🍃🌹మనం పూజలు చేసే సమయంలో ఎక్కువగా రాగి పాత్రలను వాడుతూ ఉంటాం. దీనికి సంబంధించి వివరాలను వరాహ పురాణంలో వరాహ స్వామి భూదేవికి వివరించారు. కొన్ని యుగాలకు పూర్వం గుడాకేశుడు అనే రాక్షసుడు విష్ణువును పూజించేవాడు.
🍃🌹గుడాకేశుడు అనే రాక్షసుడు రాగి రూపంలో విష్ణువు కోసం తపస్సు చేసాడు. ఆ రాక్షసుని తపస్సుకి మెచ్చి విష్ణువు ప్రత్యక్షం అయ్యి ఏ వరం కావాలో కోరుకోమని చెప్పగా, తనకు ఎలాంటి వరాలు వద్దని తన దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించి భగవంతునిలో ఐక్యం చేసుకోవాలని గుడాకేశుడు కోరుతాడు. అంతేకాక తన శరీరంతో తయారుచేసిన పాత్రలు పూజలో ఉపయోగించాలని కోరతాడు.
🍃🌹అప్పుడు విష్ణువు నీ కోరిక వైశాఖ శుక్ల పక్ష ద్వాదశి రోజున తీరుతుందని చెప్పి అదృశ్యం అవుతారు. కొంతకాలానికి ద్వాదశి రావటం, సుదర్శన చక్రం వచ్చి అతని శరీరాన్ని ముక్కలు చేయటంతో గుడాకేశుని ఆత్మ వైకుంఠానికి చేరుకుంది. శరీరం రాగిగా రూపొందింది. ఈ రాగి పాత్రలను తన పూజలో ఉపయోగించాలని లక్ష్మీపతి విష్ణువు భక్తులను ఆదేశించాడు.
🍃🌹ఆ రోజు నుండి విష్ణువు పూజలో రాగి పాత్రలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు ఆరోగ్యపరంగా చూస్తే కూడా రాగిపాత్రల్లో జలం సేవించడం మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. రాగిపాత్రల్లోని తీర్థాన్ని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి, రక్తశుద్ధి ఉంటుందని భారతీయ సంప్రదాయ వైద్య శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️