భక్తికి పరమాత్ముని సైతం శాసించగల శక్తి ఉందన్న మాట ఈ ఘటన ఒక ఉదాహరణ! అంబరీషుని కథ

P Madhav Kumar


అంబరీషుని కథ భాగవత పురాణంలో ఇలా ఉంది.

అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు. నభగ మహారాజు కుమారుడు. శ్రేష్టుడైన అంబరీషుడు ఏడు దీవులతో కూడిన భూమండల భారాన్ని తన భుజస్తంభాలమీద మోపి శుభాలనూ పొంది, రాజ్యసంపదను కలిగి చెడునడతకు లోనుకాకుండా, విష్ణుపూజలతోనే కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఏమరుపాటు పొందక ఈ లోకంలో ప్రశస్తి గాంచాడు. ఈయన గొప్ప విష్ణు భక్తుడు. శ్రీ మహావిష్ణువు గురించి భక్తితో గొప్ప యాగం చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీహరి ఆయన రాజ్యం సుఖ సంపదలతో విలసిల్లేలాగా తన సుదర్శన చక్రాన్నే వరంగా ఇచ్చాడు.
ఒకసారి అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాడు.ఈ వ్రతంలో ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించి, ఒక సంవత్సరం పాటు దీక్షలో ఉండి, ద్వాదశి ప్రారంభంలో దీక్ష విరమించి తరువాత తన ప్రజలందరికీ అన్నదానం చేయాలి. ఉపవాస దీక్ష కొద్ది గడియల్లో ముగియనుండగా దుర్వాస మహర్షి అక్కడికి విచ్చేసాడు. ఆయనను అత్యంత భక్తి ప్రపత్తులతో ఆహ్వానించి ఆ రోజుకి దుర్వాసుణ్ణి తన గౌరవ అతిథి గా ఉండమని అర్థించాడు అంబరీష మహారాజు. దుర్వాసుడు అందుకు సంతోషంగా అంగీకరించి తాను నదిలో స్నానం చేసి వచ్చేవరకు వేచి ఉండమని చెప్పి నదివైపు వెళ్ళాడు.
దీక్ష విరమణకు నిర్ణయించిన శుభముహూర్తం దాటిపోతోంది. నదీ స్నానానికని వెళ్ళిన దుర్వాసుడు ఎంతసేపైనా తిరిగి రాలేదు. అంబరీషుడు తమ కులగురువైన వశిష్ఠుని సలహా మేరకు ఆ శుభముహూర్తంలో కేవలం తులసీ దళం తో కొంత మంచి నీళ్ళు పుచ్చుకుని దీక్ష విరమించి దుర్వాస ముని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇది శాస్త్రం ప్రకారం సమ్మతమే. కానీ స్నానం చేసి తిరిగి వచ్చిన దుర్వాసుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగిన విషయాన్ని గ్రహించి రాజు మాట తప్పినందుకు ఆగ్రహించాడు. దుర్వాస ముని కోపం గురించి తెలిసిందే కదా!

అప్పటికప్పుడే తన జడల నుంచి ఒక వెంట్రుకని లాగి ఒక రాక్షసుణ్ణి సృష్టించి అంబరీషుణ్ణి సంహరించమన్నాడు. ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా అంబరీషుడి ఎదుట నిలువగానే ఆయనకు రక్షణగా ఉన్న సుదర్శన చక్రం ఒక్క వేటుతో ఆ రాక్షసుణ్ణి సంహరించి దుర్వాసుడి వెంట పడింది. దుర్వాసుడు ప్రాణభయంతో నలుదిక్కులకు పరిగెత్తాడు. ముందుగా బ్రహ్మ, శివుడి దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ చక్రాన్ని ఆపడం తమ వల్ల కాదనీ, శ్రీ మహావిష్ణువు దగ్గరకే వెళ్ళమన్నారు. చివరికి దుర్వాసుడు శ్రీ మహా విష్ణువును వేడుకున్నాడు. ఆయన కూడా తాను అంబరీషుని భక్తికి బంధీ కాబట్టి ఆయన్నే వేడుకోమన్నాడు. చివరికి దుర్వాసుడు వెళ్ళి అంబరీషుని వేడుకోగానే, ఆయన శ్రీహరిని సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని ప్రార్థిస్తాడు. భక్తికి పరమాత్ముని సైతం శాసించగల శక్తి ఉందన్న మాట ఈ ఘటన మనకి మరొక్క ఉదాహరణ!

అంబరీషోపాఖ్యానం కార్తీక మహాత్మ్యం లో కూడా వస్తుంది. ఈ సమయంలోనే దూర్వాస ముని కోపముతో అంబరీషుని రక రకాల జంతువులుగా కమ్మని శపిస్తే వాటన్నిటినీ విష్ణువు తీసుకుని ఆయన ఎత్తిన జన్మలే మన దశావతారాలు. ఈ అంబరీషుని కద్థ వేరు వేరు పురాణాల్లో వివిధ రకాలుగా చెప్పబడింది. శివపురాణం లో కథ వేరే గా ఉన్నట్లుగా చెబుతూ ఉంటారు. సుదర్శన చక్రం రాక్షసుని చంపివేసిన తరువాత దుర్వాసుని వైపు వెళ్ళిందనీ, ఆయన శివ స్వరూపం కాబట్టి చక్రం వెనక్కు తగ్గిందనీ, నంది వచ్చి అంబరీషుని దుర్వాసుని క్షమాపణ వేడుకోమన్నాడనీ, అలాగే అంబరీషుడు దుర్వాసుని క్షమాపణ కోరాడని ఉంటుంది. అయితే ఈ అంబరీషుని కథ మనకి మాత్రం భాగవతంలో ఉన్నది ప్రమాణం గా తీస్కుంటాము.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat