్తాను. నా భర్త ధర్మరాజు ప్రతి రోజు పదివేల బ్రాహ్మణులకు పదివేల యతీశ్వరులకు అన్న సంతర్పణ చేస్తాడు. ఆ ఏర్పాట్లు నేను స్వయంగా చేసి వారికి ఆనందం సమకూరుస్తాను. అంతఃపురంలో పనిచేసే వేలకొలది సేవకుల బాగోగులు నేనే స్వయంగా చూస్తాను. వారు వారి విధులను క్రమశిక్షణలో నిర్వర్తించేలా చూస్తాను. భండాగారంలో ఉన్న రత్నాలు, మణులు, ఆభరణాలు, ధనం మొదలైన లెక్కలు నాకు తెలియును. పని వారికి ఇవ్వవలసిన జీతభత్యములు నేనే ఇస్తాను. అందు వలన పాండవులు సంసార భారం నా మీద మోపి నిశ్చింతగా ఉంటారు. నాకు రాత్రి ఒక ఝాము మాత్రమే నిద్రపోవడానికి సమయం ఉంటుంది. భోజనం చేయటానికి సరిగా సమయముండదు. ఇలా ప్రవర్తించి నేను భర్తల ఆదరణ పొందుతున్నాను కాని మందులు ఔషధాలు ఉపయోగించి కాదు. ఇంద్రజాలం అసలే కాదు " అని అన్నది.

ద్రౌపది సత్యభామకు హితవు చెప్పుట


ద్రౌపది సత్యభామల సంవాదము
సత్యభామ సిగ్గుపడి " ద్రౌపదీ! నాకు నీ సంగతి తెలియక ఏదో పరిహాసంగా అన్నాను. నన్ను మన్నింపుము " అన్నది. ద్రౌపది " సత్యా! దానిదేముంది అలాగే పరిహాసంగా తీసుకుంటాను. భర్త మనసు చూరగొనే ధర్మమైన ఉపాయం చెప్తాను విను. పతిని మించిన దైవం భార్యకు లేదు. భర్త దయ వలన భార్యకు కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయి. సమస్త సంపదలు సమకూడుతాయి. భర్తకు సేవలు చేస్తే భార్యకు సులువుగా పుణ్యం లభిస్తుంది. కనుక భర్తకు ప్రతి రోజు ప్రేమతో ఆరాధనతో సేవలు చెయ్యి. నీకు భర్త అనురాగం లభిస్తుంది. భర్త రాగానే చిరునవ్వుతో ఎదురేగి స్వాగతం పలుకు. భర్త సేవలకు సేవకులను నియోగించక స్వయంగా నువ్వే చెయ్యి. నీ భర్త మాటల సందర్భంలో చెప్పిన రహస్యం బట్టబయలు చేసి సపత్నుల ముందు అవమానపడకు. అందు వలన భర్త అనురాగం సన్నగిల్లుతుంది. నీ భర్తకు అపకారం చేసే వారు నీకు మిత్రులైనా వారిని ఆదరింపకుము. భర్త బంధుమిత్రులను ఆదరించు. నీ పుత్ర సమానులైన ప్రద్యుమ్నాదులతో కూడా ఒక శయ్యపై కూర్చుండ రాదు. కుల స్త్రీలతో మాత్రం స్నేహసంబంధాలు పెట్టొకో. విలాసజీవితంపై ఆసక్తి కలవారు అహంభావులైన స్త్రీలతో స్నేహం వద్దు. ఇలా ప్రవర్తిస్తే నీకు పరమ సౌభాగ్యం కలుగగలదు " అన్నది. సత్యభామ ద్రౌపదితో " నీ భర్తలు దైవసమానులు. నీవు ధర్మం తెలిసిన దానివి. నీ కుమారులు పరాక్రమవంతులు, నీవు వీరమాతవు. వారిని ద్వారకలో రుక్మిణీ సుభద్రలు తమ కుమారుల కంటే ప్రేమగా చూసుకుంటున్నారు కలత చెంద వద్దు. వారు ద్వారకలో క్షేమంగా ఉన్నారు. త్వరలోనే మీకు మీ రాజ్యం లభిస్తుంది. దుర్యోధనాదులు కష్టాలు అనుభవించగలరు " అన్నది. శ్రీకృష్ణుడు ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద సెలవు తీసుకుని ద్వారకకు పయనమైయ్యాడు. మార్కండేయ మహర్షి ధర్మరాజుతో అనునయ వాక్యాలు పలికి తన ఆశ్రమానికి వెళ్ళాడు. పాండవులు కామ్యక వనం వదిలి ద్వైత వనానికి వెళ్ళారు.

దుర్యోధనుని అవమానభారం

ఇంతవరకు కథను వింటున్న జనమేజయుడు వైశంపాయుని చూసి " మహర్షీ! ఎల్లప్పుడూ పాండవులకు హాని తలపెట్టే దుర్యోధనుడు శత్రువులచే బంధింపబడి పాండవులచే రక్షింపబడిన అవమాన భారాన్ని ఎలా భరించాడు. భరించి ఎలా హష్తినకు చేరాడు " అని అడిగాడు.

హస్థినాపురం

హష్తినాపురవాసి అయిన బ్రాహ్మణుడు ద్వైతవనానికి వెళ్ళి పాండవులను కలుసుకుని తిరిగి హస్థినకు వెళ్ళాడు. దృతరాష్ట్రుడు ఆ బ్రాహ్మణుని చూసి పాండవుల యోగక్షేమాలు విచారించాడు. ఆ బ్రాహ్మణుడు పాండవులు ద్రౌపది అడవులలో పడే కష్టాలు వివరించాడు. దృతరాష్ట్రుడు అది విని ఎంతో దు॰ఖించాడు. " అయ్యో! నా కుమారుని దుర్నీతి వలన కదా ఇంత కష్టం దాపురించింది. దీనికంతకు నాచేతకాని తనమే కారణం. ధర్మరాజును నా పెద్ద కొడుకుగా భావిస్తాను అతనికి బ్రహ్మదేవుడు ఎన్ని కష్టాలు రాసాడు. హంసతూలికా తల్పంపై నిదురించే ధర్మరాజు కటిక నేలపై నిదురిస్తున్నాడు కదా. అనిల కుమారుడు అతి బలవంతుడైన భీముడు అడవి సింహంలా వనాలలో తిరుగుతున్నాడు కదా. అన్నదమ్ములు ద్రౌపది పడుతున్న కష్టాలు చూసి అర్జునుడు మనసులో రగిలి పోతున్నాడు కదా. సుకుమారులైన కవలలు అడవులలో ఎన్ని కష్టాలు పడుతున్నారో. వాయు పుత్రుడైన భీముడు అతి బలవంతుడైనా అన్న మాటకోసం అరణ్యవాసం చేస్తున్నాడు కాని లేకున్న అతనిని ఆపడం ఎవరి తరం. శకుని వంచన, దుశ్శాసనుని దుశ్చర్యలు, కర్ణుని తులువతనం, దుర్యోధనుని అనీతి అతని మనసులో ముల్లులా గుచ్చుకుంటున్నాయి కదా. భీముని చేతిలో నా కుమారుల మరణం తప్పదేమో. కర్మఫలం అనుభవించక తప్పదు కదా. ఏమి చేయుదును విచారించిన ఏమి ఫలం నేను ఎంత వారించినా జూదం ఆపలేక పోయాను. కష్టముల వెంట సుఖాలు వస్తాయి అంటారు కదా. అర్జునుడు పరశివుని మెప్పించి పాశుపతాన్ని సాధించాడు. సశరీరంగా స్వర్గానికి పోవడమే కాక ఇంద్రుని అర్ధ సింహాసనం అధిష్టించాడు. అర్జునుడు ఏ జన్మలో చేసిన పుణ్యమో కదా " అని పపరి విధాలుగా విలపించేడు. దుర్యోధనుడు అది చూసి "మామా! మా తండ్రిగారు ఇలా భీతిల్లుతున్నాడు. దీనిని గురించి ఆలోచించ వలెను " అన్నాడు. వారిరువురు కర్ణునితో చేరి ఏకాంతప్రదేశంలో మంతనాలు జరిపారు. కర్ణుడు " సుయోధనా పాండవుల సంపదలన్నీ నీ వశమైనాయి. వారు అడవుల పాలయ్యారు. రాజులంతా నీకే కప్పం చెల్లిస్తున్నారు. సార్వభౌముడివైన నీ పాలన ప్రజామోదాన్ని పొందింది. నీవు ద్వైత వనానికి వెళ్ళి అక్కడ ఇడుములు పడుతున్న పాండవులకు నీ భోగభాగ్యములు ప్రదర్శించి వారికి ఖేదము కలిగించ వలెను. అలాగే వారు పడుతున్న కష్టములు చూసి ఆనందించి మన జన్మ సాఫల్యం పొందవచ్చు. ద్రౌపది నీ భార్యల సౌభాగ్యం చూసి దు॰ఖించ వలెను " అని దుర్యోధనునితో అన్నాడు.

ద్వైతవనానికి దుర్యోదనాదుల ప్రయాణం

కర్ణుని మాటలు విన్న దుర్యోధనుడు " మిత్రమా కర్ణా! నా అభిప్రాయం కూడా అదే. మనం ద్వైతవనానికి పోవడానికి దృతరాష్ట్రుడు అంగీకరించాలి కదా. ఇటీవల దృతరాష్ట్రుడు పాండవులను చూసి అంతులేకుండా భయపడుతున్నాడు. పాడవుల శౌర్యపరాక్రమాలను తలచుకుని కలత చెందుతున్నాడు. ఇందుకు పాండవ పక్షపాతి అయిన విదురుడు వారిని ప్రశంసిస్తూ వంత పాడుతున్నాడు. కనుక దృతరాష్ట్రుడు మన ప్రయాణానికి అంగీకరించడేమో నీవు శకుని ఏదైనా ఉపాయం ఆలోచించండి " అన్నాడు. మరునాడు కర్ణుడు దుర్యోధనుని వద్దకు వచ్చి " సుయోధనా! ద్వైత వనంలో మనకు ఆవుల మందలు ఉన్నాయి కదా. వాటిని చూచు నెపంతో దృతరాష్ట్రుని అనుమతి తీసుకుంటాము " అన్నాడు. దుర్యోధనుడు కర్ణుని అభిప్రాయంతో తన అభిప్రాయం అదేనంటూ ఏకీభవించాడు. వెంటనే వారు ఒక గొల్లవాడిని పిలిపించి దృతరాష్ట్రునితో ఎలా మాట్లాడాలో నేర్పించారు. ఆ తరువాత ముగ్గురూ దృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. అంతలో వారు ఏర్పాటు చేసిన గొల్లవాడు వచ్చి దృతరాష్ట్రునితో " మహారాజా! నేను ద్వైతవనం నుండి వచ్చుచున్నాను అక్కడ ఇప్పటి వరకూ క్షేమంగా ఉన్న మన ఆవులకు ఇటీవల కృరమృగాల బెడద ఎక్కువయినది. మీరు సత్వరం తగు చర్య తీసుకోవాలని మనవి చేస్తున్నాను " అన్నాడు. శకుని కర్ణుడు చేరి గోపాలుని మాటలు సత్యమనిపిస్తున్నాయని సుయోధనుని గోసంరక్షణార్ధం ద్వైతవనానికి పంపమని నమ్మ పలికారు. ధృతరాష్ట్రుడు " గోసంరక్షణ చేయడం మంచిదే కాని అక్కడ పాండవులు ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళి పాండవులను అవమానిస్తారు. వారు ఇప్పటికే మీచే అవమానించబడి ఉన్నారు కనుక మిమ్మల్ని వది పెట్టరు. మీ మీద ఆగ్రహించి ఉన్న భీముని రెచ్చగొట్టడం మంచిది కాదు. అమోఘమైన అస్త్రసంపద సాధించిన అర్జునుని ఎదిరించడం క్షేమంకాదు. మీరు వారికి హానితలపెట్టడం అవివేకం. గోసంరక్షణకు సమర్ధిలైన వారి పంపుదాం. మీరు వెళ్ళద్దు " అన్నాడు. ఆ మాటలకు శకుని "మహారాజా! పాండవులు అమిత శౌర్య పరాక్రమాలు కలవాళ్ళు. వారికి మేము హాని ఎలా తలపెడతాము. మేము అలా చేసినా ధర్మాత్ముడైన ధర్మరాజు ఆడిన మాట తప్పడు. అతని తమ్ములు అతని మాట జవదాటరు. మాకు కూడా వేటాడవలెనని కోరిక కలిగినది మాకు అనుజ్ఞ ఇమ్ము. మేము ఆవులను మాత్రం రక్షిస్తాము. అందువలన పాండవులకే కీడు కలుగదు " అని నచ్చచెప్పాడు. ధృతరాష్ట్రుడు చివరకు అంగీకరించాడు. వెంటనే దుర్యోధనుడు ఘోషయాత్రను ప్రకటించాడు.

ఘోషయాత్ర

కర్ణుడు, శకుని, సోదరులు, బంధువులను తీసుకుని పరివారంతో వాహనము ఎక్కి ద్వైతవనానికి దుర్యోధనుడు బయలుదేరాడు. ఒక చోట శిబిరాలను ఏర్పరచుకుని గొల్ల వారిని అడిగి గోవుల మంచిచెడులు విచారించి అడవికి వెళ్ళి వేటాడాడు. ఎన్నో మృగాలను చంపాడు. ఆ సమయంలో ధర్మరాజు సద్యస్కందం అనే యాగాన్ని అక్కడి మునుల సాయంతో చేస్తున్నాడు. అక్కడకు చేరిన సుయోధనుడు తన వైభానికి తగినట్లు క్రీడా గృహములు నిర్మించమని చెప్పాడు. అక్కడ కాపలా ఉన్న గంధర్వులు వారిని అడ్డగించారు. వారు " ఇది చిత్రసేనుడనే గంధర్వరాజుకు చెందిన కొలను. ఇక్కడకు మీరు రాకూడదు. వెనక్కు వెళ్ళండి " అన్నారు. భటులు " ఇక్కడకు సుయోధన సార్వభౌములు వచ్చారు. అందు వలన మీరే ఇక్కడ ఉండక వెళ్ళండి " అని బదులిచ్చారు. గంధర్వులు ఆగ్రహించి " మీ రాజుకు తన బలం ఎదిరి బలం అసలు తెలియదు. గంధర్వరాజు దగ్గర ఇలాంటి దుశ్చర్యలు చెల్లవని చెప్పండి " అని హేళనగా పలికారు. భటుల ద్వారా విషయం తెలుసుకున్న దుర్యోధనుడు భటులతో " మీరు తక్షణం వెళ్ళి ఆ గంధర్వుల గర్వం అణచండి. దేవతలు దేవేంద్రునితో సాయం వచ్చినా వారిని కూడా జయించండి " అని ఆజ్ఞాపించాడు. కౌరవులు తమబలాలతో గంధర్వుల మీదకు దండయాత్రకు వెళ్ళారు. గంధర్వులు వారితో " మీకు మాకు ద్వేషం ఏముంది? ఆగండి " అన్నా వారు లక్ష్యపెట్టక వారి పై ఆయుధాలు ప్రయోగించారు. గంధర్వులు చిత్రసేనునికి జరిగినది వివరించారు. చిత్రసేనుడు ఆగ్రహించి " కౌరవసేనలను చీల్చి చెండాడండి " అని ఆజ్ఞాపించాడు. గంధర్వసేనలు కౌరవసేనను చీల్చి చెండాడాయి. గంధర్వుల ధాటికి నిలువ లేక దుశ్శాసనుడు పారిపోగా కర్ణుడు మాత్రం ధైర్యంగా పోరాడుతుండగా దుర్యోధనాదులు ఇది తెలుసుకుని యుద్ధరంగానికి వచ్చారు. కౌరవులకు గంధర్వులకు మధ్య జరిగిన ఘోరమైన పోరులో గంధర్వులు ఓడి పోయారు. వారు చిత్రసేనునికి జరిగినది చెప్పారు.

సుయోధనుడు గంధర్వుల చేతిలో బంధీ అగుట

చిత్రసేనుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు. చిత్రసేనుడు మాయాయుద్ధ నిపుణుడు. అతని మాయా యుద్ధానికి కౌరవ సేన తట్టుకొనలేక పోయింది. కర్ణుడు తప్ప మిగిలిన వారంతా పారి పోయారు. దుర్యోధనుడు కర్ణునికి సాయంగా ఉన్నాడు శకుని దుర్యోధనుని సోదరులు దుర్యోధనునికి సాయంగా నిలిచారు. గంధర్వులు కర్ణుని రథం విరగకొట్టారు. కర్ణుడు పక్కనే ఉన్న వికర్ణుని రథం ఎక్కి యుద్ధం నుండి బయటకు వెళ్ళాడు. అప్పుడు చిత్రసేనుడు దుర్యోధనుని రథం విరిచి దుర్యోధనుని జుట్టు పట్టుకుని నేల మీద పడవేసి తన రథానికి కట్టి గట్టిగా సింహనాదం చేసాడు. అది చూసిన మిగిలిన గంధర్వులు మిగిలిన కౌరవులను, వారి భార్యలను దుర్యోధనుని భార్యను, కౌరవ రాకుమారులను మంత్రులను పట్టి చిత్రసేనుని ముందు ఉంచారు. అది చూసి మిగిలిన వారు అక్కడే ఉన్న ధర్మరాజు వద్దకు వెళ్ళి రక్షించమని మొర పెట్టుకున్నారు. అది విన్న భీముడు " ఆహా మనం చేవదలచిన కార్యం గంధర్వులే చేసారు. ఏ విధమైన శ్రమ లేకుండా మనకు విజయం చేకూర్చి గంధర్వులు మనకు మహోపకారం చేసారు. పుట్టిన నాటి నుండి పాపాలు చేసిన మాత్రమే చేయటానికి అలవాటు పడిన దుర్యోధనునికి ఈ నాటికి గ్రర్వభంగం చేసిన బ్రహ్మ ఎంత నేర్పరో కదా. అడవులలో అష్టకష్టాలు పడుతున్న మనల్ని అవమానించటానికి వచ్చిన దుర్యోధనునికి తగిన పరాభవం జరిగింది. అందు వలన దుర్యోధనుని పై దయ చూపరాదు " అన్నాడు.

ధర్మరాజు సుయోధనుడిని విడిపించుటకు తమ్ములను పంపుట


యుధ్ధానికి సిధ్ధమౌతున్న భీమార్జునులు
ఆ మాటలు విన్న ధర్మరాజు " భీమసేనా! పరుషపు మాటలు తగునా. శరణన్న వారిని రక్షించాలి కాని చులక చేయడం తగునా. దాయాదుల మధ్య తగాదాలు సహజం. అంత మాత్రంచే ప్రేమలు అంతరిస్తాయా? దాయాదులు వారిలో వారు కలహించుకున్నా పరాయి వారి చేతిలో పరాభవం జరిగినప్పుడు ఒకరికి ఒకరు సాయపడాలి. అలా చేయకపోతే లోకులు నిందించరా. సుయోధనుడు దుర్నీతి కలవాడే కాని భార్యలతో సహా పట్టుబడ్డాడు. మనం ఉపేక్షించిన కులహాని కలుగుతుంది. శరణు కోరిన వారిని రక్షించడం క్షత్రియ ధర్మం నీ వంటి పరాక్రమశాలికి అది ధర్మం కనుక నీవు నీ తమ్ములతో సాయుధులై రధముల మీద వెళ్ళి చిత్రసేనుని సుయోధనుని వారి భార్యలను పరివారమును రక్షించండి " అని చెప్పాడు. భీముడు " అన్నయ్యా! దయ లేకుండా నన్ను నీటిలో తోయించి, విషాహారం పెట్టి చంపాలనుకున్నాడు. మనలను లక్క ఇంట్లో దహించాలని అనుకున్నాడు. మన సంపదలను వంచనతో అపహరించాడు. ద్రౌపది వలువలు నిండు సభలో ఊడదీయించి అవమానించాలని చూసాడు. అతడు చేసిన దుశ్చర్యలు తలచకుండా ఇలా ఔదార్యం చూపడం తగునా " అని భీముడు పలికాడు. ధర్మరాజు " భీమసేనా! రక్షించమని అడిగితే ఎంతటి దుర్బలులైనా సాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. నీ వంటి బలవంతునకు ఊరకుండటం తగునా. శత్రువునైనా శరణుజొచ్చిన రక్షించాలని పెద్దలు చెబుతారు. సుయోధనునికి మన బలపరాక్రమములు తెలుయును అందువలన మనం రక్షిస్తామని

చిత్రసేనునితో పోరాడుతున్న అర్జునుడు
ఆశతో ఎదురు చూస్తుంటారు. ఇది మనకు పుణ్యం కలుగు సమయం. నేను వెళ్ళి రక్షించగలను నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను కనుక నిన్ను అర్ధిస్తున్నాను. కనుక మీరు వెళ్ళి గంధర్వులకు మంచి మాటలతో చెప్పి వారిని విడిపించండి. లేని ఎడల వారితో యుద్ధం చేసి వారిని విడిపించండి. నా యజ్ఞాన్ని సఫలం చెయ్యండి " అన్నాడు. ఎలాగైతేనేం భీముడు అంగీకరించి తన తమ్ములతో ఆయుధాలు ధరించి గంధర్వుల దగ్గరకు వెళ్ళారు. భీముడు వారితో " గంధర్వులారా! మీకు మాకు విరోధం లేదు. మీరు స్నేహపూర్వకంగా సుయోధనుని విడిచి పెట్టండి. ఇది ధర్మరాజు ఆజ్ఞ అనుల్లంఘనీయము అని తెలుసుకోడి " అన్నాడు. గంధర్వులు "ధర్మరాజు మాకు రాజు కాదు కనుక అతని ఆజ్ఞను మేము ఎందుకు పాటించాలి. మా రాజు దేవేంద్రుడు చెప్తేనే మేము వింటాము " అన్నారు. భీముడు " గంధర్వులారా! మీరు మంచి మాటలకు వినేలా లేదు మా ప్రతాపం రుచిచూపిస్తాము. సుయోధనుని విడిపిస్తాము " అని తమ్ములతో గంధర్వులతో తలపడ్డాడు. పాండవులకు గంధర్వులకు మధ్య పోరు భీకరంగా సాగింది. అర్జునుడు తన బాణాలతో అన్ని దిక్కులను బంధించాడు. చిత్రసేనుడు గధాయుదాన్ని అర్జునిపై ప్రయోగించాడు. అర్జునుడు తన బాణంతో దానిని ముక్కలు చేసాడు. చెత్రసేనుడు మాయాయుద్ధం ఆరంభించాడు. అర్జునుడు శభ్దవేదితో బాణములతో చిత్రసేనుని వేదించాడు. ఇక చేసేది లేక చిత్రసేనుడు అర్జునిని ముందు నిలిచాడు. అర్జునుడు " చిత్రసేనా! నీకు కౌరవులతో శత్రుత్వం ఎందుకు వారిని విడిచి పెట్టు " అన్నాడు. చిత్రసేనుడు " అర్జునా! నీకు నాకు ఎలాంటి శత్రుత్వంలేదు పైగా నీవు నా మిత్రుడివి. అసలు విషయం ఏమిటంటే ఈ దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు. మీరు అడవిలో పడుతున్న కష్టాలు చూసి హఏళన చేయడానికి ఘోషయాత్ర మిష మీద వచ్చాడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు ఈ దురాత్ముని పట్టి బంధించి తన వద్దకు తీసుకు రమ్మన్నాడు. అందుకే ఇతనిని పట్టి బంధించి తీసుకు వెళుతున్నాను " అన్నాడు.

సుయోధనుడిని ధర్మరాజు వద్దకు తిసుకు వెళ్ళుట

అర్జునుడు " మిత్రమా చిత్రసేనా! ఇతడు ఎంతటి దుర్మార్గుడైనా మాకు సోదరుడు. ఇతనిని విడిచి పెట్టి ధర్మరాజుకు ఆనందం కలిగించు. దేవేంద్రుని ఆజ్ఞ అయినా ఇతనిని ధర్మరాజు దగ్గరకు తీసుకు వెళతాము. అతడు చెప్పినట్లు నడచుకుంటాము " అన్నాడు. చిత్రసేనుడు అందుకు సమ్మతించాడు. అందరూ ధర్మరాజు వద్దకు వెళ్ళారు. చిత్రసేనుని ధర్మరాజు సాదరంగా పూజించి " చిత్రసేనా! సుయోధనుడు, సోదరులు, పరివారంలో ఏరికీ నీ వలన ప్రాణహాని కలుగలేదు. మాకుటుంబం సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. ఇతని అపరాధం మన్నించి విడిచి పెట్టు " అని ప్రార్థించాడు. ధర్మరాజు మాత చిత్రసేనుడు మన్నించి సుయోధనుని పరివారంతో సహా విడిచి పెట్టాడు. చిత్రసేనుడు జరిగినది దేవేంద్రునికి చెప్పాడు. దేవేంద్రుడు అమృత వర్షాన్ని కురిపించి యుద్ధంలో మరణించిన గంధర్వులను బ్రతికించాడు. ధర్మరాజు దుర్యోధనుని బంధవిముక్తుని చేసి " సుయోధనా! ఎప్పుడూ ఇలాంటి సాహసం చేయద్దు. దుర్మార్గులు మాత్రమే ఇలాంటి క్రియలు చేసి నశిస్తారు. నీవు మనసులో ఎలాంటి విరోధం పెట్టుకొనక తమ్ములను పరివారాన్ని వెంట పెట్టుకునషస్థినకు వెళ్ళుము " అన్నాడు. సుయోధనుడు దీనవదనుడై అక్కడి నుండి వెళ్ళి పోయాడు. ధౌమ్యుడు బ్రాహ్మణులు ధర్మరాజు ఔదార్యాన్ని కొనియాడారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat