రాంబాబు ఏదైనా ఉద్యోగం చేసి తల్లిని సుఖపెట్టాలనుకున్నాడు.
పట్నానికి పోతే ఏ వర్తకుడైనా పద్దులు రాసే పనైనా ఇవ్వకపోతాడా అనుకుని ఊరు విడిచి వెళ్లాడు.
అయితే తనకి ఎక్కడా ఏ చిన్న పనీ దొరకలేదు. ఏం చెయ్యాలో తోచక వెర్రివాడిలా ఊరూవాడా తిరుగుతూ ఉండగా దారిలో అతడికి పది నాణెలు దొరికాయి.
తటాలున వాటిని తీసి ‘ఈ సొమ్ము ఎవరు పారేసుకున్నారో ఏంటో’ అనుకుంటూ అటు ఇటు చూశాడు.
దారినపోయే వాళ్లనెవరినైనా అడిగితే ఆ పైసలు తమవే అనొచ్చు.
నిజంగా పోగొట్టుకున్న వాడికి మాత్రం అవి దక్కవు.
అందుకే వాటిని జేబులో వేసుకుని ముందుకు కదిలాడు. ఆకలితో అల్లాడుతున్నా ఆ డబ్బులతో కొనుక్కుని తినాలనిపించలేదు.
శివాలయంలో గంటల మోత విని అటువైపు వెళ్లాడు. గుడి మెట్ల మీద కొందరు వికలాంగులైన బిచ్చగాళ్లు గుడ్డలు పరచుకుని భక్తులు వేసే పైసల కోసం ఆత్రంగా ఎదురుచూడసాగారు.
వాళ్లని చూస్తే రాంబాబుకి జాలేసింది. వెంటనే జేబులో ఉన్న నాణెల్ని తీసి వాళ్లకి పంచిపెట్టి వెనుదిరిగాడు.
అంతలోనే రాజభటులు పరుగున వచ్చి ‘నువ్వు తీసిన డబ్బులేవీ? దొంగతనం నేరమని నీకు తెలీదా? పద మహారాజా వారి దగ్గరకు. ఆయనే నీకు తగిన శిక్ష విధిస్తారు’ అంటూ అతడి చేతులకు సంకెళ్లు బిగించారు.
మతిపోయింది రాంబాబుకి. ‘నన్ను వదలండి. నేను దొంగని కాను. దారిలో దొరికిన పైసలు నావి కావని తెలిసే తీసాను. వాటిని పోగొట్టుకున్న వారికి ఎలా ఇవ్వాలో తెలీక ఇక్కడున్న బిచ్చగాళ్లకి పంచిపెట్టేశాను. అందులోంచి ఒక్క పైసా కూడా నేను వాడుకోలేదు. నన్ను నమ్మండి’ అని బతిమాలాడాడు.
‘నువ్వెన్ని చెప్పు. పరుల సొమ్ము తస్కరించడం నేరమే అవుతుంది’ అంటూ అతణ్ణి లాక్కెళ్లి మహారాజా వారి ఆస్థానంలో ప్రవేశపెట్టారు రాజభటులు.
తను చెయ్యని నేరానికి రాజుగారు ఏం శిక్ష విధిస్తారో? గజగజ వణికిపోతూ చేతులు కట్టుకుని బిత్తరచూపులు చూడసాగాడు రాంబాబు.
‘ఏరీ మంత్రివర్యులు?’ అసహనం వ్యక్తం చేస్తూ సింహాసనాన్ని అధిష్టించాడు మహారాజు మాధవవర్మ.
‘చిత్తం ప్రభూ! నేనిక్కడే ఉన్నాను’ అన్నాడు భటుని వేషంలో ఉన్న మంత్రి మణికంఠుడు.
‘మీరా? ఇదేంటి ఈ వేషం? అది సరే కోశాధికారిగా నియమించడానికి నిజాయితీ పరుడైన అభ్యర్థిని చూడమన్నాను. ఆ పనేం చేశారో ముందు చెప్పండి’ అన్నాడు మాధవవర్మ.
‘ఇదిగో వెతికి వెతికి ఈ కుర్రాణ్ణి లాక్కొచ్చాను ప్రభూ’ నిర్బంధంలో ఉన్న రాంబాబుని చూపిస్తూ అన్నాడు మహామంత్రి.
‘ఏంటి మీరనేది? నేరస్థుడిగా నిలబెట్టిన ఈ వ్యక్తినా?’ ఆశ్చర్యాన్ని ప్రకటించారు రాజావారు.
‘క్షమించండి ప్రభూ. ఇతడు దొంగ కాదు’ అంటూ జరిగింది పూసగుచ్చినట్లు చెప్పాడు మంత్రి మణికంఠుడు...
‘శభాష్ మహామంత్రీ! మీరే ఆ నాణెలు వేసి తనని పరీక్షించారన్న మాట. మీరు చేసిన పనివల్ల ఇతగాడు నీతిమంతుడే కాదు నిజాయితీ పరుడు, దయార్ద్ర హృదయుడని కూడా తేలింది. మీ ఎంపిక భేషుగ్గా ఉంది. ఇప్పుడే ఇతణ్ణి ఖజానా అధికారిగా నియమిస్తున్నాను’ అన్నాడు మాధవవర్మ అతణ్ణి ప్రశంసిస్తూ.
‘నిజాయితీకి ఇంత విలువ ఉంటుందా?’ ఆశ్చర్యపోతూ రాజోద్యోగం దొరికినందుకు తెగ సంబరపడిపోతూ మహారాజుగారి కాళ్ల మీద పడి కన్నీరు కార్చాడు రాంబాబు.
🔹🔸🔹🔸🔹🔸🔹
వివేక: సహ సమ్యత్యా వినయో విద్యా సహ
ఫ్రభుత్వం ప్రష్ర్యోపేతం చిణమెతన్మహాత్మనాం
సంపద తో పాటు వివేకము, విద్యతో పాటు వినమ్రత,
శక్తి తో పాటు సౌజన్యము ఉండటంతోనే మహాత్ములుగా గుర్తింపబడతారు