సేవకుడు... యజమాని

P Madhav Kumar



..


ధర్మరాజు భీష్ముడిని.. "పితామహా.. నాకు ఒక సందేహము.. తమ యజమానుల ఎడల అతడి దయా దాక్షిణ్యాల మీద బ్రతికే సేవకుడు.. ఎలా నడచుకోవాలి వివరించండి" అని అడిగాడు. దానికి.. భీష్ముడు "ధర్మనందనా.. ఒక వూరిలో ఒక బోయవాడు ఉండే వాడు. అతడు ఒక రోజు వేట కొరకు అడవికి వెళ్ళి ఒక లేడి మీద విషము పూసిన బాణమును వేసాడు. కాని ఆ బాణము గురి తప్పి ఒక చెట్టును తాకింది. ఆ చెట్టు పూలు పండ్లతో నిండి ఉండేది.


కానీ.. ఆ విష పూరిత బాణము ఆ చెట్టును నిలువునా పూలు విరుగ కాసిన పండ్లలతో సహా దహించివేసింది. ఆ చెట్టు మీద నివసిస్తున్న ఒక చిలుక మాత్రం ఆ చెట్టు దహించ బడినా ఇన్ని రోజుల నుండి కాపాడిందన్న విశ్వాసంతో దానిని విడువక అక్కడే నివసించసాగింది. ఎండ వచ్చినా, గాలి వచ్చినా, వర్షము వచ్చినా అది ఆ చెట్టును విడువ లేదు.


ఆ నోట ఈ నోట.. ఆ చిలుక గురించి విన్న ఇంద్రుడు సాధారణ మనిషి రూపంలో దాని వద్దకు వచ్చి.."ఓ చిలుకా.. ఈ చెట్టు మాడిపోయింది కదా.. ఈ అడవిలో ఫల పుష్పాలతో నిండిన ఇన్ని వృక్షాలు ఉండగా ఈ చెట్టును పట్టుకుని ఎందుకు వేలాడుతున్నావు" అని అడిగాడు. దానికి ఆ చిలుక "మహేంద్రా.. ఈ చెట్టు ఫల పుష్పాలతో నిండుగా ఉన్నప్పుడు ఈ చెట్టును అంటిపెట్టుకుని ఉండి ఈ చెట్టు ఎండి పోయినప్పుడు వదిలి వెళ్ళడము కృతగఘ్నత కాదా.." అని అడిగంది.


మారువేషములో వచ్చిన తనను మహేంద్రా.. అని సంభోదించడం చూసి ఇంద్రుడు ఖంగుతిన్నాడు. ఈ చిలుక పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యఫలము వలన తనను గుర్తించిందని తెలుసుకుని.. "చిలుకా.. నా దర్శనం వ్యర్ధము కాదు కనుక ఏదైనా వరము కోరుకో" అన్నాడు. ఆ చిలుక.. "ఈ చెట్టును పూర్వము ఉన్నట్లు ఫలపుష్పాలతో అలరారే విధముగా చెయ్యి" అని కోరుకుంది.


ఇంద్రుడు వెంటనే ఆ చెట్టు మీద అమృతమును చల్లాడు. ఆ చెట్టు పూర్వములా ఫలపుష్పాలతో శోభిల్లింది. ధర్మనందనా.. చూసావా ఇంద్రుడు వరమిచ్చినా తన కొరకు ఏ వరము కోరుకొకుండా తనకు ఆశ్రయమిచ్చిన చెట్టు శ్రేయస్సును కోరుకున్న చిలుకలా భృత్యులు సదా యజమాని శ్రేయస్సు కోరుకోవాలి" అని చెప్పాడు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat